పదిహేను సర్జరీలు అయినప్పటికీ పరిష్కారం దొరకలేదు.. | Sakshi Special Story on Yearbookcanvas founder and CEO Surashree rahane | Sakshi
Sakshi News home page

‘అప్పుడు బుక్‌ కొనకపోవడం వల్లే ఈ ఇయర్‌ బుక్‌’

Published Sat, May 1 2021 12:21 AM | Last Updated on Wed, Mar 2 2022 7:06 PM

Sakshi Special Story on Yearbookcanvas founder and CEO Surashree rahane

ప్రతి విజయం వెనుక కృషితోపాటు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నవారు నిరంతర సాధనతో సమస్యలను అధిగమించి విజయ తీరాలకు చేరతారు. కానీ వైకల్యంతో ఉన్నతస్థాయికి ఎదగాలంటే మాత్రం... ‘కష్టాల కడలి’ని ఈదాల్సిందే. ఇటువంటి కష్టాల కడలిని ఎంతో ధైర్యంగా ఈది సమాజంలో తనకంటూ గుర్తింపును ఏర్పర్చుకున్నారు ‘ఇయర్‌బుక్‌ కాన్వాస్‌’ సహవ్యవస్థాపక సీఈవో సురాశ్రీ రహానే. వైకల్యాన్ని ఓడించి ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి ఎంతోమందికి ప్రేరణగా నిలసున్నారు సురాశ్రీ.   

నాసిక్‌ జిల్లా భాగూర్‌ గ్రామంలో స్వాతంత్ర సమర యోధుల కుటుంబంలో సురాశ్రీ రహానే జన్మించింది. పుట్టుకతోనే ఆరోగ్య సమస్య ఏర్పడడంతో సురాశ్రీ పదిహేను రోజుల శిశువుగా ఉన్నప్పుడే కాళ్లకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అంతటితో సమస్య తీరుతుంది అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ అది ప్రారంభం మాత్రమే అని తర్వాత తెలిసింది వారికి. ఒకపక్క తనసమస్యతో బాధపడుతూనే సురాశ్రీ స్కూలుకెళ్లి చక్కగా చదువుకునేది. ఒకసారి మేజర్‌ సర్జరీ అయింది. అప్పుడు కొన్ని నెలల పాటు స్కూలుకు వెళ్లడం కుదరలేదు. దీంతో స్కూలుకు వెళ్లలేకపోతున్నందుకు తనకు ఎంతో బాధపడేది.

ఇప్పటిదాక మొత్తం పదిహేను సర్జరీలు  అయినప్పటికి  సురాశ్రీ∙వైకల్యానికి శాశ్వత పరిష్కారం దొరకలేదు. ‘‘ఇక లాభం లేదు! ఇలా ఉంటే నేను ముందుకు వెళ్లలేను బాగా చదువుకోని ఎదగాలి’’ అని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తయ్యాక అందరిలాగే ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ సురాశ్రీ వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ‘‘చిన్నప్పుడు నాకాళ్ల మీద నేను నిలబడేందుకు  కాళ్లు సహకరించలేదు! అయినా ఎంతో కష్టపడి నడవడం నేర్చుకున్నాను! ఇప్పుడు కెరియర్‌లో కూడా నాకు నేనే ఎదగాలి’’ అని నిర్ణయించుకుంది.

జ్ఞాపకాల ఐడియా..
చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న కష్టాలు, వైకల్యంతో కోల్పోయిన కార్యక్రమాలు, ఆనందకరమైన సందర్భాలు, స్నేహితులతో సరిగ్గా గడపలేని క్షణాలు తనకి గుర్తుకొచ్చాయి. ‘‘ఇటువంటి మధుర, చేదు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఒక దగ్గర రాసుకుని ఏడాది తరువాత చూసుకుంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది’ అన్న సురాశ్రీ ఆలోచనకు ప్రతిరూపమే ‘ఇయర్‌బుక్‌ కాన్వాస్‌’. స్టార్టప్‌ మార్వారీ కెటలిస్ట్‌ ఇన్వెస్ట్‌ చేయడంతో ఇయర్‌బుక్‌ కాన్వాస్‌ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తోంది. ఇయర్‌బుక్‌ కాన్వాస్‌కు మంచి గుర్తింపు రావడంతో ‘లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ఆసియా పసిఫిక్‌ యూనివర్సిటి నుంచి ‘అవుట్‌ స్టాండింగ్‌ స్టూడెంట్‌ ఆఫ్‌ ఇండియా’ అవార్డులు సురాశ్రీని వరించాయి. టెడెక్స్, యూనెస్కో, యుపెన్‌  వంటి అంతర్జాతీయ వేదికలపై మోటివేషనల్‌ స్పీకర్‌గాకూడా
మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 ‘‘నేను ఎప్పుడూ జ్ఞాపకాలు రాసుకోవడానికి బుక్‌ కొనుక్కోలేదు. నాకు ఎవ్వరూ సలహా కూడా ఇవ్వలేదు. అప్పుడు నేను బుక్‌ కొనకపోవడం వల్లే ఈరోజు ఇయర్‌ బుక్‌ను తీసుకు రాగలిగాను. భారతదేశంలో నంబర్‌ వ¯Œ  ఇయర్‌ బుక్‌ కంపెనీగానేగాక, ఆసియాలో మొబైల్‌ అప్లికేషన్‌  కలిగిన ఏకైక బుక్‌ కంపెనీ గా నిలవడం ఎంతో సంతోషాన్నిస్తుంది. కార్పొరేట్‌ ఉద్యోగుల కోసం ‘కార్పొరేట్‌ మెమరీ బుక్‌’ను తీసుకొచ్చాం. గతకాలపు జ్ఞాపకాలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అందుకే ఇయర్‌బుక్, కార్పొరేట్‌ మెమరీ బుక్‌లు తీసుకొచ్చాము. త్వరలోనే వైకల్యం గలిగిన పిల్లల కోసం ‘ఫ్యూచర్‌ ఎంట్రప్రెన్యూర్‌ బుక్‌’ తీసుకొస్తున్నాం’’అని  సురాశ్రీ చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement