మోసకారి టీడీపీ నేత ఎక్కడ?
Published Thu, Aug 8 2013 1:38 AM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM
కుత్బుల్లాపూర్/ జీడిమెట్ల, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ జీడిమెట్ల డివిజన్ కోశాధికారి సూరపనేని వెంకట శివాజీ బిచాణా ఎత్తేయడంతో అప్పు ఇచ్చిన బాధితుల దృష్టి ఇప్పుడు అతని ఇంటిపై పడింది. బుధవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లోని ప్రసూననగర్‌లో ఉన్న శివాజీ ఇంటికి వచ్చి పలువురు పడిగాపులు కాస్తూ కనిపించారు. మరికొంత మంది తాళం వేసిన ఇంటికి మళ్లీ తాళాలు వేస్తూ కన్పించారు. వంద గజాల్లో గ్రౌండ్ ప్లస్ 3 భవనాన్ని నిర్మించగా దీని ఖరీదు రూ. 50 లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం.
సొంతూరైన కృష్ణాజిల్లా ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో సైతం ఇటీవల నూతన గృహాన్ని నిర్మించాడు. గ్రామానికి వెళ్తున్న సందర్భంలో అక్కడి వారి ముందు తాను గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ కార్పొరేటర్ అంటూ బీరాలు పలికేవాడని తెలిసింది. అంతే కాకుండా నగరం నుంచి విజయవాడకు మూడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నట్లు బాధితులు కనుగొన్నారు. అయితే ఆ బస్సులు ఎక్కడ నుంచి వెళ్తున్నది, ఏ ట్రావెల్స్ పేరు మీద ఉన్నాయన్న విషయం తెలుసుకునేందుకు ఒక వైపు బాధితులు, మరో వైపు పోలీసులు వేట ముమ్మరం చేశారు.
ప్రసూననగర్, వివేకానందనగర్, శ్రీనివాస్‌నగర్ ప్రాంత వాసులే కాకుండా బాలానగర్‌లోని లోకేష్ కంపెనీ ఉద్యోగులు మోసపోయిన వారిలో అధికంగా ఉన్నారు. సోమవారం రాత్రి 60 మంది పోగై లెక్కలు చూసుకోగా రూ. 5 కోట్లు రాగా, మంగళవారం అది రూ. 15 కోట్లకు చేరింది. తాజాగా కృష్ణా జిల్లాలో సైతం ఇతగాని చిట్టా భారీగానే ఉందని బాధితుల ద్వారా వెలుగులోకి వస్తోంది. ఏది ఏమైనా ఈ కేసును త్వరగా చేధించే దిశగా జీడిమెట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రహస్య ప్రదేశాల్లో విసృ్తత తనిఖీలు చేస్తున్నాయి.
ఫిర్యాదుకు జంకుతున్న బాధితులు..
సూరపనేని వెంకట శివాజీ రూ. 5 లక్షలు, రూ. 2 లక్షలు చిట్టీలు వేసి పలువురి వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుండా వారికి రూ. 3 చొప్పున వడ్డీ చెల్లించేవాడు. పలువురికి సంవత్సరం, రెండు సంవత్సరాలు వడ్డీ కట్టేవాడని తెలిసింది. అయితే వారు న్యాయ సలహా తీసుకుని ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే 15 మంది ఫిర్యాదు చేయగా లక్షల్లో అప్పులిచ్చిన వారు ఐటీ రిటర్న్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్న భయంతో ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. శివాజీని ఎలాగైనా పట్టుకుని తమ డబ్బులు వసూలు చేసుకుంటామనే ధీమాతో మరికొందరు ఉన్నారు.
Advertisement
Advertisement