Academic Calendar
-
డ్రాప్ అవుట్.. నో చాన్స్!
సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లలందరినీ బడుల్లోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో (2023–24) ఇప్పటి వరకు గుర్తించిన 38,677 డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించడం ఒక సూచికగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బడి ఈడు పిల్లలందరినీ నూరు శాతం బడుల్లో చేర్పించేలా ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వలంటీర్ల ద్వారా ప్రత్యేకంగా 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు బడుల్లో ఉన్నారా.. లేక బడి బయట ఉన్నారా అనే అంశంపై సర్వే నిర్వహించడం ద్వారా డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించారు. ఇప్పటి వరకు 38,677 మంది డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించినట్లు ఇటీవల జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. 1వ తరగతిలో చేరిన పిల్లలు ఆ మరుసటి సంవత్సరం రెండో తరగతి.. ఆ మరుసటి సంవత్సరం ఆపై తరగతిలో.. ఇలా 8వ తరగతి వరకు చేరుతున్నారా లేక మధ్యలో డ్రాప్ అవుట్ అవుతున్నారా.. అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహణలో అసలు బడిలో చేరని, డ్రాప్ అవుట్, బాల కార్మికులను గుర్తించి వారి కోసం ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. పిల్లలను బడుల్లో చేర్పించడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించడం ద్వారా అవగాహన కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. తద్వారా బడి ఈడు పిల్లలందరూ బడుల్లో ఉండేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. తద్వారా ఇప్పటి వరకు మొత్తం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్కూల్స్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్య 56,34,974కు చేరింది. ఈ విద్యా సంవత్సరంలో అత్యధికంగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బడుల్లో చేరిన పిల్లలు కర్నూలు జిల్లాలో 3,78,564 మంది ఉండగా, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 3,06,667 మంది, నంద్యాల జిల్లాలో 2,29,280 మంది బడుల్లో చేరారు. -
ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లల్లో తొలిసారి పరీక్షలు
సాక్షి, అమరావతి: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్ బోధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి 8, 9 తరగతుల విద్యార్థులు పీరియాడిక్ రాత పరీక్షలు (పీడబ్ల్యూటీ), టర్మ్ పరీక్షలు రాయనున్నారు. గతేడాది 1,000 ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే దాదాపు విద్యా సంవత్సరం పూర్తవడంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు స్టేట్ బోర్డు పరీక్షలైన ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్లకే హాజరయ్యారు. కాగా, ఈ విద్యా సంవత్సరం (2023–24) నుంచి సీబీఎస్ఈ బోర్డు నిర్వహించే పీడబ్ల్యూటీ, టర్మ్ పరీక్షలు రాయనున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో వెయ్యి పాఠశాలల్లో 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ బోధనకు అనుమతి వచ్చింది. ఈ పాఠశాలల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు 2023–24 నుంచి సీబీఎస్ఈ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ బోర్డు పరీక్షలు రాస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేశారు. దీని ప్రకారం 8, 9 తరగతులకు ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల తరహాలో పీరియాడిక్ పరీక్షలు (పీడబ్ల్యూటీ), టర్మ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ నెల 6 నుంచి 9 వరకు పీడబ్ల్యూటీ జరగనున్నాయి. విషయ పరిజ్ఞానం పెంచేలా.. విద్యా సంవత్సరంలో పీడబ్ల్యూటీలు నాలుగు, టర్మ్ పరీక్షలు రెండు ఉంటాయి. టర్మ్–1 నవంబర్‌లో, టర్మ్–2 (వార్షిక) పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, రెండు భాషా పేపర్లు (మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు) రాయాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టు 50 మార్కులకు నిర్వహించే పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాత, 10 మార్కులకు ఇంటర్నల్ థియరీ పరీక్ష ఉంటుంది. 100 మార్కుల టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాత, 20 మార్కులకు అంతర్గత పరీక్షలు (ఇంటర్నల్ థియరీ) ఉంటాయి. విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాలంటే ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. సబ్జెక్టుల్లో ప్రాజెక్టులు, ల్యాబ్ టెస్టులు కూడా ఉంటాయి. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా విద్యార్థులతో పోటీపడేలా పరీక్షల్లో విషయ పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇవ్వనున్నారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి. ఇందులో పెన్ పేపర్ టెస్ట్ (5 మార్కులు), మల్టిపుల్ అసెస్మెంట్ (5), ఫోర్ట్పోలియో (5), సబ్జెక్టుపై విద్యార్థికున్న అవగాహనకు 5 మార్కులు మొత్తం 20 మార్కులు కేటాయించారు. భాషా పరీక్షలో వ్యూహాత్మకంగా పరిష్కరించే పజిల్స్, క్లాస్‌వర్క్, ఇంగ్లిష్ మాట్లాడడం, విని అర్థం చేసుకునే సామర్థ్యంపైన ప్రశ్నలు ఉంటాయి. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న 85,353 మంది విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వీరికి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అన్ని పరీక్షలు పూర్తిచేసి, ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి సిలబస్‌ను బోధించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 10వ తరగతిలో ‘స్కిల్’ సబ్జెక్టు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం(2024–25)లో 10వ తరగతిలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాయనున్నారు. ఈ క్రమంలో వీరికి ఆరో సబ్జెక్టుగా ‘స్కిల్ టెస్ట్’ను ప్రవేశపెట్టారు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ పరీక్షలో తప్పిన విద్యార్థులు స్కిల్ సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుని పాస్ చేస్తారు. ఆరో సబ్జెక్టుగా విద్యార్థుల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టులను ప్రవేశపెట్టారు. పదో తరగతి విద్యార్థులు ఈ రెండింటిలో ఒకదాన్ని ఆరో సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. జాగ్రత్త పాటించండి సీబీఎస్ఈ బోర్డు క్యాలెండర్ ప్రకారం.. వచ్చే మార్చి 31 నాటికి 9వ తరగతి పరీక్షలు పూర్తిచేసి, ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి బోధన చేపట్టాలి. అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థుల బోర్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల వివరాల నమోదులో పాఠశాలల ప్రిన్సిపాళ్లు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థి పేరు, ఆధార్, తల్లిదండ్రుల వివరాలు పుట్టిన తేదీ ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్త వహించాలి. – ఎం.వి.కృష్ణారెడ్డి, డైరెక్టర్, సీబీఎస్ఈ స్కూల్స్. -
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. సెలవులు ఇవే
సాక్షి, విజయవాడ: ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్కి 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ►జులై 24 నుంచి 26 వరకు యూనిట్-1 పరీక్షలు ►ఆగస్ట్ 24 నుంచి 26 వరకు యూనిట్ -2 పరీక్షలు ►సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు క్వార్టర్లీ పరీక్షలు ►అక్టోబర్ 16 నుంచి 18 వరకు యూనిట్ -3 పరీక్షలు ►అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు ►నవంర్ 23 నుంచి 25 వరకు యూనిట్ -4 పరీక్షలు ►డిసెంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు ►2024 జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకి వేసవి సెలవులు ►2024 ఫిబ్రవరి రెండవ వారంలో ఇంటర్ ప్రాక్టికల్స్ ►2024 మార్చ్ మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు ►2024 మార్చ్ 28 చివరి వర్కింగ్ డే ►2024 మార్చ్ 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్ విడుదల చదవండి: శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్ విషయాలు వెల్లడించిన సీపీ -
Telanagna: 2022-23 విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్‌ను 2022-23 సంత్సరానికి గాను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. క్యాలెండర్‌ను పరిశీలిస్తే.. ►ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పనిదినాలు ►ఏప్రిల్ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజు ►వేసవి సెలవులు: ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్ 11, 2023 వరకు ►ప్రైమరీ స్కూల్స్: ఉదయం 9am నుంచి 4pm వరకు తరగతులు ►ప్రాథమికోన్నత పాఠశాలలు: ఉదయం 9am నుంచి 4.15pm వరకు తరగతులు ►ఉన్నత పాఠశాలల తరగతులు: ఉదయం 9.30am నుంచి 4.45pm వరకు తరగతులు ►సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు దసరా సెలవులు (14రోజులు) ►జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు (5 రోజులు) -
Andhra Pradesh: పాఠాలకు పక్కా క్యాలెండర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి విద్యార్థినీ ప్రపంచ పౌరుడిగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లతో ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తోంది. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక వంటి పథకాలతో విద్యార్ధుల చదువుకు ప్రోత్సాహకాల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ఇప్పుడు అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లలో అభ్యసన కార్యక్రమాల నిర్వహణకూ పక్కా ప్రణాళిక రూపొందించింది. 2022–23 విద్యా సంవత్సరానికి సమగ్ర విద్యా క్యాలెండర్‌ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్దేశించిన పనిదినాలతో క్యాలెండర్‌ను రూపొందించారు. ఫౌండేషన్ పాఠశాలల నుంచి హైస్కూల్ వరకు చేపట్టాల్సిన విద్యా కార్యక్రమాలను సవివరంగా పొందుపరిచారు. అకడమిక్ క్యాలెండర్‌లోని లెసన్ ప్లాన్ ప్రకారం అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లూ విద్యాభ్యసన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. నెలవారీ కార్యక్రమాలు, లక్ష్యాలు, వాటి సాధన వంటి అంశాలను ఎస్సీఈఆర్టీ క్యాలెండర్లో సవివరంగా పొందుపరిచింది. జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూలై 5 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి జులైలో 22 రోజులు, ఆగస్టులో 22, సెప్టెంబర్‌లో 20/25, అక్టోబర్‌లో 19, నవంబర్‌లో 25, డిసెంబర్లో 26/18, జనవరిలో 26/23, ఫిబ్రవరిలో 22, మార్చిలో 23, ఏప్రిల్‌లో 21 రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయి. మొత్తం మీద పాఠశాలలు 220 రోజులు పనిచేస్తాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్, వేసవి సెలవులు మొత్తం 80 రోజులు సెలవు దినాలు ఉంటాయి. మిగతా రోజులు పండుగలు, ఆదివారాలు, ఇతర సెలవులు ఉంటాయి. దసరా సెలవులు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఉంటాయి. స్క్లూళ్ల సమయాలివీ.. ఫౌండేషన్ స్కూళ్లు (1, 2 తరగతులు, 1 నుంచి 5 తరగతుల స్కూళ్లు) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పనిచేస్తాయి. గేమ్స్, రెమిడియల్ తరగతులకోసం ఆప్షనల్ పీరియడ్‌ను 3.30 నుంచి 4.30 వరకు ఇవ్వాలి. హాఫ్‌డే స్కూళ్ల సమయంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగించాలి. హైస్కూళ్లు (3 నుంచి 7, 8 తరగతుల వరకు, 3 నుంచి 10వ తరగతి వరకు, 3 నుంచి 11, 12 తరగతులు, 6 నుంచి 10వ తరగతి) స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.00 వరకు పనిచేస్తాయి. ఆప్షనల్ పీరియడ్ సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఉంటుంది. హాఫ్‌డే స్కూళ్ల సమయంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు జరుగుతాయి. అన్ని స్కూళ్లలో తరగతుల మధ్యలో ఉదయం, మధ్యాహ్నం తప్పనిసరిగా వాటర్ బెల్ ఉంటుంది. సబ్జెక్టుల వెయిటేజి ప్రకారం పీరియడ్లు వివిధ సబ్జెక్టుల వెయిటేజి ప్రకారం పీరియడ్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు వారానికి 240 పీరియడ్లు ఉంటాయి. 1 నుంచి అన్ని తరగతులకు సబ్జెక్టు వెయిటేజీని క్యాలెండర్లో పొందుపరిచింది. హైస్కూళ్లలో అన్ని సబ్జెక్టులకు వెయిటేజీని ప్రకటిస్తూ వారానికి 384 పీరియడ్లను కేటాయించింది. ప్రధాన సబ్జెక్టులతో పాటు వుయ్ లవ్ రీడింగ్, ఆనంద వేదిక, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, కెరీర్ గైడెన్సు, మాస్ డ్రిల్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వేల్యూ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్, స్కూల్ సేఫ్టీ వంటి అంశాలను ప్రణాళికలో చేర్చారు. (క్లిక్: ఈ అమ్మఒడి భవితకు పెట్టుబడి) -
టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ!
జూన్ నెల వచ్చేసింది. కొత్త విద్యాసంవత్సరం మొదలు. పాత సమస్యలే కొత్తగా పుట్టుకొస్తాయి. ‘నేను కాలేజ్‌కి వెళ్లను’ అనిపిస్తుంది టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ మంచి మాటలతో... ఒత్తిడి మూలాలకు మందు వేయవచ్చు వేసవి సెలవులు పూర్తవుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ మొదలవుతోంది. కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే క్లాసులు మొదలు పెట్టేశాయి. కొన్ని కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధమవుతున్నాయి. టెన్త్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ కొత్త కాలేజీలో అడుగుపెట్టాలి. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్లు గ్రాడ్యుయేషన్ కాలేజీల బాటపట్టాలి. అప్పటివరకు ఆత్మీయతలు పంచుకున్న స్నేహితులు మరోచోట చేరిపోయి ఉంటారు. కొత్త వాతావరణానికి అలవాటు పడాలి. కొత్త మనుషుల మధ్య మెలగాలి. కొత్త వాళ్లలో స్నేహితులను వెతుక్కోవాలి. కొత్త మిత్రులు అర్థం అవుతున్నట్లే ఉంటారు, అలాగని పూర్తిగా అర్థం కారు. గతంలో స్నేహితులు, శత్రువుల్లా కొట్టుకున్న తోటి విద్యార్థులు గుర్తు వస్తారు. అప్పటి శత్రువులు కూడా చాలా మంచివాళ్లనిపిస్తుంటుందిప్పుడు. అలాగని వెనక్కి వెళ్లలేరు, ముందుకు సాగాల్సిందే. ఇది చిన్న సంఘర్షణ కాదు. రెక్కలు విచ్చుకుంటున్న లేత మనసులకు అది విషమ పరీక్ష అనే చెప్పాలి. పిల్లలు రెండు రకాలు ‘‘కొత్త పుస్తకాలు, కొత్త డ్రస్‌లు, కొత్త కాలేజ్... పట్ల ఉత్సుకత, ఉత్సాహంతో ఉరకలు వేసే పిల్లలు ఒక రకం. వీళ్లలో టీనేజ్ స్ట్రెస్ వంటి ఇబ్బందులుండవు. కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి బెంబేలు పడే వాళ్ల విషయంలోనే తల్లిదండ్రులు జాగ్రత్తగా మెలగాలి. టెన్త్ పరీక్షలకు ముందు పిల్లలు విపరీతమైన ఆందోళనకు గురైతే అప్పటికి ధైర్యం చెప్పి పరీక్షలు రాయించి ఉంటారు. అయితే అలాంటి పిల్లలను కాలేజ్‌లో చేర్చే ముందే వాళ్లకు తగిన కౌన్సెలింగ్ ఇప్పించాలి. కొత్త వాతావరణంలో ఇమడలేకపోవడం అనేది అలాంటి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. పేరెంట్స్ తమకు నచ్చిన కాలేజ్ అని, మంచి కాలేజ్ అనే పేరుందని, అక్కడ చదివితే ఐఐటీలో సీటు వస్తుందని తమకు తామే నిర్ణయించేసి ఫీజులు కట్టేస్తారు. పిల్లలు ఆ కాలేజ్‌కి వెళ్లడానికి ఇష్టపడకపోతే ఫీజు వృథా అవుతుందేమో, బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో పిల్లలను మరింత ఒత్తిడికి గురి చేస్తుంటారు’’ అని చెబుతున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్. మౌనం వీడరు ఇక్కడ విచిత్రం ఏమిటంటే... పేరెంట్స్ ఎంత సున్నితంగా అడిగినా పిల్లలు పూర్తిగా ఓపెన్ కారు. అలాగే పేరెంట్స్ ఎంతగా కౌన్సెలింగ్ ఇచ్చినా అవన్నీ నీతిసూత్రాలే అవుతుంటాయి. అందుకే పిల్లలు ‘ఎప్పుడు ఆపేస్తారా’ అన్నట్లు చికాగ్గా ముఖం పెడతారు. ఒక కాలేజ్ కుర్రాడు కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకు ఠంచన్‌గా లాప్టాప్తో సిద్ధమయ్యేవాడు. పేరెంట్స్ కూడా క్లాసులను జాగ్రత్తగా వింటున్నాడనే అనుకున్నారు. పరీక్షలు రాసిన తర్వాత తెలిసింది అస్సలేమీ చదవలేదని, పాఠాలు వినలేదని. ఆ ఏడాది మొత్తం లాప్టాప్లో వెబ్‌సీరీస్ చూశాడా కుర్రాడు. కొంతమంది జూనియర్ కాలేజ్‌లో యంత్రాల్లా చదివి చదివి విసిగిపోయి ఉంటారు. డిగ్రీ కాలేజ్‌కి వెళ్లగానే వాళ్లకందిన స్వేచ్ఛను ఎలా ఆస్వాదించాలో తెలియక అనేక దురలవాట్లకు బానిసలవుతుంటారు. స్వేచ్ఛ కూడా ఒత్తిడి చేసినంత నష్టాన్ని కలిగిస్తోంది. ఆ ఒత్తిడిని ఒక్కసారిగా తీసి పక్కన పెట్టినప్పుడు వచ్చే స్వేచ్ఛతో... అన్నింటికీ ‘ఇట్స్ ఓకే’ అనే కొత్త భాష్యం చెప్పుకోవడం మొదలైంది. చదవడం లేదా, బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా, క్లాసులు బంక్ కొడుతున్నారా, బ్యాక్ బెంచ్ స్టూడెంటా... అన్నింటికీ ఇట్స్ ఓకే ఫార్ములానే. దీంతోపాటు బ్యాక్లాగ్ లేని స్టూడెంట్స్ మీద కామెంట్స్ చేయడం కూడా. ఒక కప్పు కింద రెండు ప్రపంచాలు సమాజానికి ఆరోగ్యకరమైన ఒక కొత్త తరాన్ని ఇవ్వడం పేరెంట్స్ బాధ్యత. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కారణంగా ఈ తరం పిల్లలు పేరెంట్స్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. చాలామంది పేరెంట్స్ ఆ డిజిటల్ ప్రపంచంలోకి ఎంటర్ కాలేని స్థితిలోనే ఉంటారు. అలాగే పేరెంట్స్ ప్రపంచంలో జీవించడానికి పిల్లలు ఇష్టపడరు. రెండు భిన్నమైన ప్రపంచాలు ఒకే ఇంట్లో నివసిస్తున్నాయిప్పుడు. ఈ క్లిష్టమైన స్థితిలో పేరెంట్స్ పిల్లలతో మరింత స్నేహంగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది. టీన్స్‌లోకి రాకముందు నుంచే వాళ్లతో స్నేహితులుగా మెలగాలి. పిల్లలు చెప్పే విషయాలను అనుమానించడం మాని అర్థం చేసుకోవాలి, అర్థవంతంగా విశ్లేషించడం మొదలుపెట్టాలి. ఒక తోటలో చిగురించిన మొలకను పెకలించి మరో చోట నాటితే మొదట వాడిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటే కొత్త వాతావరణానికి అలవాటు పడుతుంది. కొత్త చివుళ్లు వేస్తుంది. కొత్త మట్టిసారంలో మరింత ఏపుగా పెరుగుతుంది. ఈ దశలో నిర్లక్ష్యంగా ఉంటే మొక్క వాడిపోతుంది. పిల్లలు కూడా మొక్కల్లాంటి వాళ్లే. టీనేజ్ స్ట్రెస్ లక్షణాలిలా ఉంటాయి అస్థిమితంగానూ ఆత్రుతగానూ ఉండడం, త్వరగా అలసటకు లోనుకావడం, తరచుగా కడుపు నొప్పి, ఛాతీ నొప్పి అని చెప్పడం, కుటుంబ సభ్యులతో కలవకుండా దూరం పెంచుకోవడం, నిద్రలేమి లేదా విపరీతంగా నిద్రపోవడం, పనులను వాయిదా వేయడం, బాధ్యతల పట్ల నిర్లక్ష్యం... పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఉపేక్షించరాదు. మొండి నిద్రపోతారు! కొత్త కాలేజ్‌లో అలవాటు పడలేని పిల్లల్లో ఆకలి మందగించడం, తిన్నది జీర్ణం కాకపోవడం, వాంతులు, విరేచనాలు కూడా వస్తుంటాయి. నిజానికి ఆ లక్షణాలు దేహ అనారోగ్య లక్షణాలు కావు, మానసిక ఆందోళన ప్రభావంతో ఎదురయ్యే సమస్యలు. కాబట్టి మొదట పిల్లలను జాగ్రత్తగా గమనించాలి, అది నిఘా కాకూడదు. ఎనిమిదిన్నరకు కాలేజ్‌కి రెడీ కావాల్సిన పిల్లలు ఒక్కోసారి తొమ్మిది వరకు నిద్రలేవరు. ఎంత లేపినా సరే మొండిగా నిద్రపోతుంటారు. కాలేజ్ టైమ్ దాటిన తర్వాత వాళ్లే లేస్తారు. ఆ రోజుకు ఏమీ అడగకుండా వాళ్లనలా వదిలేయడమే మంచిది. కాలేజ్‌కి వెళ్లడానికి అయిష్టత వెనుక కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. – డా‘‘ సి. వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ , యు అండ్ మి – వాకా మంజులారెడ్డి -
మార్చి 23 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ కాలేజీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 13 వరకు నడుస్తాయని ఇంటర్మీ డియట్ బోర్డు తెలిపింది. 2021–22 అకడమిక్ కేలండర్‌ను బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 220 పని దినాలుంటాయని, ఇందులో 47 పనిదినాల్లో ఆన్లైన్ బోధన జరిగిందని, మరో 173 పనిదినాల్లో ప్రత్యక్ష బోధన జరుగుతుందని తెలిపింది. -
క్యాలెండర్ విడుదల: తెలంగాణలో బడులు ఎన్ని రోజులంటే..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాఠశాల విద్యా క్యాలెండర్ విడుదలైంది. విద్యా శాఖ అధికారులు (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్) శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ ఈయర్ విడుదల చేశారు. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వివరాలు తెలిపారు. ఏప్రిల్ 23 పాఠశాలల చివరి పని దినమని చెప్పారు. ఈ ఏడాది పాఠశాల పని దినాలు 213, 47 రోజులు ఆన్లైన్ తరగతులు జరుగుతాయని వివరించారు. చదవండి: పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్ క్యాలెండర్ ఇలా.. FA1 పరీక్షలు అక్టోబర్ 5 నుంచి SA1 పరీక్షలు డిసెంబర్ 1 నుంచి 8 డిసెంబర్ వరకు FA2 పరీక్షలు పదో తరగతి జనవరి 31 నుంచి FA2 పరీక్షలు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫిబ్రవరి 28 నుంచి SA2 పరీక్షలు 1 నుంచి 9 వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి18 వరకు పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ ఫిబ్రవరి 25 లోపు మార్చి లేదా ఏప్రిల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు దసరా సెలవులు: అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు సంక్రాంతి సెలవులు: జనవరి 11 నుంచి జనవరి 16 వరకు -
ఈ విద్యాసంవత్సరంలో 188 పనిదినాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుత (2021–22) విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 188 పనిదినాలు ఉండగా సెలవులు 70 రోజులు ఉన్నాయి. ఇక బేస్‌లైన్ పరీక్షలతోపాటు ఫార్మేటివ్ (నిర్మాణాత్మక) పరీక్షలు 4, సమ్మేటివ్ (సంగ్రహణాత్మక) పరీక్షలు 2తో పాటు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ స్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ అకడమిక్ క్యాలెండర్‌ను, పాఠ్యప్రణాళికను ఎస్సీఈఆర్టీ తీర్చిదిద్దింది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి సారథ్యంలో వివిధ విభాగాల నిపుణులు 35 మంది దీని రూపకల్పనలో భాగస్వాములయ్యారు. పాలన ప్రణాళిక, యాజమాన్యాల వారీగా రాష్ట్రంలోని పాఠశాలలు, జిల్లా ఉపాధ్యాయ విద్యాశిక్షణ సంస్థలు, ఉపాధ్యాయుల వివరాలను ఈసారి కొత్తగా చేర్చారు. విద్యాహక్కు చట్టం, బాలలహక్కుల చట్టం నియమ నిబంధనలతో పాటు కేంద్రం నూతన విద్యావిధానంలో సూచించిన విధంగా సమ్మిళిత విద్యాంశాలను ఈ విద్యాప్రణాళికలో పొందుపరిచారు. 6 రకాల స్కూళ్ల గురించి.. పాఠశాలల భద్రత, విపత్తు నిర్వహణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యక్రమాలు, సమగ్రశిక్ష, వయోజన విద్య, ఉపాధ్యాయ శిక్షణ, ఉపాధ్యాయుల సామర్థ్యాలు మెరుగుపర్చడం, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, కెరీర్ గైడెన్స్, యూడైస్ చైల్డ్ ఇన్ఫో, దీక్ష వంటి అంశాలను విపులీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణలలో అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, కొత్తగా రూపొందించిన వివిధ యాప్‌లు, పాఠ్యప్రణాళికా సంస్కరణలు, గ్రంథాలయాలు, చదవడంపై ఆసక్తి వంటి అంశాలను వివరించారు. భవిష్యత్తు ప్రణాళికలు పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నూతన విద్యావిధానంలోని 6 రకాల స్కూళ్లు, నాడు–నేడు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, రంగోత్సవం, కళాఉత్సవ్, ద ఇండియా టాయ్ ఫెయిర్ ఏకభారత్ శ్రేష్ఠభారత్, మాసాంతపు వేడుక, కరోనా కాలంలో, కరోనా అనంతరం విద్యాకార్యక్రమాలు, ఆటల పోటీలు, సైన్సు ఫెయిర్లు, క్విజ్, వక్తృత్వపోటీలు, క్షేత్ర పర్యటనలు, ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలిపారు. 1, 3వ శనివారాలు నోబ్యాగ్ డే ప్రతి స్కూలులో పాఠ్యబోధనతో స్వీయ పఠనం, పర్యవేక్షక పఠనం, పోటీ పరీక్షలకు సన్నద్ధతతోపాటు నీటిగంట, ఆటలు, పునశ్చరణ, సవరణాత్మక బోధన, గ్రంథాలయ కృత్యాలు నిర్వహించేలా ఈ విద్యాప్రణాళికను రూపొందించారు. ఒకటి, 3వ శనివారాలను నోబ్యాగ్ డేగా నిర్వహించనున్నారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు వారానికి ఒకసారి కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థుల ఐచ్ఛికం ప్రకారం జరగాలని నిర్దేశించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకొనేలా చూడడంతోపాటు వాటిపై వారికి అవగాహన కలిగించాలని సూచించారు. ఫౌండేషన్ స్కూళ్లపై మరింత శ్రద్ధ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెడుతున్న ఫౌండేషన్ స్కూళ్ల నిర్వహణలో మరింత శ్రద్ధ తీసుకొనేలా విద్యాక్యాలెండర్లో అంశాలను పొందుపరిచారు. దీని ప్రకారం.. ఉదయాన్నే గ్రీట్ అండ్ మీట్ కింద ఉపాధ్యాయుడు పిల్లలకు స్వాగతం చెప్పాలి. ప్రతి పిల్లవాడిని పేరుతో పలకరిస్తూ కథలు చెప్పాలి. సామూహిక కృత్యాలు నిర్వహించాలి. తరగతి గదిలోనే బుక్ ఏరియా, డాల్స్ ఏరియా, డిస్కవరీ ఏరియా, బ్లాక్ బిల్డింగ్ ఏరియా, మ్యూజిక్ అండ్ మూవ్మెంటు ఏరియాలుగా చేసి పిల్లలు వారికి నచ్చిన ఏరియాలో ఆడుకునేలా చేసి వారి అభీష్టాలను గమనించాలి. వస్తువులను లెక్కించేలా, గుర్తించేలా చేయాలి. వస్తువులను చూడడం, తాకడం, శబ్దాలను వినడం, పదార్థాల వాసన, రుచి చూసి చెప్పడం వంటివి చేయించాలి. భోజన సమయంలో చేతులు కడుక్కోవడం, శుభ్రం చేసుకోవడం నేర్పాలి. భాషా నైపుణ్యాలను అలవర్చాలి. చివరిగా పాఠశాలను వదిలిన సమయంలో పునశ్చరణ, గుడ్‌బై చెప్పడం వంటివి చేయించాలి. -
మే 17 నుంచి టెన్త్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్‌ను ఖరారు చేసింది. కరోనా కారణంగా 11 ప్రశ్నపత్రా లకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించ నుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారం భించనున్నందున.. పని దినాలు, బోధన, పరీక్ష లకు సంబంధించిన షెడ్యూల్ తదితర అం శాలతో ప్రతిపాదిత క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ప్రభు త్వం ఒకటి, రెండు రోజుల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అయితే ఇందులో 9, 10 తరగతులకు మాత్రమే అకడమిక్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మిగతా తరగతుల విషయాన్ని ప్రస్తా వించలేదు. ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ 1 నుంచి 8 తరగతు లకు ప్రత్యక్ష బోధన కుదరకపోతే ఆన్లైన్/ డిజిటల్ విధానంలోనే బోధనను కొనసాగించి, విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఫిబ్రవరి తరువాత 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తం 204 పనిదినాలు మొత్తంగా 204 పని దినాలుగా నిర్ణయించారు. అందులో గత సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్/డిజిటల్ పద్ధతిలో 115 రోజులు అవుతాయి. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మే 26వ తేదీ వరకు 89 రోజుల పని దినాలు ఉంటాయి. ఈ రోజుల్లో ప్రత్యక్ష విద్యా బోధనతో పాటు ఆన్లైన్/డిజిటల్ విద్యా బోధన కొనసాగుతుంది. ఫిబ్రవరిలో 24, మార్చిలో 25, ఏప్రిల్‌లో 21, మేలో 19 పని దినాలు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి బడి పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. డిజిటల్ బోధన పదో తరగతికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు (రెండు పీరియడ్లు) ఉంటుంది. 9వ తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు (రెండు పీరియడ్లు) ఉంటాయి. 70 శాతం సిలబస్‌నే టీచర్లు ప్రత్యక్ష బోధనతోపాటు, ఆన్లైన్/డిజిటల్ విధానంలో బోధిస్తారు. మిగతా 30 శాతం సిలబస్ ప్రాజెక్టు వర్క్స్, అసైన్మెంట్లకే ఉంటుంది. వాటిని ఇంటర్నల్ అసెస్మెంట్స్, సమ్మేటివ్ అసెస్మెంట్/బోర్డు పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోరు. ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదు ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదు. ఇంటినుంచే చదువుకుంటామంటే తల్లిదండ్రుల అంగీకారంతో అనుమతించాలి. కనీస హాజరును పట్టించుకోకుండా పరీక్షలకు అనుమతించాలి. ఏ ఒక్క విద్యార్థినీ ఏ కారణంతోనూ పరీక్షల నుంచి విత్‌హెల్డ్‌లో పెట్టడానికి వీల్లేదు. విద్యార్థుల ఆరోగ్య ప్రణాళిక – పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి ముందే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో సమావేశం నిర్వహించాలి. కోవిడ్ జాగ్రత్తలు, రోగనిరోధకత పెంపు, మానసిక ఆరోగ్యం, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. – విద్యార్థులకు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. పాఠశాలల్లో విద్యార్థులకు, సిబ్బందికి ఐసోలేషన్ రూమ్‌లను ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వారి తల్లిదండ్రులకు తెలియజేసి, తగిన జాగ్రత్తలతో ఇళ్లకు పంపేందుకు రవాణా సదుపాయం కల్పించాలి. ఇవీ అకడమిక్ క్యాలండర్‌లోని ప్రధాన అంశాలు ఫిబ్రవరి 1: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం మే 26 : చివరి పని దినం మే 27 – జూన్ 13 : వేసవి సెలవులు పరీక్షల షెడ్యూల్ మార్చి 15 లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–1 పరీక్ష ఏప్రిల్ 15 లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–2 పరీక్ష మే 7 – మే 13 : 9వ తరగతికి సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షలు మే 17 – మే 26 : పదో తరగతి పరీక్షలు. (మార్చి/ఏప్రిల్‌లో సైన్స్ సెమినార్లు, ఎగ్జిబిషన్లను వర్చువల్‌గానే నిర్వహించాలి) -
మే 3 నుంచి ఇంటర్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 3వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కారణంగా సాధారణ షెడ్యూల్ కంటే 2 నెలలు ఆలస్యంగా పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభిస్తున్న నేపథ్యంలో అకడమిక్ కేలండర్ రూపకల్పన, పరీక్షలకు సంబంధిం చిన షెడ్యూల్ రూపకల్పనపై ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ చివరి నాటికి కనీసం 68 నుంచి 74 రోజులపాటు ప్రత్యక్ష విద్యా బోధన నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళి కను రూపొందిస్తోంది. మరోవైపు మే 3వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలి సింది. ఆ పరీక్షలను 70% సిలబస్‌తోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నా యి. అయితే తొలగిం చే 30% సిలబస్‌పై కూడా విద్యార్థులతో అసైన్మెంట్లు, ప్రాజెక్టులు చేయించేలా చర్యలు చేపడుతోంది. ఎన్విరాన్మెంటల్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలపై బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంసెట్‌పైనా ఆలోచన మరోవైపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్‌కు కేంద్ర ప్రభుత్వం సిలబస్‌ను తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై ఆలోచనలు చేస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వ ఆమోదం తీసుకొని, ఉన్నత విద్యా మండలితో సమావేశం కావా లని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. మండలితో నిర్వహించే సమావేశంలో యూనివర్సిటీలు పాల్గొంటాయి కనుక అందులో ఎంసెట్ సిలబస్ ఎంత ఉండాలో నిర్ణయించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. చదవండి: (హెడ్మాస్టర్ స్థాయి వరకే పదోన్నతులు!) ప్రాక్టికల్స్ ఉంటాయ్.. కరోనా కారణంగా విద్యా బోధన దెబ్బతిన్నప్పటికీ ఆన్లైన్/డిజిటల్/టీవీ ద్వారా విద్యా బోధనను బోర్డు నిర్వహించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్నప్పటికీ ఆన్లైన్/డిజిటల్ విద్యాబోధనను కొనసాగించనుంది. మరోవైపు ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తున్నందున విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను సైతం నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. అందుకు అనుగుణంగానే అకడమిక్ కేలండర్, పరీక్షల షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. వార్షిక పరీక్షలకు ముందే ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందిస్తోంది. ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన వారూ పాస్! గతేడాది మార్చిలో (2020) జరిగిన వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన ఫస్టియర్ విద్యార్థులను పాస్ చేసేలా ప్రభుత్వానికి ఫైలు పంపించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. కరోనా కారణంగా గతేడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. దీంతో గత మార్చిలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కనీస పాస్ మార్కులు ఇచ్చి పాస్ చేసింది. కానీ ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన 1.92 లక్షల మంది విద్యార్థుల విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వారిని కూడా కనీస మార్కులతో ఉత్తీర్ణులను చేయాలని బోర్డు భావిస్తోంది. నేడో రేపో పాఠశాల విద్య అకడమిక్ కేలండర్ పాఠశాల విద్య అకడమిక్ కేలండర్ ఒకటీ రెండురోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే కేలండర్‌ను సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. దానికి ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది. -
10 నుంచి సంక్రాంతి సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్కూళ్లకు ఈనెల పదో తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఎనిమిది రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండేలా విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్లో పనిదినాలను సర్దుబాటు చేసింది. ఈ ఏడాది కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, ఇంకా పూర్తిస్థాయిలో స్కూళ్లు తెరవలేని పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో విద్యాసంవత్సరంలో పనిదినాలు కోల్పోకుండా ఉండేందుకు విద్యాశాఖ పండగ సెలవులను కుదించాలని భావించింది. ఈనెల 13 నుంచి మూడు రోజులు పండగ దినాలు కావడంతో సెలవులు అటుఇటుగా ఆ మేరకు ప్రకటించాలనుకున్నారు. అయితే సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యం, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ సెలవు రోజులను పెంచేలా చర్యలు తీసుకుంది. 10వ తేదీ ఆదివారం సెలవు. అయితే, 11న సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం ఉన్నందున హాఫ్ డే వర్కింగ్ డేగా ఉంటుంది. హాఫ్ డే సెలవు ఉంటుంది. తర్వాత 17వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉంటాయి. 18వ తేదీ సోమవారం పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. 7, 8 తరగతుల ఫార్మేటివ్ పరీక్షలు వాయిదా ఈనెల 21 నుంచి 23 వరకు జరగాల్సిన ఫార్మేటివ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. సిలబస్ పూర్తికి సంబంధించి ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షలను ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. -
ఒత్తిడి లేకుండా బోధన.. పరీక్షల కుదింపు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది బోధనాభ్యసన కార్యక్రమాలు, పరీక్షల విషయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియెట్‌లోనూ విద్యార్థులపై భారం లేకుండా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించింది. ముఖ్యంగా టెన్త్ పబ్లిక్ పరీక్షలపై విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఏ మేరకు అభ్యసనం సాగించాలి, వారి సామర్థ్యాలను ఏ మేరకు పరిశీలన చేసి ఉత్తీర్ణతను నిర్ణయించాలి అనే వాటిపైనా ముందుగానే ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో అవుట్ కమ్ బేస్డ్ (అభ్యసన ఫలితాల ఆధారిత) సిలబస్‌ను రూపొందించినందున దానికి అనుగుణంగానే తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకొనే అంశాలు, ఇంటి దగ్గర అభ్యసనం చేయగలిగే అంశాలను వేరు చేసింది. తరగతి గదిలో బోధించే అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలను దీని ఆధారంగానే రూపొందించాలని ఎస్సెస్సీ బోర్డుకు సూచించింది. ‘ఇంటి దగ్గర విద్యార్థులు తమంతట తాము అభ్యసించగలిగే అంశాలు కేవలం వారి సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి మాత్రమే. తరగతి గదిలోని బోధనాంశాలపై మాత్రమే వారికి పరీక్షల్లో ప్రశ్నలు ఉంటాయి’ అని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: నియమాలు పాటిస్తేనే ప్రవేశాలు) 180 పని దినాలు... 143 బోధనా దినాలు రాష్ట్రంలో సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభమై ఏప్రిల్ 30తో ముగిసేలా పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్‌ను రూపొందించింది. మొత్తం 180 రోజుల పని దినాల్లో 143 రోజులు పాఠశాల బోధనా దినాలుగా, 37 రోజులు ఇంటివద్ద నేర్చుకునే పని దినాలుగా నిర్ణయించింది. పాఠశాలలు దాదాపు ఏడు నెలలపాటు మూతపడినందున 2020-21 విద్యా సంవత్సరానికి పని దినాల సర్దుబాటులో భాగంగా పలు సెలవులను కుదించారు. సంక్రాంతి సెలవులు, వేసవి సెలవుల్లో కొన్ని రోజులను పాఠశాల, ఇంటి పని దినాలుగా నిర్ణయించారు. ముఖ్యమైన పండుగలు, జాతీయ సెలవుల్లో మినహాయించి తక్కిన సెలవు రోజుల్లో పాఠ్యబోధన కొనసాగనుంది. టీచర్ల సెలవుల విషయంలోనూ నియంత్రణ పెట్టారు. (చదవండి: ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు) పరీక్షల కుదింపు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ విద్యా సంవత్సరంలో పరీక్షల సంఖ్యను కూడా పాఠశాల విద్యా శాఖ కుదించింది. ఏటా నిర్వహించే నాలుగు ఫార్మేటివ్ పరీక్షలను రెండుకు, 2 సమ్మేటివ్ పరీక్షలను ఒకటికి కుదించారు. బేస్‌లైన్ పరీక్షలను నవంబర్ మొదటి వారంలో, ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్ చివరి వారంలో, ఫార్మెటివ్-1 పరీక్షలను డిసెంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-2 పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్ పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహిస్తారు. నెలవారీగా పని దినాలు, పాఠశాల, ఇంటి పని దినాల విభజన ఇలా.. నెల మొత్తం పని దినాలు పాఠశాల పని దినాలు ఇంటివద్ద పని దినాలు నవంబర్ 29 25 4 డిసెంబర్ 31 25 6 జనవరి 31 23 8 ఫిబ్రవరి 28 24 4 మార్చి 31 25 6 ఏప్రిల్ 30 21 9 మొత్తం 180 143 37 -
రేపటి నుంచి తరగతులు ప్రారంభం
సాక్షి, అమరావతి: డిగ్రీ, పీజీ తదితర కోర్సుల కాలేజీల పునఃప్రారంభానికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ శుక్రవారం రాత్రి అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. నవంబర్ 2 నుంచి సరి, బేసి సంఖ్యల రోజుల్లో తరగతులు నిర్వహించనున్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా వీటిని కొనసాగించేలా మార్గదర్శకాలిచ్చారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ ఫస్టియర్ తరగతులను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ► వారంలో ఆరు రోజులు పనిదినాలుంటాయి. ఏదైనా కారణాల వల్ల పని దినాన్ని కోల్పోవాల్సి వస్తే రెండో శనివారం, ఇతర సెలవు దినాల్లో (నేషనల్ హాలిడేలు, ముఖ్యమైన పండుగ దినాలు మినహా) భర్తీ చేయాలి. ► ఫస్టియర్ పీజీ ప్రోగ్రాంల షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి కాలేజీలను నిర్వహించాల్సి ఉంటుంది. -
టెన్త్‌కు రెగ్యులర్ తరగతులు!
సాక్షి, అమరావతి: కోవిడ్19 కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు నవంబర్ 2 నుంచి తెరవనున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణ, ప్రత్యామ్నాయ పాఠ్య ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయిస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో విద్యా రంగ నిపుణులతో ఈ కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 25 నాటికి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌పై ప్రతిపాదనలు అందించనున్నారు. రానున్న రోజుల్లో పని దినాలను అనుసరించి విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా పాఠ్యాంశాల నిర్ణయం, తరగతుల నిర్వహణ అంశాలపై దృష్టి సారించారు. పాఠశాల తరగతులను 18 వరకు ఒక విభాగంగా, 9, 10 తరగతులను మరో విభాగంగా రూపొందిస్తున్నారు. 18 తరగతుల వారికి తరగతుల నిర్వహణకు రెండు మూడు మార్గాలను ప్రతిపాదిస్తున్నా, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం రెగ్యులర్ తరగతులు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను అనుసరించి తరగతులు కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి విద్యార్థులను అనుమతించనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఉదయం కొన్ని తరగతులు, మధ్యాహ్నం కొన్ని తరగతులు నిర్వహించనున్నారు. లేదంటే కొన్ని రోజులు కొన్ని తరగతులు, మరికొన్ని రోజులు మరికొన్ని తరగతులు పెట్టనున్నారు. తొలుత తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు పెట్టి పాఠశాలలకు పిల్లలను పంపడంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించనున్నారు. మధ్యాహ్న భోజనం సమయంలో భౌతిక దూరం పాటించేలా టీచర్లకు బాధ్యతలు అప్పగిస్తారు. స్కూలులో చెబితేనే నేర్చుకోగలుగుతారనే అంశాలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఇంటిదగ్గర నేర్చుకొనే వాటికి సంబంధించి వీడియో, ఆడియోల రూపంలో విద్యార్థులకు అందిస్తారు. అదనంగా నేర్చుకొనే అంశాల గురించి వివరిస్తారు. ఈ మేరకు పాఠ్య ప్రణాళిక రూపొందిస్తున్నారు. 180 పనిదినాలు ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు కొనసాగించేలా పాఠ్య ప్రణాళిక రూపొందుతోంది. సంక్రాంతి సెలవులను కుదించడం ద్వారా 180 పని దినాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా అన్ని అంశాలు బోధించేలా ప్రణాళిక ఉంటుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసారి పరీక్షలు రెండు ఫార్మేటివ్, ఒక సమ్మేటివ్ ఉండేలా చూస్తున్నారు. పాఠ్యప్రణాళిక ప్రకారమే పరీక్షలు ప్రస్తుతం పరిస్థితిని అనుసరించి రూపొందిస్తున్న పాఠ్య ప్రణాళికనే టెన్త్ పరీక్షల నిర్వాహకులకు అందిస్తారు. దాని ఆధారంగానే ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుల మూల్యాంకన జరిగేలా చూస్తారు. టెన్త్ పరీక్షలు ఏటా మార్చి 24 లేదా 26వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 10 వరకు జరుగుతుంటాయి. ఈసారి తరగతులు ఆలస్యమైనందున ఏప్రిల్ 15 నుంచి ప్రారంభించి, ఆ నెలాఖరులోగా పూర్తి చేస్తారు. -
నియమాలు పాటిస్తేనే ప్రవేశాలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో ముఖ్యంగా ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో నాణ్యతను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన విద్యను అందించేలా కాలేజీల్లోని సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయిస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ నియమాలను అనుసరించి సదుపాయాలు ఉన్న కళాశాలలను మాత్రమే కౌన్సెలింగ్‌లో అనుమతించనున్నారు. వర్సిటీల వారీగా తనిఖీలు ఏఐసీటీఈ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో నిర్ణీత నిబంధనల ప్రకారం సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలించేందుకు యూనివర్సిటీలు ప్రత్యేక కమిటీల ద్వారా తనిఖీలు చేయిస్తున్నాయి. కాకినాడ జేఎన్టీయూ, అనంతపురం జేఎన్టీయూ ప్రస్తుతం ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. గతంలో ఇదంతా తూతూమంత్రంగా సాగేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం సంబంధిత కాలేజీల్లో నిర్ణీత నియమాల ప్రకారం అన్ని సదుపాయాలు, బోధన, బోధనేతర సిబ్బంది, ల్యాబ్‌లు, భవనాలు, ఇతరత్రా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో క్షుణ్నంగా తనిఖీలు చేయిస్తోంది. ఉన్నత విద్యారంగంలో సంస్కరణల కోసం ఇప్పటికే ఏర్పాటైన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కాలేజీలు సమర్పించిన పత్రాలను అనుసరించి ఫీజులను నిర్ణయిస్తోంది. కొన్ని కాలేజీలను కమిషన్ తనిఖీలు చేయించింది. పలు కాలేజీలు సదుపాయాలు లేకుండానే కొనసాగుతున్నాయని, కొన్నిచోట్ల సరైన సంఖ్యలో అడ్మిషన్లు లేకున్నా కాలేజీలు నడుపుతుండటాన్ని గుర్తించింది. సదుపాయాలు లేకుంటే అనుమతి నిల్ సరైన సదుపాయాలు లేని కాలేజీలను కౌన్సెలింగ్‌లో అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైనా లోపాలు ఉన్నట్టు తేలితే సంబంధిత పరిశీలన కమిటీలపై చర్యలు తీసుకుంటారన్న సంకేతాలు ఇవ్వడంతో ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయో లేవోననే దానిపై లోతుగా పరిశీలిస్తున్నారు. ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీలు 392 రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీల సంఖ్య గతంతో పోలిస్తే ఈసారి భారీగా తగ్గింది. ఒకప్పుడు రాష్ట్రంలో 467 వరకు ఇంజనీరింగ్, ఫార్మా తదితర కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొనేవి. కానీ ఈసారి వాటి సంఖ్య 392 వరకు మాత్రమే ఉండనుంది. గత ఏడాది వీటి సంఖ్య 445 కాగా ఈసారి 53 వరకు కాలేజీల సంఖ్య తగ్గడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాల విషయంలో కఠినంగా ఉండటంతో సదుపాయాలు లేని కాలేజీలను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసివేశాయి. ప్రస్తుతం ఈ కాలేజీల గుర్తింపు (అఫ్లియేషన్) కోసం యూనివర్సిటీల తనిఖీలు కూడా లోతుగా సాగుతుండటంతో కౌన్సెలింగ్‌లోకి ఎన్ని కాలేజీలు వస్తాయో పరిశీలన అనంతరమే తేలనుంది. ప్రమాణాలు పాటిస్తేనే ఫీజు రీయింబర్స్మెంట్ నిర్దేశించిన అన్ని ప్రమాణాలూ పాటించే కాలేజీలకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనుంది. ఈసారి కాలేజీల సంఖ్య తగ్గినా సీట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో సీట్లు పెరుగుతున్నాయి. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డీప్ లెర్నింగ్, డేటా అనాలసిస్ వంటి కొత్త కోర్సుల్ని దాదాపు 50 శాతం కాలేజీల్లో ప్రారంభిస్తున్నారు. గడచిన నాలుగేళ్లలో కాలేజీలు, మొత్తం సీట్లు, కన్వీనర్ కోటా, భర్తీ అయిన, మిగులు సీట్ల వివరాలు సంవత్సరం కాలేజీల సంఖ్య మొత్తం సీట్లు కన్వీనర్ కోటా భర్తీ అయిన సీట్లు మిగిలిన సీట్లు 2017 467 1,40,358 98,251 66,073 32,178 2018 460 1,36,224 96,857 56,609 37,248 2019 445 1,29,882 1,06,203 60,315 45,888 2020 392 1,53,978 - - - -
సెప్టెంబర్ 15 నుంచి విద్యా సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: కరోనా ఎఫెక్ట్‌తో విద్యా సంవత్సరం వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల విద్యా సంవత్సరం సెప్టెంబర్ 15న షురూ కానుంది. ఈ మేరకు గురువారం అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) రివైజ్డ్ అకడమిక్ క్యాలెండర్‌ను జారీ చేసింది. ఇంతకుముందు ప్రథమ సంవత్సరంలో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబర్ ఒకటి, ఇతర విద్యార్థులకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను సవరించింది. కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తరగతుల(విద్యా సంవత్స రం)ను ప్రారంభించాలని పేర్కొంది. మిగతా విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులను మొదలుపెట్టాలని సూచించింది. యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును గతంలో జూన్ 30 వరకు ఇవ్వాలని పేర్కొనగా, ఇప్పుడు దానిని సవరించి జూలై 15వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని, మిగిలిన సీట్లను సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని పేర్కొంది. పీజీసీఎం/పీజీడీఎం కోర్సుల్లో చేరిన వారికి ఆగస్టు 1వ తేదీకల్లా తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. -
యూనివర్సిటీలు, కాలేజీలకు త్వరలో యూజీసీ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన పరీక్షలు, ప్రవేశాలు, అకడమిక్ క్యాలెండర్‌పై చర్చించేందుకు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసరంగా సమావేశమైంది. విద్యా సంవత్సరంలో కోత, ఆన్లైన్ ఎడ్యుకేషన్‌పై ఏర్పాటు చేసిన ప్యానెళ్లు ఇచ్చిన నివేదికలపై చర్చించారు. త్వరలో యూనివర్సిటీలు, కాలేజీలకు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తామని యూజీసీ సెక్రెటరీ రజనీష్ జైన్ చెప్పారు. -
వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్ మీడియం విద్యను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టనున్నట్లు ఉత్తర్వులో తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో దీనిని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. -
పాఠాలు చూడొచ్చు.. వినొచ్చు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 8వ తరగతి ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టు పుస్తకాలను అభివృద్ధి చేసి, వాటిల్లో క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ పొందుపరిచేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి చర్యలుచేపట్టింది. ప్రతి పాఠానికి సంబం ధించిన వివిధ అంశాలపై వీటిని అభివృద్ధి చేసింది. ఈనెల 11 నుంచి 14 వరకు వాటిని సమీక్షించి పుస్తకాల్లో పొందుపరచాలని నిర్ణయించింది. తద్వారా పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచే క్యూఆర్ కోడ్ ఆధారంగా విద్యార్థులు ఆ కోడ్‌ను ఎలక్ట్రానిక్ పరికరం లేదా మొబైల్ సహాయంతో రీడ్ చేస్తే ఆ పాఠ్యాంశానికి ఆడియో, వీడియోతో మొబైల్లో ప్రత్యక్షం అయ్యేలా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దీక్ష కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి తెలిపారు. మొదట ప్రయోగాత్మకంగా 8వ తరగతి ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టులో వీటిని పొందుపరచాలని నిర్ణయించామని, దీనిని 2019–20 విద్యా సంవత్సరంలో అమల్లోకి తెస్తామని ఆమె వెల్లడించారు. ఇది సక్సెస్ అయితే అన్ని తరగతుల్లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. -
భిన్నత్వంతో విభేదాలు రాకూడదు
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న భిన్నత్వం గురించి గర్వించాలి, భిన్నత్వాన్ని గౌరవించాలి తప్ప సమాజంలో విభేదాలకు అది కారణం కాకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆరెస్సెస్ మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘భవ్యిషత్ భారతం–ఆరెస్సెస్ దృక్పథం’ సదస్సును భాగవత్ సోమవారం ప్రారంభించారు. ఆరెస్సెస్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరవ్వాల్సిందిగా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులకూ ఆహ్వానం పంపామని ఆరెస్సెస్ చెబుతుండగా.. తమనెవరూ పిలవలేదనీ, పిలిచినా వెళ్లే వాళ్లం కాదని కాంగ్రెస్ సహా కొందరు విపక్ష నేతలు పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, అధికార బీజేపీ నాయకులతోపాటు అనేక మంది బాలీవుడ్ నటీనటులు, విద్యావేత్తలు సదస్సుకు వచ్చారు. భాగవత్ మాట్లాడుతూ ‘దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కాంగ్రెస్ గొప్ప పాత్ర పోషించింది. భారత్‌కు ఎంతోమంది గొప్ప నాయకులను ఇచ్చింది’ అని కొనియాడారు. ఆరెస్సెస్ పరిణామ క్రమాన్ని వివరించిన ఆయన.. ఆరెస్సెస్ సేవలను ఇతర ఏ సంస్థతోనూ పోల్చలేమన్నారు. ఆరెస్సెస్ నియంతృత్వ సంస్థ కాదనీ, అత్యంత ప్రజాస్వామిక సంస్థ అని చెప్పుకొచ్చిన భాగవత్.. ఆరెస్సెస్ తన సిద్ధాంతాలను ఎప్పుడూ ఇతరులపై రుద్దదనీ, అలాగే అనుబంధ సంస్థలపై తమ నియంత్రణేమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీని ఆరెస్సెస్ నియంత్రిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘భారత్ భిన్నత్వంతో కూడిన దేశం. దాన్ని అందరూ గౌరవించాలి, గర్వించాలి. సమాజంలో విభేదాలకు భిన్నత్వం కారణం కాకూడదు’ అని భాగవత్ విజ్ఞప్తి చేశారు. అధికారంతో సంబంధం లేదు ‘అధికారంలో ఎవరుంటారు?, దేశం ఏ విధానాలను ఆమోదిస్తుంది అనేది సమాజం, ప్రజలు నిర్ణయించాల్సింది. వీటితో మాకు సంబంధం లేదు. సమాజం బాగుండటమే మాకు ముఖ్యం’ అని భాగవత్ స్పష్టం చేశారు. -
నిధుల కోసం కేంద్రాన్ని అడుక్కోకండి
పుణే: విద్యాసంస్థలు నిధుల కోసం ప్రభుత్వాన్ని అడుక్కునే బదులు తమ పూర్వ విద్యార్థులను ఆశ్రయించాలని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవడేకర్ సూచించారు. శుక్రవారం ఇక్కడి జ్ఞాన ప్రబోధిని పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ‘ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలల నుంచి వర్సిటీల వరకు ఎవరు నడుపుతున్నారు? ప్రభుత్వాలు కాదు.. అక్కడ చదువుకుని ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరిన పూర్వ విద్యార్థులే’అని ఆయన పేర్కొన్నారు. పలు విద్యాసంస్థలు సాయం కోసం విరామం లేకుండా ప్రభుత్వాన్ని అడుక్కుంటాయని, కానీ నిజమైన సాయం వారి వద్దే ఉందని చెప్పారు. తాము చదుకున్న పాఠశాలలు, కాలేజీల అభివృద్ధికి విరాళాలు ఇవ్వడం ఓ బాధ్యతగా తీసుకోవాలని ఆయన కోరారు. -
శాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు కొత్త వీసాలు
లండన్ : భారత్‌తో పాటు విదేశీ శాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు యూకే వీసా నిబంధనలను సరళతరం చేసింది. వీరి కోసం కొత్త రకం వీసాలను ప్రవేశపెట్టింది. ఆ దేశంలో పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ కొత్త రకం వీసాలను తీసుకొచ్చినట్టు యూకే పేర్కొంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న టైర్ 5 వీసా రూట్‌కి కొత్త యూకేఆర్ఐ సెన్స్, రీసెర్చ్, అకాడమియా స్కీమ్‌ను జతచేర్చుతున్నట్టు తెలిపింది. దీన్ని యూరోపియన్ యూనియన్ వెలుపల నుంచి యూకేకు రెండేళ్ల వరకు వచ్చే విద్యావేత్తలకు, శాస్త్రవేత్తలకు జూలై 6 నుంచి అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొంది. పరిశోధన, నూతన ఆవిష్కరణలకు యూకే ప్రపంచ లీడర్‌గా ఉందని, యూకేలో పనిచేయడానికి, శిక్షణ తీసుకోవడానికి అంతర్జాతీయ పరిశోధకులకు ఈ వీసాలు ఎంతో ఉపయోగపడనున్నాయని యూకే ఇమ్మిగ్రేషన్ మంత్రి కారోలైన్ నోక్స్ తెలిపారు. ఈ వీసాలు యూకే వీసా నిబంధనలను సరళతరం చేస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతిభను ఆకట్టుకోవడానికి తప్పనిసరిగా మెరుగైన ఇమ్మిగ్రేషన్ సిస్టమ్‌ను తాము కలిగి ఉండాలని పేర్కొన్నారు. వారి నైపుణ్యం నుంచి తాము ప్రయోజనం పొందనున్నామని చెప్పారు. యూకే ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి, శాస్త్రవేత్తల, విద్యావేత్తల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ, పరిశోధన ప్రతిభను ఆకట్టుకుంటూ... యూకేను ప్రపంచంలో అగ్రగామిగా ఉంచుతామన్నారు. ఈ స్కీమ్‌ను యూకే పరిశోధన, నూతనావిష్కరణ సంస్థ(యూకేఆర్ఐ) నిర్వహిస్తుంది. ఇది దేశీయంగా ఉన్న ఏడు రీసెర్చ్ కౌన్సిల్స్‌ను ఒక్క తాటిపైకి చేరుస్తుంది. యూకేఆర్ఐ, దాంతో పాటు 12 ఆమోదిత పరిశోధన సంస్థలు ఇక నుంచి ప్రత్యక్షంగా అత్యంత నిపుణులైన ప్రజలకు స్పాన్సర్ చేయడానికి వీలవుతుంది. వారికి యూకేలో శిక్షణ ఇచ్చేందుకు, పని చేసేందుకు ఈ కొత్త వీసాలు ఎంతో సహకరించనున్నాయని యూకేఆర్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెసర్ మార్క్ వాల్‌పోర్ట్ చెప్పారు. స్పాన్సర్ ఆర్గనైజేషన్లను కూడా యూకేఆర్‌ఐనే నిర్వహిస్తోంది. -
109 కాలేజీలకు అనుమతులివ్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 109 జూనియర్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో బుధ వారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకుంటే సమీపంలో గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేర్పించే బాధ్యత సదరు యాజమాన్యానిదేనని ఆయన స్పష్టం చేశారు. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కాలేజీ అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,698 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిల్లో ఇప్పటివరకు 1,313 కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మిగతా 385 కాలేజీలకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క ఇంటర్ కాలేజీకీ హాస్టల్ నిర్వహించే అనుమతి లేదని స్పష్టం చేశారు. జూనియర్ కాలేజీల అనుమతులపై మంగళవారం సాక్షిలో ‘ఇంటర్ బోర్డు అధికారుల గుర్తింపు దందా’శీర్షికతో వచ్చిన వార్తపై బోర్డు కార్యదర్శి స్పందించారు. కాలేజీల గుర్తింపు కోసం దరఖాస్తు గడువును పలుమార్లు పెంచడంపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వ సూచనతోనే గడువును జూన్ 20 వరకు పెంచినట్లు చెప్పారు. వెబ్సైట్లో కాలేజీల వివరాలు.. గుర్తింపునకు అర్హతలేని కాలేజీల వివరాలను బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఈ నెల 20 వరకు గుర్తింపు గడువు ఉన్నందున జూన్ 21 నాటికి వెబ్సైట్లో అర్హత పొందిన, అర్హత పొందని కాలేజీల వివరాలు అందుబాటులో ఉంచుతామన్నారు. -
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
ఎచ్చెర్ల క్యాంపస్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు పక్కాగా అమలు చేస్తామ ని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాయం వైస్చాన్సల ర్ కూన రామ్‌జీ తెలిపారు. రిజిస్ట్రార్ కార్యాల యం సిబ్బందితో ఆయన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆయన మట్లాడుతూ పూర్తిస్థాయి సాంకేతిక పరి జ్ఞానంతో కూడిన బయోమెట్రిక్ యంత్రాలు విని యోగిస్తామన్నారు. హాజరు, ముగింపు సమయం తప్పనిసరి అని తెలిపారు. లేనిపక్షంలో జీతంలో కొత తప్పదని స్పష్టం చేశారు. సపోర్టింగ్ స్టాఫ్ పక్కాగా పనిచేయాలని, పనిచేసిన రోజులకు సకాలంలో జీతాలు చెల్లించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. సిబ్బందికి ఉన్న పరిజ్ఞా నం ఆధారంగా ఏ,బీ,సీ గ్రేడులుగా విభజించి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామన్నారు. పాలన సక్రమంగా ముందుకు సాగేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని వివరిం చారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.రఘుబాబు, అసిస్టెంట్ రిజస్ట్రార్ రామారావు పాల్గొన్నారు.