రాష్ట్రంలోని మోడల్‌స్కూళ్లలో వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.
మోడల్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
వచ్చేనెల 26న ప్రవేశ పరీక్ష
కథలాపూర్ (వేములవాడ): రాష్ట్రంలోని మోడల్‌స్కూళ్లలో వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. జిల్లాలో 13 మోడల్‌స్కూళ్లు ఉన్నాయి. 2017–18 విద్యాసంవత్సరానికి గాను ఆరోతరగతిలో ఒక్కో స్కూల్‌లో 100 సీట్ల చొప్పున 1,300 సీట్లును భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు ఆయా పాఠశాలల్లో 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. ఈనెల 17 నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారని కథలాపూర్ మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ నరేశ్ పేర్కొన్నారు. 7,8,9,10 తరగతుల్లో ఖాళీల వివరాలు ఆయా స్కూళ్ల నోటీస్‌బోర్డుపై అంటిస్తారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు సైతం ఆన్‌లైన్‌లోనే జారీచేస్తారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 26న ప్రవేశపరీక్ష ఉంటుంది.
దరఖాస్తులు చేసుకోవడం ఇలా...
ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకోవాలి. కలర్ పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్‌కార్డు, కులం, నివాసం, ఆదాయం సర్టిఫికెట్లతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు జిరాక్స్ కాపీని పరీక్ష రాయబోయే స్కూల్‌లో సమర్పించాలి. ఈనెల 17 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 26న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరోతరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు 7,8,9,10 తరగతుల్లో చేరే విద్యార్థులకు ప్రవేశపరీక్ష ఉంటుంది. మార్చి నెల 9న మెరిట్ లిస్టు, 10న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రదర్శన, 17, 18 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు.