అతి రహస్యంగా నోటిఫికే షన్!
విజయనగరం అర్బన్:జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి అరకొర ప్రత్యామ్నాయ చర్యల ను విద్యాశాఖ ఎట్టకేలకు తీసుకుంది. డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేసే వరకూ బోధనలు చేపట్టడానికి అకడమి క్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల నియమకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామక షెడ్యూల్ రెండు రోజుల క్రితమే విడుదల చేసినా బహిరంగ పరచకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నెలలుగా ఈ నోటిఫికేషన్‌కోసం నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. బహిరంగ ప్రకటన చేయవలసి ఉండగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు మండల విద్యాశాఖకు నేరుగా పం పి గ్రామస్థాయిలో పాఠశాలల్లో గుట్టుచప్పుడు లేకుండా నియామకాలు చేపట్టడానికి సన్నాహాలు చేసినట్టు తెలిసింది. నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం పోస్టుల దరఖాస్తులను ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు స్వీకరించాలి. ఇందుకోసం కనీసం రెండురోజుల ముందైనా బహిరంగంగా ప్రకటించాల్సి ఉంది. అయితే నోటిఫికేషన్ విషయాన్ని బుధవారం విలేకరులు అడిగే వరకు విద్యాశాఖ బహిరంగంగా ప్రకటించలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
264 పోస్టులకే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు
జిల్లాలో 264 అకడమిక్ ఇన్‌స్రక్టర్ పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల అయింది. జిల్లా వ్యాప్తంగా 624 ఏకోపాధ్యాయులతో ప్రాథమిక పాఠశాలుండగా వాటిలో తక్షణమే రెండో పోస్టు అవసరమున్న పాఠశాలలు 574 వరకు ఉన్నాయి. గతంలో విడుదల చేసిన ఆదేశాల మేరకు రేషనలైజేషన్ ప్రక్రియ అమలు చేసి కుదించినా... జిల్లాలో ఇంకా దాదాపు 350 ఎస్జీటీ పోస్టులకు తాత్కాలిక ప్రత్యామ్నాయ పోస్టులు అవసరం ఉంటుంది. అయితే జిల్లాకు తాజాగా మంజూరైన 264 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల సంఖ్య ఏ మేరకూ సరిపోదని ఉపాధ్యాయ వర్గాలు గోల పెట్టినా పట్టించుకోలేదు. ఈ పోస్టులలో ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్జీటీలకు 162, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 77, భాషాపండిత పోస్టులకు 25 వినియోగించుకోవాల్సి ఉంది.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో సబ్జెక్ట్ వారీగా పరిశీలిస్తే... లెక్కలు-09, సోషల్-30, ఫిజికల్ సైన్స్-06, బయాలజీ-06, ఇంగ్లిష్-07, తెలుగు-14, హిందీ-05, భాషాపండిత పోస్టుల్లో తెలుగు-16, హిం దీ-09 ఉన్నాయి. ఎస్జీటీలు 162 పోస్టులలోని పదుల సంఖ్య దాటిన మండలాలు కురుపాం-11, మెరకముడిదాం-20, పాచిపెంట-12, సాలూరు- 18 మాత్రమే ఉన్నాయి. మిగిలిన అన్ని మండలాలలోని సింగిల్ నంబర్‌లో ఎస్జీటీ పోస్టులను కేటాయించారు. మెరకముడిదాం మండలంలో 75 ఏకోపాధ్యాయ పాఠశాలలుంటే కేవలం 20 మాత్రమే మంజూరు చేశారు.పోస్టులకు అర్హతలుస్కూల్ అసిస్టెంట్‌పోస్టులల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల కోసం అభ్యర్థులు డిగ్రీతో పాటు బీఈడీ, డీఈడీ విద్యార్హత కలిగిఉండాలి. కేవలం మూడు నెలల కాలపరిమితికి మాత్రమే నియామకాలు చేపడుతున్నారు.
ఎంపిక ప్రక్రియ బాధ్యత ఎస్‌ఎంసీలదే!
ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్కూల్ యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తాము ఏ పాఠశాలకు దరఖాస్తు చేసుకున్నారో, అదే పంచాయతీకి చెందిన వారై ఉండాలి. రోస్టర్ మేరకు అభ్యర్థు రాకపోతే ఎస్టీలకు బదులుగా ఎస్సీలకు, ఎస్సీ నుంచి బీసీ, బీసీ నుంచి ఓసీ అభ్యర్థులకు కేటాయించి స్కూల్ యాజమాన్య కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు రూ.5 వేలు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు రూ. 7 వేలుగా నెలసరి వేతనం చెల్లిస్తారు.
డీఎస్సీ ఖాళీలకే ప్రాధాన్యం ఇచ్చాం: డీఈఓ
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల కేటాయింపులో డీఎస్సీ ఖాళీలకుమాత్రమే ప్రా ధాన్యం ఇచ్చామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. దీనివల్లే జిల్లాలోని ప్ర స్తుతం ఉన్న ఖాళీలన్నింటిలోనూ అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులను ఇవ్వలేక పోయామని చెప్పారు. కనీసం ఒక్కరోజు ముందైనా బహిరంగంగా నోటిఫికేషన్ ప్రకటించకపోవడంపై ఎలాంటి కారణాలు లేవని వివరణ ఇచ్చారు. 26వ తేదీలోపు దరఖాస్తులు స్వీకరించి, 27న పరిశీలించాలి. 28న మండల కమిటీకి అందజేయాలి. 30లోపు జిల్లా కమిటీ ఆమోదం తెలపాలని, ని యామక ప్రక్రియను వచ్చేనెల ఒకటవ తేదీలోపు పూర్తిచేయాలని చెప్పారు.