ప్రతీకాత్మక చిత్రం
జూన్ నెల వచ్చేసింది. కొత్త విద్యాసంవత్సరం మొదలు. పాత సమస్యలే కొత్తగా పుట్టుకొస్తాయి. ‘నేను కాలేజ్‌కి వెళ్లను’ అనిపిస్తుంది టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ మంచి మాటలతో... ఒత్తిడి మూలాలకు మందు వేయవచ్చు
వేసవి సెలవులు పూర్తవుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ మొదలవుతోంది. కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే క్లాసులు మొదలు పెట్టేశాయి. కొన్ని కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధమవుతున్నాయి. టెన్త్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ కొత్త కాలేజీలో అడుగుపెట్టాలి. ఇంటర్‌మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్లు గ్రాడ్యుయేషన్ కాలేజీల బాటపట్టాలి. అప్పటివరకు ఆత్మీయతలు పంచుకున్న స్నేహితులు మరోచోట చేరిపోయి ఉంటారు. కొత్త వాతావరణానికి అలవాటు పడాలి.
కొత్త మనుషుల మధ్య మెలగాలి. కొత్త వాళ్లలో స్నేహితులను వెతుక్కోవాలి. కొత్త మిత్రులు అర్థం అవుతున్నట్లే ఉంటారు, అలాగని పూర్తిగా అర్థం కారు. గతంలో స్నేహితులు, శత్రువుల్లా కొట్టుకున్న తోటి విద్యార్థులు గుర్తు వస్తారు. అప్పటి శత్రువులు కూడా చాలా మంచివాళ్లనిపిస్తుంటుందిప్పుడు. అలాగని వెనక్కి వెళ్లలేరు, ముందుకు సాగాల్సిందే. ఇది చిన్న సంఘర్షణ కాదు. రెక్కలు విచ్చుకుంటున్న లేత మనసులకు అది విషమ పరీక్ష అనే చెప్పాలి.
పిల్లలు రెండు రకాలు
‘‘కొత్త పుస్తకాలు, కొత్త డ్రస్‌లు, కొత్త కాలేజ్... పట్ల ఉత్సుకత, ఉత్సాహంతో ఉరకలు వేసే పిల్లలు ఒక రకం. వీళ్లలో టీనేజ్ స్ట్రెస్ వంటి ఇబ్బందులుండవు. కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి బెంబేలు పడే వాళ్ల విషయంలోనే తల్లిదండ్రులు జాగ్రత్తగా మెలగాలి. టెన్త్ పరీక్షలకు ముందు పిల్లలు విపరీతమైన ఆందోళనకు గురైతే అప్పటికి ధైర్యం చెప్పి పరీక్షలు రాయించి ఉంటారు. అయితే అలాంటి పిల్లలను కాలేజ్‌లో చేర్చే ముందే వాళ్లకు తగిన కౌన్సెలింగ్ ఇప్పించాలి.
కొత్త వాతావరణంలో ఇమడలేకపోవడం అనేది అలాంటి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. పేరెంట్స్ తమకు నచ్చిన కాలేజ్ అని, మంచి కాలేజ్ అనే పేరుందని, అక్కడ చదివితే ఐఐటీలో సీటు వస్తుందని తమకు తామే నిర్ణయించేసి ఫీజులు కట్టేస్తారు. పిల్లలు ఆ కాలేజ్‌కి వెళ్లడానికి ఇష్టపడకపోతే ఫీజు వృథా అవుతుందేమో, బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో పిల్లలను మరింత ఒత్తిడికి గురి చేస్తుంటారు’’ అని చెబుతున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్.
మౌనం వీడరు
ఇక్కడ విచిత్రం ఏమిటంటే... పేరెంట్స్ ఎంత సున్నితంగా అడిగినా పిల్లలు పూర్తిగా ఓపెన్ కారు. అలాగే పేరెంట్స్ ఎంతగా కౌన్సెలింగ్ ఇచ్చినా అవన్నీ నీతిసూత్రాలే అవుతుంటాయి. అందుకే పిల్లలు ‘ఎప్పుడు ఆపేస్తారా’ అన్నట్లు చికాగ్గా ముఖం పెడతారు. ఒక కాలేజ్ కుర్రాడు కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసులకు ఠంచన్‌గా లాప్‌టాప్‌తో సిద్ధమయ్యేవాడు. పేరెంట్స్ కూడా క్లాసులను జాగ్రత్తగా వింటున్నాడనే అనుకున్నారు.
పరీక్షలు రాసిన తర్వాత తెలిసింది అస్సలేమీ చదవలేదని, పాఠాలు వినలేదని. ఆ ఏడాది మొత్తం లాప్‌టాప్‌లో వెబ్‌సీరీస్ చూశాడా కుర్రాడు. కొంతమంది జూనియర్ కాలేజ్‌లో యంత్రాల్లా చదివి చదివి విసిగిపోయి ఉంటారు. డిగ్రీ కాలేజ్‌కి వెళ్లగానే వాళ్లకందిన స్వేచ్ఛను ఎలా ఆస్వాదించాలో తెలియక అనేక దురలవాట్లకు బానిసలవుతుంటారు. స్వేచ్ఛ కూడా ఒత్తిడి చేసినంత నష్టాన్ని కలిగిస్తోంది.
ఆ ఒత్తిడిని ఒక్కసారిగా తీసి పక్కన పెట్టినప్పుడు వచ్చే స్వేచ్ఛతో... అన్నింటికీ ‘ఇట్స్ ఓకే’ అనే కొత్త భాష్యం చెప్పుకోవడం మొదలైంది. చదవడం లేదా, బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా, క్లాసులు బంక్ కొడుతున్నారా, బ్యాక్ బెంచ్ స్టూడెంటా... అన్నింటికీ ఇట్స్ ఓకే ఫార్ములానే. దీంతోపాటు బ్యాక్‌లాగ్ లేని స్టూడెంట్స్ మీద కామెంట్స్ చేయడం కూడా.
ఒక కప్పు కింద రెండు ప్రపంచాలు
సమాజానికి ఆరోగ్యకరమైన ఒక కొత్త తరాన్ని ఇవ్వడం పేరెంట్స్ బాధ్యత. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కారణంగా ఈ తరం పిల్లలు పేరెంట్స్ కంటే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటున్నారు. చాలామంది పేరెంట్స్ ఆ డిజిటల్ ప్రపంచంలోకి ఎంటర్ కాలేని స్థితిలోనే ఉంటారు. అలాగే పేరెంట్స్ ప్రపంచంలో జీవించడానికి పిల్లలు ఇష్టపడరు.
రెండు భిన్నమైన ప్రపంచాలు ఒకే ఇంట్లో నివసిస్తున్నాయిప్పుడు. ఈ క్లిష్టమైన స్థితిలో పేరెంట్స్ పిల్లలతో మరింత స్నేహంగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది. టీన్స్‌లోకి రాకముందు నుంచే వాళ్లతో స్నేహితులుగా మెలగాలి. పిల్లలు చెప్పే విషయాలను అనుమానించడం మాని అర్థం చేసుకోవాలి, అర్థవంతంగా విశ్లేషించడం మొదలుపెట్టాలి.
ఒక తోటలో చిగురించిన మొలకను పెకలించి మరో చోట నాటితే మొదట వాడిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటే కొత్త వాతావరణానికి అలవాటు పడుతుంది. కొత్త చివుళ్లు వేస్తుంది. కొత్త మట్టిసారంలో మరింత ఏపుగా పెరుగుతుంది. ఈ దశలో నిర్లక్ష్యంగా ఉంటే మొక్క వాడిపోతుంది. పిల్లలు కూడా మొక్కల్లాంటి వాళ్లే.
టీనేజ్ స్ట్రెస్ లక్షణాలిలా ఉంటాయి
అస్థిమితంగానూ ఆత్రుతగానూ ఉండడం, త్వరగా అలసటకు లోనుకావడం, తరచుగా కడుపు నొప్పి, ఛాతీ నొప్పి అని చెప్పడం, కుటుంబ సభ్యులతో కలవకుండా దూరం పెంచుకోవడం, నిద్రలేమి లేదా విపరీతంగా నిద్రపోవడం, పనులను వాయిదా వేయడం, బాధ్యతల పట్ల నిర్లక్ష్యం... పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఉపేక్షించరాదు.
మొండి నిద్రపోతారు!
కొత్త కాలేజ్‌లో అలవాటు పడలేని పిల్లల్లో ఆకలి మందగించడం, తిన్నది జీర్ణం కాకపోవడం, వాంతులు, విరేచనాలు కూడా వస్తుంటాయి. నిజానికి ఆ లక్షణాలు దేహ అనారోగ్య లక్షణాలు కావు, మానసిక ఆందోళన ప్రభావంతో ఎదురయ్యే సమస్యలు. కాబట్టి మొదట పిల్లలను జాగ్రత్తగా గమనించాలి, అది నిఘా కాకూడదు.
ఎనిమిదిన్నరకు కాలేజ్‌కి రెడీ కావాల్సిన పిల్లలు ఒక్కోసారి తొమ్మిది వరకు నిద్రలేవరు. ఎంత లేపినా సరే మొండిగా నిద్రపోతుంటారు. కాలేజ్ టైమ్ దాటిన తర్వాత వాళ్లే లేస్తారు. ఆ రోజుకు ఏమీ అడగకుండా వాళ్లనలా వదిలేయడమే మంచిది. కాలేజ్‌కి వెళ్లడానికి అయిష్టత వెనుక కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
– డా‘‘ సి. వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ , యు అండ్ మి
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment