కొత్త తరగతిలోకి...
⇒నేటి నుంచి నూతన విద్యా సంవత్సరం
⇒ఇప్పటికే పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు
⇒ పలు స్కూళ్లలో వేధిస్తున్న సమస్యలు
కాళోజీ సెంటర్ : ఆనవాయితీకి భిన్నంగా మూడు నెలల ముందుగానే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతోంది. పాఠశాల విద్యావ్యవస్థలోనే తొలిసారి వేసవి సెలవులకు ముందే సీబీఎస్‌ఈ విధానం తరహాలో నూతన విద్యా సంవత్సరం మంగళవారం ఆరంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. సాధారణంగా ఏటా జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. కానీ ఈసారి విద్యార్థులు మంగళవారమే పై తరగతులకు ప్రమోట్ కానున్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం, వరంగల్ రూరల్ జిల్లా విద్యాశాఖ అధికారులు ముందస్తు విద్యా సంవత్సరానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పాఠశాలలకు ఎక్కువ శాతం పాఠ్యపుస్తకాలు చేరగా మిగిలినవి త్వరలోనే అందుతాయని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 644 పాఠశాలలు
జిల్లాలో అన్ని యాజమన్యాలవి కలిపి 644 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 455, ప్రాథమికోన్నత పాఠశాలలు 76, ఉన్నత పాఠశాలలు 133 ఉండగా, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు కూడా కొనసాగుతున్నాయి. వీటన్నింట్లో కూడా సోమవారం నుంచే నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎప్పుడూ ఏప్రిల్ 23 వరకు జరగాల్సిన 1నుంచి 9వ తరగతుల వార్షిక పరీక్షలను ఈనెల 16వరకే ముగించేశారు. అలాగే, జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులు మంగళవారం విద్యార్థులకు ఫలితాలు వెల్లడించనున్నారు.
పాఠశాలలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
పాఠశాలల ప్రారంభం రోజున చేతిలో నూతన తరగతి పాఠ్యపుస్తకాలు ఉండాలన్న విద్యార్థులు, తల్లిదండ్రుల లక్ష్యం నెరవేరబోతోంది. ఈ మేరకు విద్యాశాఖ అదికారులు అవసరమైన మేరకు పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేర్చారు. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని 664 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని టైటిళ్లు కలిపి 3,05,900 పాఠ్యపుస్తకాలు అవసరం. ఇందులో 80శాతం మేర పాఠ్యపుస్తకాలు మండలాలకు చేరుకున్నాయి. ఎంఈఓ కార్యాలయాల నుంచి పాఠశాలలకు చేర్చే ప్రక్రియ కూడా చురుకుగా కొనసాగుతోంది. అలాగే, త్వరలోనే విద్యార్థులకు యూనిఫాం కూడా పంపిణీ చేయనున్నారు.
సమస్యల స్వాగతం
ఎప్పటిలాగా ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండలు మండిపోతుండగా.. పలు పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో సమస్యగా మారనుంది. అలాగే, మధ్యాహ్న భోజన నిర్వాహకులు సైతం ఇబ్బంది పడక తప్పదని చెప్పాలి. ఇంకా పలు పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేకపోగా.. ఉన్న వాటిలో ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కబోత నడుమే విద్యార్థులు పాఠాలు వినాల్సి వస్తుంది. ఇక ఉపాధ్యాయుల కొరత ఎలాగూ ఉంటుంది. ఇలా పలు సమస్యల నడుమే కొత్త విద్యాసంవత్సరం ఆరంభం కానుండగా.. అధికారులు స్పందించి సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.