న్యూఢిల్లీ: దేశంలో ఉన్న భిన్నత్వం గురించి గర్వించాలి, భిన్నత్వాన్ని గౌరవించాలి తప్ప సమాజంలో విభేదాలకు అది కారణం కాకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆరెస్సెస్ మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘భవ్యిషత్ భారతం–ఆరెస్సెస్ దృక్పథం’ సదస్సును భాగవత్ సోమవారం ప్రారంభించారు. ఆరెస్సెస్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరవ్వాల్సిందిగా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులకూ ఆహ్వానం పంపామని ఆరెస్సెస్ చెబుతుండగా.. తమనెవరూ పిలవలేదనీ, పిలిచినా వెళ్లే వాళ్లం కాదని కాంగ్రెస్ సహా కొందరు విపక్ష నేతలు పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, అధికార బీజేపీ నాయకులతోపాటు అనేక మంది బాలీవుడ్ నటీనటులు, విద్యావేత్తలు సదస్సుకు వచ్చారు.
భాగవత్ మాట్లాడుతూ ‘దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కాంగ్రెస్ గొప్ప పాత్ర పోషించింది. భారత్‌కు ఎంతోమంది గొప్ప నాయకులను ఇచ్చింది’ అని కొనియాడారు. ఆరెస్సెస్ పరిణామ క్రమాన్ని వివరించిన ఆయన.. ఆరెస్సెస్ సేవలను ఇతర ఏ సంస్థతోనూ పోల్చలేమన్నారు. ఆరెస్సెస్ నియంతృత్వ సంస్థ కాదనీ, అత్యంత ప్రజాస్వామిక సంస్థ అని చెప్పుకొచ్చిన భాగవత్.. ఆరెస్సెస్ తన సిద్ధాంతాలను ఎప్పుడూ ఇతరులపై రుద్దదనీ, అలాగే అనుబంధ సంస్థలపై తమ నియంత్రణేమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీని ఆరెస్సెస్ నియంత్రిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘భారత్ భిన్నత్వంతో కూడిన దేశం. దాన్ని అందరూ గౌరవించాలి, గర్వించాలి. సమాజంలో విభేదాలకు భిన్నత్వం కారణం కాకూడదు’ అని భాగవత్ విజ్ఞప్తి చేశారు.
అధికారంతో సంబంధం లేదు
‘అధికారంలో ఎవరుంటారు?, దేశం ఏ విధానాలను ఆమోదిస్తుంది అనేది సమాజం, ప్రజలు నిర్ణయించాల్సింది. వీటితో మాకు సంబంధం లేదు. సమాజం బాగుండటమే మాకు ముఖ్యం’ అని భాగవత్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment