నోట్‌బుక్స్ దాచారు!
ఆర్‌వీఎం నిర్లక్ష్యం
కేజీబీవీలకు అందని నోట్స్
కరీంనగర్ కేజీబీవీలో భద్రం
రవాణా వారి బాధ్యత కాదట
పిల్లలకు పంచేది ఇంకెప్పుడో
7800 మందికి ఇబ్బందులు
విద్యా సంవత్సరం ఆరంభమై నెల రోజులు దాటింది. ఇప్పటికీ.. సర్కారు సరఫరా చేసిన నోట్‌బుక్స్‌ను పిల్లలకు పంచే దిక్కులేదు. పాఠ్యపుస్తకాలు, దుస్తులతో పాటు జూన్‌లో పంపిణీ చేయాల్సిన నోట్‌బుక్స్ జిల్లాకేంద్రంలోనే మూలుగుతున్నాయి. వీటిని పాఠశాలలకు రవాణా చేయాల్సిన అధికారులు.. అది తమ బాధ్యత కాదన్నట్లుగా చేతులెత్తేశారు. జిల్లా కేంద్రంలోనే ఓ పాఠశాలలో వీటిని భద్రపరిచారు. సప్తగిరి కాలనీలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలోని ఓ తరగతి గదిలో ఈ నోట్‌బుక్స్ బండిల్స్‌ను పడేసి తాళం వేశారు. దీంతో కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న బాలికలు ఇబ్బంది పడుతున్నారు. తమకు బోధించే పాఠాలు రాసుకునేందుకు నోట్స్ తామే కొనుక్కోవాలా.. లేదా సర్కారు పంపిణీ చేస్తుందా... అర్థంకాక బిత్తరపోతున్నారు. రాజీవ్ విద్యామిషన్ (ఆర్‌వీఎం) అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణమిది.
జిల్లాలో 51 కస్తూరిబా గాంధీ బాలికల (కేజీబీవీ) విద్యాలయాలున్నాయి. వీటిలో తొమ్మిది పాఠశాలలను రెసిడెన్షియల్ సొసైటీలు నిర్వహిస్తున్నాయి. మిగతా 42 పాఠశాలలు ఆర్‌వీఎం ప్రాజెక్టు ఆఫీసరు పర్యవేక్షణలో నడుస్తున్నాయి. వీటిలో ఈ విద్యా సంవత్సరం 7,800 మంది బాలికలు చదువుకుంటున్నట్లు రికార్డులున్నాయి. బాలకార్మికులు, అనాథలు, డ్రాపవుట్స్, ఇప్పటికీ బడిలో చేరనివారు, ఎయిడ్స్ బాధితుల పిల్లలకు రెసిడెన్షియల్ పద్ధతిలో బోధన, వసతి సదుపాయాలు కల్పించే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం కేజీబీవీలు నెలకొల్పింది. పాఠ్యపుస్తకాలు, దుస్తులతో పాటు ఇక్కడి పిల్లలకు ఒక్కొక్కరికి 16 నోట్‌బుక్స్‌ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. పిల్లల సంఖ్యకు సరిపడేన్ని నోట్‌బుక్స్‌ను సర్కారు గత నెలలోనే పంపించింది. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీటీపీసీఎల్) ఈ బుక్స్‌ను కేజీబీవీలకు సరఫరా చేస్తోంది. జిల్లాకు నోట్‌బుక్స్ వచ్చాయని.. వీటిని పాఠశాలలకు చేరవేయాల్సిన బాధ్యత వారిదేనని ఆర్‌వీఎం అధికారులు చెబుతున్నారు. కానీ.. నెల రోజులైనా వీటిని పాఠశాలలకు చేరవేయకపోతే చదువుకునే విద్యార్థులు నోట్స్ ఎలా రాసుకుంటారని ఆలోచించకపోవడం గమనార్హం. మరో లోడ్ నోట్‌బుక్స్ రావాల్సి ఉందని.. అవి వచ్చాక ఏపీటీపీసీఎల్ వీటిని పాఠశాలలకు రవాణా చేస్తుందని ఆర్‌వీఎం పీవో రాజమౌళి వివరణ ఇచ్చారు. ఖర్చుతో కూడుకున్న పని కావటంతో తాము రవాణా చేయటం లేదని చెప్పారు.