వికారాబాద్ అర్బన్: సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్‌ను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తుండగా, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈసారి నోట్ బుక్స్ కూడా ఇస్తామని ప్రకటించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. కానీ నోట్‌బుక్స్ అందజేతలో జరుగుతున్న జాప్యంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫ్రీగా ఇస్తారని చెప్పడంతో చాలా మంది పేద తల్లిదండ్రులు నోట్‌బుక్స్ కొనివ్వలేదు.
పదిశాతం మందికే..
స్కూళ్లు ప్రారంభమై దాదాపుగా 20 రోజులు కావస్తోంది. ఇప్పటివరకు పది శాతం మంది విద్యార్థులకు కూడా నోట్‌బుక్స్ అందలేదు. ప్రైవేటు పాఠశాలల మాదిరిగా 1నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి మూడు వర్క్ బుక్స్ (ఒకే పుస్తకంలో టెక్ట్స్ బుక్, నోట్‌బుక్) ఇస్తామని చెప్పారు. ఈ లెక్కన జిల్లాకు 1,42,377 నోటు పుస్తకాలు రావాలి. కానీ ఇప్పటి వరకు వీటి పత్తా లేదు. 6నుంచి 10వ తరగతి విద్యార్థులు కూడా నోట్‌బుక్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తరగతుల ఆధారంగా ఎన్ని నోట్‌బుక్స్ ఇవ్వాలనేది నిర్ణయించారు. అధికారుల లెక్కల ప్రకారం 6నుంచి 10వ తరగతి వరకు 4,24,374 నోట్‌బుక్స్ అవసరం.
ఇప్పటి వరకు 60,700 మాత్రమే వచ్చాయి. ప్రభుత్వం నోట్‌బుక్స్ ఇస్తుందా..? లేక ఎప్పటిలాగే మార్కెట్‌లో కొనుగోలు చేసి ఇవ్వాలా..? అనే విషయంలో తల్లిదండ్రులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొంతమంది కొనివ్వగా వారు హోం వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ నోట్‌బుక్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు వెనకబడిపోతున్నారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఈ విషయంలో మరింత ఆందోళన చెందుతున్నారు.
91,494 వేల మంది విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 91,494 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖ అధికారుల లెక్క ప్రకారం వీరికి 5.6 లక్షలకుపైగా నోట్‌బుక్స్ రావాలి. కానీ ఇప్పటివరకు కేవలం 60,700 మాత్రమే వచ్చాయి. మొదటి విడతగా ‘మన ఊరు మనబడి’ కింద ఎంపికై న 32 పాఠశాలల్లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విద్యా దినోత్సవం రోజున నోటు పుస్తకాలు అందజేశారు. మిగిలిన స్కూళ్లలో ఎక్కడా ఇవ్వలేదు. పాఠాల బోధన వేగంగా సాగుతున్నప్పటికీ నోట్‌బుక్స్ లేకపోవడంతో హోం వర్క్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నోట్‌బుక్స్ త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు.
రాగానే పంపిణీ చేస్తాం
ఇప్పటి వరకు వచ్చిన 60వేల పైచిలుకు నోట్‌బుక్స్ పంపిణీ చేశాం. మిగతావి కూడా మరో మూడు నాలుగు రోజుల్లో రావచ్చు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఇచ్చే వర్క్ బుక్స్ ప్రింటింగ్ కూడా పూర్తయినట్లు మాకు సమాచారం ఉంది. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం.
– రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి
త్వరగా ఇవ్వాలి
ప్రభుత్వం నోట్‌బుక్స్ ఉచితంగా ఇస్తుందని సార్లు చెప్పడంతో ఇప్పటి వరకు కొనుక్కోలేదు. కొందరు నోట్‌బుక్స్ తెచ్చుకున్నారు. కొనాలా వద్దా అనేది తెలుస్తలేదు. త్వరగా ఇస్తే అందరిలా నోట్స్ రాసుకోవడం, హోం వర్క్ చేసుకోడానికి వీలుంటుంది. నోట్‌బుక్స్ త్వరగా ఇవ్వాలి.
– శ్రవణ్‌కుమార్, 8వ తరగతి, మదన్‌పల్లి
Comments
Please login to add a commentAdd a comment