Notebooks
-
నోటు పుస్తకాలేవి?.. స్కూళ్లు ప్రారంభమై 20 రోజులైనా పత్తాలేని ఉచిత నోట్‌బుక్స్
వికారాబాద్ అర్బన్: సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్‌ను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తుండగా, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈసారి నోట్ బుక్స్ కూడా ఇస్తామని ప్రకటించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. కానీ నోట్‌బుక్స్ అందజేతలో జరుగుతున్న జాప్యంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫ్రీగా ఇస్తారని చెప్పడంతో చాలా మంది పేద తల్లిదండ్రులు నోట్‌బుక్స్ కొనివ్వలేదు. పదిశాతం మందికే.. స్కూళ్లు ప్రారంభమై దాదాపుగా 20 రోజులు కావస్తోంది. ఇప్పటివరకు పది శాతం మంది విద్యార్థులకు కూడా నోట్‌బుక్స్ అందలేదు. ప్రైవేటు పాఠశాలల మాదిరిగా 1నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి మూడు వర్క్ బుక్స్ (ఒకే పుస్తకంలో టెక్ట్స్ బుక్, నోట్‌బుక్) ఇస్తామని చెప్పారు. ఈ లెక్కన జిల్లాకు 1,42,377 నోటు పుస్తకాలు రావాలి. కానీ ఇప్పటి వరకు వీటి పత్తా లేదు. 6నుంచి 10వ తరగతి విద్యార్థులు కూడా నోట్‌బుక్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తరగతుల ఆధారంగా ఎన్ని నోట్‌బుక్స్ ఇవ్వాలనేది నిర్ణయించారు. అధికారుల లెక్కల ప్రకారం 6నుంచి 10వ తరగతి వరకు 4,24,374 నోట్‌బుక్స్ అవసరం. ఇప్పటి వరకు 60,700 మాత్రమే వచ్చాయి. ప్రభుత్వం నోట్‌బుక్స్ ఇస్తుందా..? లేక ఎప్పటిలాగే మార్కెట్లో కొనుగోలు చేసి ఇవ్వాలా..? అనే విషయంలో తల్లిదండ్రులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొంతమంది కొనివ్వగా వారు హోం వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ నోట్‌బుక్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు వెనకబడిపోతున్నారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఈ విషయంలో మరింత ఆందోళన చెందుతున్నారు. 91,494 వేల మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 91,494 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖ అధికారుల లెక్క ప్రకారం వీరికి 5.6 లక్షలకుపైగా నోట్‌బుక్స్ రావాలి. కానీ ఇప్పటివరకు కేవలం 60,700 మాత్రమే వచ్చాయి. మొదటి విడతగా ‘మన ఊరు మనబడి’ కింద ఎంపికై న 32 పాఠశాలల్లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విద్యా దినోత్సవం రోజున నోటు పుస్తకాలు అందజేశారు. మిగిలిన స్కూళ్లలో ఎక్కడా ఇవ్వలేదు. పాఠాల బోధన వేగంగా సాగుతున్నప్పటికీ నోట్‌బుక్స్ లేకపోవడంతో హోం వర్క్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నోట్‌బుక్స్ త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. రాగానే పంపిణీ చేస్తాం ఇప్పటి వరకు వచ్చిన 60వేల పైచిలుకు నోట్‌బుక్స్ పంపిణీ చేశాం. మిగతావి కూడా మరో మూడు నాలుగు రోజుల్లో రావచ్చు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఇచ్చే వర్క్ బుక్స్ ప్రింటింగ్ కూడా పూర్తయినట్లు మాకు సమాచారం ఉంది. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం. – రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి త్వరగా ఇవ్వాలి ప్రభుత్వం నోట్‌బుక్స్ ఉచితంగా ఇస్తుందని సార్లు చెప్పడంతో ఇప్పటి వరకు కొనుక్కోలేదు. కొందరు నోట్‌బుక్స్ తెచ్చుకున్నారు. కొనాలా వద్దా అనేది తెలుస్తలేదు. త్వరగా ఇస్తే అందరిలా నోట్స్ రాసుకోవడం, హోం వర్క్ చేసుకోడానికి వీలుంటుంది. నోట్‌బుక్స్ త్వరగా ఇవ్వాలి. – శ్రవణ్‌కుమార్, 8వ తరగతి, మదన్‌పల్లి -
బడివేళకు విద్యాకానుక రెడీ
కడప ఎడ్యుకేషన్: పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదు. విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఇది గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో నాడు – నేడు కింద పలు పాఠశాలలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం రెండవ విడత పనులను కూడా ప్రారంభించారు. దీంతోపాటు పేద పిల్లల చదువులకు ఊతమిచ్చేలా 8 రకాల విద్యాసామగ్రిని జగనన్న విద్యాకానుక కిట్ల రూపంలో అందించనున్నారు. వీటిని పాఠశాలలు తెరిచే రోజే పిల్లల చేతికి అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. విద్యాకానుక కిట్లు జిల్లాకు రావడం ప్రారంభమైంది. ప్రస్తుతం నోట్‌బుక్స్ జిల్లాలోని పలు స్కూల్ కాంప్లెక్స్‌లకు చేరుతున్నాయి. మిగతా వస్తువులు త్వరలో రానున్నాయి. ఏర్పాట్లు ప్రారంభం జగనన్న విద్యాకానుక పంపిణీకి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మున్సిపల్, ఎయిడెడ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు సమావేశాలు నిర్వహించి కిట్ల పంపిణీపై అవగాహన కల్పించారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 3373 పాఠశాలలకు చెందిన 2,67,317 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక లబ్ధి చేకూరనుంది. జిల్లాకు చేరుతున్న విద్యా కానుక జగనన్న విద్యాకానుక కిట్‌లో స్కూల్ బ్యాగ్, నోట్‌పుస్తకాలు, షూస్, 2 జతల సాక్సులు, 3 జతల యూనిఫాం క్లాత్, బెల్టు ఉంటాయి. గత ఏడాది నుంచి అదనంగా ఇంగ్లిష్– తెలుగు డిక్షనరీలు విద్యార్థులకు అందచేజేస్తున్నారు. ప్రస్తుతం విద్యాకానుక కిట్లలో నోట్‌బుక్స్ స్కూల్ కాంప్లెక్స్‌లకు రావడం ప్రాంభమైంది. ఇప్పటి వరకు బద్వేలు, దువ్వూరు, గోపవరం, కలసపాడు, ఖాజీపేట, ముద్దనూరు, మైలవరం, ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల, రాజుపాలెం, కాశినాయన మండలాలకు సంబంధించిన స్కూల్ కాంప్లెక్స్‌లకు చేరిపోయాయి. పక్కాగా కొలతలు విద్యార్థులకు అందించే బూట్ల సైజు కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో తరగతుల వారిగా విద్యార్థుల కొలతలను సేకరించాము. దాని వివరాలను ఇండెంట్ పంపాము. ప్రస్తుతం విద్యాకానుకలో భాగంగా నోట్ బుక్స్ వస్తున్నాయి. మిగతావి కూడా త్వరలో రానున్నాయి. వచ్చిన కిట్లను ప్రధానోపాధ్యాయులు పరిశీలించుకోవాలి. ఏవైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలి. – దిద్దకుంట గంగిరెడ్డి, సీఎంఓ, సమగ్రశిక్ష విద్యా సంవత్సరం ఆరంభంలోనే.. 2022–23 విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేస్తాం. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే జిల్లాలో అర్హులైన విద్యార్థుల జాబితాను సిద్ధం చేశాం. ఈ ఏడాది 2,67,317 మందికి విద్యాకానుక కిట్లు అందనున్నాయి. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి -
రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్...తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్..!
కోవిడ్-19 దెబ్బకు విద్యార్థులు పూర్తిగా ఆన్లైన్ చదువులకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా ఉదృతి తగ్గడంతో స్కూళ్లు ఒపెన్ అయ్యాయి. నెలరోజులుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఇంటి బడ్జెట్ భారీగా పెరిగింది. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. కాగా ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్ విద్యార్థుల చదువుపై పడనున్నట్లు సమాచారం. విద్యార్థుల చదువులు మరింత భారంగా మారనున్నట్లు తెలుస్తోంది. భారీగా పెరగనున్న పుస్తకాల ధరలు..! రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్, కోల్ ధరలు భారీగా పెరిగాయి. ధరల పెరుగుదల ఒక్కింతా పేపర్ పరిశ్రమలకు కూడా శాపంగా మారింది. దీంతో విద్యార్థుల పుస్తకాలు, నోట్ బుక్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముడి పదార్థాల ధరలు పెరగటంతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ) వేస్ట్ కటింగ్స్ ఎగుమతులపై నిషేధం విధించటంతో నోట్‌బుక్స్ ధరల పెరిగే అవకాశం ఉందని పేపర్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. పేపర్ కొరత కారణంగా రానున్న రోజుల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ తగ్గిపోయి వచ్చే విద్యా సంవత్సరంలో వాటికి కొరత ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. మే నుంచి ధరల బాదుడు..! పేపర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇప్పటికే తమ డీలర్లకు నోట్ పుస్తకాల ధరలను పెంచుతున్నట్లు సంకేతాలిచ్చాయి. పుస్తకాలు, నోట్ బుక్స్ ధరలు మే నుంచి పెరగనున్నాయి. ఇప్పటికే పెంచిన ధరలతో నోట్‌బుక్స్‌ను సరఫరా చేస్తామని డీలర్లకు సదరు కంపెనీలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.కోవిడ్ కంటే ముందు కేజీ పేపర్ ధర రూ.55 ఉండగా ప్రస్తుతం రూ.100కి చేరింది. పేపర్ తయారీలో ఉపయోగించే అన్ని రకాలైన ముడి పదార్ధాల ధరలు పెరగటంతో తాము ధరలు పెంచక తప్పటం లేదని అఖిల భారత పేపర్ ట్రేడర్స్ సమాఖ్య ప్రెసిడెంట్ దీపక్ మిట్టల్ తెలిపారు. నిషేధం విధించిన ఈయూ..! పేపర్ వేస్ట్ కటింగ్స్‌పై ఈయూ దేశాలు నిషేధం విధించటంతో పేపర్ పరిశ్రమపై భారీ ప్రభావం చూపనుంది. కాగా నిషేధంపై చర్చించేందుకు ఈయూ దేశాలు ఏప్రిల్ 14న భేటీ కానుండగా...దీనిపై సానుకూల నిర్ణయం తీసుకున్నా ధరలు దిగిరావటానికి చాలా సమయం పట్టే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తగ్గిపోయిన పాత పేపర్లు..! ప్యాకేజింగ్‌పై ఎఫెక్ట్..! కోవిడ్ కారణంగా వార్తాపత్రికలు, జర్నల్స్‌కు ప్రజలు దూరంగా ఉండిపోయారు. దీంతో పాత పేపర్ల రీసర్క్యులేషన్ 35 శాతం మేర తగ్గిపోయింది. ఇప్పుడిదే దిగ్గజ ఎఫ్ఎంసీజీ, ఈ కామర్స్ సంస్థలకు ప్యాకేజింగ్ విషయంలో భారీ నష్టం జరగనుంది. కార్డ్బోర్డ్ తయారీలో పాత పేపర్లే కీలకం. కార్డ్ బోర్డ్ ప్యాకేజింగ్ విషయంలో ఈ సంస్థలను తీవ్రంగా వేధించనున్నాయి. చదవండి: ఎలన్‌మస్క్ సంచలన నిర్ణయం..! సోషల్ మీడియాపై గురి..! -
చిన్న బుక్.. 1,500 ఏళ్ల డేంజర్
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఎటూ తేలడం లేదు. చివరికి అణు దాడికీ పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు ఉక్రెయిన్‌లో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల విషయంగా చాలా దేశాలు వణికిపోతున్నాయి. మరి ఇంత భయానికి కారణం.. రేడియేషన్. అలాంటి రేడియేషన్‌తో ప్రమాదమెంత?ఎంతకాలం ప్రభావం ఉంటుందనే వివరాలు తెలుసుకుందామా.. అణువే.. బ్రహ్మాండం.. అణువు అంటే అత్యంత సూక్ష్మమైనది. కానీ దానికి ఉండే శక్తి మాత్రం అపారమైనది. ఇది అది అని కాదు.. అత్యంత ప్రాథమికమైన హైడ్రోజన్ నుంచి.. అణ్వస్త్రాల్లో వాడే యురేనియం, ఫ్లూటోనియం దాకా అన్ని మూలకాల్లో అపరిమిత శక్తి ఉంటుంది. ఆ శక్తిని గుర్తించి, మనకు అనుకూలంగా వాడుకోవడం కోసం శాస్త్రవేత్తలు వందల ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ 1898లో అణు ధార్మికత (రేడియేషన్)ను.. రేడియం, పోలోనియం మూలకాలను కనుగొన్నారు. ఆ పుస్తకాలు, వ్రస్తాలు ప్రమాదకరమే.. రేడియం మూలకం అత్యంత తీవ్రస్థాయిలో రేడియో ధార్మికతను విడుదల చేస్తుంది. తక్కువ పరిమాణంలోని రేడియంపైనే మేరీ క్యూరీ ప్రయోగాలు చేసినా.. దాని రేడియేషన్ ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా పడింది. దానితోనే ఆమె శరీరంలో ఎముక మజ్జ (బోన్‌మ్యారో) దెబ్బతిని ప్రాణాలు కోల్పోయింది. క్యూరీ పరిశోధన చేసిన ల్యాబ్‌లో ఫర్నిచర్, ఇతర వస్తువులు, ఆమె వస్త్రాలు, పరిశోధన వివరాలు రాసిన నోట్‌బుక్స్ అన్నీ రేడియం ప్రభావానికి లోనయ్యాయి. ఎంతగా అంటే.. ఆమె పుస్తకాలు, వ్రస్తాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది. ఇప్పుడే కాదు.. మరో 1,500 ఏళ్ల పాటు వాటిలో రేడియేషన్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ► మేరీ పరిశోధనలకు గుర్తుగా ఆమె నోట్‌బుక్స్‌ను ఫ్రాన్స్‌లోని బిబ్లియోథెక్ మ్యూజియంలో భద్రపర్చారు. వాటి నుంచి వెలువడే రేడియేషన్ బయటికి రాకుండా సీసపు పెట్టెల్లో వాటిని ఉంచారు. ► మేరీ క్యూరీ శరీరం నుంచీ రేడియేషన్ వెలువడుతుండటంతో.. ఆమె మృతదేహాన్ని ఒక అంగు ళం మందంతో తయారు చేసిన సీసపు పెట్టెలో ఉంచి ఖననం చేయడం గమనార్హం. ► అణుధార్మిక మూలకాల నుంచి వెలువడే రేడియేషన్‌ను సీసం సమర్థవంతంగా పీల్చుకోగలుగుతుంది. అందుకే రేడియో యాక్టివ్ మూలకాలను నిరంతరం సీసపు పెట్టెల్లోనే ఉంచుతారు. ‘ఎలిఫెంట్ ఫుట్’.. బతికేది ఐదు నిమిషాలే.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ప్రమాదానికి లోనైన అణు విద్యుత్ కేంద్రం చెర్నోబిల్. 1986 ఏప్రిల్‌లో అందులోని ఒక రియాక్టర్ పేలిపోయి రేడియేషన్ లీకైంది. దాని ప్రభావంతో చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని వేలాది మంది ఆ రేడియేషన్‌కు లోనై.. వివిధ వ్యాధుల బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పట్లో రియాక్టర్ పేలినప్పుడు.. అందులోని అణు ఇంధనం, చుట్టూ ఉన్న లోహ పరికరాలు, కాంక్రీట్ శ్లాబ్‌లు, బీమ్‌లు కరిగి దిగువకు కారిపోయాయి. అవి దిగువన కాస్త వెడల్పుగా విస్తరించిన పొడుగాటి స్తంభంలా ఏర్పడ్డాయి. అది చూడటానికి ఏనుగు కాలు ఆకారంలో ఉండటంతో ‘ఎలిఫెంట్ ఫుట్’అని పేరుపెట్టారు. ఇది జరిగి 38 ఏళ్లయినా ఇప్పటికీ దాని నుంచి రేడియేషన్ వెలువడుతూనే ఉంది. ఎవరైనా దాని దగ్గరగా వెళ్లి.. ఐదు నిమిషాలుగానీ ఉంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఈ రేడియేషన్ బయటికి రాకుండా.. దాని చుట్టూ రెండు వరుసలుగా సీసం, ఇతర లోహాలతో ప్రత్యేకంగా కంటైన్మెంట్ చేసి మూసేశారు. ► ప్రస్తుతం ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా.. ఆ దేశంలోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని స్వాదీనంలోకి తెచ్చుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైనది కూడా ఇందుకే.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
‘గోల్కొండ’ నోట్‌బుక్స్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లేపాక్షి నంది నోట్‌బుక్స్ అంటే ఒకప్పుడు విద్యార్థుల్లో యమ క్రేజ్. హాస్టళ్లలోని విద్యార్థులకు ఈ నోట్ బుక్స్‌నే సరఫరా చేసేవారు. బయటివారు కొనుక్కోవాలంటే మాత్రం సూపర్బజార్లకు వెళ్లాల్సిందే. సాధారణ నోట్ బుక్‌లకంటే పెద్దసైజ్, నాణ్యత ఈ నోట్‌బుక్స్ సొంతం. వాటి మీద ఆసక్తితో విద్యార్థులు పట్టణాల్లోని సూపర్ బజార్లకు వెళ్లి మరీ కొనుక్కునేవారు. ఇప్పుడు ఆ నోట్‌బుక్స్ మళ్లీ రాబోతున్నాయి. కాకపోతే లేపాక్షి నంది బ్రాండ్ స్థానంలో ‘గోల్కొండ’ నోట్‌బుక్స్ పేరుతో వాటిని పరిశ్రమల శాఖ తీసుకొస్తోంది. అన్ని శాఖలకు అందుబాటులోకి... తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్లో భాగంగా ఈ నోట్‌బుక్స్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. విద్యాశాఖ పరిధిలోని గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) వీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. గోల్కొండ నోట్‌బుక్‌లను తీసుకునేలా జిల్లాల్లోని డీఈఓలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖను కోరింది. విద్యార్థులకే కాక... అన్ని శాఖల విభాగాధిపతి కార్యాలయాలు, కమిషనరేట్లు, కలెక్టరేట్లు, కార్పొరేషన్లు, బోర్డు కార్యాలయాల్లోనూ గోల్కొండ స్క్రిబ్లింగ్ ప్యాడ్లు, పేపరు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆయా శాఖల అధికారులకు పరిశ్రమల శాఖ లేఖలు కూడా రాసింది. సైజును బట్టి ధరలు.. సైజులను బట్టి ఈ నోట్‌బుక్‌ల ధరలను నిర్ణయించింది. ఏ4 సైజ్, ఏ3 సైజు తదితర తెల్ల కాగితం నాణ్యతను (70 జీఎస్ఎం, 75 జీఎస్ఎం) బట్టి ధరలను ఖరారు చేసింది. 200 పేజీల సింగిల్ రూల్డ్ (వైట్) నోటుబుక్కు సైజును బట్టి రూ.31.30గా, 100 పేజీల నోట్ బుక్ ధరను సైజును బట్టి రూ.10.29గా, రూ.17.77గా నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను గురుకుల విద్యాసంస్థల అధికారులకు పంపించింది. వాటిని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరింది. -
అబ్బే అదేం లేదు
.. అంటున్నారు బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఏ వార్తను ఇలా కొట్టిపారేస్తున్నారంటే.. బాలీవుడ్ యంగ్ హీరో జహీర్ ఇక్బాల్‌తో తాను లవ్‌లో ఉన్నాననే విషయాన్ని. 2018 సోనాక్షికి వృత్తి రీత్యా సరిగ్గా కలసి రాలేదు. వ్యక్తిగతంగా మాత్రం ఈ యంగ్ హీరోతో ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కథనాలు రాసుకొచ్చింది. ఇంతకీ జహీర్ ఇక్బాల్ ఎవరంటే.. త్వరలోనే బాలీవుడ్‌కు పరిచయం కానున్న హీరో. సల్మాన్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘నోట్‌బుక్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. జహీర్, సోనాక్షీ కలవడానికి కారణం కూడా సల్మాన్‌ఖానే అని టాక్. రీసెంట్గా జరిగిన సల్మాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో జహీర్‌తో కలసి పార్టీకు కూడా హాజరు అయ్యారట సోనాక్షి. అయితే ఈ వార్తలను సోనాక్షి కొట్టిపారేశారు. ‘మేం రిలేషన్లో లేము. మా ఇద్దరి మధ్యలో రొమాన్స్ ఏం లేదు’ అని సమాధానమిచ్చారు. మరి ఏమీ లేకుండా కలిసి ఎందుకు తిరుగుతున్నట్లబ్బా? అని కొందరి సందేహం. ఆ సంగతలా ఉంచి, సినిమాల విషయానికి వస్తే సోనాక్షి ‘ కళంక్’ అనే పీరియాడికల్ చిత్రంలో నటించారు. జహీర్ ‘నోట్‌బుక్’ చిత్రం మార్చిలో విడుదల కానుంది. -
ఆరేళ్లుగా ఆంగ్ల మాధ్యమంలో..
మోర్తాడ్ : రామన్నపేట్ ప్రాథమిక పాఠశాలకు ఆరేళ్ల క్రితం ప్రధానోపాధ్యాయుడిగా జంగం అశోక్ వచ్చారు. అప్పటికి పాఠశాలలో 40 మంది విద్యార్థులున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆయన కృషి చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తుండడంతో పిల్లలను అక్కడికే పంపిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాల మనుగడ సాగించాలంటే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఉపాధ్యాయ బృందంతో చర్చించారు. గ్రామస్తుల సహకారంతో అదే ఏడాది ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను దాతల సహకారంతో సేకరించి అందిస్తున్నారు. అంతేకాక విద్యార్థులకు టై, బెల్టు, ఇతర్ర సామగ్రినీ ఇస్తున్నారు. దీంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరగసాగింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులున్నారు. అందరి సహకారంతో.. రామన్నపేట్ పాఠశాలలో ఆరేళ్ల క్రితమే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించాం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు ఎంతగానో శ్రమించారు. శ్రమిస్తూనే ఉన్నారు. దాతలూ సహకరిస్తుండడంతో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్టేషనరీని సమకూర్చగలుగుతున్నాం. – జంగం అశోక్, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడు, రామన్నపేట్ -
ఇదో రకం దోపిడీ!
- ప్రైవేటు స్కూళ్లలో నోట్‌బుక్స్, ఇతర సామగ్రి అమ్మకాలు - బహిరంగ మార్కెట్ కంటే రెండింతలు అధిక ధరలు - నిబంధనలు ఉల్లంఘన - చలనం లేని విద్యాశాఖాధికారులు సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు స్కూళ్ల దోపిడీ పరాకాష్టకు చేరుతోంది. పిల్లల నుంచి దోచుకునేందుకు అనువైన ఏ అవకాశాన్నీ వదలడం లేదు. ఇప్పటికే ట్యూషన్, అడ్మిషన్, డొనేషన్ ఫీజుల పేరిట పిండుకుంటున్నా.. వారి ధనదాహం తీరడం లేదు. చిన్నపాటి ప్రైవేటు పాఠశాల మొదలుకొని కార్పొరేట్ స్కూళ్ల వరకు ఇదే పరిస్థితి. బడుల్లో ఏ వస్తువూ విక్రయించకూడదని నిబంధలు స్పష్టం చేస్తున్నా... హద్దు మీరుతున్నారు. నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, పెన్సిళ్లు, చార్టులు, పెన్నులు, యూనిఫాంలు, సాక్సులు తదితర వాటిని బలవంతంగా విద్యార్థులకు అంటగడుతున్నారు. బయట కొనుగోలు చేస్తామని తల్లిదండ్రులు వారించినా.. యాజమాన్యాలు వదిలిపెట్టడం లేదు. దీంతో చేసేదేమీలేక ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తూ చేతి చమురు వదిలించుకుంటున్నారు. రెండింతలు అధికం స్కూల్ పేరు, చిరునామా ముద్రించి మరీ కొన్ని యాజమాన్యాలు నోట్‌బుక్స్ విక్రయిస్తున్నాయి. ఒక్కో నోట్‌బుక్ పై ధర రూ.40- రూ.50 వేసి దండుకుంటున్నారు. అదే నోట్‌బుక్ బహిరంగ మార్కెట్లో రూ.20- రూ.30కు మించి ఉండదు. వారు నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయని పిల్లల పట్ల యాజమాన్యాలు కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. విభిన్న రూపాల్లో దండిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తొమ్మిదో తరగతికి అవసరమయ్యే 25 నోట్‌బుక్స్‌కు రూ.1100కు పైడి, పదో తరగతిలో 30 నోట్‌బుక్స్‌కు రూ.1300 - రూ.1700 వరకు వసూలు చేస్తుండడం ప్రైవేటు స్కూళ్ల నిలువు దోపిడీకి నిదర్శనం. ప్రత్యామ్నాయం లేక ఖర్చు ఎక్కువైనా ఆ స్కూళ్లలో కొనుగోలు చేస్తున్నారు విద్యార్థులు. కొన్ని ప్రాంతాల్లో బయట లభించే నోట్బుక్స్నే స్కూళ్లలో అధిక ధరలకు అంటగడుతున్నారు. ఇంకొన్ని బడులలో ఏడాదికి సరిపడే నోట్‌బుక్స్, అట్టలు, పేరు స్టిక్కర్లు, రంగులతోపాటు సాధారణ పెన్సిళ్లు, పెన్నులు, చార్టులకు ధర నిర్ణయించి ప్యాకేజీలా అమ్ముతున్నారు. వీటికి తోడు ఏమాత్రం నాణ్యత లేని వర్క్‌బుక్స్‌ని వందల రూపాయలకు విక్రయిస్తున్నారు. అధికారుల మొద్దు నిద్ర ప్రైవేటు స్కూళ్ల అక్రమ వ్యవహారమంతా విద్యాశాఖాధికారులకు తెలిసినా... చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు అందితేనే తప్ప తనిఖీలకు కదలని పరిస్థితి దాపురించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న స్కూళ్ల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. కొన్నిచోట్ల స్కూళ్ల లొసుగులు తెలిసినా అధికారులు చర్యలకు ఉపక్రమించే ధైర్యం చేయడం లేదు. యాజమాన్యాలు అధికారులపై రాజకీయ ఒత్తిడి తెస్తుండడంతో చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. జంట విద్యాశాఖలకు సిబ్బంది కొరత వేధిస్తోందని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలకు ప్రత్యేక వ్యవస్థ లేదు. ఈ కారణంగా వారు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. పున:ప్రారంభానికి ముందు... ఆ తర్వాత కొన్ని నెలల వరకు ప్రైవేటు స్కూళ్ల నిర్వహణపై విద్యాశాఖాధికారులు ఓ కన్నేస్తే మంచిది. కొంతవరకైనా వాటి ఆగడాలను అదుపుచేయవచ్చు. ఉపేక్షించం ప్రైవేటు స్కూళ్లలో నోట్‌బుక్స్ విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. స్కూళ్లలో తనిఖీలు చేపడతాం. ఒకవేళ అమ్ముతున్నట్లు సమాచారం అందితే ఆ స్కూళ్లపై చర్యలు తప్పవు. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఏ వస్తువూ అమ్మకూడదు. గీత దాటితే ఉపేక్షించేది లేదు. - సోమిరెడ్డి, హైదరాబాద్ డీఈఓ యూనిఫాంలపైనా... ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు యూనిఫాంలూ కాసులు కురిపిస్తున్నాయి. పాఠశాలల్లో నేరుగా యూనిఫాంలు విక్రయిస్తే అధికారులతో ఇబ్బంది ఎదురవుతుందని భావించిన యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. స్కూల్ ఉన్న సమీప ప్రాంతంలోనే ఓ వ స్త్ర దుకాణంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. తమ యూనిఫారాలు అక్కడే లభించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడే కొనుగోలు చేసేలా చూస్తున్నాయి. దీనిపై వస్త్ర దుకాణాల నుంచి కమీషన్ల రూపంలో భారీగా వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నోట్‌బుక్స్ దాచారు!
ఆర్వీఎం నిర్లక్ష్యం కేజీబీవీలకు అందని నోట్స్ కరీంనగర్ కేజీబీవీలో భద్రం రవాణా వారి బాధ్యత కాదట పిల్లలకు పంచేది ఇంకెప్పుడో 7800 మందికి ఇబ్బందులు విద్యా సంవత్సరం ఆరంభమై నెల రోజులు దాటింది. ఇప్పటికీ.. సర్కారు సరఫరా చేసిన నోట్‌బుక్స్‌ను పిల్లలకు పంచే దిక్కులేదు. పాఠ్యపుస్తకాలు, దుస్తులతో పాటు జూన్‌లో పంపిణీ చేయాల్సిన నోట్‌బుక్స్ జిల్లాకేంద్రంలోనే మూలుగుతున్నాయి. వీటిని పాఠశాలలకు రవాణా చేయాల్సిన అధికారులు.. అది తమ బాధ్యత కాదన్నట్లుగా చేతులెత్తేశారు. జిల్లా కేంద్రంలోనే ఓ పాఠశాలలో వీటిని భద్రపరిచారు. సప్తగిరి కాలనీలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలోని ఓ తరగతి గదిలో ఈ నోట్‌బుక్స్ బండిల్స్‌ను పడేసి తాళం వేశారు. దీంతో కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న బాలికలు ఇబ్బంది పడుతున్నారు. తమకు బోధించే పాఠాలు రాసుకునేందుకు నోట్స్ తామే కొనుక్కోవాలా.. లేదా సర్కారు పంపిణీ చేస్తుందా... అర్థంకాక బిత్తరపోతున్నారు. రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణమిది. జిల్లాలో 51 కస్తూరిబా గాంధీ బాలికల (కేజీబీవీ) విద్యాలయాలున్నాయి. వీటిలో తొమ్మిది పాఠశాలలను రెసిడెన్షియల్ సొసైటీలు నిర్వహిస్తున్నాయి. మిగతా 42 పాఠశాలలు ఆర్వీఎం ప్రాజెక్టు ఆఫీసరు పర్యవేక్షణలో నడుస్తున్నాయి. వీటిలో ఈ విద్యా సంవత్సరం 7,800 మంది బాలికలు చదువుకుంటున్నట్లు రికార్డులున్నాయి. బాలకార్మికులు, అనాథలు, డ్రాపవుట్స్, ఇప్పటికీ బడిలో చేరనివారు, ఎయిడ్స్ బాధితుల పిల్లలకు రెసిడెన్షియల్ పద్ధతిలో బోధన, వసతి సదుపాయాలు కల్పించే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం కేజీబీవీలు నెలకొల్పింది. పాఠ్యపుస్తకాలు, దుస్తులతో పాటు ఇక్కడి పిల్లలకు ఒక్కొక్కరికి 16 నోట్‌బుక్స్‌ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. పిల్లల సంఖ్యకు సరిపడేన్ని నోట్‌బుక్స్‌ను సర్కారు గత నెలలోనే పంపించింది. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీటీపీసీఎల్) ఈ బుక్స్‌ను కేజీబీవీలకు సరఫరా చేస్తోంది. జిల్లాకు నోట్‌బుక్స్ వచ్చాయని.. వీటిని పాఠశాలలకు చేరవేయాల్సిన బాధ్యత వారిదేనని ఆర్వీఎం అధికారులు చెబుతున్నారు. కానీ.. నెల రోజులైనా వీటిని పాఠశాలలకు చేరవేయకపోతే చదువుకునే విద్యార్థులు నోట్స్ ఎలా రాసుకుంటారని ఆలోచించకపోవడం గమనార్హం. మరో లోడ్ నోట్‌బుక్స్ రావాల్సి ఉందని.. అవి వచ్చాక ఏపీటీపీసీఎల్ వీటిని పాఠశాలలకు రవాణా చేస్తుందని ఆర్వీఎం పీవో రాజమౌళి వివరణ ఇచ్చారు. ఖర్చుతో కూడుకున్న పని కావటంతో తాము రవాణా చేయటం లేదని చెప్పారు.