ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఎటూ తేలడం లేదు. చివరికి అణు దాడికీ పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు ఉక్రెయిన్‌లో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల విషయంగా చాలా దేశాలు వణికిపోతున్నాయి. మరి ఇంత భయానికి కారణం.. రేడియేషన్. అలాంటి రేడియేషన్‌తో ప్రమాదమెంత?ఎంతకాలం ప్రభావం ఉంటుందనే వివరాలు తెలుసుకుందామా..
అణువే.. బ్రహ్మాండం..
అణువు అంటే అత్యంత సూక్ష్మమైనది. కానీ దానికి ఉండే శక్తి మాత్రం అపారమైనది. ఇది అది అని కాదు.. అత్యంత ప్రాథమికమైన హైడ్రోజన్ నుంచి.. అణ్వస్త్రాల్లో వాడే యురేనియం, ఫ్లూటోనియం దాకా అన్ని మూలకాల్లో అపరిమిత శక్తి ఉంటుంది. ఆ శక్తిని గుర్తించి, మనకు అనుకూలంగా వాడుకోవడం కోసం శాస్త్రవేత్తలు వందల ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ 1898లో అణు ధార్మికత (రేడియేషన్)ను.. రేడియం, పోలోనియం మూలకాలను కనుగొన్నారు.
ఆ పుస్తకాలు, వ్రస్తాలు ప్రమాదకరమే..
రేడియం మూలకం అత్యంత తీవ్రస్థాయిలో రేడియో ధార్మికతను విడుదల చేస్తుంది. తక్కువ పరిమాణంలోని రేడియంపైనే మేరీ క్యూరీ ప్రయోగాలు చేసినా.. దాని రేడియేషన్ ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా పడింది. దానితోనే ఆమె శరీరంలో ఎముక మజ్జ (బోన్‌మ్యారో) దెబ్బతిని ప్రాణాలు కోల్పోయింది. క్యూరీ పరిశోధన చేసిన ల్యాబ్‌లో ఫర్నిచర్, ఇతర వస్తువులు, ఆమె వస్త్రాలు, పరిశోధన వివరాలు రాసిన నోట్‌బుక్స్ అన్నీ రేడియం ప్రభావానికి లోనయ్యాయి. ఎంతగా అంటే.. ఆమె పుస్తకాలు, వ్రస్తాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది. ఇప్పుడే కాదు.. మరో 1,500 ఏళ్ల పాటు వాటిలో రేడియేషన్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
► మేరీ పరిశోధనలకు గుర్తుగా ఆమె నోట్‌బుక్స్‌ను ఫ్రాన్స్‌లోని బిబ్లియోథెక్ మ్యూజియంలో భద్రపర్చారు. వాటి నుంచి వెలువడే రేడియేషన్ బయటికి రాకుండా సీసపు పెట్టెల్లో వాటిని ఉంచారు.
► మేరీ క్యూరీ శరీరం నుంచీ రేడియేషన్ వెలువడుతుండటంతో.. ఆమె మృతదేహాన్ని ఒక అంగు ళం మందంతో తయారు చేసిన సీసపు పెట్టెలో ఉంచి ఖననం చేయడం గమనార్హం.
► అణుధార్మిక మూలకాల నుంచి వెలువడే రేడియేషన్‌ను సీసం సమర్థవంతంగా పీల్చుకోగలుగుతుంది. అందుకే రేడియో యాక్టివ్ మూలకాలను నిరంతరం సీసపు పెట్టెల్లోనే ఉంచుతారు.
‘ఎలిఫెంట్ ఫుట్’.. బతికేది ఐదు నిమిషాలే..
ప్రపంచ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ప్రమాదానికి లోనైన అణు విద్యుత్ కేంద్రం చెర్నోబిల్. 1986 ఏప్రిల్‌లో అందులోని ఒక రియాక్టర్ పేలిపోయి రేడియేషన్ లీకైంది. దాని ప్రభావంతో చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని వేలాది మంది ఆ రేడియేషన్‌కు లోనై.. వివిధ వ్యాధుల బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పట్లో రియాక్టర్ పేలినప్పుడు.. అందులోని అణు ఇంధనం, చుట్టూ ఉన్న లోహ పరికరాలు, కాంక్రీట్ శ్లాబ్‌లు, బీమ్‌లు కరిగి దిగువకు కారిపోయాయి. అవి దిగువన కాస్త వెడల్పుగా విస్తరించిన పొడుగాటి స్తంభంలా ఏర్పడ్డాయి.
అది చూడటానికి ఏనుగు కాలు ఆకారంలో ఉండటంతో ‘ఎలిఫెంట్ ఫుట్’అని పేరుపెట్టారు. ఇది జరిగి 38 ఏళ్లయినా ఇప్పటికీ దాని నుంచి రేడియేషన్ వెలువడుతూనే ఉంది. ఎవరైనా దాని దగ్గరగా వెళ్లి.. ఐదు నిమిషాలుగానీ ఉంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఈ రేడియేషన్ బయటికి రాకుండా.. దాని చుట్టూ రెండు వరుసలుగా సీసం, ఇతర లోహాలతో ప్రత్యేకంగా కంటైన్‌మెంట్ చేసి మూసేశారు.
► ప్రస్తుతం ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా.. ఆ దేశంలోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని స్వాదీనంలోకి తెచ్చుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైనది కూడా ఇందుకే..
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment