Radioactive
-
Californium: 50 గ్రాముల రాయి... రూ. 850 కోట్ల ఖరీదు!
పట్నా: అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియంను గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తుండగా బిహార్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారినుంచి 50 గ్రాముల కాలిఫోర్నియంను స్వా«దీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా రూ.850 కోట్ల దాకా ఉంటుందని గోపాల్‌గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ వెల్లడించారు! గ్రాము ధర రూ.17 కోట్లు పలుకుతుందని ఆయన వివరించారు. ‘‘పక్కా సమాచారం మేరకు జిల్లా ఇన్వెస్టిగేషన్ విభాగం, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఎస్టీఎఫ్ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. యూపీ, బిహార్ సరిహద్దులో మోటార్‌బైక్ మీద వస్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా కాలిఫోరి్నయం దొరికింది’’ అని తెలిపారు. దీనిపై అణు ఇంధన శాఖకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. ఎందుకింత ఖరీదు? కాలిఫోర్నియం అత్యంత అరుదైన రేడియోధార్మిక పదార్థం. ఇది ప్రకృతిలో సహజంగా లభించదు. ప్రయోగశాలల్లో హెచ్చు పీడనంతో కూడిన ఐసోటోప్ రియాక్టర్లలో తయారు చేయాల్సి ఉంటుంది. ఎంతగానో శ్రమించిన మీదట అత్యంత స్వల్ప పరిమాణాల్లో మాత్రమే తయారవుతుంది! దీన్ని తయారు చేయగల సామర్థ్యమున్న అణు రియాక్టర్లు రెండే ఉన్నాయి! ఒకటి అమెరికాలో, రెండోది రష్యాలో. 1950లో భౌతిక శాస్త్ర పరిశోధకులు స్టాన్లీ గెరాల్డ్ థాంప్సన్, కెనెత్ స్ట్రీట్ జూనియర్, అల్బర్ట్ గిరోసో, గ్లెన్ టి.సీబోర్గ్ దీన్ని తొలిసారిగా తయారు చేశారు. ఈ రేడియో ధారి్మక పదార్థాన్ని భూగర్భంలో బంగారు, వెండి నిల్వల అన్వేషణతో పాటు ఇంధన క్షేత్రాల్లో చమురు, నీటి పొరలను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. -
చిన్న బుక్.. 1,500 ఏళ్ల డేంజర్
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఎటూ తేలడం లేదు. చివరికి అణు దాడికీ పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు ఉక్రెయిన్‌లో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల విషయంగా చాలా దేశాలు వణికిపోతున్నాయి. మరి ఇంత భయానికి కారణం.. రేడియేషన్. అలాంటి రేడియేషన్‌తో ప్రమాదమెంత?ఎంతకాలం ప్రభావం ఉంటుందనే వివరాలు తెలుసుకుందామా.. అణువే.. బ్రహ్మాండం.. అణువు అంటే అత్యంత సూక్ష్మమైనది. కానీ దానికి ఉండే శక్తి మాత్రం అపారమైనది. ఇది అది అని కాదు.. అత్యంత ప్రాథమికమైన హైడ్రోజన్ నుంచి.. అణ్వస్త్రాల్లో వాడే యురేనియం, ఫ్లూటోనియం దాకా అన్ని మూలకాల్లో అపరిమిత శక్తి ఉంటుంది. ఆ శక్తిని గుర్తించి, మనకు అనుకూలంగా వాడుకోవడం కోసం శాస్త్రవేత్తలు వందల ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ 1898లో అణు ధార్మికత (రేడియేషన్)ను.. రేడియం, పోలోనియం మూలకాలను కనుగొన్నారు. ఆ పుస్తకాలు, వ్రస్తాలు ప్రమాదకరమే.. రేడియం మూలకం అత్యంత తీవ్రస్థాయిలో రేడియో ధార్మికతను విడుదల చేస్తుంది. తక్కువ పరిమాణంలోని రేడియంపైనే మేరీ క్యూరీ ప్రయోగాలు చేసినా.. దాని రేడియేషన్ ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా పడింది. దానితోనే ఆమె శరీరంలో ఎముక మజ్జ (బోన్‌మ్యారో) దెబ్బతిని ప్రాణాలు కోల్పోయింది. క్యూరీ పరిశోధన చేసిన ల్యాబ్‌లో ఫర్నిచర్, ఇతర వస్తువులు, ఆమె వస్త్రాలు, పరిశోధన వివరాలు రాసిన నోట్‌బుక్స్ అన్నీ రేడియం ప్రభావానికి లోనయ్యాయి. ఎంతగా అంటే.. ఆమె పుస్తకాలు, వ్రస్తాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది. ఇప్పుడే కాదు.. మరో 1,500 ఏళ్ల పాటు వాటిలో రేడియేషన్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ► మేరీ పరిశోధనలకు గుర్తుగా ఆమె నోట్‌బుక్స్‌ను ఫ్రాన్స్‌లోని బిబ్లియోథెక్ మ్యూజియంలో భద్రపర్చారు. వాటి నుంచి వెలువడే రేడియేషన్ బయటికి రాకుండా సీసపు పెట్టెల్లో వాటిని ఉంచారు. ► మేరీ క్యూరీ శరీరం నుంచీ రేడియేషన్ వెలువడుతుండటంతో.. ఆమె మృతదేహాన్ని ఒక అంగు ళం మందంతో తయారు చేసిన సీసపు పెట్టెలో ఉంచి ఖననం చేయడం గమనార్హం. ► అణుధార్మిక మూలకాల నుంచి వెలువడే రేడియేషన్‌ను సీసం సమర్థవంతంగా పీల్చుకోగలుగుతుంది. అందుకే రేడియో యాక్టివ్ మూలకాలను నిరంతరం సీసపు పెట్టెల్లోనే ఉంచుతారు. ‘ఎలిఫెంట్ ఫుట్’.. బతికేది ఐదు నిమిషాలే.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ప్రమాదానికి లోనైన అణు విద్యుత్ కేంద్రం చెర్నోబిల్. 1986 ఏప్రిల్‌లో అందులోని ఒక రియాక్టర్ పేలిపోయి రేడియేషన్ లీకైంది. దాని ప్రభావంతో చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని వేలాది మంది ఆ రేడియేషన్‌కు లోనై.. వివిధ వ్యాధుల బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పట్లో రియాక్టర్ పేలినప్పుడు.. అందులోని అణు ఇంధనం, చుట్టూ ఉన్న లోహ పరికరాలు, కాంక్రీట్ శ్లాబ్‌లు, బీమ్‌లు కరిగి దిగువకు కారిపోయాయి. అవి దిగువన కాస్త వెడల్పుగా విస్తరించిన పొడుగాటి స్తంభంలా ఏర్పడ్డాయి. అది చూడటానికి ఏనుగు కాలు ఆకారంలో ఉండటంతో ‘ఎలిఫెంట్ ఫుట్’అని పేరుపెట్టారు. ఇది జరిగి 38 ఏళ్లయినా ఇప్పటికీ దాని నుంచి రేడియేషన్ వెలువడుతూనే ఉంది. ఎవరైనా దాని దగ్గరగా వెళ్లి.. ఐదు నిమిషాలుగానీ ఉంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఈ రేడియేషన్ బయటికి రాకుండా.. దాని చుట్టూ రెండు వరుసలుగా సీసం, ఇతర లోహాలతో ప్రత్యేకంగా కంటైన్మెంట్ చేసి మూసేశారు. ► ప్రస్తుతం ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా.. ఆ దేశంలోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని స్వాదీనంలోకి తెచ్చుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైనది కూడా ఇందుకే.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ...ఆ మాత్రలకు పెరిగిన డిమాండ్! ఎందుకలా..
Potassium Iodide Pill block Radioactive Iodine: ఉక్రెయిన్ రష్యా మధ్య నిరవధికంగా యుద్ధం కొనసాగుతోంది. ఎటునుంచి చూసిన ఈ యుద్ధం ఆగుతుందని ఎవరికి అనిపించటంలేదు. అలాంటి విధ్వంసకర పోరు సమయంలో పొటాషియం అయోడైడ్ మాత్రలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీనికి గల కారణం రష్యా ఉక్రెయిన్‌లోని అణుకర్మాగారం పై దాడుల జరపడంతోనే ఈ మాత్రలకు అనుహ్యంగా డిమాండ్ పెరిగింది. అసలు పొటాషియం అయోడైడ్(కేఐ) అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏమిటంటే..సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ప్రకారం పొటాషియం అయోడైడ్ అనేది స్థిరమైన అయోడిన్ ఉప్పు. ఇది రేడియోధార్మిక అయోడిన్‌ను థైరాయిడ్ గ్రంథి గ్రహించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. తద్వారా ఈ గ్రంధిని అణుధార్మిక రేడియేషన్ భారి నుంచి కాపాడుతుంది. అంతేకాదు థైరాయిడ్ గ్రంధిలోకి రేడియోధార్మిక అయోడిన్ రాకుండా నిరోధించడానికి మన వద్ద ఉన్న టేబుల్ స్పూన్ ఉప్పు, అయోడిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలలోని అయోడిన్ సరిపోదని సీడీసీ పేర్కొంది. అంతేకాదు థైరాయిడ్ గ్రంధి స్థిరమైన అయోడిన్, రేడియోధార్మిక అయోడిన్ మధ్య వ్యత్యాసాని గుర్తించలేదు. అయితే ఒక వ్యక్తి కేఐ మాత్ర తీసుకున్నప్పుడూ స్థిరమైన అయోడిన్ని మాత్రమే గ్రహిస్తుందని, రేడియోధార్మిక అయోడిన్‌ను ప్రవేశించకుండా అడ్డుకుంటుందని సీడీసీ వెల్లడించింది. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రతరం అవుతుందనే భయంతో చాలామంది యూరోపియన్లు అయోడిన్ మాత్రలను నిల్వ చేసుకున్నారు. అంతేగాక బెల్జియంలో, దాదాపు 30 వేల మంది నివాసితులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అణు నిరోధక దళాలను హై అలర్ట్‌లో ఉంచాలని ప్రకటించిన నేపథ్యంలో ఉచిత మాత్రల కోసం ఫార్మసీలకు వెళ్లారని స్థానిక మీడియా పేర్కొంది. పైగా యూఎస్‌లోని ఫార్మాస్యూటికల్ కంపెనీ పొటాషియం అయోడైడ్ ఉత్పత్తులకు సంబంధించిన అధిక డిమాండ్‌ను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. (చదవండి: ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత) -
204 మంది మిస్సింగ్.. ఇద్దరు బతికారు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో ధౌలిగంగా నది సృష్టించిన జలప్రళయం భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. కాగా, ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం సంభవించి 6రోజులు ముగుస్తున్నాయి. ఎన్టీపీసీ హైడల్ ప్రాజెక్టు తపోవన్ సొరంగంలో చిక్కుకున్నవారికోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఈ ఘటనలో ఇద్దరు సజీవంగా బయట పడ్డారు. ఇప్పటికే 204 మంది తప్పిపోయారు. టన్నెల్ చిక్కుకున్న మరికొందరితో సంబంధాలు ఏర్పర్చుకోవడానికి అనేక ఏజెన్సీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తపొవన్ సొరంగంవద్ద సహయక చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు చమోలి జిల్లా కలెక్టర్ స్వాతి భదోరియా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇదిలా ఉండగా.. ఈ భయానక విపత్తుకు అందరూ భావించినట్లు హిమనీనదం పేలుడు కారణం కాదని రైనీ గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాక వారు మరో సంచలన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 56 ఏళ్ల కిందట అధికారులునందాదేవి శిఖరంపై ఓ రేడియో యాక్టివ్ (రేడియోధార్మిక పదార్థం) పరికరాన్ని ఏర్పాటు చేశారని.. ఆ తర్వాత ఆ పరికరం మిస్సైందని తెలిపారు. తాజా పేలుడుకు ఆ పరికరమే కారణమై ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.550కి సీఎస్ 137 కిట్ విక్రయం!
కృష్ణాజిల్లా , కలిదిండి (కైకలూరు) : ఓఎన్జీసీకి చెందిన రేడియో ధార్మిక మూలకం సీఎస్ 137 కిట్ వ్యవహారం కలిదిండిలో కలకలం రేపింది. గుర్వాయపాలెం శివారు మద్దావానిగూడెం వద్ద రోడ్డుపై దొరికిందని చెప్పి ఓ వ్యక్తి ఆ కిట్‌ను స్థానిక ఒక పాత ఇనుము దుకాణంలో రూ.550 కు విక్రయించాడు. ఇది లారీలను ఎత్తే చిన్న జాకీ పరికరంగా భావించిన పాత ఇనుము షాపు యజమాని చిన వీరయ్య దాన్ని ఓ గోడ పక్కన వదిలేశాడు. ఈ కిట్ అపహరణకు గురైందని పత్రికల్లో వచ్చిన వార్తకు యజమాని కుమారుడు సాయిరామ్ స్పందించి అది తమ వద్ద ఉందని ఫోన్ చేశాడు. దీంతో రాజమండ్రి నుంచి వచ్చిన సంబంధిత ఉన్నత అధికారులు పోలీసుల సమక్షంలో బుధవారం ఈ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, అంతకు ముందు ఆ కిట్ తమదా కాదా అని నిర్ధారించుకోవడానికి అధికారులకు దాదాపు 4 గంటల సమయం పట్టింది. చివరికి అది రేడియో ధార్మిక మూలకం సీఎస్ 137 కిట్టేనని నిర్ధారించుకుని ప్రత్యేక వాహనంపై రాజమండ్రికి తరలించారు. దుకాణం యజమానికి రూ.600 చెల్లించారు. అయితే, ఈ పరికరం అందిస్తే తగిన బహుమతి ఇస్తామని ప్రకటించిన అధికారులు కేవలం రూ.50 అదనంగా ఇవ్వటంపై షాపు యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. కాగా కిట్టు పోయిందని పోలీసులకు సమాచారం ఇచ్చిన సంస్థ అధికారులు తర్వాత దాన్ని తొలగింపజేశారు. అయితే, మండలంలోని కొండంగి గ్రామ సమీపంలో రిగ్గు వేసిన ఓఎన్జీసీ అ«ధికారులు గురువారం ఉదయం కూడా రేడియో ధార్మిక మూలకం సీఎస్ 137 కిట్టు పోయిందని, ఎవరికైనా దొరికితే అందజేయాలని దేవాలయం వద్ద మైక్‌లో చెప్పించారు. అది ప్రమాదకర కిట్టని దాన్ని ఓపెన్ చేయవద్దని హెచ్చరించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కిట్టు దొరికిన తర్వాత కూడా ప్రకటన చేయడం గమనార్హం. అయితే, బుధవారం దొరికిన కిట్టు అసలుది కాదేమోనని వాళ్లు సందేహించారు. కాగా, ఈ కిట్టు స్వాధీనంపై తమకెటువంటి సమాచారం లేదని ఎస్ఐ సుధాకర్ గురువారం తెలిపారు. -
ఎట్టకేలకు చేరింది
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్: ఓఎన్జీసీలో చమురు, గ్యాస్ తవ్వకాలకు వినియోగించే శక్తిమంతమైన రేడియోధార్మిక మూలకం సీఎస్–137 కంటైనర్ సురక్షితంగా గురువారం తెల్లవారుజామున ఓఎన్జీసీ బేస్‌కాంప్లెక్స్‌కు చేర్చారు. మాయమైన మూలకం కంటైనర్‌ను కృష్ణాజిల్లా కలిదిండిలో గుర్తించిన విషయం తెలిసిందే. ఈనెల 12న కృష్ణాజిల్లా మల్లేశ్వరానికి ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లి, తిరిగి ఈనెల 14న బేస్‌కాంప్లెక్స్‌కు తీసుకువచ్చారు. ఈనెల 16న పరిశీలించగా లాగింగ్ యూనిట్‌కు ఉండాల్సిన రేడియోధార్మిక మూలకం సీఎస్–137 కంటైనర్ కనిపించలేదు. దీంతో ఈనెల 17వతేదీన ఓఎన్జీసీ అధికారులు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్ జిల్లా ఎస్పీ షిమూషీబాజ్‌పాయ్ ఆదేశాల మేరకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి కృష్ణాజిల్లా కలిదిండి పాత ఇనుపదుకాణంలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఓఎన్జీసీ అధికారులు సంయుక్తంగా రేడియో ధార్మికమూలకం సీఎస్–137 కంటైనర్‌ను సురక్షితంగా ఓఎన్జీసీ బేస్‌కాంప్లెక్స్‌కు చేర్చారు. జాకీగా భావించి రూ.540కు విక్రయం రేడియోధార్మిక మూలకం సీఎస్–137 ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై జారిపడిపోయినట్టు భావిస్తున్నారు. అది వ్యక్తికి దొరకగా దానిని లారీటైర్లు విప్పే జాకీగా భావించి కలిదిండి గ్రామంలోని పాత ఇనుపసామాన్ల దుకాణంలో 27కిలోల కంటైనర్‌ను కిలో రూ.20 చొప్పున రూ.540కు విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అధికారుల ఫిర్యాదులో పేర్కొన్న విధంగా రూ.35లక్షలు దానిని రూ.540కు విక్రయించడం గమనార్హం. -
రేడియోధార్మిక పరికరం మిస్సింగ్ కేసును చేధించాం
-
విమానాశ్రయంలో రేడియోయాక్టీవ్ లీక్ కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో టెర్మినల్ వద్ద రేడియోయాక్టీవ్ పదార్థం లీక్ కావడం ఆదివారం కలకలం సృష్టించింది. విమానాశ్రయ సిబ్బంది సమాచారం మేరకు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్(ఏఈఆర్బీ) అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎయిర్ ఫ్రాన్స్ విమానం ద్వారా వచ్చిన మెడికల్ పార్సిల్లో ఈ లీక్ సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా కార్గో టెర్మినల్ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. లీక్ అయిన రేడియోయాక్టీవ్ పదార్థం క్యాన్సర్ చికిత్సలో వాడే న్యూక్లియర్ మెడిసిన్‌కు సంబంధించినది అని, అయితే దీని రేడియోయాక్టివ్ తీవ్రత చాలా తక్కువ అని ఏఈఆర్బీ అధికారులు తనిఖీల అనంతరం వెల్లడించారు. జాతీయ విపత్తు నిర్వహన సంస్థ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎలాంటి హానిలేదని తెలిపారు. -
ఢిల్లీలో అణుధార్మికత లీకేజీ కలకలం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అణుధార్మిక పదార్థం లీకేజీ కలకలం రేపింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అణుధార్మిక పదార్థాలు లీకవడంతో ఆందోళన రేగింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయే కనుగొనేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందం రంగంలోకి దిగింది. టర్కీ నుంచి వచ్చిన కార్గో విమానంలో ఇది వచ్చినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఫోర్టిస్ ఆస్పత్రి కోసం ఇస్తాంబుల్ నుంచి దీన్ని తెప్పించారని ఎన్డీఆర్ఎఫ్ డీజీ తెలిపారు. ఫోర్టిస్ ఆస్పత్రి సిబ్బందిని పిలిపించి విచారిస్తున్నట్టు చెప్పారు. పరిస్థితిని కనిపెట్టి చూస్తున్నామని చెప్పారు. ఎయిర్ పోర్టులోని కార్గో కాంపెక్స్ నుంచి అణుధార్మికత లీకయినట్టు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అణుశక్తి విభాగం బృందం కూడా విమానాశ్రయానికి చేరుకుందన్నారు. అణుధార్మికత లీకేజీని నియంత్రించారని తనకు సమాచారం ఇచ్చారని చెప్పారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అణుధార్మికత లీకైందన్న కోణంలో సీఐఎస్ఎఫ్, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.