కిట్‌ను ప్రత్యేక వాహనంపైకి చేరుస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది
కృష్ణాజిల్లా , కలిదిండి (కైకలూరు) : ఓఎన్జీసీకి చెందిన రేడియో ధార్మిక మూలకం సీఎస్ 137 కిట్ వ్యవహారం కలిదిండిలో కలకలం రేపింది. గుర్వాయపాలెం శివారు మద్దావానిగూడెం వద్ద రోడ్డుపై దొరికిందని చెప్పి ఓ వ్యక్తి ఆ కిట్‌ను స్థానిక ఒక పాత ఇనుము దుకాణంలో రూ.550 కు విక్రయించాడు. ఇది లారీలను ఎత్తే చిన్న జాకీ పరికరంగా భావించిన పాత ఇనుము షాపు యజమాని చిన వీరయ్య దాన్ని ఓ గోడ పక్కన వదిలేశాడు. ఈ కిట్ అపహరణకు గురైందని పత్రికల్లో వచ్చిన వార్తకు యజమాని కుమారుడు సాయిరామ్ స్పందించి అది తమ వద్ద ఉందని ఫోన్ చేశాడు. దీంతో రాజమండ్రి నుంచి వచ్చిన సంబంధిత ఉన్నత అధికారులు పోలీసుల సమక్షంలో బుధవారం ఈ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే, అంతకు ముందు ఆ కిట్ తమదా కాదా అని నిర్ధారించుకోవడానికి అధికారులకు దాదాపు 4 గంటల సమయం పట్టింది. చివరికి అది రేడియో ధార్మిక మూలకం సీఎస్ 137 కిట్టేనని నిర్ధారించుకుని ప్రత్యేక వాహనంపై రాజమండ్రికి తరలించారు. దుకాణం యజమానికి రూ.600 చెల్లించారు. అయితే, ఈ పరికరం అందిస్తే తగిన బహుమతి ఇస్తామని ప్రకటించిన అధికారులు కేవలం రూ.50 అదనంగా ఇవ్వటంపై షాపు యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. కాగా కిట్టు పోయిందని పోలీసులకు సమాచారం ఇచ్చిన సంస్థ అధికారులు తర్వాత దాన్ని తొలగింపజేశారు. అయితే, మండలంలోని కొండంగి గ్రామ సమీపంలో రిగ్గు వేసిన ఓఎన్‌జీసీ అ«ధికారులు గురువారం ఉదయం కూడా రేడియో ధార్మిక మూలకం సీఎస్ 137 కిట్టు పోయిందని, ఎవరికైనా దొరికితే అందజేయాలని దేవాలయం వద్ద మైక్‌లో చెప్పించారు. అది ప్రమాదకర కిట్టని దాన్ని ఓపెన్ చేయవద్దని హెచ్చరించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కిట్టు దొరికిన తర్వాత కూడా ప్రకటన చేయడం గమనార్హం. అయితే, బుధవారం దొరికిన కిట్టు అసలుది కాదేమోనని వాళ్లు సందేహించారు. కాగా, ఈ కిట్టు స్వాధీనంపై తమకెటువంటి సమాచారం లేదని ఎస్‌ఐ సుధాకర్ గురువారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment