ఢిల్లీలో అణుధార్మికత లీకేజీ కలకలం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అణుధార్మిక పదార్థం లీకేజీ కలకలం రేపింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అణుధార్మిక పదార్థాలు లీకవడంతో ఆందోళన రేగింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయే కనుగొనేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందం రంగంలోకి దిగింది.
టర్కీ నుంచి వచ్చిన కార్గో విమానంలో ఇది వచ్చినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఫోర్టిస్ ఆస్పత్రి కోసం ఇస్తాంబుల్ నుంచి దీన్ని తెప్పించారని ఎన్డీఆర్ఎఫ్ డీజీ తెలిపారు. ఫోర్టిస్ ఆస్పత్రి సిబ్బందిని పిలిపించి విచారిస్తున్నట్టు చెప్పారు. పరిస్థితిని కనిపెట్టి చూస్తున్నామని చెప్పారు.
ఎయిర్ పోర్టులోని కార్గో కాంపెక్స్ నుంచి అణుధార్మికత లీకయినట్టు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అణుశక్తి విభాగం బృందం కూడా విమానాశ్రయానికి చేరుకుందన్నారు. అణుధార్మికత లీకేజీని నియంత్రించారని తనకు సమాచారం ఇచ్చారని చెప్పారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అణుధార్మికత లీకైందన్న కోణంలో సీఐఎస్ఎఫ్, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.