ఇదో రకం దోపిడీ!
- ప్రైవేటు స్కూళ్లలో నోట్‌బుక్స్, ఇతర సామగ్రి అమ్మకాలు
- బహిరంగ మార్కెట్ కంటే రెండింతలు అధిక ధరలు
- నిబంధనలు ఉల్లంఘన
- చలనం లేని విద్యాశాఖాధికారులు
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు స్కూళ్ల దోపిడీ పరాకాష్టకు చేరుతోంది. పిల్లల నుంచి దోచుకునేందుకు అనువైన ఏ అవకాశాన్నీ వదలడం లేదు. ఇప్పటికే ట్యూషన్, అడ్మిషన్, డొనేషన్ ఫీజుల పేరిట పిండుకుంటున్నా.. వారి ధనదాహం తీరడం లేదు. చిన్నపాటి ప్రైవేటు పాఠశాల మొదలుకొని కార్పొరేట్ స్కూళ్ల వరకు ఇదే పరిస్థితి. బడుల్లో ఏ వస్తువూ విక్రయించకూడదని నిబంధలు స్పష్టం చేస్తున్నా... హద్దు మీరుతున్నారు.
నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, పెన్సిళ్లు, చార్టులు, పెన్నులు, యూనిఫాంలు, సాక్సులు తదితర వాటిని బలవంతంగా విద్యార్థులకు అంటగడుతున్నారు. బయట కొనుగోలు చేస్తామని తల్లిదండ్రులు వారించినా.. యాజమాన్యాలు వదిలిపెట్టడం లేదు. దీంతో చేసేదేమీలేక ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తూ చేతి చమురు వదిలించుకుంటున్నారు.
రెండింతలు అధికం
స్కూల్ పేరు, చిరునామా ముద్రించి మరీ కొన్ని యాజమాన్యాలు నోట్‌బుక్స్ విక్రయిస్తున్నాయి. ఒక్కో నోట్‌బుక్ పై ధర రూ.40- రూ.50 వేసి దండుకుంటున్నారు. అదే నోట్‌బుక్ బహిరంగ మార్కెట్‌లో రూ.20- రూ.30కు మించి ఉండదు. వారు నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయని పిల్లల పట్ల యాజమాన్యాలు కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. విభిన్న రూపాల్లో దండిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తొమ్మిదో తరగతికి అవసరమయ్యే 25 నోట్‌బుక్స్‌కు రూ.1100కు పైడి, పదో తరగతిలో 30 నోట్‌బుక్స్‌కు రూ.1300 - రూ.1700 వరకు వసూలు చేస్తుండడం ప్రైవేటు స్కూళ్ల నిలువు దోపిడీకి నిదర్శనం.
ప్రత్యామ్నాయం లేక ఖర్చు ఎక్కువైనా ఆ స్కూళ్లలో కొనుగోలు చేస్తున్నారు విద్యార్థులు. కొన్ని ప్రాంతాల్లో బయట లభించే నోట్‌బుక్స్‌నే స్కూళ్లలో అధిక ధరలకు అంటగడుతున్నారు. ఇంకొన్ని బడులలో ఏడాదికి సరిపడే నోట్‌బుక్స్, అట్టలు, పేరు స్టిక్కర్లు, రంగులతోపాటు సాధారణ పెన్సిళ్లు, పెన్నులు, చార్టులకు ధర నిర్ణయించి ప్యాకేజీలా అమ్ముతున్నారు. వీటికి తోడు ఏమాత్రం నాణ్యత లేని వర్క్‌బుక్స్‌ని వందల రూపాయలకు విక్రయిస్తున్నారు.
అధికారుల మొద్దు నిద్ర
ప్రైవేటు స్కూళ్ల అక్రమ వ్యవహారమంతా విద్యాశాఖాధికారులకు తెలిసినా... చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు అందితేనే తప్ప తనిఖీలకు కదలని పరిస్థితి దాపురించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న స్కూళ్ల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. కొన్నిచోట్ల స్కూళ్ల లొసుగులు తెలిసినా అధికారులు చర్యలకు ఉపక్రమించే ధైర్యం చేయడం లేదు. యాజమాన్యాలు అధికారులపై రాజకీయ ఒత్తిడి తెస్తుండడంతో చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు.
జంట విద్యాశాఖలకు సిబ్బంది కొరత వేధిస్తోందని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలకు ప్రత్యేక వ్యవస్థ లేదు. ఈ కారణంగా వారు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. పున:ప్రారంభానికి ముందు... ఆ తర్వాత కొన్ని నెలల వరకు ప్రైవేటు స్కూళ్ల నిర్వహణపై విద్యాశాఖాధికారులు ఓ కన్నేస్తే మంచిది. కొంతవరకైనా వాటి ఆగడాలను అదుపుచేయవచ్చు.
ఉపేక్షించం
ప్రైవేటు స్కూళ్లలో నోట్‌బుక్స్ విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. స్కూళ్లలో తనిఖీలు చేపడతాం. ఒకవేళ అమ్ముతున్నట్లు సమాచారం అందితే ఆ స్కూళ్లపై చర్యలు తప్పవు. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఏ వస్తువూ అమ్మకూడదు. గీత దాటితే ఉపేక్షించేది లేదు.
- సోమిరెడ్డి, హైదరాబాద్ డీఈఓ
యూనిఫాంలపైనా...
ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు యూనిఫాంలూ కాసులు కురిపిస్తున్నాయి. పాఠశాలల్లో నేరుగా యూనిఫాంలు విక్రయిస్తే అధికారులతో ఇబ్బంది ఎదురవుతుందని భావించిన యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. స్కూల్ ఉన్న సమీప ప్రాంతంలోనే ఓ వ స్త్ర దుకాణంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. తమ యూనిఫారాలు అక్కడే లభించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడే కొనుగోలు చేసేలా చూస్తున్నాయి. దీనిపై వస్త్ర దుకాణాల నుంచి కమీషన్ల రూపంలో భారీగా వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.