పేద తల్లులు... పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి | Amma Odi Scheme for the all the Poor mothers in the state | Sakshi

పేద తల్లులు... పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి

Published Mon, Jun 24 2019 3:59 AM | Last Updated on Mon, Jun 24 2019 8:05 AM

Amma Odi Scheme for the all the Poor mothers in the state  - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతి పేద తల్లి పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి కొద్ది రోజులుగా భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నింటికీ తెరదించుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఈ ప్రకటన చేసింది. ‘అమ్మ ఒడి’ విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావులేదని పేర్కొంది.

ఈ పథకం అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంగా, ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా వివరించారని తెలిపింది. బడిబాట, అక్షరాభ్యాసం కార్యక్రమాల సందర్భంగా, ఎడ్యుకేషన్‌ రివ్యూ మీటింగ్‌లోనూ స్పష్టీకరించారని వివరించింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా అందరికీ అమ్మ ఒడి వర్తిస్తుందని వైఎస్‌ జగన్‌ తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో తెలిపారని, ఈ దృష్ట్యా పేద పిల్లలు చదివేది ప్రభుత్వ లేదా ప్రవేట్‌ పాఠశాల అయినా అమ్మ ఒడి వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

పేదల పిల్లలందరూ చదువుకోవాలి
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటి స్థితిగతుల్ని, రూపురేఖల్ని మారుస్తామని ముఖ్యమంత్రి ఇంతకు ముందే ప్రకటించారని, ప్రభుత్వ బడుల్ని మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలూ త్వరలో ప్రారంభం కాబోతున్నాయని సీఎం కార్యాలయం వివరించింది. ‘దేశంలో నిరక్షరాస్యుల సగటు 26 శాతం ఉంటే ఏపీలో 33 శాతం ఉంది. అంటే మన రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 33 మంది చదువుకోని వారే. అక్షరాస్యత విషయంలో మన రాష్ట్రం దేశంలో అట్టడుగున ఉంది.

ఈ పరిస్థితిని మార్చి, పేదల పిల్లల్లో ప్రతి ఒక్కరూ బడికి వెళ్లి చదువుకోవాలన్న ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావు లేదు’ అని స్పష్టం చేసింది. ఎన్నికల హామీల మేరకు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలతో సంవత్సరానికి రూ.15 వేలు అందిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మరో ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement