విద్యార్థులకు త్వరలో ఆన్‌లైన్‌ టీసీలు! | Online TC soon for students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు త్వరలో ఆన్‌లైన్‌ టీసీలు!

Published Tue, Jun 18 2019 1:51 AM | Last Updated on Tue, Jun 18 2019 1:51 AM

Online TC soon for students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్ల(టీసీ) విధానం అమల్లోకి తెచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అది కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. తద్వారా ఒక్కసారి ఎన్‌రోల్‌ అయిన విద్యార్థి ఎక్కడికి పోతున్నారు? బడి మానేస్తున్నారా? రాష్ట్రంలో మరెక్కడైనా చేరుతున్నారా? అన్న సమగ్ర వివరాలను క్రోడీకరించవచ్చన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతోంది.

ఒకవేళ విద్యార్థి బడి మానేస్తే గుర్తించేందుకు ఇప్పటికే చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టం ఉంది. అయితే దానిని మరింత పకడ్బందీగా అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. చైల్డ్‌ ట్రాకింగ్‌లో భాగంగానే డిజిటల్‌ టీసీల విధానాన్ని తీసుకురావడం ద్వారా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లో తేడాలు లేకుండా చూడవచ్చని, విద్యార్థులు లేకపోయినా ఎక్కువమంది ఉన్నట్లు చూపించే తప్పిదాలకు చెక్‌ పెట్టవచ్చన్న ఆలోచనలతో ఈ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,834 ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, మైనార్టీ, మదర్సా విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిల్లో 65,29,072 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 52 సెంట్రల్‌ స్కూళ్లు ఉండగా, వాటిల్లో 36,594 మంది విద్యార్థులు చదువుతున్నారు.  

ఇబ్బందులు తొలగించేందుకే.. 
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని స్కూళ్లు అన్ని యూడైస్‌తో అనుసంధానమై ఉన్నాయి. దీంతో వీటి పరిధిలో విద్యార్థుల ట్రాన్స్‌ఫర్‌ ఒక స్కూల్‌ నుంచి మరో స్కూల్‌కు, ఒక మేనేజ్‌మెంట్‌ నుంచి మరో మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేసే క్రమంలో ఆ విద్యార్థి టీసీతోపాటు ఇతర సర్టిఫికెట్లను ఆ విద్యార్థి స్కూల్‌కు పంపిస్తారు. మరోవైపు సెంట్రల్‌ స్కూళ్లు కూడా యూడైస్‌తో అనుసంధానం అయి ఉన్నప్పటికీ వాటిల్లో చేరాలనుకునే విద్యార్థులకు మాత్రం డిజిటల్‌ సంతకంతో కూడిన సర్టిఫికెట్లను అందజేస్తారు. తాజా విధానంతో సెంట్రల్‌ స్కూళ్లలో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడవచ్చని భావిస్తోంది.

మరోవైపు పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు కూడా డిజిటల్‌ టీసీ, ఇతర సర్టిఫికెట్లను ఇవ్వడం ద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అన్నింటిలో కంప్యూటర్లు వినియోగంలో ఉన్నాయి. వాటిల్లో ఈ వి«ధానం అమలుకు ఎలాంటి ఇబ్బంది లేదని పాఠశాల విద్యా కమిషనర్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎలా అమలు చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నామని, వాటిల్లో అమలుకు కంప్యూటర్లు కొనుగోలు చేయాలా? ఎలా ముందుకు సాగాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement