సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు | AP CM YS Jagan Review Meeting On Education System | Sakshi
Sakshi News home page

విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Published Fri, Dec 27 2019 6:59 PM | Last Updated on Fri, Dec 27 2019 7:16 PM

AP CM YS Jagan Review Meeting On Education System - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో విద్యావ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తామన్న హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అమ్మఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం వాటి అమలుపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణలపై  సీఎం జగన్‌ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లలోనే నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. అదే రోజున తల్లిదండ్రులతో ఏర్పడ్డ విద్యాకమిటీలను పిలిపించి ఘనంగా అమ్మ ఒడిని నిర్వహించాలని సీఎం చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ మరియు మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు, ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ మరియు మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య పాల్గొన్నారు. 

ఆ మూడు విషయాల్లో మార్పు కనిపించాలి..
సమావేశంలో సీఎం జగన్‌ అధికారులతో మాట్లాడుతూ.. ‘ప్రజలు మననుంచి నాణ్యమైన విద్యను ఆశిస్తున్నారు. పాఠ్యప్రణాళికలో నాణ్యతను కోరుకుంటున్నారు. ప్రైవేటు కాలేజీలు, పాఠశాలల్లో ఫీజులు షాక్‌ కొట్టే రీతిలో ఉన్నాయి. ఫీజులు వెంటనే తగ్గించాలి. ఈ మూడు విషయాల్లో మార్పు ప్రస్ఫుటంగా కనిపించాలి. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి. దీని కొరకు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి. ప్రభుత్వ స్కూళ్లు తెలుగు మీడియంలో ఉన్నందువల్ల పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం చదువులు కోసం విపరీతంగా ఖర్చుపెడుతున్నారు. పిల్లలకు మనం ఇంగ్లిషు మీడియంలో ఉచితంగా చదువులు చెప్పిద్దామని ప్రయత్నాలు చేస్తున్నాం. దీన్ని విపరీతంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. ఇంగ్లీషు మీడియంను పేదవాళ్ల దగ్గరకు తీసుకెళ్తేనే ఈ వ్యవస్థలో మార్పులు వస్తాయి. 

సకాలంలో ఫీజు రియింబర్స్‌మెంట్‌..
ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే చాలామంది తట్టుకోలేకపోతున్నారు. మద్యం దుకాణాలు, బార్లు తగ్గిస్తుంటే... దానిపైనా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియంలో చదువులు చెప్పిస్తున్నామంటే దానిపైనా విమర్శలు చేస్తున్నారు. వారి మనవళ్లు, పిల్లలు ఏ మీడియంలో చదువుకుంటున్నారు?. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లలో ఫీజులను నియంత్రించేందుకు ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలి. సమాజం పట్ల అంకిత భావంలేకుండా చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలుంటాయన్న సందేశం పోవాలి. పేదల పిల్లలు మంచి కాలేజీల్లో చదువుకోవాలి. ప్రభుత్వం నుంచి ఫీజు రియింబర్స్‌మెంట్‌ కింద ఇవ్వాల్సిన డబ్బులను సకాలంలో ఇస్తాం. ప్రమాణాలు, నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాల్సిందే. ఉల్లంఘనలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటే వాటిని ప్రచారం చేయండి. దీనివల్ల ఇతరులు ఆ తప్పులు చేయకుండా ఉంటారు. పెద్దపెద్ద విద్యాసంస్థల్లో కూడా పేదలకు అవకాశాలు లభించాలి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌పై దృష్టిపెట్టాలి. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలను ప్రభుత్వపరమైన కార్యక్రమాలకు వాడుకోవాలని, టీచర్లను విద్యాబోధనకే వినియోగించుకోవాలి’ అని సీఎం సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement