టెన్త్‌ విద్యార్థులకు వయసు తిప్పలు | Age Problems To Tenth students | Sakshi
Sakshi News home page

టెన్త్‌ విద్యార్థులకు వయసు తిప్పలు

Published Tue, Feb 11 2020 2:08 AM | Last Updated on Tue, Feb 11 2020 2:08 AM

Age Problems To Tenth students  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తల్లిదండ్రులకు తెలియకో, టీచర్ల అలసత్వమో.. నిర్ధేశిత వయసు రాకముందే బడిలో చేర్పించే ఆతృత వల్లనో... వెరసి పదో తరగతి పరీక్షల సమయం వచ్చేసరికి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పడం లేదు. టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు అవసరమైన నిర్ధేశిత వయసు లేకపోవడంతో వారిని పరీక్షలకు అనుమతించలేని పరిస్థితి వస్తోంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ప్రధానోపాధ్యాయులు, డీఈవో కార్యాలయాలు, ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్సెస్సీ బోర్డు) చుట్టూ తిరిగి అనుమతులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఏటా ఇలాంటి వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. ఈసారి మాత్రం ఆ సంఖ్య 1,394 ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. వారందరికి అనుమతులు లభించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. 

వేయి మందికిపైగా 6రోజులు తక్కువున్న వారే
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2019 ఆగస్టు 30వ తేదీ నాటికి 14 ఏళ్లు పూర్తయితేనే ఆ విద్యార్థి 2020 మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు అర్హులు. ఆ నిబంధనల ప్రకారం వయసు తక్కువ ఉన్న పిల్లలు రాష్ట్రంలో 1,394 మంది ఉన్నారు. వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏడాదిన్నర వరకు ప్రధానోపాధ్యాయుడు, రెండేళ్లు తక్కువగా ఉంటే ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ అనుమతి పొందాల్సి ఉంటుంది. అదే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఏడాదిన్నర తక్కువగా ఉంటే డీఈవో, రెండేళ్లు తక్కువగా ఉంటే ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ నుంచి అనుమతి పొందాలి.

రెండేళ్లకంటే ఎక్కువ మినహాయింపు పొందాలంటే విద్యాశాఖ కార్యదర్శి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఇలా ప్రత్యేక అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికంగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. అందులోనూ గరిష్టంగా 24 రోజులు మాత్రమే తక్కువ ఉన్న వారు ఉన్నారు. అందులో 1 నుంచి 6 రోజులు తక్కువ ఉన్న వారు 1000 మందికిపైగా ఉండగా, మిగతా వారు 7 నుంచి 27 రోజులు తక్కువ ఉన్నవారు ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం లెక్కలు వేసింది. వారందరిని కూడా పరీక్షలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement