tenth exams
-
10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 51 ఏళ్ల మహిళ
అన్నానగర్(చెన్నై): కరూర్‌లో 41 ఏళ్ల మహిళ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. వివరాలు.. కరూర్ జిల్లా కృష్ణరాయపురం ప్రాంతానికి చెందిన రహీలా భాను (51). ఈమె పూవంబాడి పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో వంటపని చేస్తోంది. 1989లో 9వ తరగతి పూర్తి చేసిన ఈమె కుటుంబ పరిస్థితుల కారణంగా పాఠశాలకు వెళ్లలేదు. ఈ క్రమంలో 10వ తరగతి ఉత్తీర్ణులైతేనే న్యూట్రిషన్ ఆర్గనైజర్ పోస్టుకు అర్హత సాధించే అవకాశం ఉన్నందున 10వ తరగతి పరీక్షలు హాజరు కావాలని నిర్ణయించుకుని గత ఏప్రిల్‌లో జరిగిన 10వ తరగతి సాధారణ పరీక్షలకు ప్రత్యేక అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుంది. ఈమె ఇంగ్లీషు, సోషల్‌సైన్స్‌లో ఉత్తీర్ణత సాధించింది. ఆపై తాను ఉత్తీర్ణత సాధించని తమిళం, గణితం, సైన్స్ సబ్జెక్టులకు జూన్‌లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు చేసిపరీక్ష రాసింది. ఈ క్రమంలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇందులో రహీలా భాను తమిళం, గణితం, సైన్స్ సబ్టెక్టుల్లో ఉత్తీర్ణులయ్యారు. చదవండి Cockroach Found In IRCTC Meals: వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం.. -
టెన్త్ పేపర్ లీక్ కేసు.. డిబార్ అయిన విద్యార్థికి ఊరట
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పేపర్ లీకేజీ ఆరోపణలతో డిబార్ అయిన టెన్త్ విద్యార్థి హరీష్‌కు ఊరట లభించింది. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది కాగా హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ పేపర్ లీక్ చేసిన ఆరోపణలతో అధికారులు హరీష్‌ను డిబార్ చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కొడుకు హరీష్ హిందీ పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్ లాక్కున్నారని తెలిపారు. కమలాపూర్‌లో నమోదైన ఎఫ్ఐఆర్లో కూడా హరీష్ పేరు ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినా అధికారులు శుక్రవారం నాటి పరీక్షను రాసేందుకు అనుమంతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును రాజకీయాలకు బలి చేశారని ఆరోపిస్తూ.. హరీష్‌ను టెన్త్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. విద్యార్థిని మిగతా పరీక్షలు రాసేలా అనుమతివ్వాలని అధికారులను ఆదేశించింది. చదవండి: టెన్త్ పేపర్ లీక్ కేసు.. ఎగ్జామ్ సెంటర్లో జరిగింది ఇదేనా..? -
హిందీ‘టెన్’షన్
సాక్షిప్రతినిధి, వరంగల్: టెన్త్ హిందీ ప్రశ్నపత్రం కూడా అవుటైంది. టెన్త్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే తాండూరులో తెలుగు ప్రశ్నపత్రం లీకవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కాగా.. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే, రెండోరోజే హిందీ పేపర్ కూడా బయటకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. మంగళవారం పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాట్సాప్ గ్రూపులలో హిందీ ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టడం ప్రారంభమయ్యింది. ఈ మేరకు అందిన సమాచారంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే ఉమ్మడి వరంగల్ కలెక్టర్లు, పోలీసు కమిషనర్, ఎస్పీలు, డీఈవోలతో మాట్లాడారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో పోలీసులు సోషల్ మీడియాలో వైరలైన పోస్టింగ్‌ల ఆధారంగా దర్యాప్తు జరిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చినట్లు తేల్చారు. ఓ మైనర్ బాలుడితో పాటు నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురుని అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు. కమలాపూర్ మండలానికి చెందిన ఓ బాలుడు (16) తన స్నేహితుడికి చిట్టీలు అందించడం కోసం ఈ పని చేశాడని, దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి పరీక్ష రాసే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసేలా ç‘పేపర్ లీక్’ అంటూ ప్రచారం చేశారని చెప్పారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గోడెక్కి ఫొటో తీసి.. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష రాస్తున్న తన మిత్రుడికి సహాయం చేసేందుకు కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్ష కేంద్రంలోని చెట్టు సహాయంతో గోడెక్కాడు. మొదటి అంతస్తులోని మూడవ సంబర్ గది కిటికి పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకుని తన సెల్ఫోన్లో 9.45కు ఫొటో తీశాడు. 9.46కు మౌటం శివ గణేష్‌కు వాట్సాప్‌లో పంపాడు. మౌటం శివ గణేష్ ఉదయం 9.59 గంటలకు తన సెల్‌ఫోన్ ద్వారా 31 మంది సభ్యులున్న ఎస్సెస్సీ 2019–20 అనే వాట్సాప్ గ్రూపులో ఫార్వర్డు చేశాడు. ఆ గ్రూపులో ఉన్న గుండెబోయిన మహేశ్ అనే మాజీ రిపోర్టర్ (పస్తుతం కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్) దూడం ప్రశాంత్ (మాజీ జర్నలిస్టు)కు పంపించాడు. అతను ‘బ్రేకింగ్ న్యూస్.. రెండోరోజు పదో తరగతి పేపర్ లీక్..’ అంటూ 10.46 కల్లా హిందీ ప్రశ్నపత్రం ఓ జర్నలిస్టుల గ్రూపుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి, మరో 110 మందికి పోస్టు చేశాడు. చివరికిది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఎక్కడినుంచి పేపర్ లీకయ్యిందో స్పష్టత లేకపోవడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. సైబర్‌క్రైం పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయమై ఆరా తీశారు. తీగలాగితే డొంక కదిలినట్లు ఒకరి తర్వాత మరొకరికి పోస్టయిన విషయం వెలుగులోకి వచ్చింది. అందరికీ నోటీసులు ఇస్తాం: సీపీ బాలుడితో పాటు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని, మైనర్‌ను జువైనల్ హోంకు, శివ గణేష్, ప్రశాంత్‌ను రిమాండ్‌కు పంపినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. మహేశ్ పరారీలో ఉన్నాడని, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తామని తెలిపారు. ఎప్పుడైనా పరీక్షకు ముందే పేపర్ బయటకు వస్తే దాన్ని లీక్ అంటామని.. పరీక్ష కేంద్రంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చాక బయటకు వస్తే కాపీయింగ్ అంటామని కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇలావుండగా పేపర్ అవుట్ కలకలం సృష్టించడంతో స్నేహితుడి కోసం బాలుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. -
టెన్త్ పేపర్ అవుట్
సాక్షి, హైదరాబాద్/ వికారాబాద్/ తాండూరు: టెన్త్ పరీక్షల తొలిరోజు.. పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. ఓ పాఠశాలలోని ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా మరో పాఠశాలలోని టీచర్‌కు పంపాడు. అతను ఇతర గ్రూపులకు పంపడంతో విషయం వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఇద్దరు ఉపాధ్యాయులు సహా నలుగురిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రైవేట్ స్కూళ్ల పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు విద్యాశాఖ ఆదేశించింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, వికారాబాద్ కలెక్టర్ వివరాలు వెల్లడించారు. అసలేం జరిగింది? పదవ తరగతి పరీక్షలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు తెలుగు పరీక్ష కోసం విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 9.30 నుంచి 12.30 గంటల వరకు జరిగే పరీక్ష కోసం 9.30కి ఇన్విజిలేటర్లు వారికి ప్రశ్నపత్రాలు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల–1లోని 5వ నంబర్ పరీక్ష హాల్లో కూడా అలాగే ఇచ్చారు. ఆ గదిలో శ్రీనివాసులు ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్నారు. అయితే అదే పాఠశాలలో రిలీవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బందెప్ప రూమ్ నంబర్ ఐదుకు వచ్చాడు. గైరుహాజరైన ఓ విద్యార్థికి చెందిన క్వశ్చన్ పేపర్ తీసుకుని శ్రీనివాసులుకు తెలియకుండా తన సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నాడు. తొలుత పొరపాటున ఓ వాట్సాప్ గ్రూప్‌కు పంపి వెంటనే డిలిట్ చేశాడు. 9.37 సమయంలో చెంగోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సమ్మప్పకు వాట్సాప్ ద్వారా పంపాడు. అతని ద్వారా ప్రశ్నపత్రం వేరే ఇతర వాట్సాప్ గ్రూపులకు, 11: 30 ప్రాంతంలో ఓ మీడియా వాట్సాప్ గ్రూప్‌కు వెళ్లింది. విలేకరులు కొందరు మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు అలాంటిదేమీ లేదని అన్నారు. కానీ పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థుల వద్ద ఉన్న పేపర్‌తో పోల్చి చూస్తే నిజమేనని తేలింది. దీంతో వారు అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రిమినల్ కేసుల నమోదు ఈ వ్యవహారంలో నలుగురిని సస్పెండ్ చేశామని, వీరిలో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారిస్తున్నామని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం సాయంత్రం విలేకరులకు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, విద్యాశాఖ అధికారులు, అదనపు కలెక్టర్‌ను రంగంలోకి దింపామని తెలిపారు. విచారణలో తాండూరు–1 స్కూల్ నుంచి పేపర్ లీకైనట్లు గుర్తించామన్నారు. పేపర్ ఫోటోలు తీసిన బందెప్పతో పాటు అతను పేపర్ సెండ్ చేసిన సమ్మప్పను విధుల నుంచి తొలగించి, క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించిన సెంటర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ శివకుమార్ (ముద్దాయిపేట, యాలాల మండలం), చీఫ్ సూపరింటెండెంట్ కె.గోపాల్ (తాండూరు హైస్కూల్–1)ను కూడా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రశ్నపత్రాన్ని ఫొటోలు తీసిన విషయాన్ని గమనించడంలో విఫలమైన శ్రీనివాస్‌ను ఇన్విజిలేషన్ విధుల నుంచి తొలగించటంతో పాటు అతనిపై కూడా తదుపరి విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించామని తెలిపారు. లీకైన పేపర్‌ను ఉపయోగించి మాస్ కాపీయింగ్ చేసినట్లుగా ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించలేదని కలెక్టర్ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్ ఫొటోలు తీసి మరో ఉపాధ్యాయుడికి పంపినప్పటికీ.. విద్యార్థులు ఆ పేపర్ ద్వారా కాపీయింగ్‌కు పాల్పడినట్టు తేలలేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రం బయటకు వాస్తవమే.. టెన్త్ ప్రశ్నపత్రం లీక్‌పై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన స్పందించారు. తాండూరు హైస్కూల్–1 నుంచి ప్రశ్నపత్రం మరో టీచర్‌కు వెళ్ళిన మాట వాస్తవమేనని ఆమె తెలిపారు. అయితే పరీక్ష సమయంలో ఇతరులెవరూ లోపలికి రాలేదని, లోపలి నుంచి ఎవరూ బయటకు వెళ్ళలేదని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపారని, బాధ్యులపై చర్యలు తీసుకున్నారని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. మిగతా పరీక్షలన్నీ యధాతథంగా జరుగుతాయని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లతో మిలాఖత్? ప్రశ్నపత్రం బయటకు వెళ్లిన వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు కూడా పరీక్ష హాల్లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్ళడం నిషేధం. అలాంటిది ఓ ఇన్విజిలేటర్ ఎలా తీసుకెళ్ళాడనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. అయితే అతని సెల్‌ఫోన్ ద్వారా వెళ్ళిన ప్రశ్నపత్రం ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులకు కూడా వెళ్ళినట్టు అనుమానిస్తున్న పోలీసు వర్గాలు ఈ దిశగా విచారణ చేపట్టాయి. ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి యత్నం టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీపై నిరసన వ్యక్తం చేస్తూ ఎన్ఎస్యూఐ ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి ప్రయత్నించింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్టేషన్‌కు తరలించారు. విద్యాశాఖ కార్యాలయం ఎదుట కూడా ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లీకేజీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ నేతలు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గతంలోనూ వివాదాస్పదుడే.. తాండూరు నంబర్–1 పాఠశాలలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న బందెప్పకు వివాదాస్పదుడిగా పేరుంది. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు స్కూల్ ఆవరణలోనే దేహశుద్ధి చేశారు. అప్పట్లో అతనిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. తాజాగా ప్రశ్నప్రతం లీక్ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
Andhra Pradesh: టెన్త్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్నారు. 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అన్ని కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో ఫర్నీచర్, మంచి నీరు వంటి సదుపాయాలు కల్పించామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా విద్యార్థుల రాకపోకలకు సమస్య లేకుండా ఆర్టీసీ యాజమాన్యం తగినన్ని బస్సులు నడుపుతోందన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో టెన్త్ విద్యార్థులు హాల్ టికెట్ చూపించి, ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఏడు మాధ్యమాల్లో పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ మాధ్యమాల్లో రోజు విడిచి రోజు ఆరు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ► తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మేథ్స్, సోషల్ స్టడీస్ పరీక్షలకు 24 పేజీల బుక్లెట్, ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్, సంస్కృతం, వృత్తి విద్యా కోర్సులకు 12 పేజీల బుక్లెట్లను అందిస్తారు. సైన్స్‌కు ఒకే ప్రశ్నపత్రం, రెండు ఆన్సర్ షీట్లు ఉంటాయి. ఆయా ప్రశ్నలకు నిర్దేశిత బుక్‌లెట్‌లోనే సమాధానాలు రాయాలి. ► పేపర్ లీక్ అనేది లేకుండా పక్కాగా నిఘా ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా, ఏదైనా అవాంఛనీయ ఘటన, లీక్ జరిగితే అది ఎక్కడ జరిగిందో వెంటనే కనిపెట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ► అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణకు 43 వేల సిబ్బందిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ తదితర విభాగాల సహకారం తీసుకుంటున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 104 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాలనూ నో ఫోన్ జోన్లుగా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు సహా ఏ ఒక్కరూ మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లరాదు. ► విద్యార్థులు కూడా వాచీలు, ఫోన్లు ఇతర డిజిటల్ వస్తువులను తీసుకెళ్లకూడదు. పెన్ను, పెన్సిల్, ఎరేజర్ స్కేలు వంటివి తీసుకెళ్లవచ్చు. విద్యార్థులకు ఇచ్చిన ఓఎమ్మార్ షీట్లో వివరాలు తనవో కాదో సరిచూసుకున్న తర్వాతే సమాధానాలు రాయాలి. ఏదైనా తేడా ఉంటే ఇన్విజిలేటర్‌కు చెప్పి సరైనది పొందాలి. ఓఎమ్మార్ షీట్‌ను సమాధానాల బుక్‌లెట్‌కు పిన్ చేయాలి. ► ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. -
టెన్షన్ లేకుండా టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సన్నద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను కోరారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని, వారికి అసౌకర్యం కలగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చే నెల 3 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పాఠశాల విద్య సంచాలకురాలు దేవసేనతో కలసి మంత్రి సబిత బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షల్లో విద్యార్థులు హాజరవుతున్న పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారని, వీరి కోసం 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించే ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్ష పేపర్లను 11 నుంచి 6 కు కుదించామని, సైన్స్ పరీక్ష రోజున భౌతిక శాస్త్రం, జీవ స్త్రాస్తానికి సంబంధించి ప్రశ్న పత్రాలను విడివిడిగా అందిస్తామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం చేసే సౌకర్యం కూడా కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు. -
Telangana: ‘టెన్త్’కు కఠిన పరీక్ష!
‘పరీక్షల’పై ప్రశ్నలు, ఆందోళనలివీ.. ► టెన్త్ పరీక్షల్లో గతంలో ఇచ్చినట్టుగా ఈసారి రెండు, మూడు మార్కుల సూక్ష్మ ప్రశ్నలకు చాయిస్ ఇవ్వలేదు. ఆరు చొప్పున ప్రశ్నలిచ్చి అన్నీ రాయాలన్నారు. ఏ ఒక్క ప్రశ్న తెలియకపోయినా విద్యార్థి ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. అన్ని చాప్టర్లపై పట్టులేనప్పుడు దీనితో చాలా నష్టం. ► వ్యాసరూప ప్రశ్నల తీరును కఠినం చేశారు. సెక్షన్ మాదిరి కాకుండా, గ్రూపు మాదిరి చాయిస్ ఇవ్వడం విద్యార్థులకు ఇబ్బందేనని నిపుణులు చెప్తున్నారు. సెక్షన్ మాదిరిగా అంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి అందులోంచి ఆరింటికి సమాధానాలు రాయాలి. దీనిలో విద్యార్థులకు చాయిస్ ఎక్కువగా ఉండి, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఒక్కో గ్రూప్‌లో రెండు ప్రశ్నల చొప్పున ఆరు గ్రూపులుగా ప్రశ్నలు ఇచ్చారు. ప్రతి గ్రూప్‌లోని రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి. ఆ రెండింటికి సమాధానం తెలియకపోతే.. ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. మిగతా గ్రూపుల్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగినా ప్రయోజనం ఉండదు. ► పరీక్ష సమయం మొత్తం 3 గంటలు.. ఇందులో ఆరు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే రెండు గంటల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ముందే మిగతా ప్రశ్నలకు జవాబులు రాస్తే.. వ్యాసరూప ప్రశ్నలకు సమయం సరిపోదని అంటున్నారు. అందువల్ల వ్యాసరూప ప్రశ్నలను నాలుగుకు తగ్గించాలని సూచిస్తున్నారు. ► సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్/కెమిస్ట్రీ ఒకటి.. బయాలజీ మరొకటిగా పేపర్లు ఉంటాయి. రెండింటి ప్రిపరేషన్ వేర్వేరుగా ఉంటుంది. వీటన్నింటినీ ఒకేరోజు, ఒకే సమయంలో పెట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రశ్నపత్రంలో చాయిస్ పెంచాలి ప్రశ్నపత్రంలో జవాబుల చాయిస్ పెంచాలి. అన్ని విభాగాల్లో కనీసం 30 శాతమైనా ఇవ్వాలి. విరామం లేకుండా పరీక్షల నిర్వహణ అశాస్త్రీయం. తక్షణమే పరీక్షల తీరుపై అధికారులు సమీక్షించాలి. – రాజా భానుచంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు సాక్షి, హైదరాబాద్: ఎస్సెస్సీ పరీక్షల చుట్టూ వివాదం ముసురుతోంది. పరీక్ష విధానం, నిర్వహణ, సిలబస్, చాయిస్‌లలో చేసిన మార్పులపై పునః సమీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పరిశీలించిన ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ అభ్యంతరాలు తెలిపాయి. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోకుంటే.. విద్యార్థులకు ఇబ్బంది తప్పదని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ అంశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుండటంతో.. విద్యాశాఖ ఉన్నతాధికారులు డోలాయమానంలో పడ్డారు. మోడల్ పేపర్లను చూసి.. ఇటీవల టెన్త్ పరీక్షల టైం టేబుల్ విడుదల చేసిన ఎస్సెస్సీ బోర్డు పరీక్షల మోడల్ పేపర్లనూ ఆన్లైన్లో పెట్టింది. ఈ మోడల్ పేపర్లను బట్టి పరీక్ష విధానం కఠినంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు నిర్ధారణకు వచ్చాయి. అసలే కోవిడ్ వల్ల రెండేళ్లుగా అభ్యసన నష్టాలు ఉన్నప్పుడు పరీక్షను కఠినతరం చేస్తే విద్యార్థులకు నష్టమని అంటున్నాయి. టెన్త్ పరీక్షలు రాయబోయే దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల్లో.. 2 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లవారు ఉంటారని.. వీరిలో 1.2 లక్షల మంది కనీస స్థాయిలో, మరో 45 వేల మంది అంతకన్నా తక్కువగా సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నట్టు ఇటీవలి అంచనాల్లో వెల్లడైందని పేర్కొంటున్నాయి. కోవిడ్ పరిణామాలతో ప్రైవేటు విద్యార్థుల్లోనూ ప్రమాణాలు తగ్గాయని.. ఇలాంటప్పుడు క్లిష్టమైన ప్రశ్నలు, సంక్లిష్టమైన సమాధాన రూపం ఉండటం సరికాదని స్పష్టం చేస్తున్నాయి. గ్యాప్ ఇవ్వాల్సిందే.. సీబీఎస్సీ సిలబస్‌తో కొనసాగే కేంద్ర విద్యాసంస్థల్లో ప్రతీ పరీక్షకు మధ్య సన్నద్ధతకు సెలవు ఉంటుంది. మన రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డ్ మాత్రం ఈ విధానాన్ని పాటించ లేదు. ప్రభుత్వ సెలవు దినాలు మినహా ప్రతీ సబ్జెక్టు పరీక్షల మధ్య విరామం ఇవ్వలేదు. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లుగా పరీక్షలు (40 మార్కుల చొప్పున) నిర్వహించినప్పుడు మధ్యలో ఒకరోజు విరామం ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 80 మార్కులతో ఒకే పరీక్ష నిర్వహించనున్నా మధ్యలో విరామం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ విషయాన్ని విద్యామంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కోవిడ్ నష్టాలున్న కాలం కాబట్టి విరామం, ఇతర వెసులుబాట్లు అమలు చేయాలని కోరినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. చాయిస్ పెంచాలి.. ఒకే పేపర్‌గా పరీక్ష నిర్వహిస్తుండటం వల్ల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. ప్రశ్నపత్రంలోని ఒకటి, రెండు సెక్షన్లలో కూడా చాయిస్ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 2 మార్కులు, 3 మార్కుల ప్రశ్నలకు కనీసం 30శాతం చాయిస్ ఇవ్వాలని అంటున్నారు. మూడో సెక్షన్లో వ్యాస రూప ప్రశ్నలను తగ్గించాలని.. ఫిజిక్స్/కెమిస్ట్రీ, బయాలజీ పరీక్షలు ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని సూచిస్తున్నారు. ఎస్సెస్సీ బోర్డు ఈ సూచనలు పాటించకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ముందుగా బోధన ప్రారంభం కావడం, రివిజన్ రెండు సార్లు చేయడం వల్ల తేలికగా పరీక్షలు రాసే వీలు ఉందని అంటున్నారు. అదే ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికీ సిలబస్ పూర్తి కాలేదని, ఉపాధ్యాయుల కొరత ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. పరీక్షల తీరులో మార్పులు చేయాలి రెండేళ్లుగా కోవిడ్ వల్ల తరగతులే సరిగా జరగలేదు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రశ్నపత్రాలు ఉంటే మంచిది. కానీ మోడల్ పేపర్లు చూస్తే చాలా కఠి నంగా ఉన్నాయి. పరీక్షలపై సంఘాల నేతలతో కలిసి చర్చించి, మార్పులు చేయాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ వ్యాస రూప ప్రశ్నలు తగ్గించాలి మోడల్ పేపర్లను బట్టి చూస్తే వ్యాస రూప ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. వాటిని తగ్గించాలి. భౌతిక, రసాయన శాస్త్రాలు.. జీవశాస్త్రం పేపర్లను ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలి. – బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్టీయూటీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
టెన్త్‌లో సైన్స్‌కు ఒకే పేపర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సైన్సు పరీక్ష ఇకనుంచి ఒకే పేపర్‌గా జరుగుతుంది. సైన్సులో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రాలను రెండు వేర్వేరు పేపర్లుగా కాకుండా ఒకే ప్రశ్నపత్రంతో నిర్వహించనున్నారు. ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నలను రెండు విభాగాలుగా.. ఒకే ప్రశ్నపత్రంలో ఇస్తారు. ఈ విద్యాసంవత్సరం నుంచి టెన్త్‌లో 6 పేపర్ల విధానాన్నే అనుసరిస్తున్నట్టు ప్రభుత్వం ఇంతకుముందు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) బ్లూప్రింట్లు, నమూనా ప్రశ్నపత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. బ్లూప్రింట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు గతంలో టెన్త్ పరీక్షలు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో 11 పేపర్లలో జరిగేవి. అంతర్గత మార్కులు 20 ఉండగా పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. 2016–17 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలు అంతర్గత మార్కుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో తరువాత టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను రద్దు చేసి 100 మార్కులకు నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం కరోనా సమయంలో పరీక్షల నిర్వహణకు తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో 11 పేపర్లకు బదులు పరీక్షను 7 పేపర్లకు ప్రభుత్వం కుదించింది. తెలుగు, ఇంగ్లిష్,, హిందీ, మేథ్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లను 50 మార్కుల చొప్పున రెండురోజుల పాటు నిర్వహించారు. 2022 టెన్త్ పబ్లిక్ పరీక్షలు కూడా ఇదే విధానంలో జరిగాయి. కాగా, సీసీఈ విధానంలో 4 ఫార్మేటివ్, 2 సమ్మేటివ్ పరీక్షలను నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను ఏడాదిలో నిరంతరం మూల్యాంకనం చేస్తున్నందున ఇక నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలను 7 లేదా 6 పేపర్లకు కుదించి నిర్వహించడం మంచిదని ఎస్సీఈఆర్టీ ప్రభుత్వానికి ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదనలు పంపించింది. పరిశీలించిన ప్రభుత్వం 2022–23 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు 6 పేపర్లతోనే నిర్వహించేలా జీవో–136ను ఆగస్టు 22న విడుదల చేసింది. గత ఏడాది ఏడు పేపర్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించిన సమయంలో సైన్సును ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లుగా వేర్వేరుగా నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మొత్తం పేపర్లను ఆరింటికే కుదించినందున సైన్సును రెండు పేపర్లుగా కాకుండా ఒకే పేపర్‌గా 100 మార్కుల ప్రశ్నపత్రంతో ఒకేరోజు నిర్వహించనున్నారు. పరీక్ష ఒకటే.. సమాధాన పత్రాలు రెండు ఇకనుంచి సైన్సు ఒకే పేపర్‌గా 33 ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహించనున్నారు. మొత్తం 33 ప్రశ్నలను 2 భాగాలుగా చేసి ఫిజికల్ సైన్సులో 16 ప్రశ్నలను, బయోలాజికల్ సైన్సులో 17 ప్రశ్నలను ఇవ్వనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలను వేర్వేరు బుక్లెట్లలో రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు సమాధానాలను వేర్వేరు టీచర్లు మూల్యాంకనం చేయాల్సి ఉన్నందున ఇలా రెండు సమాధానాల బుక్లెట్లను ఇవ్వనున్నారు. 25 నుంచి ఫీజుల చెల్లింపు మార్చి–2023లో నిర్వహించే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలస్య రుసుము రూ.50తో డిసెంబర్ 11 నుంచి 20 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 నుంచి 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు. -
2025 నుంచి సీబీఎస్ఈ ప్యాట్రన్‌లో టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2025 విద్యాసంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో సమూల మార్పులు రానున్నాయి. ఆ విద్యాసంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానంలో జరగనున్నాయి. రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోపాటు ఈ విద్యాసంవత్సరం 8వ తరగతి నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యాసంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ తరహాలో పాఠ్యపుస్తకాలను అందించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని ద్విభాషా (బైలింగ్యువల్) విధానంలో ముద్రించి ఇచ్చారు. ఈ విద్యార్థులు 2025లో టెన్త్ పబ్లిక్ పరీక్షలను రాయనున్నారు. వీటిని సీబీఎస్ఈ ప్యాట్రన్‌లో నిర్వహించనున్నారు. ఆ తరువాత నుంచి వచ్చే బ్యాచ్‌ల విద్యార్థులు సీబీఎస్ఈ ప్యాట్రన్‌లోనే అభ్యసనం సాగించనున్నందున వారికి పరీక్షలు కూడా అదే విధానంలో నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2022–23, 2023–24 విద్యాసంవత్సరపు విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహా పరీక్షలు ఉంటాయి. ఆతరువాత నుంచి పూర్తిగా సీబీఎస్ఈ విధానంలోనే పరీక్షలు కొనసాగనున్నాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులు తప్పనిసరి ప్రస్తుతం ఎస్సెస్సీ బోర్డు ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్ పరీక్షలను.. అంతర్గత మార్కులు 20 కలపకుండా నేరుగా 100 మార్కులకు నిర్వహిస్తున్నారు. సీబీఎస్ఈ విధానంలో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించి మిగిలిన 20 అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సమగ్ర నిరంతర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్, కంటిన్యూ ఇవాల్యుయేషన్ – సీసీఈ) విధానం ప్రకారం గతంలో ఎస్సెస్సీ పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండేవి. అంతర్గత ప్రాజెక్టులకు 20 మార్కులు, పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. అయితే అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా వ్యవహరిస్తూ తమ విద్యార్థులకు 20కి 20 మార్కులు వేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గతంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నుంచి అంతర్గత మార్కులను తొలగించింది. పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తోంది. సీబీఎస్ఈ విధానాన్ని అనుసరించనున్నందున 2025 నుంచి జరిగే టెన్త్ పరీక్షల్లో ఎస్సెస్సీ బోర్డు కూడా ఆ తరహాలోనే అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుందని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2022–23)లో కూడా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. తొలివిడతగా 1,092 స్కూళ్లకు రానున్న సీబీఎస్ఈ గుర్తింపు రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ హైస్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపునకోసం విద్యాశాఖ ఇప్పటికే ఆ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1,092 స్కూళ్లకు తొలివిడతగా ఈ గుర్తింపు రానుంది. ఈ స్కూళ్ల విద్యార్థులకు సీబీఎస్ఈ విధానాలను అనుసరించి పరీక్షలు ఉంటాయి. నేరుగా ఆ బోర్డే ఈ స్కూళ్ల విద్యార్థులకు పరీక్షలు పెడుతుంది. సీబీఎస్ఈ గుర్తింపులేకున్నా దాని సిలబస్, ప్యాట్రన్‌ను మిగిలిన స్కూళ్లలో అనుసరించనున్నందున ఆ స్కూళ్ల పదోతరగతి విద్యార్థులకు మాత్రం ఎస్సెస్సీ బోర్డు ద్వారా.. సీబీఎస్ఈ ప్యాట్రన్‌లోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. -
ఏపీ: పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు
-
పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: పదో తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్ఈ సిలబస్ నేపథ్యంలో 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. చదవండి: సాఫ్ట్వేర్ లవ్‌స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ.. -
పదిలో ఆరు.. ఇంటర్లో ఏడు
సాక్షి,శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) ఆధ్వర్యంలో అభ్యసిస్తున్న పది, ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మెరుగైన ఉత్తీర్ణతను సాధించారు. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాను టెన్త్‌లో ఆరోస్థానం, ఇంటర్లో ఏడో స్థానంలో నిలిపారు. జిల్లా ఫలితాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ గార పగడాలమ్మ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ డి.సూరపునాయుడు విడుదల చేశారు. పదో తరగతిలో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు 41.82 శాతం ఉత్తీర్ణతను సాధించి రాష్ట్రంలో ఆరోస్థానంలో నిలిచారు. అలాగే ఇంటర్మీడియెట్ విద్యార్థులు 56.37 శాతం ఉత్తీర్ణతను సాధించి ఏడో స్థానంలో నిలి,చారు. జిల్లా నుంచి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలకు 1277 మంది విద్యార్థులు హాజరుకాగా 534 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్ పరీక్షలకు 1350 మంది హాజరుకాగా 761 మంది ఉత్తీర్ణత పొందారు. చదవండి: Maharashtra Crisis: జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు -
తొలిరోజు కోదాడలో గడబిడ
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. తొలిరోజున అన్నిచోట్లా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ప్రకటించారు. ఎస్సెస్సీ పరీక్షలకు మొత్తం 5,08,143 మంది దరఖాస్తు చేసుకోగా.. సోమవారం జరిగిన మొదటి భాష పరీక్షను 5,03,041 (99 శాతం) మంది రాశారని, 5,102 మంది గైర్హాజరయ్యారని ఎస్సెస్సీ బోర్డ్ తెలిపింది. ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ కేసులు నమోదు కాలేదని ప్రకటించింది. పూర్తి నిఘా నీడలో పరీక్ష జరిగిందని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా పరీక్షలు రాశారని పేర్కొంది. అంతటా కోవిడ్ నిబంధనలు అమలు చేశామని తెలిపింది. వేసవి తీవ్రత తగ్గడంతో ఎక్కడా అసౌకర్యం కలగలేదని, అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించింది. జనరల్ తెలుగుకు బదులు... కాంపోజిట్ తెలుగు సూర్యాపేట జిల్లా కోదాడలో మాత్రం పరీక్షల్లో గందరగోళం నెలకొంది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు జనరల్ తెలుగు (1టి, 2టి)కు బదులు కాంపోజిట్ తెలుగు (3టి, 4ఎస్) ప్రశ్నపత్రాలు ఇచ్చారు. ఇది చూసి కంగుతిన్న విద్యార్థులు.. పరీక్షా కేంద్రం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాము చదివినది తెలుగు భాష సబ్జెక్టు అని.. వేరే పేపర్లు వచ్చాయని చెప్పారు. దీనితో అధికారులు సదరు విద్యార్థుల నుంచి డిక్లరేషన్ తీసుకుని వారికి జనరల్ తెలుగు ప్రశ్నపత్రాలను ఇచ్చారు. ప్రైవేటు స్కూళ్ల నిర్వాకంతో.. కోదాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పరిమితికి మించి విద్యార్థులు ఉండటంతో వారిని పట్టణంలోని మరో కార్పొరేట్ స్కూల్ తరఫున పరీక్ష రాయించినట్టు తెలిసింది. సదరు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు జనరల్ తెలుగు సబ్జెక్టు చదవగా.. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులు కాంపోజిట్ తెలుగు సబ్జెక్టు చదివారు. పరీక్ష ఫీజు కట్టే సమయంలో కార్పొరేట్ స్కూల్ అందరు విద్యార్థుల సబ్జెక్టును కాంపోజిట్ తెలుగుగా నమోదు చేసిందని.. దీనిప్రకారమే విద్యార్థులకు కాంపోజిట్ తెలుగు పేపర్లను ఇచ్చారని తెలిసింది. పరీక్ష కేంద్రంలో పాము కలకలం ఖమ్మం జిల్లా ముత్తగూడెం పరీక్షా కేంద్రంలోని 7వ నంబర్ గదిలో పాము కలకలం రేపింది. ఆ గదిలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా పాము వచ్చి దూరింది. విద్యార్థులు భయంతో బయటికి పరుగెత్తేందుకు ప్రయత్నించగా.. ఇన్విజిలేటర్ వారికి సర్దిచెప్పి బెంచీలపై నిల్చోబెట్టారు. ఓ విద్యార్థి ధైర్యం చేసి కర్రతో పామును చంపడంతో అంతా ప్రశాంతంగా పరీక్ష రాశారు. పుట్టెడు దుఃఖంలోనూ నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లకు చెందిన ఇడికోజు లలిత కొండమల్లేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. లలిత తండ్రి పురుషోత్తమాచారి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. లలిత పుట్టెడు దుఃఖంలోనూ బంధువులు, స్నేహితుల సాయంతో పరీక్షకు హాజరైంది. -
TS SSC Exams 2022 : పదో తరగతి పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)
-
Telangana: 23 నుంచి పది పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు ఏర్పా ట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యా శాఖ ఏర్పాటు చేసింది. ఈ నెల 23 నుంచి జూన్ ఒకటి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 5,09,275 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థుల హాల్‌టికెట్లను విద్యా శాఖ ఇప్పటికే వెబ్సైట్లో అందుబా టులో ఉంచడంతో పాటు పాఠశాలలకు చేరవేసింది. ప్రింటెడ్ నామినల్ రోల్స్ కూడా సంబంధిత పా ఠశాలలకు పంపామని స్పష్టం చేసింది. కరోనా వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవడంతో సిలబస్‌ను 70 శాతానికి కుదించి ప్రశ్నపత్రాలను తయారు చేశామని తెలిపింది. పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించామంది. జనరల్ సైన్స్ కేటగిరీలో మాత్రం ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ప్రశ్నాపత్రాలను వేరుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈసారి ప్రశ్నపత్రంలో చాయిస్‌లను ఎక్కువగా ఇచ్చామని వివరించింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విద్యార్థులు చదువుతున్న పాఠశాలకు చేరువలో ఉన్న పరీక్ష కేంద్రాలనే విద్యా శాఖ కేటాయించింది. పరీక్షల నిర్వహణకు 2,861 మంది చీఫ్ సూపరింటెండెంట్లు.. 2,861 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 33 వేల మంది ఇన్విజిలేటర్లను విధుల్లోకి తీసుకుంది. రాష్ట్ర కార్యాలయం నుంచి 4 ప్రత్యేక ఫ్లైయింగ్ స్వా్కడ్ బృందాలు, 144 ఫ్లైయింగ్ స్వా్కడ్ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేసి పరీక్ష తీరును పరిశీలిస్తాయి. పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అదనంగా నడపాలని ఆర్టీసీ అధికారులను విద్యా శాఖ కోరింది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీటీవీలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తారు. పరీక్ష కేంద్రంలో సంబంధిత జి ల్లా, మండల విద్యాధికారుల ఫోన్ నంబర్లను ప్రద ర్శించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఉదయం 9.35 తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు. -
టెన్త్ పరీక్షలు రాస్తున్నారా? సక్సెస్‌బాట పట్టించే సూచనలు తెలుసుకోండి
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు ఓ వైపు ఒత్తిడి, మరోవైపు వారిలో ఆందోళనను నివృత్తి చేసేందుకు వారికి ఉపాధ్యాయులు, అధికారులు పలు సూచనలు చేశారు. మైలార్‌దేవ్‌పల్లి (హైదరాబాద్): ఏకాగ్రత, ప్రణాళిక బద్ధంగా చదివితేనే విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. పలు సూచనలు.. ► పరీక్షా సమయంలో సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్ల వైపు దృష్టి మరలకుండా చూసుకోవాలి. ప్రతి రోజు విద్యార్థి నిర్ధేశించుకున్న టైమ్ టేబుల్ ప్రకారం చదువుకోవాల్సి ఉంటుంది. ► ఉపాధ్యాయులు, స్నేహితులు, సీనియర్ల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సిద్ధమైతేనే విజయం మరింత సులభమవుతుంది. ► ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ముఖ్యంగా విద్యార్థులకు పరీక్ష సమాయాల్లో ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి. ► విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయడంతో పాటు అవసరమైన ధైర్యాన్ని అందించాలి. ► ఒత్తిడిని తగ్గించేందుకు వారికి సహకారం అందిస్తే అధిక సమయం చదువుకే కేటాయిస్తారు. ► తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన ఆహారం అందించాలి. ► విద్యార్థులు సమయానికి తగినట్లుగా నిద్రపోయేలా కుటుంబసభ్యులు చూసుకోవాలి. రెండు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు పూర్తి సన్నద్ధం చేశాం. ఇప్పటికే రెండు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి వారికి మనోధైర్యాన్ని కల్పించాం. గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చేలా ఎప్పటికప్పుడు తరగతులు నిర్వహిస్తున్నాం. మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నాం. –రామిరెడ్డి, ఎంఈఓ రాజేంద్రనగర్ సొంతంగా రాసిన జవాబులకే అధిక మార్కులు ఉపాధ్యాయులు ఇచ్చిన మెటీరియల్‌ను విద్యార్థులు చదువుకుని పాఠ్య పుస్తకాలపైనే దృష్టిసారించాలి. సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. సొంతంగా రా సిన జవాబులకే అధిక మార్కులు వేసే అవకాశం ఉంటుంది. –ఎన్.మాణిక్యంరెడ్డి, ఉపాధ్యాయుడు ఖాళీ కడుపుతో వెళ్లకూడదు విద్యార్థులు పరీక్షలకు వెళ్లే సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. పరీక్షలకు వెళ్లే ముందు తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ప్రశ్నా పత్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే జవాబులు రాయాలి. –డాక్టర్ సుభాష్, మైలార్‌దేవ్‌పల్లి 10 జీపీ సాధిస్తామనే నమ్మకం ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేదు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ ఉపాధ్యాయులు ఇచ్చిన నోట్స్‌ను ఇప్పటికే చదివేశాం. పదికి పది జీపీ సాధిస్తామన్న విశ్వాసం ఉంది. –స్వాతి, పదో తరగతి విద్యార్థిని -
విద్యార్థులకు నిజంగా ‘పరీక్షే’..!
సాక్షి, హైదరాబాద్: మండు వేసవిలో గొంతు తడుపుకొనే అవకాశం లేదు. ముక్కు మూసుకుంటే తప్ప మరుగుదొడ్లకు వెళ్లలేని పరిస్థితి. ఎప్పుడు ఊడిపడుతుందోనన్నట్టుగా ఉన్న భవనాల పైకప్పులు. కరెంటు సౌకర్యం ఉన్నా ఫ్యాన్లు లేవు. ఉన్నా పనిచేయడం లేదు. ఇదీ ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్న అనేక కేంద్రాల దుస్థితి. ముఖ్యంగా మారుమూల పల్లెల్లో, ఓ మాదిరి పట్టణ కేంద్రాల్లో ఈ తరహా దయనీయ పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 5,09,275 మంది టెన్త్ విద్యార్థులు 2,861 కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. ప్రైవేటు స్కూల్స్ పరీక్షా కేంద్రాలు కావడంతో సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కానీ జిల్లాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 పరీక్ష కేంద్రాల్లో ఏదో ఒక సమస్య కన్పిస్తోందని క్షేత్రస్థాయి అధికారులు ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నివేదికలు కూడా పంపారు. వీటి ప్రకారం.. దాదాపు 500 పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు వాడుకలోనే లేవని తెలిసింది. 400 పాఠశాలల్లో శుద్ధమైన తాగునీటి సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించారు. 145 పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడ..ఎలా? ♦కరీంనగర్ పట్టణం సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్వోఆర్ ప్లాంట్ కొన్ని నెలలుగా వాడుకలో లేదు. దీన్ని మరమ్మతు చేయించకపోవడంతో మంచినీళ్లు అందే అవకాశం కన్పించడం లేదు. ఇదే స్కూల్లో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని అధ్వానంగా ఉన్నాయి. ♦ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 5 పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు పనిచేయడం లేదు. నల్లబెల్లి మండలంలో మంచినీటి కొరత ఉంది. శౌచాలయాలు ఉపయోగంలో లేవు. ఖానాపురం పాఠశాల పరీక్ష కేంద్రంలో పైకప్పు పెచ్చులూడి మీద పడే పరిస్థితి ఉంది. ఈ పరీక్ష కేంద్రాన్ని చూసి ఉపాధ్యాయులే భయపడుతున్నారు. సంగెం మండల కేంద్రంలోని పాఠశాలలో ఎనిమిది గదులుంటే నాలుగింటికి విద్యుత్ సరఫరా లేదు. ఈదుల పూసపల్లి ఒకటో వార్డులో ప్రభుత్వ పాఠశాలకు మంచినీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. గతంలో కూడా ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పడినా, మరోసారి కేంద్రంగా ఎంపిక చేయడం గమనార్హం. ఈ స్కూల్‌కు చెందిన పాత భవనంలో నాలుగు గదులు శిథిలావస్థలో ఉన్నాయి. ♦ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఉన్నత పాఠశాలలో 13 తరగతి గదులుంటే 8 గదులకే విద్యుత్ సౌకర్యం ఉంది. సూర్యాపేటలోని నంబర్ 2 జెడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. దేవరకొండ జిల్లా పరి«షత్ బాలికల ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ♦ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రం దారుణంగా ఉంది. ఫ్లోరింగ్ పగిలిపోయి అస్తవ్యస్తంగా తయారైంది. ఫ్యాన్ల రెక్కలు వంకర తిరిగి ఉన్నాయి. బెంచీలు విరిగిపోయి ఉన్నాయి. సమస్యలుంటే డీఈవో దృష్టికి తెండి సమస్యలు లేని స్కూళ్లనే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయమని క్షేత్రస్థాయి సిబ్బందికి మొదట్లోనే ఆదేశాలిచ్చాం. అయినా అక్కడక్కడ ఏమైనా సమస్యలుంటే డీఈవోల దృష్టికి తీసుకెళ్లాలి. సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలన్నదే మా లక్ష్యం. – కృష్ణారావు (పరీక్షల విభాగం అదనపు డైరెక్టర్) -
అద్దెకు దొరకవు... అధిక కిరాయిలు!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23 నుంచి మొదలయ్యే టెన్త్ పరీక్షలకు సీసీ కెమెరాల ఏర్పాటు సమస్యగా మారింది. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఈసారి సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాల బండిల్‌ను తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. పరీక్ష కేంద్రం నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆన్లైన్ లింక్ ఉండాలని, అన్ని స్థాయిల్లోనూ పర్యవేక్షణ ఉండాలని స్పష్టంచేసింది. అయితే, ఇందుకోసం వాడే సీసీ కెమెరాలను అద్దెకు మాత్రమే తీసుకోవాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. హైదరాబాద్‌లో పెద్ద ఇబ్బందులు లేనప్పటికీ.. జిల్లా కేంద్రాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఇదో సమస్యగానే అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,400 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతీ కేంద్రంలో చీఫ్ ఎగ్జామినర్ వద్ద సీసీ కెమెరా ఉండాలి. అక్కడి నుంచి ఇంటర్నెట్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి లింక్ ఉంటుంది. అయితే, ప్రతీ జిల్లాలోనూ కనీసం 200 పరీక్ష కేంద్రాలుంటే, అన్ని సీసీ కెమెరాలు అద్దెకు లభించడం కష్టంగా ఉంది. జిల్లా కేంద్రాల్లో కొద్ది మొత్తంలో ఉన్నా, రోజుకు కనీసం రూ.1,500 వరకూ అద్దె అడుగుతున్నారు. వైఫై, ఇతర ఇన్స్టలేషన్ చార్జీలు అదనం. కనీసం పది రోజులు ఒక కెమెరా పరీక్ష కేంద్రంలో ఉంచినా, రూ.15 వేల వరకూ చెల్లించాలి. అయితే, మార్కెట్లో ఒక్కో కెమెరా కొనుగోలు చేసినా ఇంతకంటే తక్కువగా దొరుకుతుందని అంటున్నారు. పెద్ద మొత్తంలో సమకూర్చుకోవడం కష్టమైనప్పుడు వేరే ప్రాంతాల నుంచి ఇంత తక్కువ సమయంలో తెప్పించడం ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇదే అదనుగా ప్రైవేటు వ్యక్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎక్కువ మొత్తాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉంటే, జిల్లా కలెక్టరేట్ అధికారులు మాత్రం తక్కువ రేటుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది కలెక్టర్లు మాత్రం ఈ బాధ్యతను రాష్ట్రస్థాయిలోనే ఏదైనా సంస్థకు ఇస్తే బాగుంటుందని, జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయలేమని విద్యాశాఖకు చెప్పినట్లు తెలిసింది. అయితే, పాఠశాల విద్య డైరెక్టర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాగు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మాకు మిగిలేదేంటి కొద్దిరోజుల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా, బిగింపునకు అయ్యే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. వీటన్నింటినీ కలుపుకొనే మేం రోజుకు రూ.1,500 అద్దెతో ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్షల తర్వాత వాటిని తొలగించినా, వాడిన వైరు, ఇతర ఉపకరణాలను ఏమీ చేసుకోలేం. అదీగాక నెట్ సౌకర్యం లేని ప్రాంతంలో తాత్కాలిక నెట్ సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ కలుపుకొంటే మాకు మిగిలేది పెద్దగా ఏమీ ఉండదు. – డి.వేణు (సీసీ కెమెరాల నిర్వాహకుడు) -
టెన్షన్ వీడితే పాస్ ఈజీనే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమై ఈనెల 23 వరకు జరగనున్నాయి. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, 25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్‌ను సిద్ధం చేశా రు. ఆర్టీసీ సౌజన్యంతో పరీక్ష కేంద్రాలకు ప్రత్యేకం గా బస్సులు నడుపుతున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీళ్లు అందుబాటులో ఉంచాలని అధికారులు పరీక్ష కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ‘ఈసారి కూడా 70% సిలబస్‌తోనే పరీక్షలుంటాయి. ఎవరూ ఎలాంటి భయం పెట్టుకోవద్దు. టెన్షన్‌కు దూరంగా ఉండి, ఇంటర్ బోర్డు అందించిన స్టడీ మెటీరియల్‌ను ఫాలో అయితే పరీక్షల్లో తేలికగా విజయం సాధించే వీలుంది..’అని ఇంటర్ విద్య కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,07,394 మంది ఇంటర్ పరీక్షలు రాయబోతు న్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 4,64,626 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. కోవిడ్ వల్ల గత రెండేళ్లుగా పరీక్షలు సజావుగా సాగలేదు. దీంతో విద్యార్థుల్లో పరీక్షల అలవాటు కాస్త తగ్గినట్టు కన్పిస్తోం దని నిపుణులు అంటున్నారు. ఈ కింది విషయా లను గమనంలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. గంట ముందే చేరుకోవాలి.. హాల్ టికెట్లు కాలేజీ నుంచే తీసుకోవాలనే రూల్ ఎక్కడా లేదు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిపై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు. ప్రతీ విద్యార్థి పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. కోవిడ్ నిబంధనలు పాటించాలి. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించరు. వాటర్ బాటిల్ అనుమతిస్తారు. పరీక్షల వేళ ఏం చేయాలంటే... ఇంటర్ విద్యార్థుల నుంచి రోజూ పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. ఆందోళనగా ఉందని, భయమేస్తోందని చెబుతున్నారు. అందువల్ల విద్యార్థులు కొన్నింటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రోజూ కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. టీవీ, మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు నిద్రను పాడు చేస్తాయి. ఫలితంగా పరీక్షలపై దృష్టి తగ్గుతుంది. ఇంటర్ సిలబస్ మినహా అనవసరమైన ఇతర విషయాలపై మాట్లాడకూడదు. చర్చించకూడదు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడొద్దు. ఇతరులతో కొద్దిపాటి ఘర్షణలకు కూడా ఆస్కారం ఇవ్వొద్దు. దీనివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. పరీక్ష కేంద్రానికి కనీసం ఒక గంట ముందే చేరుకుని, పుస్తకాలు పక్కనబెట్టి వీలున్నంత వరకూ ప్రశాంతంగా ఉండాలి. కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. – డాక్టర్ ఎ.అనిత (ఇంటర్ బోర్డు నియమించిన క్లినికల్ సైకాలజిస్ట్) టెన్త్ రాయలేదు.. ఫస్టియర్‌లో టెన్షన్ టెన్త్ పరీక్షలు రాయలేదు. ఇంటర్ ఫస్టియర్‌లోనూ టెన్షన్ పడ్డాం. కానీ ఇప్పుడు కాస్త అవగాహన వచ్చింది. కాలేజీలో అధ్యాపకుల గైడెన్స్, చివరి నెలలో ప్రిపరేషన్ నమ్మకం పెంచింది. – చేతమోని రజిత (ఇంటర్ విద్యార్థి, జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా) స్టడీ మెటీరియల్ ఫాలో అయ్యాం కరోనా తగ్గడం, ఈసారి క్లాసులు బాగా జరగడంతో పరీక్షలకు బాగా సన్నద్ధమయ్యాం. ఇంటర్ బోర్డ్ స్టడీ మెటీరియల్‌ను ఒకటికి రెండుసార్లు చదివాం. మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాం. – ఎం.నూతన్ ప్రసాద్ (ఇంటర్ విద్యార్థి, గార్ల ప్రభుత్వ కాలేజీ, ఖమ్మం) -
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న... పరిశుభ్రత ప్రశ్నార్థకం
సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలకు తోడు కోవిడ్ ఫోర్తు వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నెల 23 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలను కూడా పరీక్ష కేంద్రాలుగా గుర్తించడంతో ఏర్పాట్లు సమస్యగా మారాయి. సర్కారు బడుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల కొరత వెంటాడుతుంటంతో ఇప్పటి వరకు ప్రైవేటు సిబ్బందితో పనులు కొనసాగిస్తూ వచ్చారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు రానప్పటికీ టీచర్లందరు కలిసి సిబ్బంది వేతనాలను భరిస్తూ వచ్చారు. ఇక పరీక్షలు కేంద్రాల్లో సదుపాయాలను సమకూర్చేందుకు నిధుల కొరతతోపాటు ప్రైవేట్ సిబ్బంది విధులకు హాజరయ్యే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి సెలవుల సందర్భంగా ఇప్పటివరకు పాఠశాలల్లో పనిచేసిన స్వీ పర్లు, స్కావెంజర్లు డ్యూటీకి రాకుంటే పరిస్థితి ఏమిట ని ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 62 మంది సిబ్బందే.. హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 690 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నా యి. ఆయా స్కూళ్లలో ప్రస్తుతం 1,06,635 మంది చదువుతుండగా, 6,200 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు నాలుగో తరగతికి చెందిన సుమారు 62 మంది పర్మనెంట్ అటెండర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఇతర పాఠశాలల్లో ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని తరగతి గదులు, నీటి ట్యాంకులు, మరుగుదొడ్లను శుభ్రం చేయడంతోపాటు విద్యార్థులకు తాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్ధితేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెండేళ్ల నుంచి.. కరోనాకు ముందు పాఠశాల నిధులు (స్కూల్ గ్రాంట్) నుంచి కొంత డబ్బులు తీసి ఒక్కొక్కరికి నెలకు రూ.2500 వేతనం కింద ఇచ్చేవారు. సర్వశిక్ష అభియాన్ కింద కేటాయించే నిధులను కోవిడ్ కాలం నుంచి రద్దు కావడంతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై భారం పడినట్లయింది. తాము పని చేస్తున్న స్కూల్లో మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు, తరగతి గదులను శుభ్రం చేయించేందుకు సొంతంగా డబ్బులు సమకూర్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూల్లో ఒక్కొక్కరు రూ.300 నుంచి 500 ఇస్తుండగా, ఎక్కువ ఉన్న చోట్ల రూ.500–1000 వరకు వేసుకొని వారికి వేతనాలుగా అందిస్తున్నారు. పరీక్షల సమయంలో ఎలా? వాస్తవంగా ప్రతి ఏటా పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ రెండో వారంలోగా పూర్తవుతుంటాయి. అప్పుడు అటెండర్లు, స్వీపర్లు, స్కావెంజర్ల సమస్య ఎదురయ్యేది కాదు. ప్రస్తుతం వేసవి సెలవుల సమయంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనుండడంతో ఏర్పాట్లు సమస్యగా తయారైంది. వేసవి సెలవుల్లో ప్రైవేట్ స్వీపర్లు, స్కావెంజర్లు విధులకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదని కొందరు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరీక్షలు జరుగుతున్నప్పుడు రోజువారీగా తరగతి గదులను శుభ్రం చేయడంతోపాటు తాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది, ఎండాకాలం సెలవుల్లో వేతనం ఇచ్చే పరిస్థితి ఉండకపోవడంతో మెజారిటీ సిబ్బంది విధులకు హాజరుపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రంజాన్‌కు భారీ బందోబస్తు) -
టీడీపీకి పరీక్షలపై మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పరీక్షలపై ప్రభుత్వం, అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉంటూ, కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ పేపర్ల లీకేజి, కాపీయింగ్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ఎస్సై నిర్వాకం: ప్రేమించి, పెళ్లి చేసుకుని.. నా జీవితాన్ని నాశనం చేశాడు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిని గుర్తించి అరెస్టు చేశామన్నారు. చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల సిబ్బందితో సహా మాల్ ప్రాక్టీసుకు ప్రయత్నించిన 7 మందితో పాటు, నంద్యాలలో కూడా పలువురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పరీక్షా పత్రాలు బయట మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రశ్న ప్రత్రాలు లీకవుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నిస్తూ దొరికిపోయిన తమ సొంత పార్టీకే చెందిన నారాయణ, తదితర విద్యా సంస్థల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తమ పార్టీకి (టీడీపీకి) చెందిన వారే అక్రమాలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తూ, ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. ఒకట్రెండు చోట్ల తమ స్వార్థ ప్రయోజనాల కోసం పరీక్షలు ప్రారంభమైన తరువాత కుట్రపూరితంగా విద్యార్ధులకు సమాధానాలు చేరేలా పథకం ప్రకారం యత్నిస్తూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అరెస్టైన వారి ద్వారా ఈ విషయం ఇప్పటికే వెల్లడైందని మంత్రి పేర్కొన్నారు. ఆరు లక్షలకు పైగా విద్యార్థులకు సంబంధించిన అంశంలో రాజకీయాలను చొప్పించవద్దని, పరీక్షలను పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని, ఎటువంటి ఆందోళనకు గురికాకుండా పూర్తిగా పరీక్షలపైనే దృష్టి సారించాలని ఆయన సూచించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఏపీలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ( ఫొటోలు)
-
Andhra Pradesh: పదో తరగతి పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి (ఏప్రిల్ 27, బుధవారం) నుంచి మే 9 వరకు జరగనున్న ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,20,063 మంది బాలురు కాగా 3,02,474 మంది బాలికలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పదో తరగతి పరీక్షలు నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి 9.30 గంటల వరకు అనుమతిస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలకు అనుమతించబోమని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నందున పూర్వపు 13 జిల్లాల విద్యాధికారులే కొత్త జిల్లాలకూ నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. 24 పేజీల బుక్‌లెట్‌లోనే సమాధానాలు పదో తరగతి పరీక్షల చరిత్రలో తొలిసారిగా విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను పంపిణీ చేయనున్నారు. వీటిలోనే సమాధానాలు రాయాలి. ఇందులో పార్టు–1లోని ఓఎమ్మార్ షీట్లో పేర్కొన్న వివరాలను హాల్టికెట్లలోని సమాచారంతో సరిచూసుకోవాలి. 24 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థులు రోల్ నంబర్లను, తమ పేర్లను, స్కూల్ పేర్లను రాయకూడదు. అలాగే గ్రాఫ్స్‌లో, మ్యాప్ పాయింట్లలో కూడా రోల్ నంబర్ వేయకూడదు. రోల్ నంబర్ వేసి ఉన్న ఆన్సర్ షీట్లను మూల్యాంకనం చేయరు. అలాంటివారిని మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డవారిగా పరిగణిస్తారు. 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 292 సిట్టింగ్ స్క్వాడ్లు పదో తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ జరగకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 292 సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన సామగ్రి మొత్తాన్ని అన్ని జిల్లాల కేంద్రాలకు తరలించారు. విద్యార్థులకు ఏప్రిల్ 18 నుంచే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి పరీక్షలకు ఏర్పాట్లు చేపట్టారు. రూముకు 16 మంది చొప్పున ఉంచడంతోపాటు భౌతికదూరం పాటించేలా, మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. మంచినీటి సదుపాయం, ఏఎన్ఎంల నియామకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రత వంటి చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో ఫోన్లు, డిజిటల్ పరికరాలకు నో ఎంట్రీ పరీక్ష కేంద్రాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్లు తప్ప ఇతరులెవరూ ఫోన్లను తీసుకువెళ్లడానికి వీలులేదు. అలాగే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలను కూడా అనుమతించరు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో విద్యాశాఖతోపాటు ట్రెజరీ, రెవెన్యూ, పోలీసు, పోస్టల్, ఏపీఎస్ఆర్టీసీ, ట్రాన్స్‌కో, వైద్య, ఆరోగ్య శాఖ, తదితర అన్ని విభాగాలను సమన్వయం చేసి ఎక్కడా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ సంఘవిద్రోహ శక్తులు పుకార్లను వ్యాపింప చేయకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. ఫేక్, గాసిప్ ప్రశ్నపత్రాలను కూడా ప్రచారంలోకి తేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వాటిని వ్యాపింపచేసే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతారు. -
టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే పరీక్షా సమయం పొడిగించారు. 2 గంటల 45 నిమిషాలు ఉన్న పరీక్ష సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 70 శాతం సిలబస్‌నే అమలు చేస్తున్నామన్నారు. ప్రశ్నపత్రంలో అధిక చాయిస్ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. చదవండి: గ్రూప్–1, 2 ఇంటర్వ్యూలకు గుడ్‌బై? -
మే 23 నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త టైం టేబుల్‌ను పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం బుధవారం విడుదల చేసింది. వాస్తవానికి టెన్త్ పరీక్షలు మే 11 నుంచి 20వ తేదీ మధ్య నిర్వహించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినందున ఇంటర్మీడియెట్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఇదే సమయంలో టెన్త్ పరీక్షలు నిర్వహించడం సమస్యగా ఉంటుందని భావించారు. దీంతో టెన్త్ పరీక్షలను మే 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్ష ఉంటుందని ఎస్సెస్సీ పరీక్షల విభాగం తెలిపింది. అయితే, మండు వేసవిలో పరీక్షల నిర్వహణపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. మార్పు అనివార్యమని భావిస్తే ఏప్రిల్‌లో పరీక్షలు పెడితే బాగుండేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.