3 నుంచి పది మూల్యాంకనం
- సెల్‌ఫోన్లు తేవొద్దు
- పేపర్ లీక్ కాలేదు.. అది మాల్‌ప్రాక్టీస్
- యాజమాన్యం పాత్ర ఉందని తేలితే స్కూల్‌ను బ్లాక్‌లిస్టులో పెడతాం
- డీఈఓ రామలింగం
నెల్లూరు(టౌన్) : పదో జవాబుపత్రాల మూల్యాం కనం వచ్చే నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం తెలిపారు. నెల్లూరులోని పొదలకూరురోడ్డులోని సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో మూల్యాంకనం చేయనున్నట్లు వెల్లడించారు.
జిల్లాకు సుమారు 5 లక్షలకు పైగా జవాబుపత్రాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం డీకోడ్ జరుగుతోందన్నారు. మూల్యాంకనంలో 3,700 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొననున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సెల్‌ఫోన్లు అనుమతించమని చెప్పారు. కుటుంబసభ్యులతో మాట్లాడాలనుకుంటే డీఈఓ సెల్‌ఫోన్ నుంచి చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.
ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంగా ఉండటంతో..
పది పరీక్షలు జరిగే సమయంలో సెల్‌ఫోన్ అనుమతించలేదన్నారు. నారాయణ స్కూల్‌లో వాటర్ బాయ్ ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్ ద్వారా పంపించడం మాల్‌ప్రాక్టీస్ కిందకు వస్తుందన్నారు. ఆ గదిలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే సెల్‌ఫోన్‌తో ఫొటో తీశారని చెప్పారు. ప్రాథమిక విచారణ అనంతరం అనుమానంతో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విచారణలో టీచర్ పాత్ర ఉందని తేలితే సర్వీసు నుంచి తొలగిస్తామన్నారు. ఈ వ్యవహారంలో స్కూల్ యాజమాన్యం హస్తం ఉన్నట్లు విచారణలో తేలితే ఆస్కూల్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టనున్నుట్లు తెలిపారు.