Andhra Pradesh 10th Class Public Exams To Start 03-04-2023 - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: టెన్త్‌ పరీక్షలు ప్రారంభం

Published Mon, Apr 3 2023 2:08 AM | Last Updated on Mon, Apr 3 2023 10:06 AM

Andhra Pradesh 10th class public exams to start 03-04-2023 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్నారు. 6,64,152 మంది విద్యా­ర్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్‌ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అన్ని కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో ఫర్నీచర్, మంచి నీరు వంటి సదుపా­యాలు కల్పించామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు. పరీక్ష సమయా­లకు అనుగుణంగా విద్యార్థుల రాకపోకలకు సమస్య లేకుండా ఆర్టీసీ యాజమాన్యం తగి­నన్ని బస్సులు నడుపుతోందన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో టెన్త్‌ విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపించి, ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు.

ఏడు మాధ్యమాల్లో పరీక్షలు
తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ మాధ్యమాల్లో రోజు విడిచి రోజు ఆరు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

► తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మేథ్స్, సోషల్‌ స్టడీస్‌ పరీక్షలకు 24 పేజీల బుక్‌లెట్, ఫిజికల్‌ సైన్స్, నేచురల్‌ సైన్స్, సంస్కృతం, వృత్తి విద్యా కోర్సులకు 12 పేజీల బుక్‌లెట్లను అందిస్తారు. సైన్స్‌కు ఒకే ప్రశ్నపత్రం, రెండు ఆన్సర్‌ షీట్లు ఉంటాయి. ఆయా ప్రశ్నలకు నిర్దేశిత బుక్‌లెట్‌లోనే సమాధానాలు రాయాలి. 

► పేపర్‌ లీక్‌ అనేది లేకుండా పక్కాగా నిఘా ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా, ఏదైనా అవాంఛనీయ ఘటన, లీక్‌ జరిగితే అది ఎక్కడ జరిగిందో వెంటనే కనిపెట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

► అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణకు 43 వేల సిబ్బందిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ తదితర విభాగాల సహకారం తీసుకుంటున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 104 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాలనూ నో ఫోన్‌ జోన్లుగా ప్రకటించారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లు సహా ఏ ఒక్కరూ మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లరాదు. 

► విద్యార్థులు కూడా వాచీలు, ఫోన్లు ఇతర డిజిటల్‌ వస్తువులను తీసుకెళ్లకూడదు. పెన్ను, పెన్సిల్, ఎరేజర్‌ స్కేలు వంటివి తీసుకెళ్లవచ్చు. విద్యార్థులకు ఇచ్చిన ఓఎమ్మార్‌ షీట్లో వివరాలు తనవో కాదో సరిచూసుకున్న తర్వాతే సమాధానాలు రాయాలి. ఏదైనా తేడా ఉంటే ఇన్విజిలేటర్‌కు చెప్పి సరైనది పొందాలి. ఓఎమ్మార్‌ షీట్‌ను సమాధానాల బుక్‌లెట్‌కు పిన్‌ చేయాలి. 

► ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement