tenth class public exams
-
నాన్నా రాడు.. అమ్మ లేదు.. ‘పది’ ఫలితాల్లో సత్తా చాటిన అలేఖ్య
నల్గొండ: నిడమనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థిని కట్టెబోయిన అలేఖ్య పరీక్షలకు ముందు ఎన్నో ఇబ్బందులకు గురైంది. బుధవారం ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 9.7 జీపీఏ సాధించింది. గుర్రంపోడు మండలం కొత్తలాపురానికి చెందిన కట్టెబోయిన వెంకటయ్య, లక్షమ్మ దంపతులకు ఏకైక కూతురు అలేఖ్య. తల్లికి అనారోగ్యం అని తెలియడంతో తండ్రి చాలా ఏళ్ల కిందటే వదిలి వెళ్లాడు. దీంతో తల్లి లక్ష్మమ్మ కూతురు అలేఖ్యను తీసుకుని తల్లిగారి ఊరు పెద్దవూర మండలంలోని ముసలమ్మ చెట్టుకు వచ్చి స్థిరపడింది. అలేఖ్య ఆరో తరగతి నుంచే నిడమనూరులోని వసతి గృహంలో ఉంటూ ఆదర్శ పాఠశాలలో చేరింది. అలేఖ్య తల్లి లక్ష్మమ్మ కూడా తీవ్ర అనారోగ్యంతో ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మృతిచెందింది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రా సి 9.7 జీపీఏ సాధించింది. అలేఖ్య పరిస్థితి తెలుసుకున్న ఆదర్శ పాఠశాల అధ్యాపకులు ఆర్థికంగా కొంత సహయ సహకారాలు అందించారు. పదో తరగతి తర్వాత కూడా అలేఖ్య కూడా చదువుకు అవసరమైన సహకారం అందించడానికి అధ్యాపకులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య హైదరాబాద్‌లో వస్త్ర దుకాణంలో పని చేస్తుంది. బైపీసీలో చేరి, నర్సింగ్ చేయాలని లక్ష్యమని తెలిపింది. సాయం అందిచాలనుకునే వారు: కట్టెబోయిన అలేఖ్య యూనియన్ బ్యాంక్(పెద్దవూర బ్రాంచ్) A/C NO: 194612120000001 IFSC CODE:UBIN 0819468 -
కట్టుదిట్టంగా టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి మంగళవారం అధికారులకు పలు సూచనలు జారీచేశారు. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, సి–సెంటర్ కస్టోడియన్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ♦ పరీక్ష కేంద్రాలన్నీ నో మొబైల్ జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ మొబైల్ ఫోన్ ఇంట్లోనే ఉంచి రావాలి. లేదా సెంటర్లో పోలీస్ పికెట్ వద్ద అప్పగించాలి. ♦ఒకసారి పరీక్ష కేంద్రంలోకి వచ్చిన సిబ్బంది పరీక్ష ముగిసేవరకు బయటికి రాకూడదు. అటెండర్లు, ఇతర సహాయకులు కూడా టీ, శీతల పానీయాలు వంటి అవసరాలకు కూడా బయటకు రాకూడదు. ♦పరీక్ష విధులు లేని ఉపాధ్యాయులు పరీక్ష జరిగే సమయంలో ఆ పరిసరాల్లో ఉండకూడదు. ♦ పరీక్ష కేంద్రాలుగా ఉన్న కె.జి.బి.వి., రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులు పరీక్ష విధులు లేకపోతే ఆ సమయంలో పాఠశాలలో ఉండకూడదు. ♦ పరీక్ష కేంద్రంలో ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఉండకూడదు. ♦ ప్రశ్నపత్రాలు, వాటిపై వదంతులు వాట్సాప్ గ్రూప్‌లలోగానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ ప్రచారం చేయకూడదు. ♦ చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షకు హాజరుకాని అభ్యర్థుల ప్రశ్నపత్రాలను, మిగిలిన ప్రశ్నపత్రాలను ఉదయం 10 గంటలలోపు అకౌంట్ రాసి సీల్ చేయాలి. ♦ ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి పరీక్షల చట్టం 25/97 ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. -
Andhra Pradesh: టెన్త్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్నారు. 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అన్ని కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో ఫర్నీచర్, మంచి నీరు వంటి సదుపాయాలు కల్పించామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా విద్యార్థుల రాకపోకలకు సమస్య లేకుండా ఆర్టీసీ యాజమాన్యం తగినన్ని బస్సులు నడుపుతోందన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో టెన్త్ విద్యార్థులు హాల్ టికెట్ చూపించి, ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఏడు మాధ్యమాల్లో పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ మాధ్యమాల్లో రోజు విడిచి రోజు ఆరు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ► తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మేథ్స్, సోషల్ స్టడీస్ పరీక్షలకు 24 పేజీల బుక్లెట్, ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్, సంస్కృతం, వృత్తి విద్యా కోర్సులకు 12 పేజీల బుక్లెట్లను అందిస్తారు. సైన్స్‌కు ఒకే ప్రశ్నపత్రం, రెండు ఆన్సర్ షీట్లు ఉంటాయి. ఆయా ప్రశ్నలకు నిర్దేశిత బుక్‌లెట్‌లోనే సమాధానాలు రాయాలి. ► పేపర్ లీక్ అనేది లేకుండా పక్కాగా నిఘా ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా, ఏదైనా అవాంఛనీయ ఘటన, లీక్ జరిగితే అది ఎక్కడ జరిగిందో వెంటనే కనిపెట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ► అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణకు 43 వేల సిబ్బందిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ తదితర విభాగాల సహకారం తీసుకుంటున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 104 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాలనూ నో ఫోన్ జోన్లుగా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు సహా ఏ ఒక్కరూ మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లరాదు. ► విద్యార్థులు కూడా వాచీలు, ఫోన్లు ఇతర డిజిటల్ వస్తువులను తీసుకెళ్లకూడదు. పెన్ను, పెన్సిల్, ఎరేజర్ స్కేలు వంటివి తీసుకెళ్లవచ్చు. విద్యార్థులకు ఇచ్చిన ఓఎమ్మార్ షీట్లో వివరాలు తనవో కాదో సరిచూసుకున్న తర్వాతే సమాధానాలు రాయాలి. ఏదైనా తేడా ఉంటే ఇన్విజిలేటర్‌కు చెప్పి సరైనది పొందాలి. ఓఎమ్మార్ షీట్‌ను సమాధానాల బుక్‌లెట్‌కు పిన్ చేయాలి. ► ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. -
సర్కారు వారి సత్తా..
సర్కార్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభ పది పరీక్షల్లో నిరూపితమైంది. విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన సంస్కరణల ఫలితాలకు కరోనా అడ్డుపడింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లు పరీక్షలు లేకుండానే పోయాయి. ఇక ఆ రెండేళ్లు చదువులు సైతం ఆన్‌లైన్‌కే పరిమితమైంది. తాజాగా కరోనా పరిస్థితులను అధిగమించి.. నూతన సంస్కరణలతో నిర్వహించిన పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు లభించాయి. ఇది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సమర్థతకు అద్దం పడుతోంది. కార్పొరేట్ ఫలితాలకు మించి సాధించారు. ప్రకాశం (పీసీపల్లి) : 588/600, 570/600, 569/600.. ఇది పదో తరగతి పరీక్షల్లో మార్కులు. ఈ ఫలితాలు సాధించింది సర్కార్ పాఠశాలల విద్యార్థులు. జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి çమండలం 97.67 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గంలో 10 ప్రభుత్వ పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మంది విద్యార్థులు 500 మార్కులకుపైగా సాధించి సత్తా చాటారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించి పేద తల్లిదండ్రుల కళ్లలో సంతోషాన్ని నింపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 77.77 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. మొత్తం 826 హైస్కూళ్లు ఉండగా 41,341 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందులో 41,061 మంది పరీక్షలకు హాజరయ్యారు. 32,151 మంది ఉత్తీర్ణత సాధించారు. కనిగిరి నియోజకవర్గంలో 52 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 45 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 6 కేజీబీవీ పాఠశాలలు, 1 మోడల్ స్కూల్ ఉన్నాయి. ఇందులో హెచ్‌ఎంపాడులో 4 పాఠశాలలు, కనిగిరిలో 3 పాఠశాలలు, పీసీపల్లిలో 3 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఉత్తమ ఫలితాలు ఇలా.. ప్రత్యేక తరగతులు, ప్రత్యేక ప్రణాళికలు. పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించడంతోపాటు విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యాబోధన అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక తరగతులు, పకడ్బందీ ప్రణాళికలతో ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించింది. ప్రతి రోజూ సాయంత్రం స్టడీ అవర్స్. వారాంతంలో ఆ వారంలో పూర్తయిన సిలబస్‌పై పరీక్షలు. ఏ సబ్జెక్టులో విద్యార్థులు వెనుకబడ్డారో గుర్తించి దానిపై ప్రత్యేక దృష్టిసారించారు. అలాగే సకాలంలో సిలబస్‌ను పూర్తి చేశారు. పలు మార్లు రివిజన్ చేశారు. ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విద్యార్థులకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేశారు. దీంతో నూటికి నూరు శాతం ఫలితాలతోపాటు మంచి మార్కులొచ్చాయి. పథకాలతో అండగా.. ► అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, నాడు–నేడు, జగనన్న విద్యా కానుక వంటి పథకాలతో సీఎం జగన్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ► పిల్లలను బడికి పంపుతున్న తల్లుల ఖాతాల్లో ఏటా జనవరిలో క్రమం తప్పకుండా అమ్మ ఒడి నగదు రూ.15 వేలు జమ చేస్తున్నారు. ► సరైన సౌకర్యాలు లేక పూర్తిగా శిథిలమైపోయిన పాఠశాలలను నాడు–నేడు పేరుతో మరమ్మతులు చేయించి అదనపు సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించారు. ► ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద పేరుతో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ► ఒక్క తెలుగు మీడియంలోనే విద్యనభ్యసిస్తే భవిష్యత్తులో మంచి ఉన్నత చదువులు చదువుకునేందుకు అడ్డంకి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా ఇంగ్లిషు మీడియం ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులకు ముందుగా ఇంగ్లిషు మీడియంలో శిక్షణనిచ్చింది. ప్రత్యేక బస్సు.. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనిగిరి ఆర్టీసీ డిపో అధికారులు సీఎస్‌పురం మండలంలో ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. సీఎస్‌పురం నుంచి ఏకునాపురానికి రెండు హైస్కూళ్ల విద్యార్థులను తీసుకువెళ్తుంది. చెర్లోపల్లి, అరివేముల, జంగంవారి పల్లి, చింతలపాలెం, ముండ్లపాడు, ఏకునాపురం తదితర గ్రామాల్లో చదువుతున్న 70 నుంచి 80 విద్యార్థులను స్కూలుకు సకాలంలో తీసుకువెళ్తుంది. ప్రత్యేక తరగతులు నిర్వహించాం కరోనాతో విద్యకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. పదో తరగతిలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని రాత్రి ప్రత్యేక తరగతులు ఉపాధ్యాయులతో నిర్వహించాం. విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా స్టడీ అవర్స్ నిర్వహించడం వల్లే ఇంతటి మెరుగైన ఫలితాలు సాధించాం. – సుజాత, కేజీబీవీ హెచ్ఎం, పీసీపల్లి నూరుశాతం ఫలితాలు సాధించాం పాఠశాలలో చదువుతున్న 64 మంది పదో తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణులయ్యారు. అమ్మ ఒడి పథకంతో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. 99 శాతం విద్యార్థుల బడికి హాజరవుతున్నారు. 35 మంది బాల బాలికలు 500 పైన మార్కులు సాధించారు. – జీవీ సురేష్‌బాబు, హెచ్ఎం, హెచ్‌ఎంపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల అమ్మ, నాన్న సంతోషంగా ఉన్నారు ఉపాధ్యాయుల బోధన, ఇచ్చిన సలహాలు సూచనలు బాగా ఉపయోగపడ్డాయి. ఇంగ్లిషు మీడియంలో కష్టపడి చదివి 588 మార్కులు సాధించాను. అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక పథకాలు బాగా ఆదుకున్నాయి. మంచి మార్కులు వచ్చినందుకు మా అమ్మ, నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. – గంటా నీతీష్రెడ్డి, హనుమంతునిపాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ విజయం .. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పించడం వల్ల మేము బాగా చదువుకునేందుకు వీలైంది. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి చదివించారు. వారి సహకారంతోనే 576 మార్కులు సాధించాను. – కే పద్మ, శ్రీరంగా పురం, మోడల్ స్కూల్ కనిగిరి బిడ్డల చదువుకు ఆటంకం లేకుండా చేశారు.. నాకు ఇద్దరు బిడ్డలు. వీరిని చదివించాలంటే మా ఆర్థిక స్థోమత సరిపోక పొలం పనులకు తీసుకెళ్లే దాన్ని. జగన్ సీఎం అయ్యాక మాకు రైతు భరోసా, నా బిడ్డలను చదువుకోవడానికి అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద, విద్యాకానుక అందిస్తూ నా బిడ్డల చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా చేశారు. – అన్నెబోయిన పద్మ,ఏకునాంపురం, అశ్విని తల్లి బస్సు సౌకర్యం కల్పించారు మా గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు దాదాపు 15 కి.మీలు ఉండేది. గతంలో పాఠశాలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం ఉండేది కాదు. దీంతో వారంలో మూడు రోజులు గైర్హాజరయ్యేదాన్ని. ఇప్పుడు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో ప్రతి రోజు బడికి వెళ్లాను. పదో తరగతిలో 554 సాధించాను. – అన్నెబోయిన అశ్విని, ఏకునాంపురం, సీఎస్‌పురం మండలం ప్రైవేటు స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరా.. గతంలో నేను ప్రైవేటు స్కూల్లో చదువుకున్నాను. తరువాత ప్రభుత్వ పాఠశాలలో చేరాను. మా బడిలో వసతులు బాగున్నాయి. బాగా చదువు చెప్పారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టపడి చదివి 554 మార్కులు తెచ్చుకున్నాను. – మాధవిరెడ్డి, పీసీపల్లి ప్రభుత్వ పాఠశాల -
6 నుంచి పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీవరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం టెన్త్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీవరకు గడువు ఉందని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో జూన్ 21వ తేదీ నుంచి ఆయా సబ్జెక్టుల పరీక్ష తేదీకి ఒక రోజుముందు వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులకు ఊరట కల్పిస్తూ.. కరోనా కారణంగా చదువులు సరిగా ముందుకు సాగక విద్యార్థులు కొంత నష్టపోయిన నేపథ్యంలో వారికి ఊరట కల్పించేలా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు ఎన్ని మార్కులు సాధించినా వారిని కంపార్టుమెంటల్ పాస్ కింద కాకుండా పరీక్షలో ఆయా విద్యార్థులు సాధించే మార్కులను యథాతథంగా పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే వారికి డివిజన్లను కేటాయించనున్నామని మంత్రి వివరించారు. ► ఉత్తీర్ణులైన అభ్యర్థుల మార్కులకు సంబంధించి షార్ట్ మెమోలను రెండు రోజుల అనంతరం www.bse.ap.gov.in వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. ఈ మెమోల ద్వారా విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు పొందవచ్చు. ► ఫెయిలైన వారి వివరాలను మంగళవారం అధి కారిక వెబ్సైట్లో పొందుపరచనుంది. ► విత్‌హెల్డ్‌లో ఉన్న వారి ఫలితాలను ఆయా జిల్లాలనుంచి సమాచారం అందిన అనంతరం ప్రకటించనున్నారు. ► రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ► రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోస్టాట్ కాపీల కోసం ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున ఈనెల 20వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ► రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసేవారు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లే దు. రీ వెరిఫికేషన్‌లో మార్కుల రీ కౌంటింగ్‌తో పాటు సమాధానాలు రాసిన అంశాలన్నిటికీ మార్కులు వేశారా? లేదా? అనేది పరిశీలన చే స్తారు. ఒకవేళ ప్రశ్నలకు సమాధానాలు రాసినా వాటికి మార్కులు ఇవ్వకుంటే ఆ ప్రశ్నల సమాధానాలను రీ వాల్యుయేషన్ చేసి మార్కులు కేటాయిస్తారు. రీ వెరిఫికేషన్‌లో ఆయా సమాధానాల రీ కరెక్షన్కు అవకాశం ఉండదు. అలాంటి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోరు. -
Telangana: మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 23 నుంచి జూన్ 1 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.. ఈ ఏడాది మొత్తం 5 లక్షల 8వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. విద్యార్థుల హల్ టిక్కెట్లు గురువారం వెబ్ సైట్లో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. పరీక్షల షెడ్యూల్: మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్-ఏ మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్) మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్) మే 24- సెకండ్ లాంగ్వేజ్.. మే 25- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) మే 26- మ్యాథమెటిక్స్ మే 27- జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్, బయోలాజికల్ సైన్స్) మే 28- సోషల్ స్టడీస్ మే 30 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం, అరబిక్) మే 31- ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం, అరబిక్) జూన్ 1- ఎస్ఎస్సీ ఓకేషనల్ కోర్స్ (థియరీ) చదవండి: అనూహ్యం: డీజీపీని తప్పించిన సీఎం యోగి! కారణం ఏంటంటే.. -
పట్టు వదలక.. కొడుకుతో కలిసి పరీక్ష రాసిన తల్లి
భువనేశ్వర్: తల్లీ, కొడుకులు తోటి విద్యార్థులుగా మెట్రిక్ పరీక్షలకు హాజరయ్యారు. జయపురం మండలం పూజారిపుట్ గ్రామంలో జ్యోత్స్న పాఢి(తల్లి), అలోక్‌నాథ్ పాత్రొ(కొడుకు) శుక్రవారం మెట్రిక్యులేషన్ పరీక్షలు రాశారు. తల్లి జయపురం ప్రభుత్వ పాఠశాల కేంద్రంలో ఓపెన్ స్కూల్ అభ్యర్థిగా, కొడుకు పూజారిపుట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షలకు హాజరయ్యారు. భర్త త్రినాథ్‌ప్రసాద్ పాత్రొ ప్రోత్సాహంతో అర్ధాంతరంగా ముగించిన చదువును తిరిగి ప్రారంభించినట్లు జ్యోత్స్న తెలిపారు. అసౌకర్యాల వెక్కిరంత! ఉత్తర ఒడిశాలో పలు కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు లేనట్లు ఆరోపణలు వినిపించారు. ఈ కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందికరంగా పరీక్షలు రాయాల్సి వచ్చిందని నిరుత్సాహం వ్యక్తం చేశారు. వేసవి తాపంతో తల్లడిల్లుతున్న పరిస్థితుల్లో పలు కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేయలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: Fake Baba At Uttarakhand: భూత వైద్యం పేరుతో మహిళను లొంగదీసుకొని.. ఆ తర్వాత.. -
పరీక్ష కేంద్రంలో పురిటినొప్పులు
డుంబ్రిగుడ: పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని ప్రసవ వేదనతో ఆస్పత్రిలో చేరి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా వున్నాయి. గుంటగన్నెల పంచాయతీ జాముగుడ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఈమె ఆరోగ్యం బాగులేకపోవడంతో కొద్దిరోజుల క్రితం కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. టెన్త్ పరీక్షలు రాసేందుకు ఆమెను ఈనెల 27న మండల కేంద్రం డుంబ్రిగుడలోని పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. ఆమెకు పురిటినొప్పులు రావడంతో పరీక్ష కేంద్రం నుంచి హుటాహుటిన కుటుంబ సభ్యులు అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రసవించిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తెలుసుకున్న అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, ఎంఈవో భారతరత్నం గురువారం కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థిని గర్భం దాల్చి ప్రసవించడంపై ప్రత్యేకాధికారి జ్యోతి, వసతిగృహ నిర్వాహకురాలు (టీచర్) అప్పలమ్మకు అధికారులు చార్జి మెమో జారీ చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి వివరాలతో పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణకు నివేదిక అందజేస్తామని ఎంఈవో భారతరత్నం తెలిపారు. (చదవండి: దారిలోనే పసివాడిన బతుకు) -
‘పది’.. పాపమంతా ‘నారాయణ’దే
చిత్తూరు అర్బన్: రాష్ట్రంలో ప్రశాంతంగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలను రాజకీయం చేసేందుకు, తమ స్వలాభం కోసం నారాయణ విద్యాసంస్థ చేసిన కుట్ర బట్టబయలైంది. తిరుపతిలో తెలుగు కాంపోజిట్ పరీక్ష ప్రశ్నపత్రాలను ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టిన ప్రధాన నిందితులు నారాయణ సిబ్బందేనని గుర్తించిన పోలీసులు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. తిరుపతి నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ చేసిన వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. గతంలో నారాయణలో పనిచేసి ప్రస్తుతం ఎన్ఆర్ఐ విద్యా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించడం చూస్తుంటే ప్రభుత్వంపై తెరవెనుక జరుగుతున్న కుట్ర బట్టబయలవుతోంది. రెండు రోజుల క్రితం ప్రారంభమైన పది పరీక్షల్లో తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం, దీనికి కొనసాగింపుగా గురువారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హిందీ పేపర్ లీకేజీ వార్తలు ప్రచారం చేయడం ఇందుకు నిదర్శనం. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ విద్యా సంస్థలు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డాయి. చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు మంత్రిగా చక్రం తిప్పిన నెల్లూరు జిల్లా టీడీపీ నేత పొంగూరి నారాయణ ఈ విద్యా సంస్థల అధిపతి అనే విషయం తెలిసిందే. పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం వైరల్ కావడంపై చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు నుంచే.. పరీక్ష ప్రారంభమయ్యాక తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీన్ని చిత్తూరు టాకీస్ అనే వాట్సాప్ గ్రూపులో.. తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్స్‌పాల్ గిరిధర్‌రెడ్డి పోస్టు చేశాడు. తొలుత తనకు రైల్వేకోడూరు నారాయణలో పనిచేసిన సుధాకర్ అనే వ్యక్తి ప్రశ్నపత్రాన్ని పంపాడని చెప్పి గిరిధర్‌రెడ్డి కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం. చిత్తూరు నగరంలోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి.. నారాయణ సిబ్బంది డబ్బు ఆశ చూపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కక్కుర్తిపడ్డ ఉపాధ్యాయుడు నారాయణ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డికి ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా నారాయణ సిబ్బంది నుంచి పలువురికి ప్రశ్నపత్రం ఫార్వర్డ్ అయినట్లు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు తెలుసుకున్నారు. ఆ మేరకు 90 శాతం కేసును ఛేదించారు. పెద్ద ముఠా.. ఈ వ్యవహారంలో నారాయణ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు మరో 10 మంది నారాయణ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు నూటికి నూరు మార్కులు వచ్చేలా చేయడానికి.. నారాయణతో పాటు పలు పేరొందిన విద్యాసంస్థలు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఫలితంగా పరీక్ష ప్రారంభమైన గంటలోపు ప్రశ్నపత్రం బయటకు తీసుకురావడం, వాటికి సమాధానాలు రాసి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు పంపడానికి ఓ ముఠానే పనిచేస్తున్నట్లు సమాచారం. కొలిక్కివచ్చిన ఈ కేసులో శుక్రవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లెలో 12 మంది అరెస్ట్ కొలిమిగుండ్ల: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డ 12 మంది ఉపాధ్యాయులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పదిన్నర గంటల సమయంలో మూడో నంబర్ గదిలోని ఓ విద్యార్థికి చెందిన ప్రశ్నపత్రాన్ని సీఆర్పీ రాజేష్ తన సెల్ఫోన్లో ఫొటో తీశాడు. అదే స్కూల్లోనే క్రాఫ్ట్ టీచర్ రంగనాయకులకు సెల్‌ఫోన్ ఇచ్చి సమీపంలోని రూములో ఉన్న టీచర్లకు ఇవ్వమని చెప్పాడు. సెల్‌ఫోన్‌ను టీచర్లు నాగరాజు, నీలకంఠేశ్వరరెడ్డికి రంగనాయకులు అందించాడు. వారు రాజేష్ సెల్‌ఫోన్ నుంచి ప్రశ్నపత్రాన్ని తొమ్మిది మంది ఉపాధ్యాయులకు వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేశారు. తర్వాత టీచర్లంతా కలిసి వాట్సాప్‌లో వచ్చిన ప్రశ్నలకు జవాబులు తయారు చేసి అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ వాటర్ బాయ్స్‌గా అవతారమెత్తిన ఈశ్వర్, భగీరథ, చంద్రకిరణ్, విజయ్‌కుమార్ ద్వారా తొమ్మిది గదుల్లోకి ఆయా ఇన్విజిలేటర్ల అనుమతితో స్లిప్‌లు పంపారు. ఉపాధ్యాయులతో పాటు మరొక సీఆర్పీ మద్దిలేటి సెల్‌ఫోన్‌కు క్వశ్చన్ పేపర్ రాగానే ఆన్సర్లు తయారు చేసి పంపించాడు. పోలీసులు, విద్యాశాఖాధికారులు వెంటనే రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. తహసీల్దార్ షేక్ మోహిద్దీన్ ఫిర్యాదు మేరకు 12 మందిపై కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తలారి రాజేష్ (సీఆర్పీ), నీలకంఠేశ్వరరెడ్డి (గొర్విమానుపల్లె), నాగరాజు (అబ్దులాపురం), మధుసూదనరావు (చింతలాయిపల్లె), వెంకటేశ్వర్లు(అంకిరెడ్డిపల్లె), దస్తగిరి (అంకిరెడ్డిపల్లె), వనజాక్షి (కనకాద్రిపల్లె), లక్ష్మీదుర్గ(రామకృష్ణ స్కూల్), ఆర్యభట్ట (అబ్దులాపురం), పోతులూరు (గొర్విమానుపల్లె), రంగనాయకులు (క్రాఫ్ట్ టీచర్ అంకిరెడ్డిపల్లె), మద్దిలేటి (సీఆర్పీ) పోలీసుల అదుపులో ఉన్నారు. -
Andhra Pradesh: పదో తరగతి పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి (ఏప్రిల్ 27, బుధవారం) నుంచి మే 9 వరకు జరగనున్న ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,20,063 మంది బాలురు కాగా 3,02,474 మంది బాలికలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పదో తరగతి పరీక్షలు నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి 9.30 గంటల వరకు అనుమతిస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలకు అనుమతించబోమని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నందున పూర్వపు 13 జిల్లాల విద్యాధికారులే కొత్త జిల్లాలకూ నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. 24 పేజీల బుక్‌లెట్‌లోనే సమాధానాలు పదో తరగతి పరీక్షల చరిత్రలో తొలిసారిగా విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను పంపిణీ చేయనున్నారు. వీటిలోనే సమాధానాలు రాయాలి. ఇందులో పార్టు–1లోని ఓఎమ్మార్ షీట్లో పేర్కొన్న వివరాలను హాల్టికెట్లలోని సమాచారంతో సరిచూసుకోవాలి. 24 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థులు రోల్ నంబర్లను, తమ పేర్లను, స్కూల్ పేర్లను రాయకూడదు. అలాగే గ్రాఫ్స్‌లో, మ్యాప్ పాయింట్లలో కూడా రోల్ నంబర్ వేయకూడదు. రోల్ నంబర్ వేసి ఉన్న ఆన్సర్ షీట్లను మూల్యాంకనం చేయరు. అలాంటివారిని మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డవారిగా పరిగణిస్తారు. 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 292 సిట్టింగ్ స్క్వాడ్లు పదో తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ జరగకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 292 సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన సామగ్రి మొత్తాన్ని అన్ని జిల్లాల కేంద్రాలకు తరలించారు. విద్యార్థులకు ఏప్రిల్ 18 నుంచే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి పరీక్షలకు ఏర్పాట్లు చేపట్టారు. రూముకు 16 మంది చొప్పున ఉంచడంతోపాటు భౌతికదూరం పాటించేలా, మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. మంచినీటి సదుపాయం, ఏఎన్ఎంల నియామకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రత వంటి చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో ఫోన్లు, డిజిటల్ పరికరాలకు నో ఎంట్రీ పరీక్ష కేంద్రాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్లు తప్ప ఇతరులెవరూ ఫోన్లను తీసుకువెళ్లడానికి వీలులేదు. అలాగే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలను కూడా అనుమతించరు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో విద్యాశాఖతోపాటు ట్రెజరీ, రెవెన్యూ, పోలీసు, పోస్టల్, ఏపీఎస్ఆర్టీసీ, ట్రాన్స్‌కో, వైద్య, ఆరోగ్య శాఖ, తదితర అన్ని విభాగాలను సమన్వయం చేసి ఎక్కడా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ సంఘవిద్రోహ శక్తులు పుకార్లను వ్యాపింప చేయకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. ఫేక్, గాసిప్ ప్రశ్నపత్రాలను కూడా ప్రచారంలోకి తేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వాటిని వ్యాపింపచేసే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతారు. -
పరీక్ష గదికి 16 మంది విద్యార్థులే
సాక్షి, అమరావతి: రాష్టంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో గదికి 16 మంది విద్యార్థులే ఉండేలా ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకు ముందు గదికి 24 మంది ఉండేవారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు గతంలోనే విద్యార్థుల సంఖ్యను కుదించింది. ప్రస్తుతం కరోనా దాదాపు తగ్గుముఖం పట్టినప్పటికీ, విద్యార్థుల ఆరోగ్యంతోపాటు పరీక్షల్లో కాపీయింగ్ జరగకుండా బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. గతంలో దాదాపు 2 వేల కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించగా, ఇప్పుడా సంఖ్యను 4,200కు పెంచినట్లు ఎస్సెస్సీ బోర్డు డైరక్టర్ డి.దేవానందరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ఈ ఏడాది పరీక్షలకు 6.30 లక్షల మంది హాజరుకానున్నారు. టెన్త్ విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ ఇప్పటికే ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయించింది. మే 2 నుంచి పరీక్షలు టెన్త్ పరీక్షలను మే 2వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించేలా బోర్డు షెడ్యూల్‌ను ఇంతకు ముందే విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సిలబస్ పూర్తి చేశారు. ఇప్పుడు ప్రత్యేక మెటీరియల్‌ను విద్యార్థులకు అందిస్తున్నారు. రివిజన్ చేయిస్తూ రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రాల బ్లూప్రింట్, మాదిరి ప్రశ్నపత్రాలను బోర్డు విడుదల చేసింది. ఈసారి అంతర్గత మార్కులతో సంబంధం లేకుండా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో హిందీ మినహా తక్కినవాటిలో రెండేసి పేపర్లు 50 మార్కులు చొప్పున ఉండేవి. తాజాగా పేపర్లను ఏడింటికి కుదించడంతో 100 మార్కులకు ప్రశ్నపత్రాలు ఉంటాయి. బిట్ పేపర్ విడిగా ఉండదు. వ్యాసరూప ప్రశ్నలకు 8, లఘు సమాధాన ప్రశ్నలకు 4, అతి లఘు ప్రశ్నలకు, లక్ష్యాత్మక ప్రశ్నలకు 1 మార్కు ఇస్తారు. మేథమెటిక్స్‌లో అకడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రాబ్లెమ్ సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అంశాలను పరిశీలన చేసేలా ప్రశ్నలుంటాయి. లక్ష్యాత్మక ప్రశ్నల్లో ప్రయోగాలు, ప్రశ్నలు రూపొందించడం, క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు, పట నైపుణ్యాలు వంటివి ఉంటాయి. సైన్సు సబ్జెక్టుల్లో సమస్యకు సరైన కారణాలు ఊహించి చెప్పడం, ప్రయోగ అమరిక చిత్రాన్నిచ్చి ప్రశ్నించడం, ప్రయోగ నిర్వహణకు అవసరమైన పరికరాల గురించి అడగడం వంటివి ఉంటాయి. -
7లోగా టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 7వ తేదీలోగా వెల్లడించేందుకు ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేసింది. 2020–21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్లతోపాటు 2019–20 టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు కూడా ప్రకటించనుంది. కోవిడ్ కారణంగా ఈ రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం జీవో 46ను విడుదల చేసింది. ఫలితాలను గణించడానికి అనుసరించనున్న విధివిధానాలను అందులో వివరించింది. గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించనున్నారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరిస్తారు. వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్ ఇస్తారు. 2020–21 విద్యార్థులకు.. ఈ విద్యార్థులకు వారి ఫార్మేటివ్ పరీక్షల్లోని స్లిప్ టెస్టు మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఇతర మూడు కాంపొనెంట్ల మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి గ్రేడ్లు ప్రకటిస్తారు. ఎవరైనా ఒక్కటే ఫార్మేటివ్ పరీక్ష రాసి ఉంటే ఆ మార్కులను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్ ఇస్తారు. పరీక్షలకు హాజరైనా మార్కులు అప్లోడ్ కాని విద్యార్థుల విషయంలో వారికి కనీస పాస్ గ్రేడ్లను ప్రకటిస్తారు. వొకేషనల్ విద్యార్థులకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్షలకు రిజిస్టర్ అయిన వారికి వారి టెన్త్ 20 అంతర్గత మార్కులను అయిదుసార్లు రెట్టింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు. -
ఎగ్జామ్ సెంటర్‌కు ఎమ్మెల్యే వస్తున్నాడని హడావుడి.. తీరా ఆయన చూస్తే..
సాక్షి, గంజాం: కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మెట్రిక్ ఫలితాలను ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ ఫలితాల పట్ల ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వారికి మరోసారి ఆఫ్‌లైన్‌లో పరీక్షలు రాసి, మంచి మార్కులు సాధించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో గంజాం జిల్లాలో శుక్రవారం మెట్రిక్ పరీక్షలు (టెన్త్ ఎగ్జామ్స్) ప్రారంభమయ్యాయి. కాగా తొలిరోజు పరీక్షకు సురడా నియోజకవర్గానికి చెందిన బీజేడీ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వంయి హాజరు కావడం సంచలనం రేకెత్తించింది. బంజనగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి ఉదయం చేరిన ఈయనను చూసి, అక్కడి సిబ్బంది ఎమ్మెల్యే సందర్శనకు వస్తున్నారని అంతా హడావిడి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎగ్జామ్ రాసేందుకు వచ్చారని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. -
టెన్త్ పరీక్షలపై రేపు సీఎం జగన్ కీలక నిర్ణయం: చినవీరభద్రుడు
సాక్షి, అమరావతి: టెన్త్ పరీక్షలపై రేపు సీఎం జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో జులై 26 నుంచి ఆగస్ట్ రెండు వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 6.28 లక్షల మంది విద్యార్ధుల హాజరవుతారని, వారి కోసం 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో 80 వేల మంది ఉపాద్యాయులు, సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. ఈ సారి 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకే పరీక్షలు నిర్వహించేలా సూచిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే సెప్డెంబర్ 2 లోపు పరీక్షా ఫలితాలు వెలువడేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గత ఏడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయగా, ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులకి నష్టం కలుగుతుందని అదే క్రమంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. చదవండి: జూన్ 20 తర్వాత ఏపీలో కర్ఫ్యూ సడలింపులు: సీఎం జగన్ -
ఒంటి చేత్తో మాస్కులు కుట్టిన సింధూరి
మంగుళూరు: ఒంటి చేత్తో ఫేస్ మాస్కులు కుట్టి పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అందిస్తున్న ఓ పదేళ్ల బాలిక శభాష్ అనిపించుకుంటోంది. ఉడిపికి చెందిన సింధూరికి పుట్టుకతోనే ఓ చేయి లేదు. మౌంట్ రోసరీ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆరో తరగతి చదువుతోంది. (మా పేరు ‘కరోనా’ కాదు.. మేం భారతీయులమే) ప్రజల కోసం ఆ స్కూల్ కు చెందిన స్కౌట్ అండ్ గైడ్స్ డిపార్ట్ మెంటు లక్ష మాస్కులను కుట్టి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా సింధూరి 15 మాస్కులను ఒంటి చేత్తో తయారు చేసింది. వీటిని పదో తరగతి పరీక్షలు రాస్తున్న స్టూడెంట్స్ కు అందజేశారు. (పీఎఫ్ ఖాతాదారులకు మరో షాక్?) మొదట్లో ఒంటి చేత్తో కుట్టేందుకు ఇబ్బంది పడ్డానని, అమ్మ సాయంతో చేయగలిగానని సింధూరి తెలిపింది. మాస్కులు కుట్టి అందజేసినందుకు అందరూ తనను అభినందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. -
జూలైలో పది పరీక్షలు
ఒంగోలు: జూలైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. సంతపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేలో పరీక్షలు నిర్వహిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. -
5 వేల కేంద్రాలు.. 60 వేల గదులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అదనపు కేంద్రాల ఏర్పాటుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న 2,500 కేంద్రాలకు అదనంగా మరో 2,500 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటివరకు 5.65 లక్షల మంది విద్యార్థులకు 30వేల గదుల్లో పరీక్షలు నిర్వహించగా, ఇకపై 60వేల గదులు అవసరమని అంచనా వేసింది. ఇప్పటివరకు 30 మంది విద్యార్థులు పరీక్షలు రాసిన ఒక్కో గదిలో ఇప్పుడు 10 నుంచి 15 మందిలోపే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని డీఈవోలను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. -
లాక్డౌన్ ముగియగానే టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ ముగియగానే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన చర్యలను చిత్రా రామచంద్రన్ వివరించారు. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయని, ఫలితాలను వెల్లడించాల్సి ఉందని తెలిపారు. విద్యార్థులకు ఆన్లైన్లో బోధన చేపడుతున్నామని, టీ–శాట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, దీక్ష ద్వారా ఆడియో, వీడియో పాఠాలను విద్యార్థులకు బోధిస్తున్నామని వెల్లడించారు. అలాగే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్యూఆర్ కోడ్ డిజిటలైజ్ చేశామని, అవి విద్యార్థులకు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. -
10 పరీక్షలు వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లాక్డౌన్ ప్రకటించినందున ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వాయిదా వేస్తున్నామని తెలిపారు. పరీక్షలు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు నిర్వహించాల్సి ఉంది. 2 వారాలు వాయిదా వేస్తున్నందున తదుపరి పరీక్షల షెడ్యూల్‌ను ఈనెల 31వ తేదీ తరువాత ప్రకటిస్తామని వివరించారు. ప్రజారవాణా నిలిచిపోవడంతో.. - ప్రజారవాణా నిలిచిపోవడం, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లన్నీ మూతవేయడం తదితర కారణాల వల్ల విద్యార్థులు హాల్‌టికెట్లను పొందడంతో పాటు పరీక్ష కేంద్రాలకు చేరడంలో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. - సంక్షేమ విభాగాల రెసిడెన్షియల్ స్కూళ్లు మూతపడినందున అక్కడి విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకున్నారు. వారు రావడానికి సమస్య అవుతుంది. అలాగే సిబ్బంది కూడా పరీక్ష కేంద్రాలకు చేరుకోలేరు. - ఈనేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కాగా, అంతకుముందు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. -
మార్చి 23 నుంచి పదో తరగతి పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేశ్, అనిల్‌కుమార్ యాదవ్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షల్లో సంస్కరణలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు కొత్త విధానం అమలు కానుంది. విద్యార్థుల భావవ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, అవగాహన తదితర అంశాలను సమగ్రంగా బేరీజు వేసేలా ఈ విధానాన్ని ప్రభుత్వం రూపుదిద్దింది. ఇందులో బిట్ పేపర్ రద్దు సహా అనేక నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు (జీఓ 69) జారీ చేశారు. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చిలో జరగనున్న పరీక్షల నుంచే ఈ నూతన విధానం అమలుకానుంది. ప్రధాన మార్పులు ఇవీ... పరీక్షలలో విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇస్తారు. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. బిట్ పేపర్ వేరేగా ఉండదు. ప్రధాన ప్రశ్నాపత్రంలోనే లఘు సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఇస్తారు. హిందీ, ఓఎస్సెస్సీ, కాంపోజిట్ తెలుగు తప్ప మిగిలిన అన్ని పరీక్షలకు సమయం 2:30 గంటలు. ప్రశ్నపత్రం చదివేందుకు మరో 15 నిమిషాలు. హిందీ పరీక్షకు 3 గంటలు, ఓఎస్సెస్సీ లాంగ్వేజ్, కాంపోజిట్ తెలుగు ప్రశ్న పత్రానికి 3.15 గంటల సమయం ఉంటుంది. సర్టిఫికెట్లో సబ్జెక్టుల వారీగా, పేపర్ వారీగా గ్రేడులు ఇస్తారు. సబ్జెక్టుల వారీగా 2 పేపర్లలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రం స్వరూపం ఇలా ఉంటుంది (50 మార్కులకు) – ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 12 అబ్జెక్టివ్ ప్రశ్నలకు 6 మార్కులు. – 8 అతిలఘు సమాధాన ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున 8 మార్కులు. – 8 లఘు ప్రశ్నలకు ఒకొక్క దానికి రెండేసి మార్కుల చొప్పున 16. – 5 వ్యాస రూప (ఎస్సే) ప్రశ్నలకు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 20 మార్కులు ఉంటాయి. –లాంగ్వేజ్, కాంపోజిట్ తెలుగు ప్రశ్న పత్రానికి 3.15 గంటల సమయం ఉంటుంది. –సర్టిఫికెట్లో సబ్జెక్టుల వారీగా, పేపర్ వారీగా గ్రేడులు ఇస్తారు. –సబ్జెక్టుల వారీగా 2 పేపర్లలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఉత్తీర్ణతపై అస్పష్టత ఇలా ఉండగా విద్యార్థుల పాస్ మార్కులపై ఈ జీవోలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. సబ్జెక్టుల వారీగా కాకుండా పేపర్ వారీగా పాస్ మార్కులను పరిగణలోకి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పొందుపరిచారు. అయితే దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. దీని వల్ల విద్యార్థులు ఒక పేపర్లో ఎక్కువ మార్కులు సాధించినా రెండో పేపర్లో పాస్ మార్కులు రాకుంటే ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పాస్ మార్కుల గురించి ప్రస్తావించలేదు. దీంతో పాత పద్ధతిలో సబ్జెక్టుల వారీగానే పాసు మార్కులు ఉంటాయని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి. -
‘పది’కి సన్నద్ధం
కరీంనగర్‌ఎడ్యుకేషన్: 2018–19 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రత్యేకంగా మెటీరీయల్ తయారు చేయించి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణులయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. గతంలో రెండుసార్లు పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా రెండవ స్థానం సాధించిందని, ఈసారి మొదటి స్థానం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆయన వివరిం చా రు. పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధత, తీసుకుంటున్న చర్యలపై ఆయనను బుధవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ చేసింది. సాక్షి: జిల్లాలో ఈసారి ఎంత మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు? డీఈవో: కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలు 150 ఉన్నాయి. వీటిల్లో మొత్తం 14,196 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. గత రెండు సంవత్సరాలుగా పది ఫలితాల్లో జిల్లా రెండవ స్థానం సాధించింది. ఈ దఫా జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం బోధన చేయాలని ప్రధానోపాధ్యాయులను, సబ్జెక్టు ఉపాధ్యాయులను అదేశించాం. గత నెల నుంచే అన్ని పాఠశాలల్లో 60 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టు వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి వెనుకబడిన వారిపై శ్రద్ధ కనబరుస్తున్నాం. సాక్షి: విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారా..? డీఈవో: పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. నవంబర్ నుంచే ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు స్పెషల్ క్లాసులు కొనసాగిస్తున్నాం. ప్రతిరోజు స్లిప్ టెస్టులు, వారానికి ఒకసారి ఓరల్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక తరగతుల్లో పాల్గొంటున్న విద్యార్థుల కోసం అల్పాహారం విషయంపై జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. ని«ధులిస్తామని స్పష్టం చేశారు. ఆమోదం రాగానే పాఠశాలల్లో అల్పాహారం విద్యార్థులకు కిచిడి, ఉప్మా అందిస్తాం. సాక్షి: అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తి చేశారా..? డీఈవో: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో దాదాపు సిలబస్ తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరు నాటికి అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తవుతుంది. జనవరి మొదటి వారంలో డీసీబీ ద్వారా సబ్జెక్టు నిపుణులతో అన్ని సబ్జెక్టుల పరంగా పాఠ్యాంశం ప్రకారం మెటీరియల్ తయారు చేయిస్తాం. విద్యార్థులకు రివిజన్ చేయిస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తాం. సాక్షి: వార్షిక పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? డీఈవో: మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు పూర్తవుతాయి. అంతకు ముందే సిలబస్ పూర్తి చేసి, తరగతులు రివైజ్ చేయిస్తాం. ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశముంది. దీని ద్వారా విద్యార్థులకు మేలు చేకూరుతుంది. సాక్షి: విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మీరిచ్చే సూచనలు..? డీఈవో: జిల్లాను పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పటినుంచే సిద్ధం కా వాలి. ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. విద్యార్థులను ఇంటి వద్ద తల్లిదండ్రులు చదివించాలి. ఉపా«ధ్యాయులు సైతం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి. సబ్జెక్టుల వారీగా తరగతులు రివైజ్డ్ చేయాలి. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో 94.03 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ సంవత్సరం ఉత్తీర్ణత 100 శాతం నమోదయ్యేలా అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాలి. -
పరీక్షే..
పాల్వంచరూరల్: ఇటీవలే శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. మరోవైపు పదో తరగతి వార్షిక పరీక్షల గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల చదువులపై ఎన్నికలు ప్రభావం చూపేలా ఉన్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలకు ఇంకా ఎక్కువ మంది సిబ్బంది అవసరమవుతారు. ఒక్కో పంచాయతీలో దాదాపు 8, 10 వార్డులు ఉండగా, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉపాధ్యాయులను అధిక సంఖ్యలో ఎన్నికలకు వినియోగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో విద్యాశాఖలో కూడా అయోమయం నెలకొంది. ఆశించిన ఫలితాలు రాబట్టగలమో, లేదోనని సంశయిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 13,646 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలికలు 7,103 బాలురు 6543మంది ఉన్నారు. 2015–2016లో ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పరీక్షలను 34,556 మంది రాశారు. వీరిలో 26,956 మంది ఉత్తీర్ణులయ్యారు. 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2016–2017లో ఉమ్మడి జిల్లాలో 35,333 మంది పరీక్షలకు హాజరుగా 29,898 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.62శాతం ఉత్తీర్ణత సాధించారు. 2017–2018 భద్రాద్రి జిల్లాలో 13175 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 9453 మంది ఉత్తీర్ణులయ్యారు. 71.74శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కన్నా మెరుగైన ఫలితాలును సాధించాలని విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. పుస్తకాలూ ఆలస్యంగానే వచ్చాయి.. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా పూర్తిస్థాయిలో పుస్తకాలు విద్యార్థులకు చేరలేదు. దీనికితోడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్డ్ విడుదల చేసిన తర్వాత కూడా అధికారులు స్టడీ మెటీరియల్‌ను అందజేయలేదు. పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న సయమంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో విద్యార్థుల చదువులను ఎలా పూర్తిచేయాలో అర్థంకాక ఉపాధ్యాయులు, పరీక్షల్లో తమ పిల్లలు ఎలా రాస్తారోనని బెంగ తల్లిదండ్రుల్లో నెలకొంది. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించకపోతే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులు హక్కుం జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా మారింది. ఉత్తమ ఫలితాలకు యాక్షన్ ప్లాన్.. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఇటు డీఈఓ, అటు ఐటీడీఏ పీఓలు పాఠశాలలకు, గురుకులాలకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. గత నెల నుంచే అన్ని పాఠశాలలో ఉదయం, సాయంత్రం పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. గురుకులాల్లో ఉదయం 5 గంటలనుంచి విద్యార్థులను పుస్తకాలు పట్టుకునే విధంగా ఉపాధ్యాయులు చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్.. జిల్లాలో ఇంటర్ కళాశాలలు మొత్తం 57 ఉండగా ఇందులో ప్రభుత్వ కళాశాలు 14, ప్రైవేట్ కళాశాలు 43 ఉన్నారు. ఈ సంవత్సరం వార్షిక పరీక్షలకు 11,500 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ప్రైవేటు కళాశాలల నుంచి 6,500 మంది, ప్రభుత్వ కళాశాలల నుంచి సుమారు 5 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఎన్నికలకు వినియోగించకపోతే ఉత్తమ ఫలితాలు పదో తరగతి విద్యార్థులకు ప్ర త్యేకంగా నెల రోజుల నుంచి యాక్షన్ ప్లాన్ ద్వారా విద్యబోధన సాగిస్తున్నాం. పరీక్ష సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి రోజు విలువైనదిగా భావించి బోధన చేస్తున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఉత్తమ ఫలితాలను సాధించి తీరుతాం. –డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్నికల విధులు అప్పగించొద్దు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు అప్పగించొద్దు. తద్వారా విద్యార్ధులను పరీక్షలకు ప్రీపరేషన్ చేసి విద్యాశాఖ నిర్దేశించిన ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఎన్నికల విధులకు టీచర్లను వినియోగిస్తే ఆశించిన ఫలితాలు సాధించడం కష్టం. –రమేష్ రాథోడ్, ఉపాధ్యాయుడు ప్రభావం పడకుండా ప్రణాళిక విద్యార్థుల చదువులపై ఎన్నికల ప్రభావం పడకుండా ప్రణాళిక రూపొందించాం. ఎన్నికల విధులకు వెళ్ళే ఉపాధ్యాయుల స్థానంలో ఇతర ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం. –వాసంతి, డీఈఓ -
మాస్ కాపీయింగ్‌కు తెరపడేనా?
సాక్షి, ముదినేపల్లి రూరల్: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధించేందుకు విద్యాశాఖ ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే మార్చిలో జరగబోయే పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేపట్టారు. కేవలం పరీక్షా కేంద్రాల మార్పు వల్లే మాస్ కాపీయింగ్ నిరోధించడం ఏమేరకు సాధ్యపడుతుందనేది నియోజకవర్గంలోని ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ ఫలితాల కోసం అడ్డదారులు ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు ప్రభుత్వస్కూళ్లలోనూ, ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలోని కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. ఇన్విజిలేటర్లు, డీవోలు, సీఎస్‌లుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఫలితాల కోసం ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులతో కుమ్మక్కై మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేరుకే చట్టం పరీక్షల్లో కాపీయింగ్ నిరోధించేందుకు విద్యాశాఖ యాక్ట్ 25 అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యార్థి మాస్‌కాపీయింగ్ చేస్తు పట్టుబడితే విద్యార్థితో పాటు ఇన్విజిలేటర్, చీఫ్ సూపరెంటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంది. వీరిని విధుల నుంచి తప్పించడంతో పాటు జరిమానా, సస్పెన్షన్, జైలు శిక్ష విధించాలి. అయితే ఈ చట్టం పేరుకే తప్ప ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదు. దీని ప్రకారం ఇప్పటి వరకు ఏ ఒక్క ఉపాధ్యాయుడిని బాధ్యుడిని చేయలేదంటే మాస్‌కాపీయింగ్ లేనట్లా? లేక చట్టాన్ని సక్రమంగా అమలుచేయడం లేదో అర్థంకాని పరిస్థితి. దీన్ని అమలు చేయాల్సిన స్క్వాడ్ అధికారులే మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తూ యాక్ట్ 25ను అపహాçస్యం చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. అధికారుల ఒత్తిడి విద్యార్థుల సామర్థ్యాలతో పనిలేకుండా పది పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా అధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడం ఆనవాయితీగా మారింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫలితాల సాధన కోసం మాస్‌కాపీయింగ్‌ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నట్లు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలనే ఒత్తిడి ఉన్నంత కాలం పరీక్షా కేంద్రాలు ఏవిధంగా మార్పు చేసినా మాస్‌కాపీయింగ్‌కు తెరపడదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
వాంకిడి(ఆసిఫాబాద్): పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయాలని డీఈవో భిక్షపతి అన్నారు. మండలంలోని ఇందాని జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులు, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల పనితీరు పై అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. బోధన అంశాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులపై శ్రద్ధ వహించాలన్నారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఇవ్వాలన్నారు. అనంతరం మొదటి సారిగా పాఠశాలకు వచ్చిన డీఈవోను పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం రాథోడ్ సుభాష్, ఉపాధ్యాయులు మహేశ్, సూర్యభాను తదితరులు ఉన్నారు.