
సుల్తానాబాద్(పెద్దపల్లి): మార్చి 15 నుంచి 28 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని విద్యాశాఖ కమిషనర్ జి కిషన్ ఆదేశాల మేరకు అమలు చేస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్‌రావు స్పష్టం చేశారు. ఉదయం 9:15 నిముషాల నుంచి 12:15 వరకు పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 20 నిమిషాల ముందే హాజరు కావల్సి ఉంటుందని తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12.15 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు 500 మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా, 49మంది సూపరింటెండెంట్లు, మూడు ష్లైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో స్క్వాడ్‌లో డిప్యూటీ తహసీల్దార్, ఎంఈవో, ఇద్దరు కానిస్టేబుళ్లు, డీఈవోతో ప్రత్యేక టీం, స్టేట్ పరిశీలకుల టీం, ఫస్ట్ ఏయిడ్ కోసం ఏఎన్‌ఎంల టీం సైతం కేంద్రాల వద్ద ఉంటారని తెలిపారు.
49 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో 47 రెగ్యులర్ సెంటర్లు, 2 ప్రైవేట్ సెంటర్లలో 10,307 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని జిల్లా పరీక్షల ఇన్‌చార్జి హన్మంతు తెలిపారు. 105 సర్కారు, ప్రైవేటు, ఆదర్శ పాఠశాలలు 7, కేజీబీవీ 7, గురుకుల వసతి గృహాలు 6, మైనారిటీ హైస్కూల్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్
పదో తరగతి పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖకు సిఫారసు చేసినట్టు డీఈవో తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ కేంద్రాలు సైతం తెరిచి ఉండరాదని ఆయన స్పష్టం చేశారు.
సీసీ కెమెరాలు లేనట్టే..
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని స్థానిక అధికారులు తెలిపారు. గత సంవత్సరం ధర్మారం మండలం మల్లాపూర్ ప్రభుత్వ హైస్కూల్‌లో మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఇప్పుడు ఏర్పాటు చేయాలా వద్దా అనే దానిపై అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆదేశాలు వచ్చినా సీసీ కెమెరాలు 9 రోజుల్లో ఏర్పాటు చేయడం కష్టమే.
ఎలాంటి ఉత్తర్వులు రాలేదు
సీసీ కెమెరాలు పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ఎలాంటి ఉత్తర్వులు ఇప్పటికీ అందలేదు. పరీక్షలు పకడ్బందీగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఇవ్వద్దని కమిషనర్ కిషన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
– వెంకటేశ్వర్‌రావు, డీఈవో, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment