చండీగఢ్: హరియాణాలో దారుణం జరిగింది. పాఠాలు బోధించాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పదోతరగతి పరీక్షల్లో పాస్ చేయిస్తానని మభ్యపెట్టి 16 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని పసిగట్టిన బాధితురాలి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. గోహానా పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ తన స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న బాలికను సమీపంలోని బంధువుల ఇంటికి పిలిపించాడు. పరీక్షలు చాలా కఠినంగా ఉండబోతున్నాయని విద్యార్థిని భయపెట్టి.. పాస్ అయ్యేందుకు తాను సాయం చేస్తానని నమ్మబలికాడు. తాను చెప్పినట్టు వింటే.. వేరొక బాలికతో పరీక్షలు రాయిస్తానని చెప్పి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత విద్యార్థిని తండ్రిని పిలిచి రూ.10వేలు ఇస్తే వేరొక అమ్మాయితో పరీక్షలు రాయిస్తానని ప్రిన్సిపాల్ నమ్మబలికారు. పరీక్షల అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక తండ్రితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆయన బాధితురాలితో కలిసి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్, మరో ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment