ఆరుబయట చదువుకుంటున్న విద్యార్థులు
పాల్వంచరూరల్: ఇటీవలే శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. మరోవైపు పదో తరగతి వార్షిక పరీక్షల గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల చదువులపై ఎన్నికలు ప్రభావం చూపేలా ఉన్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలకు ఇంకా ఎక్కువ మంది సిబ్బంది అవసరమవుతారు. ఒక్కో పంచాయతీలో దాదాపు 8, 10 వార్డులు ఉండగా, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉపాధ్యాయులను అధిక సంఖ్యలో ఎన్నికలకు వినియోగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో విద్యాశాఖలో కూడా అయోమయం నెలకొంది. ఆశించిన ఫలితాలు రాబట్టగలమో, లేదోనని సంశయిస్తోంది.
- జిల్లాలో ఈ ఏడాది 13,646 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలికలు 7,103 బాలురు 6543మంది ఉన్నారు.
- 2015–2016లో ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పరీక్షలను 34,556 మంది రాశారు. వీరిలో 26,956 మంది ఉత్తీర్ణులయ్యారు. 78 శాతం ఉత్తీర్ణత సాధించారు.
- 2016–2017లో ఉమ్మడి జిల్లాలో 35,333 మంది పరీక్షలకు హాజరుగా 29,898 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.62శాతం ఉత్తీర్ణత సాధించారు.
- 2017–2018 భద్రాద్రి జిల్లాలో 13175 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 9453 మంది ఉత్తీర్ణులయ్యారు. 71.74శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కన్నా మెరుగైన ఫలితాలును సాధించాలని విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది.
పుస్తకాలూ ఆలస్యంగానే వచ్చాయి..
పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా పూర్తిస్థాయిలో పుస్తకాలు విద్యార్థులకు చేరలేదు. దీనికితోడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్డ్ విడుదల చేసిన తర్వాత కూడా అధికారులు స్టడీ మెటీరియల్‌ను అందజేయలేదు. పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న సయమంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో విద్యార్థుల చదువులను ఎలా పూర్తిచేయాలో అర్థంకాక ఉపాధ్యాయులు, పరీక్షల్లో తమ పిల్లలు ఎలా రాస్తారోనని బెంగ తల్లిదండ్రుల్లో నెలకొంది. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించకపోతే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులు హక్కుం జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా మారింది.
ఉత్తమ ఫలితాలకు యాక్షన్ ప్లాన్..
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఇటు డీఈఓ, అటు ఐటీడీఏ పీఓలు పాఠశాలలకు, గురుకులాలకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. గత నెల నుంచే అన్ని పాఠశాలలో ఉదయం, సాయంత్రం పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. గురుకులాల్లో ఉదయం 5 గంటలనుంచి విద్యార్థులను పుస్తకాలు పట్టుకునే విధంగా ఉపాధ్యాయులు చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
ఇంటర్మీడియట్..
జిల్లాలో ఇంటర్ కళాశాలలు మొత్తం 57 ఉండగా ఇందులో ప్రభుత్వ కళాశాలు 14, ప్రైవేట్ కళాశాలు 43 ఉన్నారు. ఈ సంవత్సరం వార్షిక పరీక్షలకు 11,500 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ప్రైవేటు కళాశాలల నుంచి 6,500 మంది, ప్రభుత్వ కళాశాలల నుంచి సుమారు 5 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఎన్నికలకు వినియోగించకపోతే ఉత్తమ ఫలితాలు
పదో తరగతి విద్యార్థులకు ప్ర త్యేకంగా నెల రోజుల నుంచి యాక్షన్ ప్లాన్ ద్వారా విద్యబోధన సాగిస్తున్నాం. పరీక్ష సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి రోజు విలువైనదిగా భావించి బోధన చేస్తున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఉత్తమ ఫలితాలను సాధించి తీరుతాం. –డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
ఎన్నికల విధులు అప్పగించొద్దు
పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు అప్పగించొద్దు. తద్వారా విద్యార్ధులను పరీక్షలకు ప్రీపరేషన్ చేసి విద్యాశాఖ నిర్దేశించిన ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఎన్నికల విధులకు టీచర్లను వినియోగిస్తే ఆశించిన ఫలితాలు సాధించడం కష్టం. –రమేష్ రాథోడ్, ఉపాధ్యాయుడు
ప్రభావం పడకుండా ప్రణాళిక
విద్యార్థుల చదువులపై ఎన్నికల ప్రభావం పడకుండా ప్రణాళిక రూపొందించాం. ఎన్నికల విధులకు వెళ్ళే ఉపాధ్యాయుల స్థానంలో ఇతర ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం. –వాసంతి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment