
అన్ని రాష్ట్రాల్లో సకాలంలో పంచాయతీ ఎన్నికలు జరిపేలా కేంద్రం చర్యలు చేపట్టాలి
కేంద్రానికి పంచాయతీరాజ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల జాప్యం కారణంగా ప్రజాభివృద్ధికి విఘాత కలుగుతోందని పంచాయతీరాజ్ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక అభివృద్ధి నిధులు నిలిచిపోయాయని గుర్తుచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తగు చర్యలు చేపట్టాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది.
ఈ మేరకు సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తమ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (2025–26) నివేదికను బుధవారం పార్లమెంట్‌కు సమర్పించింది. ఇందులో పంచాయతీ ఎన్నికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ‘73వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్ని రాష్ట్రాలు గ్రామ స్థాయిలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ఈ(3) ప్రకారం పంచాయతీ ఎన్నికలను ఆ గ్రామపంచాయతీ కాలపరిమితి ముగిసేలోపు లేదంటే రద్దయ్యాక ఆరు నెలల వ్యవధిలోపు పూర్తి చేయాలి.
ఒక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కచ్చితంగా పాటించాల్సిన రాజ్యాంగపరమైన నిబంధన’ అని కమిటీ పేర్కొంది. ‘‘ పుదుచ్చేరి (2011), కర్ణాటక (2021), మహారాష్ట్ర (2022), మణిపూర్ (2022), లక్షద్వీప్ (2022), అస్సాం(2023), జమ్మూకశ్మీర్ (2023), లద్దాఖ్ (2023)లలో వివిధ కారణాల వల్ల పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లలో 2024 ఏడాదిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఇంకా నిర్వహించలేదు’’ అని కమిటీ తెలిపింది.
ఈ విషయంలో సంబంధిత రాష్ట్ర హైకోర్టు, ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయని తెలిపింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం వల్ల గ్రామ అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలకు కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఆగిపోయాయని పేర్కొంది.
‘‘ఈ గ్రాంట్లు, నిధులు మంజూరు పంచాయతీలకు సకాలంలో సాకారం అయి ఉంటే ఆయా గ్రామాల ప్రజలు వివిధ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ఫలాలను అందుకుని ఉండేవారు’’ అని కమిటీ వ్యాఖ్యానించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణంగా నిధుల లభ్యత లేకపోవడంతో గ్రామాల్లో ప్రజల పరిస్థితి మెరుగ్గా లేదని రాష్ట్రాల పర్యటనల్లో తేలినట్లు కమిటీ పార్లమెంట్ దృష్టికి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించేలా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సత్వరం అత్యున్నత స్థాయి చర్యలు చేపట్టాలని కమిటీ సిఫార్సు చేసింది.
‘ఉపాధి’కి నిధులు పెంచాలి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకానికి నిధులు పెంచాలని, కార్మికుల కనీస వేతనాలను పెంచాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ‘ గతంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోనూ గ్రామీణ ఉపాధి పథకానికీ కేటాయింపులు తగ్గాయి. ఇప్పుడు కేవలం రూ.86,000 కోట్ల కేటాయింపులు చేశారు. గ్రామాల్లో తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న గ్రామీణులకు ఉపాధిహామీ పథకం ఇన్నాళ్లూ కీలకమైన రక్షణచట్రంగా నిలిచింది.
కరోనా కాలంలో కోట్లాది మంది పేదలను ఈ పథకం ఆదుకుంది. అణగారిన వర్గాలకు ఉపాధిని కల్పించే ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తగినంత బడ్జెట్ కేటాయింపులు చేయడం చాలా అవసరం. అందుకే ఈ పథకానికి కేటాయింపులు సమధికంగా పెంచాలి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖపై గ్రామీణాభివృద్ధి శాఖ ఒత్తిడి తీసుకురావాలి’’ అని కమిటీ సిఫార్సు చేసింది. పెరుగుతున్న జీవన వ్యయం, గ్రామీణ కార్మికుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రోజువారీ వేతన రేట్లు తగిన విధంగా సవరించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment