కొన్ని రోజుల అంతరంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కారు యోచన
ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు.. తర్వాత గ్రామ పంచాయతీలకు..
ఈ దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు
ఎంపీటీసీ స్థానాల పునరి్వభజన కోసం జిల్లాల నుంచి నివేదికలు తెప్పించిన అధికారులు
నేడు అసెంబ్లీ భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం.. ఈ నెల 15లోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే సూచనలు
కసరత్తు ముమ్మరం చేసిన ఎస్‌ఈసీ.. మూడు విడతల్లో నిర్వహణ, బ్యాలెట్ పత్రాలతో పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే మండల పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) ఎన్నికలను తొలుత నిర్వహించాలని.. అనంతరం పార్టీల గుర్తులు లేకుండా జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది.
మరోవైపు ఈ రెండింటినీ కొన్నిరోజుల అంతరంతో జరపాలనే ప్రతిపాదనతోపాటు.. వీలైతే సమాంతరంగా ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన కూడా ఉ న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రాకున్నా.. తొలుత పరిషత్‌లకు, తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశమే ఎక్కువని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఉదయం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీ, తర్వాత నిర్వహించే శాసనసభ ప్రత్యేక సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్పష్టత వస్తుందని వివరిస్తున్నాయి.
రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి..
సమగ్ర కుటుంబ సర్వే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు (ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 42 శాతానికి), ఎస్సీ వర్గీకరణ నివేదిక తదితర అంశాలపై మంగళవారం కేబినెట్‌లో భేటీలో చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి తీర్మానం చేస్తారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 50శాతానికి మించకూడదు.
కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులు, కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికల ఆధారంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదం కోసం పార్లమెంటుకు పంపే అవకాశం ఉంది. అందులోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పంచాయతీలు, మండలాలు, జిల్లాల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 15లోగా షెడ్యూల్!
స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 15వ తేదీలోగా షెడ్యూల్ విడుదల కానున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు.. తర్వాత వారం గడువిచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయవచ్చని అంటున్నాయి. వచ్చే నెల మొదట్లో ఇంటర్ పరీక్షలు, 21 నుంచి టెన్త్ పరీక్షలు ఉన్నందున.. టెన్త్ పరీక్షలు మొదలయ్యేలోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రాజకీయ పార్టీల గుర్తులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, వాటిని ఒక విడతలో ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, అభ్యర్థులంతా స్వతంత్రులుగానే పోటీ చేసే విధానంలో జరుగుతాయి కాబట్టి.. వాటిని విడిగా నిర్వహించనున్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలను గతంలో మాదిరిగా మూడు విడతల్లో నిర్వహించి.. ఏ విడతకు ఆ విడతలో పోలింగ్ ముగిశాక సాయంత్రమే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. 2018లో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా బ్యాలెట్ పేపర్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పేర్కొన్న నేపథ్యంలో.. దీనివైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది.
ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై సమీక్ష
రాష్ట్రంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ ఆర్‌డీ) అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా చూడటం, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసిన నేపథ్యంలో మార్పులు చేర్పులు, కొత్తగా ఏర్పడిన 34 మండలాల్లో ఎంపీటీసీ సీట్ల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై సోమవారం కసరత్తు పూర్తి చేశారు. జిల్లాల వారీగా పునర్విభజన (కార్వింగ్) చేసిన ఎంపీటీసీ స్థానాల వివరాలతో మండల పరిషత్ కార్యాలయాల్లో తుది జాబితాలను ప్రచురించారు.
ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరుపై అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు (ఏసీఎల్‌బీ), ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్, గూగుల్ మీట్‌లు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడం, గ్రామ పంచాయతీల మ్యాపింగ్, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల లెక్కలు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికలు జరిపేందుకు అందుబాటులో ఉన్న సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర రవాణా ఏర్పాట్లు, రిటర్నింగ్ అధికారుల (ఆర్వోల) నియామకం, ఆర్వోలు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment