
రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో గద్దెనెక్కేవారు పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల విషయంలో మీనమేషాలు లెక్కించటం పరిపాటయింది. దేశంలో దాదాపు అన్ని చోట్లా ఇదే పోకడ. పల్లెసీమల్లో ప్రజాతంత్ర భావన పెంపొందించి, పంచాయతీరాజ్ సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా పనిచేయనివ్వాలని... వాటికవే అభివృద్ధి ప్రణాళికలను స్వతంత్రంగా రూపొందించుకోవటానికి అవకాశమీయాలన్న సంకల్పంతో మూడున్నర దశాబ్దాల క్రితం 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు.
కానీ ఇప్పటికీ చాలా ప్రభుత్వాలు ఆ సంస్కృతికి పాతరేస్తున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవలి నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామ పంచాయతీ కాలపరిమితి ముగిసేలోపు లేదా గడువుతీరిన ఆర్నెల్లలోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాజ్యాంగంలోని 243 ఈ (3) నిర్దేశిస్తోంది. ఎన్నికలు సకాలంలో నిర్వహించని రాష్ట్రాలకు కేంద్రంనుంచి పంచా యతీలకు రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. పర్యవసానంగా అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రామాలు పారిశుద్ధ్య లేమితో, అందువల్ల కలిగే అంటువ్యాధులతో ఇబ్బంది పడుతున్నాయి.
పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయటానికి రాష్ట్ర ప్రభుత్వాలు వేనవేల సాకులు చెబుతుంటాయి. అందులో రిజర్వేషన్ల నిర్ధారణ ఒకటి. పారదర్శకత పాటించకుండా, నిబంధనలకు విలు వీయకుండా రూపొందించే ఆ రిజర్వేషన్లు ఎటూ వివాదాస్పదంగా మారి న్యాయస్థానాల పరిశీలనకు వెళ్తాయని, దాన్ని సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయొచ్చని చాలా ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. ఈ విషయంలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అగ్రస్థానంలో ఉంది.
ఆఖరుసారి 2006లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన ఆ కేంద్రపాలిత ప్రాంతం ఆ తర్వాతనుంచి ఏదో ఒక కారణం చూపిస్తూ వాయిదాల్లోనే కాలక్షేపం చేస్తోంది. సిగ్గుచేటైన సంగతేమంటే... అక్కడ ఫ్రెంచ్ పాలన సాగినన్నాళ్లు స్థానిక సంస్థలు అద్భుతంగా పనిచేశాయి. అభివృద్ధి పనుల ప్రణాళికలు ఒక క్రమపద్ధతిలో అమలయ్యాయి. తీరా స్వాతంత్య్రం వచ్చాక ఆ సంస్థలు నీరసించాయి.
అధికారంలోకి ఎవరొచ్చినా ఏదో వంకతో వాటి ఎన్నికలు వాయిదా వేస్తూ పోయారు. 1954లో జరిగిన రిఫరెండమ్ ద్వారా భారత్‌లో విలీనానికి మెజారిటీ ప్రజలు సుముఖత వ్యక్తం చేయగా, 1962లో అది పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతమైంది. 1968–2024 మధ్య కేవలం ఒకే ఒక్కసారి 2006లో పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలైనా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పుణ్యమే.
అంటే గడిచిన 56 ఏళ్లలో ఒకే ఒక్కసారి మినహా పుదుచ్చేరిలోని 108 పల్లెల బాగోగులు చూసే ప్రజాతంత్ర వ్యవస్థలే లేవన్నమాట! చిత్రమేమంటే... వివిధ అంశాల్లో మొదటి పది స్థానాల్లో నిలిచిన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటివి కూడా సకాలంలో ఎన్నికలు నిర్వహించటంలో విఫలమయ్యాయి. ఇప్పటికి నాలుగేళ్లుగా కర్ణాటకలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు లేవు.
మహారాష్ట్ర మూడేళ్లనుంచీ, అస్సాం, జమ్మూ–కశ్మీర్ వంటివి రెండేళ్లనుంచీ ఎన్నికలు నిర్వహించటం లేదు. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లలో గతేడాది ఎన్నికలు జరగాల్సివుంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది కనుక త్వరలోనే పంచా యతీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని ఆశించాలి.
రాజ్యాంగంలో ఎన్ని ఉన్నతాశయాలున్నా ఆచరణ సరిగా లేనప్పుడు అవన్నీ నీరుగారి పోతాయి. అందులో పల్లెసీమల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడే పంచాయతీరాజ్ సంస్థలను నిర్లక్ష్యం చేయటం ఒకటి. నిజానికి నిర్దిష్ట కాలంలో సక్రమంగా ఎన్నికలు జరిగేచోట సైతం ఆ సంస్థల పనితీరు ఏమంత ఆశాజనకంగా లేదు. నిధుల విడుదలలో జాప్యం, నాసిరకంగా పనులుండటం, సిబ్బంది కొరత వగైరాలు ఎన్నోవున్నాయి.
ఇక మహిళలకు పంచాయతీరాజ్ వ్యవస్థలో పెద్ద పీట వేయాలని 73వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించింది. అందుకోసం వారికి మూడోవంతు స్థానాలు కేటాయించాలని నిర్దేశించింది. అయితే దీన్ని 50 శాతానికి మార్చాలని మెజారిటీ రాష్ట్రాలు భావించాయి. ఒక లెక్క ప్రకారం 21 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు సగం స్థానాలు మహిళలకు కేటాయించాయి. కానీ విషాదమేమంటే... మహిళల పేరుమీద వారి భర్తలో, తండ్రులో అధికారం వెలగబెడుతున్నారు.
ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్య తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ సంగతి చూడాలని ఆదేశించింది. అటు తర్వాత ఈ సమస్య పరిష్కారానికి ఒక కమిటీ వేశారుగానీ జరిగిందేమీ లేదు. ప్రజా సేవారంగంలో మహిళలు చొరవగా పాల్గొనటా నికి ఉద్దేశించిన విధానం కాస్తా ఇలా దారితప్పుతోంది.
దశాబ్దాల తరబడి పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ పోవటంవల్ల పల్లె సీమల్లో వర్ధిల్లాల్సిన ప్రజాస్వామిక వాతావరణం లోపిస్తోంది. తమకున్న వనరులేమిటో, తమ అవ సరాలేమిటో సమీక్షించుకుని ఏయే అభివృద్ధి పనులు చేపట్టాలో నిర్ణయించుకోవాల్సిన పంచాయతీ రాజ్ సంస్థలు నిధుల కోసం బేలగా ఎదురు చూస్తున్నాయి.
పల్లెల్లో సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉండిపోవటంవల్ల ఆ సంస్థలపై ప్రజలకు ఒక రకమైన చిన్నచూపు ఏర్పడుతోంది. అందుకే పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించినట్టు పంచాయతీరాజ్ ఎన్నికలు సకాలంలో జరిగేలా చూడాలి. పుదుచ్చేరి మాదిరి నిరవధికంగా వాయిదాలతో పొద్దుపుచ్చుతూ, పంచాయతీలను నామ మాత్రావశిష్టంగా మార్చే ప్రభుత్వాలను దారికి తీసుకొచ్చేందుకు కొత్త మార్గాలు వెదకాలి.
Comments
Please login to add a commentAdd a comment