ఆధిపత్య కులాల్లోని నిరుపేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకున్న నిర్ణయం సరైందేనని అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మా సనం సోమవారం వెలువరించిన మెజారిటీ తీర్పు సహజంగానే పలు ప్రశ్నలను రేకెత్తించింది. రాజ్యాంగంలోని 15, 16 అధికరణలకు కొత్త క్లాజులు చేరుస్తూ తీసుకొచ్చిన 103వ సవరణ రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
తరతరాలుగా సామాజిక అణచివేతకూ, వివక్షకూ గురవుతూ అన్ని విధాలుగా వెనకబడివున్న కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని మన రాజ్యాంగ నిర్మాతలు నిర్దే శించగా నిరుపేదలకు కల్పించిన కోటా ఇందుకు విరుద్ధంగా ఆర్థిక వెనకబాటుతనాన్ని ప్రాతిపది కగా తీసుకుంది. సారాంశంలో కోటా కల్పనకు ఒక వర్గాన్నీ, దాని సామాజిక స్థితిగతులనూ కాక వ్యక్తిని పరిగణనలోకి తీసుకుంది. పైగా ఈ కోటానుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేదలను మినహా యించింది. ఇది సరైందేనని మెజారిటీ తీర్పు అంటుండగా, మైనారిటీ తీర్పు నిరుపేదలకు కోటా కల్పనను సమర్థిస్తూనే దాన్నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేదలను మినహాయించటం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించటమేననీ, రాజ్యాంగాన్ని బలహీనపరచటమేననీ స్పష్టం చేసింది. తన ఆధ్వర్యంలోని ధర్మాసనంలో మెజారిటీ తీర్పునిచ్చిన సభ్యుల్లో ప్రధాన న్యాయమూర్తి ఒకరుగా లేకపోవటం చాలా అరుదు. పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ లలిత్ అసమ్మతి తీర్పు వెలువ రించిన ఇద్దరిలో ఒకరై ఆ రికార్డు నెలకొల్పారు.
కులంతో సంబంధం లేకుండా నిరుపేద వర్గాలన్నిటికీ అవసరమైన సదుపాయాలు కల్పిం చటం, ఆ వర్గాల ఎదుగుదలకు దోహదపడటం తప్పేమీ కాదు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు అందుకు అవకాశ మిస్తున్నాయి. కానీ పేద వర్గాలకు కోటా ఇవ్వాలంటే ఆ వర్గాలు పేదరికం కారణంగా సామాజి కంగా ఎటువంటి వివక్షనూ, అణచివేతనూ ఎదుర్కొంటున్నాయన్నది... ఒక వ్యక్తి ఎదుగుదలకు ఆర్థిక అననుకూలత ఎలా అవరోధంగా ఉందన్నది నిగ్గు తేల్చవలసిన అవసరం ఏర్పడుతుంది. దాన్ని గణించటం సాధ్యమా? పైగా నిరుపేద వర్గాలను ఉద్ధరించటం కోసం కోటా ఉద్దేశించామని చెబుతూ అత్యంత నిరుపేద వర్గాలు అధికంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను దాన్నుంచి మినహాయించటం సరైందేనా? ఆ వర్గాలు ఇప్పటికే రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తు న్నాయన్న కారణంతో ఇలా మినహాయించటం సరికాదని మైనారిటీ తీర్పునిచ్చిన న్యాయమూర్తులు వ్యక్తం చేసిన అభిప్రాయం సహేతుకమైనదన్న భావన కలగదా? అంతేకాదు... గతంలో మండల్ కమిషన్ కేసులో తొమ్మిదిమంది న్యాయమూర్తుల రాజ్యాంగ« ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పు రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించరాదని స్పష్టం చేసింది.
దాని ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభు త్వాలు కొత్తగా ఇచ్చే కుల రిజర్వేషన్లను వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇంతవరకూ కొట్టివేస్తూ వచ్చాయి. కానీ తాజాగా మెజారిటీ సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు 50 శాతం కోటా పరిమితి మార్చడానికి వీల్లేనిది కాదంటున్నది. ఆ తీర్పు కులప్రాతిపదికన ఇస్తున్న కోటాకే వర్తిస్తుందని భాష్యం చెబుతోంది. ఇది కొత్తగా రిజర్వేషన్లు కోరుకుంటున్న వర్గాలనుంచి తామరతంపరగా డిమాండ్లు పుట్టుకురావటానికి దోహదపడదా? నిజానికి తొలిసారి 1991లో అప్పటి ప్రధాని పీవీ జనరల్ కేటగిరీలోని పేదలకు పదిశాతం కోటా నిర్ణయం తీసుకున్నారు. కానీ సుప్రీంకోర్టు అప్పట్లో ఈ నిర్ణయాన్ని కొట్టేసింది.
ఆర్థిక అసమానతలు పీడిస్తున్నప్పుడు సహజంగానే బాధిత వర్గాలు ప్రభుత్వాల నుంచి ఆసరా కోరుకుంటాయి. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత సాగిన అభివృద్ధికి సమాంతరంగా సంక్షోభం కూడా బయల్దేరింది. చేతివృత్తులపై ఆధారపడి జీవించే అట్టడుగు కులాలతోపాటు వ్యవ సాయంపై ఆధారపడే కులాలు సైతం ఒడిదుడుకుల్లో పడ్డాయి. అందుకే రిజర్వేషన్లు పొందుతున్న వర్గాల్లోని అత్యంత వెనకబడిన కులాలు వర్గీకరణ కావాలని ఉద్యమించటం మొదలుపెడితే... మొదటినుంచీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు తమకూ వాటిని వర్తింపజేయాలన్న డిమాండ్‌తో ముందుకొచ్చాయి. ఇక క్రీమీ లేయర్ వాదన సరేసరి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దానిపై తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సహజంగానే దళిత, ఓబీసీ వర్గాల్లో కలవరం కలిగించాయి.
అందుకే మైనారిటీ తీర్పు వ్యక్తంచేసిన అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆ వర్గాలకు తగిన భరోసానివ్వాలి. అంతకన్నా ముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికలైన ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటివి, ప్రస్తుతం ఏపీలో ఇస్తున్నట్టు వివిధ వృత్తులవారికి ఏటా నిర్ణీత మొత్తంలో నగదు అందించే పథకాలవంటివి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలి. ఇప్పటికే ఉన్న వాటిని మరింత మెరుగుపరచాలి. ఎటూ ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు కుంచించుకుపోయా యన్నది వాస్తవం. కనుక కోటాలవల్ల ఆచరణలో పెద్దగా ఫలితం ఉండదు. ప్రభుత్వ రంగాన్ని విస్తరిస్తే, తయారీ రంగ పరిశ్రమల స్థాపనకు నడుం బిగిస్తే నిరుద్యోగం నియంత్రణలో ఉంటుంది. పేదరికం అంతరిస్తుంది. కేంద్రం ఈ సంగతి ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment