
సాక్షి, న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందో కాదో తొలుత పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ముస్లింలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు(కోటా) కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దృష్టి సారించింది. సెప్టెంబర్ 6న విధానపరమైన ప్రక్రియ, ఇతర అంశాలను పరిశీలిస్తామని, సెప్టెంబర్ 13 నుంచి ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభిస్తామని మంగళవారం స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా, అనంతరం ముస్లిం రిజర్వేషన్ చట్టంపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది. ఈ రెండు అంశాలపై విచారణకు నోడల్ అడ్వొకేట్లుగా వ్యవహరించాలని నలుగురు న్యాయవాదులకు సూచించింది.
చదవండి: అంధుడైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు.. మైక్రోసాఫ్ట్‌లో 47 లక్షల వేతనం
Comments
Please login to add a commentAdd a comment