మతాధారిత రిజర్వేషన్లు... రాజ్యాంగ ఉల్లంఘనే | Religion-Based Reservation Violates Constitution says RSS General Secretary Dattatreya Hosabale | Sakshi
Sakshi News home page

మతాధారిత రిజర్వేషన్లు... రాజ్యాంగ ఉల్లంఘనే

Published Mon, Mar 24 2025 4:11 AM | Last Updated on Mon, Mar 24 2025 4:11 AM

Religion-Based Reservation Violates Constitution says RSS General Secretary Dattatreya Hosabale

ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలె  

బెంగళూరు: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం అనుమతించలేదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలె తెలిపారు. ఇలాంటి రిజర్వేషన్లు రాజ్యాంగానికి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆశయాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కేటాయించాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఆర్‌ఎస్‌ఎస్‌ అత్యున్నత నిర్ణాయక విభాగం అఖిల భారతీయ ప్రతినిధి సభ మూడు రోజుల భేటీ ముగిసిన అనంతరం ఆదివారం హొసబలె బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర గతంలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చేసిన ప్రయత్నాలను హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టు అడ్డుకున్నాయని గుర్తు చేశారు. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ను ఆదర్శమూర్తిగా మార్చారే తప్ప, పరమత సహనాన్ని బోధించిన ఆయన పెద్ద సోదరుడు దారా షికోను పట్టించుకోవడం లేదన్నారు. 

భారతీయ సంప్రదాయానికి వ్యతిరేకంగా నడుచుకున్న వారిని కీర్తించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ‘దురాక్రమణదారు మనస్తత్వం కలిగిన వారు దేశానికి ప్రమాదకరం, భారతీయ సంప్రదాయాన్ని గౌరవించే వారికి మనం మద్దతుగా నిలుద్దాం’అని హొసబలె పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కొన్ని అంశాలపై తన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు హొసబలె.. ప్రతిదీ సజావుగానే నడుస్తున్నందున ఆ అవసరమే లేదని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వానికి నిత్యం జరిగే అంశాల గురించి సంఘ్‌ ఏమీ చెప్పదు. 

ప్రజలేవైనా కొన్ని విషయాలపై ఆందోళన వ్యక్తం చేసిన సమయాల్లో మాత్రమే ఆ పనిచేస్తుంది. వివిధ సంస్థలు, రంగాల్లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలే ఈ పనిని నెరవేరుస్తారు. వీటిపై చర్చించే యంత్రాంగం మాకుంది’అంటూ హొసబలె వివరించారు. ‘‘అయోధ్య రామాలయ నిర్మాణం ఆర్‌ఎస్‌ఎస్‌ ఘనత కాదు.యావత్తు హిందూ సమాజం ఘనత. హిందువనే గుర్తింపు సిగ్గుపడే విషయం కాదు. అది గర్వకారణం. హిందువంటే మతపరమైన గుర్తింపే కాదు. జాతీయత, ఆధ్యాత్మికత, నాగరికతకు కూడా సంబంధించిన గుర్తింపు’’ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement