మత ప్రాతిపదికన రిజర్వేషన్లు సరికాదు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు
సాక్షి, న్యూఢిల్లీ: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఆమోదయోగ్యం కాదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. లౌకిక దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు ఆస్కారం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు పేర్కొన్నారు. తెలంగాణలోని ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంపై మురళీధర్‌రావు స్పందించారు.
‘‘తమిళనాడులో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన పద్ధతులలోనే రాష్ట్రంలోని ముస్లింలకు కూడా 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఆమోదయోగ్యం కాదు’’ అని మురళీధర్ రావు గురువారం సోషల్ మీడియా ట్వీటర్‌లో చెప్పారు.