![Deputy CM Bhatti on 42 percent reservation for BCs](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/bhatti.jpg.webp?itok=z33t_vHs)
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వారి వివరాలను కూడా సేకరించనుంది. ఈ నెల 16 నుంచి 28 వరకు ఈ సర్వే నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం జరిగింది.
ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, సీఎస్ శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి భట్టి మీడియాకు వెల్లడించారు.
బిల్లుకు పూర్తి చట్టబద్ధత కోసం చర్యలు
‘రాష్ట్రంలోని బీసీలు, ఓబీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ, తదితర రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా..దశాబ్దాల ఓబీసీల కలను నిజం చేసే దిశలో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేసి పార్లమెంట్‌కు పంపిస్తాం.
ఆ తర్వాత కలసి వచ్చే రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళుతుంది. ప్రధానితో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అన్ని పార్టీల నేతలు, ఎంపీలను కలిసి ఈ బిల్లుకు పూర్తి చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు చేపడతాం. పార్లమెంట్‌లో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను, శక్తులను ఏకం చేస్తాం..’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.
మూడు పద్ధతుల్లో వివరాల నమోదు
‘ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదు. అలాంటి వారు ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు తమ వివరాలు, సమాచారం నమోదు చేసుకోవచ్చు. మూడు పద్ధతుల్లో అంటే.. టోల్ ఫ్రీ నంబర్ (ఇంకా ప్రకటించలేదు)కు ఫోన్ చేసి, మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారుల వద్ద, ఆన్‌లైన్‌లో కుటుంబ వివరాల నమోదుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి కోరితే అధికారులు వారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వంటి వారు గతంలో ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు. మరికొందరు అందుబాటులో లేకుండా పోయారు అలాంటి వారందరి కోసం మరోసారి అవకాశం కల్పిస్తున్నాం..’ అని భట్టి వివరించారు.
బీసీల ప్రయోజనాల కోసం భారం మోసేందుకు సిద్ధం
‘ఇప్పటికే ఏడాదికి పైగా ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఎన్నికలు ఆలస్యమైతే మరింత ఇబ్బంది అవుతుంది కదా..’ అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీంతో ‘కులగణనలో రాష్ట్రంలో బీసీలు 56 శాతమున్నట్టుగా తేలిన నేపథ్యంలో వారి ప్రయోజనాల కోసం మరో 2, 3 నెలలు ఆర్థిక భారం పడినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని భట్టి బదులిచ్చారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్ష మందికి పైగా సిబ్బందితో పూర్తి శాస్త్రీయంగా సమగ్ర ఇంటింటి సర్వే జరిగిందని చెప్పారు. బిల్లు ఆమోదం కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
మరోసారి సర్వే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: జాజుల
సమగ్ర ఇంటింటి కులగణన సర్వేను మరోసారి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బీసీలు, ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి చట్టం చేయాలని నిర్ణయించడం శుభ పరిణామమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment