Violation of Constitution
-
మతాధారిత రిజర్వేషన్లు... రాజ్యాంగ ఉల్లంఘనే
బెంగళూరు: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం అనుమతించలేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలె తెలిపారు. ఇలాంటి రిజర్వేషన్లు రాజ్యాంగానికి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కేటాయించాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణాయక విభాగం అఖిల భారతీయ ప్రతినిధి సభ మూడు రోజుల భేటీ ముగిసిన అనంతరం ఆదివారం హొసబలె బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర గతంలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చేసిన ప్రయత్నాలను హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టు అడ్డుకున్నాయని గుర్తు చేశారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ను ఆదర్శమూర్తిగా మార్చారే తప్ప, పరమత సహనాన్ని బోధించిన ఆయన పెద్ద సోదరుడు దారా షికోను పట్టించుకోవడం లేదన్నారు. భారతీయ సంప్రదాయానికి వ్యతిరేకంగా నడుచుకున్న వారిని కీర్తించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ‘దురాక్రమణదారు మనస్తత్వం కలిగిన వారు దేశానికి ప్రమాదకరం, భారతీయ సంప్రదాయాన్ని గౌరవించే వారికి మనం మద్దతుగా నిలుద్దాం’అని హొసబలె పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ కొన్ని అంశాలపై తన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు హొసబలె.. ప్రతిదీ సజావుగానే నడుస్తున్నందున ఆ అవసరమే లేదని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వానికి నిత్యం జరిగే అంశాల గురించి సంఘ్ ఏమీ చెప్పదు. ప్రజలేవైనా కొన్ని విషయాలపై ఆందోళన వ్యక్తం చేసిన సమయాల్లో మాత్రమే ఆ పనిచేస్తుంది. వివిధ సంస్థలు, రంగాల్లో పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ఈ పనిని నెరవేరుస్తారు. వీటిపై చర్చించే యంత్రాంగం మాకుంది’అంటూ హొసబలె వివరించారు. ‘‘అయోధ్య రామాలయ నిర్మాణం ఆర్ఎస్ఎస్ ఘనత కాదు.యావత్తు హిందూ సమాజం ఘనత. హిందువనే గుర్తింపు సిగ్గుపడే విషయం కాదు. అది గర్వకారణం. హిందువంటే మతపరమైన గుర్తింపే కాదు. జాతీయత, ఆధ్యాత్మికత, నాగరికతకు కూడా సంబంధించిన గుర్తింపు’’ అన్నారు. -
దేశ ప్రజాస్వామ్యానికి విఘాతం: ఆప్
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల విధానం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఆప్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మౌలిక స్వరూపం, సమాఖ్య విధానాలను దెబ్బతీస్తుంది. పార్లమెంట్, శాసనసభల్లో హంగ్ ఏర్పడిన సందర్భాల్లో ఈ విధానంలో పరిష్కారం లేదు. పైపెచ్చు పార్టీ ఫిరాయింపులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను బహిరంగంగానే కొనుగోలు చేసేందుకు దారులు చూపుతుంది. జమిలి ఎన్నికల నిర్వహణతో ఆదా అయ్యే ప్రజాధనం కేంద్ర వార్షిక బడ్జెట్లో కేవలం 0.1 శాతం మాత్రమే. సంకుచిత ఆర్థిక లాభాలు, పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాంగం, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను త్యాగం చేయజాలం’అని ఆప్ పేర్కొంది. -
'ఫిరాయింపులపై జాతీయస్థాయిలో ఉద్యమం'
- సేవ్ డెమొక్రసీ ర్యాలీ ఈ నెల 23కు మార్పు హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లుతోందని ఆమె అన్నారు. హైదరాబాద్‌లో బుధవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ ఉల్లంఘనలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ నెల 23న సెవ్ డెమొక్రసీ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నెల 23న సేవ్ డెమోక్రసీ పేరిట ఆందోళనలు చేపడుతామని చెప్పారు. 25న రాష్ట్రపతి అపాయిమెంట్ దొరికే అవకాశం ఉండటంతో రెండు రోజులు ముందుగానే సేవ్ డెమోక్రసీ ఆందోళనలు చేపడుతున్నట్టు వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితమంతా అవినీతి రాజకీయమేనని దుయ్యబట్టారు. పుట్టిన రోజున కాస్తా మంచి పని చేయాలనుకుంటారు.. చంద్రబాబు పుట్టినరోజున మాత్రం ఫిరాయింపులకు కులాల మధ్య చిచ్చు పెట్టడం రాజకీయమా? అంటూ సూటిగా ప్రశ్నించారు. రైతు, రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పుకోచ్చిన చంద్రబాబు.. వందల హామీలు మ్యానిఫెస్టోలో పెట్టి ప్రచారం చేసుకున్నారంటూ విమర్శించారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.సుజయకృష్ణ రంగారావును నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్పారు. టీడీపీ కండువాలు కప్పుకుంటేనే నియోజకవర్గాలా అభివృద్ధి జరుగుతుందా?.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను సీఎం పట్టించుకోరా? అంటూ వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు.