'ఫిరాయింపులపై జాతీయస్థాయిలో ఉద్యమం'
- సేవ్ డెమొక్రసీ ర్యాలీ ఈ నెల 23కు మార్పు
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లుతోందని ఆమె అన్నారు. హైదరాబాద్లో బుధవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ ఉల్లంఘనలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ నెల 23న సెవ్ డెమొక్రసీ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నెల 23న సేవ్ డెమోక్రసీ పేరిట ఆందోళనలు చేపడుతామని చెప్పారు. 25న రాష్ట్రపతి అపాయిమెంట్ దొరికే అవకాశం ఉండటంతో రెండు రోజులు ముందుగానే సేవ్ డెమోక్రసీ ఆందోళనలు చేపడుతున్నట్టు వాసిరెడ్డి పద్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితమంతా అవినీతి రాజకీయమేనని దుయ్యబట్టారు. పుట్టిన రోజున కాస్తా మంచి పని చేయాలనుకుంటారు.. చంద్రబాబు పుట్టినరోజున మాత్రం ఫిరాయింపులకు కులాల మధ్య చిచ్చు పెట్టడం రాజకీయమా? అంటూ సూటిగా ప్రశ్నించారు. రైతు, రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పుకోచ్చిన చంద్రబాబు.. వందల హామీలు మ్యానిఫెస్టోలో పెట్టి ప్రచారం చేసుకున్నారంటూ విమర్శించారు.
బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.సుజయకృష్ణ రంగారావును నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్పారు. టీడీపీ కండువాలు కప్పుకుంటేనే నియోజకవర్గాలా అభివృద్ధి జరుగుతుందా?.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను సీఎం పట్టించుకోరా? అంటూ వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు.