న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల విధానం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఆప్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మౌలిక స్వరూపం, సమాఖ్య విధానాలను దెబ్బతీస్తుంది.
పార్లమెంట్, శాసనసభల్లో హంగ్ ఏర్పడిన సందర్భాల్లో ఈ విధానంలో పరిష్కారం లేదు. పైపెచ్చు పార్టీ ఫిరాయింపులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను బహిరంగంగానే కొనుగోలు చేసేందుకు దారులు చూపుతుంది. జమిలి ఎన్నికల నిర్వహణతో ఆదా అయ్యే ప్రజాధనం కేంద్ర వార్షిక బడ్జెట్‌లో కేవలం 0.1 శాతం మాత్రమే. సంకుచిత ఆర్థిక లాభాలు, పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాంగం, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను త్యాగం చేయజాలం’అని ఆప్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment