Constitutional system
-
Rahul Gandhi: రాజ్యాంగ సంస్థలు మోదీ సొత్తు కాదు
వయనాడ్/నీలగిరి: సీబీఐ, ఈడీ మొదలుకుని కేంద్ర ఎన్నికల సంఘం దాకా ప్రతి రాజ్యాంగబద్ద సంస్థల్లోకి తమ వారిని జొప్పిస్తూ ప్రధాని మోదీ వాటిని తన సొంత ఆస్తులుగా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేరళలోని సొంత ఎంపీ నియోజకవర్గం వయనాడ్‌లో ప్రచారంలో భాగంగా సోమవారం వల్లిమండలో రోడ్‌షో నిర్వహించి అక్కడి పార్టీ కార్యకర్తలు, ఓటర్లనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటనీ బీజేపీ హస్తగతం చేసుకుంటున్న తీరు మీకందరికీ అర్థమయ్యే ఉంటుంది. న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమిషన్, సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఇలా ప్రతి రాజ్యాంగబద్ధ విభాగంలోనూ తమ అస్మదీయులను జొప్పించడంలో ఆర్ఎస్ఎ‹స్, బీజేపీ బిజీగా ఉన్నాయి. అవే రాజ్యాంగబద్ధ సంస్థల పరిరక్షణ కోసం విపక్షాల ‘ఇండియా’ కూటమి పాటుపడుతోంది. ఇవి ఎవరి సొంత సంస్థలుకావు. ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తులు అస్సలు కావు. ఇవి ప్రతి ఒక్క భారతీయ పౌరుడివి. రాజ్యాంగాన్ని సవరించబోతున్నట్లు ఒక బీజేపీ ఎంపీ ఇటీవలే ప్రకటించారు. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఆర్ఎస్ఎస్కు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. రాజ్యాంగాన్ని తమకు నచి్చనట్లు మార్చేసి జాతి సమున్నత ఆశయాలను సమాధిచేయాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు. ‘‘ కేరళను నాగ్‌పూర్(ఆర్ఎస్ఎస్ ప్రధానకేంద్రం) పాలించకూడదు. సొంత పట్టణాలు, పల్లెల నుంచే పరిపాలన సాగాలి. కేరళ ప్రజలకు ఏం కావాలో, వాళ్లేం ఆశిస్తున్నారో ఢిల్లీ(మోదీ సర్కార్)కి ఎలా తెలుస్తుంది?’’ అని ప్రశ్నించారు. ‘‘ఎంతోకాలంగా డిమాండ్‌చేస్తున్నా సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ వయనాడ్ జిల్లాలో ఇంతవరకు ఒక్క వైద్యకళాశాలను ఏర్పాటుచేయలేదు. యూడీఎఫ్ ప్రభుత్వం వస్తేగానీ కాలేజీ రాదేమో’’ అని విమర్శించారు. ‘ఇంతటి అందమైన ప్రదేశం వయనాడ్‌లో ఓ వారం పది రోజులు గడపమని మా అమ్మ(సోనియా)కు చెప్పా. ఆమెకు అతి ఉక్కబోత పడదు. భువిపైనే అందమైన ప్రదేశాన్ని మిస్ అవుతున్నావని గుర్తుచేశా’’ అని రాహుల్ అన్నారు. రాహుల్ హెలికాప్టర్లో తనిఖీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి రాహుల్ వచ్చినపుడు ఆయన ప్రయాణించిన హెలీకాప్టర్‌లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లైయింగ్ స్వా్కడ్ తనిఖీల్లో ఎలాంటి చట్టవ్యతిరేక వస్తువులు లభించలేదు. -
రాజ్యాంగ విలువలకు తిలోదకాలేనా?
సుప్రసిద్ధ మహాకవి సి. నారాయణ రెడ్డి మూడు దశా బ్దాల నాడే కొందరు భావి పాలకులు దేశ రాజ్యాంగాన్ని పక్కకు తోసేసి, ‘రాచరిక పాలన’ను అభిలషిస్తూ ప్రవర్తించే అవకాశాలు ఎలా ఉన్నాయో ‘ప్రపంచ పదులు’ కవిత ద్వారా పాఠకులకు అందించారు. ‘నడమంత్రపు బుద్ధి దూకుడు’ ఎలా ఉంటుందో ఆ కవితలో నిరూపించారు: ‘‘గాలిలోన ఎగిరిపడే గడ్డిపరక ఊపిరెంత? ఏటిలోన తుళ్లిపడే నీటి బుడగ ఉనికి ఎంత? అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతె ఏం లాభం? కడలిలోన మిడిసిపడే కప్పపిల్ల పాకుడెంత? నడమంత్రపు సిరినేర్పిన దుడుకుబుద్ధి దూకుడెంత?’’ పాలకుల ఈ ‘దుడుకు బుద్ధి’ వల్ల దేశానికి రాబో తున్న అనర్థాల గురించి అడుగడుగునా నిశితమైన పరిశీలనలో ఉన్నారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. పదవిని అధిష్ఠించిన రోజు నుంచీ దేశ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకులు ఎత్తుకున్న ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ నినాదం దేశ ఫెడరల్ వ్యవస్థ స్వరూప, స్వభావాలకు విరుద్ధం. దేశంలో ‘రాచరికం’ ఉంది గాని 75 ఏళ్లలో దేశ ప్రజలు నిర్మించుకున్న సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థ లేదని వర్తమాన పరిస్థితులు చెబుతున్నాయి. కనుకనే కాలానికి లొంగిపోని కర్మయోగులు నేడు మేలుకోవలసి ఉంది. ఎందుకంటే: ‘‘కలవరపడి వెనుతిరిగితే కాలం ఎగబడుతుంది కదనుతొక్కితే కాలం భయపడుతుంది కనురెప్పలు మూతపడితే కాలం జోకొడుతుంది కంఠమెత్తి తిరగబడితే కాలం జేకొడుతుంది!’’ కాబట్టి ప్రతిపాదిత ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ విధా నాన్ని బుద్ధిజీవులు అందరూ వ్యతిరేకించాలి. పటిష్ఠ మైన ప్రజాస్వామ్య పునాదులను గౌరవించాలనీ, ప్రస్తుత పాలకుల కనుసన్నలలోనే ఎదిగిన మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన ‘ప్రజాస్వామ్య రక్షణ’ పేరిట మరో ‘తైనాతీ’ కమిటీ ఏర్పాటు తగదనీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. పాలకుల చేతిలో కోవింద్ కీలు బొమ్మగా వ్యవహరించరాదనీ ఆయన సలహా ఇచ్చారు. అసలు విచిత్రమేమంటే, కేంద్ర, రాష్ట్రాలకు కలిపి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా దేశాని కయ్యే అపారమైన ఖర్చును ఆదా చేయవచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం సలహా ఇవ్వబోవడం! ఈ చర్య రాజ్యాంగాన్నీ, పార్లమెంటరీ వ్యవస్థనూ అవ మానపరచడమే! అంతేగాదు, మత విశ్వాసాలను కూడా రాజకీయ లబ్ధి కోసం బీజేపీ–ఆరెస్సెస్ పాలకులు వాడుకోవడం ఓటర్లను దగా చేయడమే! ఈ రాజకీయమే వేల ఏళ్ల నాటి బాబ్రీమసీదు కట్టడాన్ని బలవంతంగా కూల్చి వేసి, దాని స్థానే రామమందిర నిర్మాణానికి కారణ మయ్యింది. నిజానికి సాధారణ ముస్లిం పౌరులు హిందువులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. హిందువులు పవిత్రంగా భావించే రామా యణాన్ని స్థానిక ‘అవధి’ భాషలో రచించి ఖ్యాతి వహించిన తులసీదాస్‌ను హిందీలో రాయనందుకు శిక్షించడానికి ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో ఆయననూ, ఆయన రామాయణాన్నీ ఓ స్థానిక ముస్లిం కాపాడాడు. ఈ వాస్తవాన్ని ఈ రోజుకీ గుర్తించ నిరాకరిస్తున్న ముఠా... మహాత్మాగాంధీ పేరిట కంటి తుడుపు ఉత్సవాలు చేస్తున్నా రని గమనించాలి. లాహోర్ కుట్ర కేసులో నిందితులుగా, ముద్దా యిలుగా ఉన్న భగత్‌సింగ్, సుఖదేవ్‌లు ఉరిశిక్షను ఎదుర్కొంటున్నప్పుడు భగత్‌సింగ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘తన కాలంలో మార్క్స్ కొత్త తరహాగా ఆలోచించబట్టే కాల చక్రాన్ని తన పద్ధతుల్లో త్వరిత గతిన ముందుకు నడిపించగలిగారు. అలాగే మన దేశంలో సామ్యవాద సిద్ధాంతాన్ని (సోషలిజం) నేను గాని, నువ్వు గాని (సుఖదేవ్తో సంభాషణ) ఆరంభించలేదు. నిజానికి కాలం, పరిస్థితులు కల్పించిన ప్రభావ ఫలితం అది. ఇంత కష్టమైన బాధ్యతను మనం చేపట్టినప్పుడు దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాలే గాని కష్టాలు ఎదురయ్యాయని చెప్పి, ఆత్మహత్య చేసుకుంటే అది ప్రజలకు మార్గదర్శకం కాజాలదు.’’ ఈ మాటలు భగత్‌సింగ్ ఏ సందర్భంలో అన్నాడు? ఉవ్వెత్తున ప్రజాందోళన వల్ల మన ఉరిశిక్షలు ఆగిపోయి, యావజ్జీవ కారాగార శిక్షగా మారిపోవచ్చు. కానీ, 14 ఏళ్లపాటు ద్వీపాంతరవాస శిక్ష అనుభవించాక మనం జీవచ్ఛవాలుగా మారిపోతాం. అలాంటప్పుడు బతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు కదా... ఇలా ఆలోచిస్తూ సుఖదేవ్ తన అభిప్రాయాల్ని భగత్‌సింగ్‌కు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరానికి జవాబుగా భగత్‌సింగ్ రాసిన ఆశావహమైన లేఖే ‘కాలం అవసరం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం’ అన్న ప్రత్యుత్తరం. కాగా, నేటి తరం పాలకులకు రాజ్యాంగ విలువలూ తెలియవు. కనుకనే పాలనా వ్యవస్థల నుంచి, విద్యా వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థల దాకా ఇష్టం వచ్చినట్లు మార్చడానికి ప్రయత్ని స్తున్నారు. అందుకే బహుశా, ‘ఒడువని ముచ్చట’ అనే కవితలో కందుకూరి అంజయ్య ఆవేదనను మనమూ పంచుకుందాం: శంకరా! ఇప్పుడు మనుషులను కూడగట్టే మానిసి లేడు మంచి చెడ్డలను విప్పిచెప్పే సాత్వికుడూ లేడు అంతా... వడ్లూ – పెరుగూ కలిసినట్టుంది ఈనగాస్తే నక్కలపాలయింది అంతా మొదటికొచ్చింది ఒడువని ముచ్చటై కూసుంది!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
దేశ ప్రజాస్వామ్యానికి విఘాతం: ఆప్
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల విధానం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఆప్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మౌలిక స్వరూపం, సమాఖ్య విధానాలను దెబ్బతీస్తుంది. పార్లమెంట్, శాసనసభల్లో హంగ్ ఏర్పడిన సందర్భాల్లో ఈ విధానంలో పరిష్కారం లేదు. పైపెచ్చు పార్టీ ఫిరాయింపులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను బహిరంగంగానే కొనుగోలు చేసేందుకు దారులు చూపుతుంది. జమిలి ఎన్నికల నిర్వహణతో ఆదా అయ్యే ప్రజాధనం కేంద్ర వార్షిక బడ్జెట్లో కేవలం 0.1 శాతం మాత్రమే. సంకుచిత ఆర్థిక లాభాలు, పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాంగం, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను త్యాగం చేయజాలం’అని ఆప్ పేర్కొంది. -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, చైనాతో ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు, దేశ ఆర్థిక స్థితిగతులు, చైనాతో సరిహద్దు సంక్షోభం, రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ండటం తదిరాలను సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ శనివారం పార్టీ నాయకురాలు సోనియాగాంధీ నివాసంలో సమావేశమైంది. విపక్షాలతో చర్చించి ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తామని పార్టీ నేత జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలు ఈసారి సమావేశాలకు దూరం కానున్నారు. నా వ్యాఖ్యల వక్రీకరణ: ఖర్గే అహ్మదాబాద్: ప్రధాని మోదీని రావణుడని తాను ప్రత్యేకంగా అనాల్సిన పని లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. ‘‘నా వ్యాఖ్యలను వక్రీకరించారు. గుజరాత్లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లపై మోదీ ముఖమే. అలా అనేలా చేసుకుంది వాళ్లే’’ అన్నారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఆప్ ప్రయత్నిస్తోందన్నారు. -
Constitution Day: ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం కాదు
న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొలీజియంతో సహా ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం, లోపరహితం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రస్తుత ఉన్న వ్యవస్థ నుంచే కనిపెట్టాలని తెలిపారు. రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగాన్ని అమలుపర్చే న్యాయమూర్తులను విశ్వసనీయమైన సైనికులుగా అభివర్ణించారు. ప్రజాసేవ పట్ల అంకితభావం, అనురక్తి ఉన్నవాళ్లు న్యాయ వ్యవస్థలో చేరాలని సీజేఐ సూచించారు. న్యాయవాద వృత్తిలో వలస పాలన కాలం నాటి ఆచారాలను వదిలించుకోవాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు. లాయర్లకు కఠినంగా అమల్లో ఉన్న డ్రెస్ కోడ్‌ను పునఃపరిశీలించాలన్నారు. మన జీవన విధానం, మన వాతావరణానికి తగ్గట్టుగా డ్రెస్ కోడ్ ఉండాలని సూచించారు. -
శాసనసభ తల వంచదు
సాక్షి, అమరావతి: చట్ట సభలకు రాజ్యాంగం ప్రసాదించిన సర్వ స్వాతంత్య్ర, సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని కచ్చితంగా కాపాడి తీరతామని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ‘చట్టాలు చేసే విషయంలో శాసనసభ రాజీపడదు.. తన తలను ఎవరికీ తాకట్టు పెట్టదు.. ఎవరికీ తల వంచదు’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశంపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై శాసనసభలో గురువారం నిర్వహించిన చర్చ ముగింపు సందర్భంగా స్పీకర్ తన అభిప్రాయాన్ని విస్పష్టంగా ప్రకటించారు. రాజ్యాంగ వ్యవస్థలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమతమ అధికార పరిధికి లోబడే పని చేయాలన్నారు. ఈ మూడు వ్యవస్థలు తమ అధికార పరిధుల మధ్య ఉన్న సన్నని విభజన రేఖను అతిక్రమించకుండా, ఒకదాని అధికారాల్లో మరొకటి జోక్యం చేసుకోకుండా రాజ్యాంగం తమకు నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తించాలని చెప్పారు. చట్టాలు చేసే అధికారం.. ప్రజా ప్రయోజనకర అంశాల్లో తీర్మానాలు చేసే అధికారం చట్ట సభలకు లేదంటే ఎలా? అని ప్రశ్నించారు. శాసన వ్యవస్థకు చట్టాలు, తీర్మానాలు చేసే అధికారాన్ని రాజ్యాంగమే ప్రసాదించిందని, ఆ హక్కును ఎవరూ కాలరాయలేరన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, అంతమాత్రాన చట్ట సభల ఆత్మగౌరవం, రాజ్యాంగ బద్ధమైన హక్కులకు భంగం కలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతించే ప్రశ్నే లేదన్నారు. చట్ట సభ రాజ్యాంగ బద్ధమైన హక్కును, స్వాతంత్రతను కచ్చితంగా కాపాడి, భావి తరాలకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత సభలో సభ్యులందరిపైనా ఉందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చట్ట సభ ద్వారా సంక్రమించిన రాజ్యాంగబద్ధ అధికారాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. -
ప్రభుత్వ తోడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నా: నిమ్మగడ్డ
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో గతంలో లాగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన తిరిగి విధులకు హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘శుక్రవారమే బాధ్యతలను స్వీకరించా. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్లకు, అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి తెలియజేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగన రాజ్యాంగ వ్యవస్థ. ఇది రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. -
మోదీ, గాడ్సేలది ఒకే భావజాలం: రాహుల్
వయనాడ్: ప్రధాని మోదీ, జాతిపిత మహాత్మ గాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేది ఒకే రకమైన భావజాలమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘రాజ్యాంగ పరిరక్షణ’ ఉద్యమంలో భాగంగా బుధవారం కేరళలోని కాల్పెట్టాలో రాహుల్ గాంధీ వేలాది మంది పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ.. తరహా భావజాలం కలిగిన వాడేనని, కాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకునే ధైర్యం మోదీకి లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో యువతకు భవిష్యత్తు లేదని, పాకిస్థాన్ గురించి ప్రధాని ఎంత మాట్లాడినా మన యువకులకు ఉద్యోగాలైతే రావని అన్నారు. -
ఆరెస్సెస్ వల్లే అరాచకత్వం
భువనేశ్వర్: దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లో చొచ్చుకునిపోయేందుకు, వాటిని నియంత్రించేందుకు ఆర్ఎస్ఎస్ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అందువల్లే న్యాయవ్యవస్థ, న్యాయవ్యవస్థ సహా దేశంలో గందరగోళం, అరాచకత్వం రాజ్యమేలుతోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ప్రజలను కలుసుకోవడంలో భాగంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ పలువురు మేధావులతో ముచ్చటించారు. ‘1991లో, 2004–14 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన సరళీకరణ విధానాలతోనే దేశంలో మధ్యతరగతి అవతరించింది’ అని రాహుల్ తెలిపారు. ‘బీజేపీ, ఆరెస్సెస్ నేతలు నన్ను తరచుగా దూషిస్తూ ఉంటారు. వాటిని నేను బహుమానంగా స్వీకరిస్తా. ఎందుకంటే ఆ విమర్శలు నన్ను మరింత రాటుదేలేలా చేశాయి’ అని అన్నారు. ప్రియాంక రాకపై గతంలోనే నిర్ణయం సోదరి ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి రావాలని కొన్నేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ స్పష్టంచేశారు. మిరాయా, రైహాన్ వాద్రాలు చిన్నపిల్లలు కావడంతో ప్రియాంక రాజకీయాలకు దూరంగా ఉన్నారన్నారు. ప్రస్తుతానికి యూపీలో కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడమే ప్రియాంక లక్ష్యమనీ, ఎలాంటి ఇతర బాధ్యతలు ఆమెకు అప్పగించలేదని స్పష్టం చేశారు. తామిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందనీ, నానమ్మ ఇందిర, తండ్రి రాజీవ్‌ల హత్యల తర్వాత అది మరింత దృఢపడిందని రాహుల్ పేర్కొన్నారు. తనను, ప్రియాంక పక్కపక్క గదుల్లో కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగితే దాదాపు 80 శాతం ఒకేరకమైన సమాధానం వస్తుందని తెలిపారు.బీజేపీ నేత, సుల్తాన్పూర్ ఎంపీ వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటి ఊహాగానాలు వస్తున్నట్లు తనకు తెలియదన్నారు. -
గత పాలకులు వ్యవస్థలను భ్రష్టు పట్టించారు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి * వాటిని మేం సరిదిద్దుతున్నాం * నాలుగు నెలల్లోగా వీసీల నియామకం * నెలాఖరులోగా మొదటి విడత ఫీజు బకాయిలు విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్య, సంక్షేమం, పాలన, రాజ్యాంగ వ్యవస్థలను గత పాలకులే భ్రష్టు పట్టించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. అలాంటి వారికి ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. గత పాలకులు చేసిన తప్పులను ఇప్పుడు సరిదిద్దడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతున్నామని వివరించారు. సచివాలయంలో శుక్రవారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ, విద్యారంగంలో గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, నియామకాలు చేపట్టకపోవడం వల్ల యూనివర్సిటీలు నాక్ గుర్తింపును కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎక్కడా అధ్యాపకులు ఉండాల్సిన నిష్పత్తి ప్రకారం లేరన్నారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు ఇష్టానుసారంగా అనుమతి ఇచ్చారని, కానీ సిబ్బందిని, వసతులను కల్పించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు యూనివర్సిటీలు, కాలేజీల్లో సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తరువాత మిగతా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కొత్త రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా యూనివర్సిటీల చట్టాన్ని రూపొందిస్తున్నామని చెప్పా రు. వచ్చే నాలుగు నెలల్లోగా యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్లను నియమించడంతోపాటు పాలక మండళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఇంటర్మీడియెట్ బోర్డులో ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చామన్నారు. ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణ జరిపి చర్యలు చేపట్టామన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఉపాధ్యాయులపైనా చర్యలు తప్పవన్నారు. టీచర్ల సర్వీసు రూల్స్‌పై త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతామన్నారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. గత పాలకులు ఇవ్వని 2013-14 ఫీజు బకాయిలను తాము క్రమంగా చెల్లిస్తూ వస్తున్నామన్నారు. ఈ నెలాఖరులోగా మొదటి విడత ఫీజు బకాయిలను విడుదల చేస్తామన్నారు. ఎర్రబెల్లిని చూస్తే జాలేస్తోంది... ఎర్రబెల్లి దయాకర్‌రావును చూస్తే జాలేస్తోందన్నారు. ‘బదిలీల్లో అక్రమాలంటూ ఓసారి సీబీసీఐడీ విచారణకు, మరోసారి సీబీఐ విచారణకు ఆదేశించాలంటారు.. ఇపుడు నన్ను భర్తరఫ్ చేయాలని అంటున్నారు.. నేను భర్తరఫ్ అయితే పార్టీలోకి వచ్చి మంత్రి కావాలనుకుంటున్నాడు. అందుకే అతన్ని చూస్తే జాలేస్తోంది’ అని కడియం పేర్కొన్నారు. ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో దూరవిద్య విధానంలో నిర్వహిస్తున్న ఎస్ఎస్సీ, ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు అభ్యర్థులు ప్రవేశాలు పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 19 వరకు ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందొచ్చని వివరించారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్‌సొసైటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వేంకటేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.