గత పాలకులు వ్యవస్థలను భ్రష్టు పట్టించారు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
* వాటిని మేం సరిదిద్దుతున్నాం
* నాలుగు నెలల్లోగా వీసీల నియామకం
* నెలాఖరులోగా మొదటి విడత ఫీజు బకాయిలు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్య, సంక్షేమం, పాలన, రాజ్యాంగ వ్యవస్థలను గత పాలకులే భ్రష్టు పట్టించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. అలాంటి వారికి ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. గత పాలకులు చేసిన తప్పులను ఇప్పుడు సరిదిద్దడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతున్నామని వివరించారు.
సచివాలయంలో శుక్రవారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ, విద్యారంగంలో గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, నియామకాలు చేపట్టకపోవడం వల్ల యూనివర్సిటీలు నాక్ గుర్తింపును కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎక్కడా అధ్యాపకులు ఉండాల్సిన నిష్పత్తి ప్రకారం లేరన్నారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు ఇష్టానుసారంగా అనుమతి ఇచ్చారని, కానీ సిబ్బందిని, వసతులను కల్పించలేదని పేర్కొన్నారు.
ఇప్పుడు యూనివర్సిటీలు, కాలేజీల్లో సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తరువాత మిగతా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కొత్త రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా యూనివర్సిటీల చట్టాన్ని రూపొందిస్తున్నామని చెప్పా రు. వచ్చే నాలుగు నెలల్లోగా యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్లను నియమించడంతోపాటు పాలక మండళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఇంటర్మీడియెట్ బోర్డులో ఆన్‌లైన్ విధానం అమల్లోకి తెచ్చామన్నారు.
ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణ జరిపి చర్యలు చేపట్టామన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఉపాధ్యాయులపైనా చర్యలు తప్పవన్నారు. టీచర్ల సర్వీసు రూల్స్‌పై త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతామన్నారు.
సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట
ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. గత పాలకులు ఇవ్వని 2013-14 ఫీజు బకాయిలను తాము క్రమంగా చెల్లిస్తూ వస్తున్నామన్నారు. ఈ నెలాఖరులోగా మొదటి విడత ఫీజు బకాయిలను విడుదల చేస్తామన్నారు.
ఎర్రబెల్లిని చూస్తే జాలేస్తోంది...
ఎర్రబెల్లి దయాకర్‌రావును చూస్తే జాలేస్తోందన్నారు. ‘బదిలీల్లో అక్రమాలంటూ ఓసారి సీబీసీఐడీ విచారణకు, మరోసారి సీబీఐ విచారణకు ఆదేశించాలంటారు.. ఇపుడు నన్ను భర్తరఫ్ చేయాలని అంటున్నారు.. నేను భర్తరఫ్ అయితే పార్టీలోకి వచ్చి మంత్రి కావాలనుకుంటున్నాడు. అందుకే అతన్ని చూస్తే జాలేస్తోంది’ అని కడియం పేర్కొన్నారు.
ఓపెన్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్
రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో దూరవిద్య విధానంలో నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు అభ్యర్థులు ప్రవేశాలు పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 19 వరకు ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందొచ్చని వివరించారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్‌సొసైటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వేంకటేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.