ప్రస్తుత నిబంధనల మేరకే గ్రూప్-2
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థ రద్దుతో సంబంధం లేకుండా.. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలతోనే గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు పలు ఉద్యోగ పరీక్షల నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుమతినిచ్చారు. ఈ మేరకు గురువారం లేదా శుక్రవారం గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ జారీకానుంది. మొత్తంగా 1,032 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రధాన నోటిఫికేషన్‌లో పేర్కొన్న 439 పోస్టుల కోసం 5.65 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... అయితే తాజా అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరింత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
సీఎంతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ భేటీ
ఉద్యోగ పరీక్షల అంశంపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయాల నేపథ్యంలో... పోస్టుల భర్తీపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించారు. అయితే ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ జారీకి టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలను అక్టోబర్ చివరి వారంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 6 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున జాప్యం జరిగితే... నవంబర్ చివరి వారంలో పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి.
ఇండెంట్లు రాగానే గురుకుల టీచర్ల నోటిఫికేషన్
సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన మేరకు 2,444 పోస్టుల భర్తీకి అవకాశముంది. వాటికి సంబంధించి ఆయా శాఖల నుంచి ఇండెంట్లు ఇప్పటికే అందాయి కూడా. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన 180 మైనారిటీ గురుకులాలకు మంజూరు చేసిన పోస్టులు, మరికొన్ని పాత ఖాళీలు కలిపి మరో 3,292 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి ఇండెంట్లు రావాల్సి ఉంది. అవి అందగానే మొత్తంగా 5,736 గురుకుల టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇండెంట్ల కోసం ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించి.. వచ్చే వారం పది రోజుల్లో ఈ నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.