గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
⇒ 439 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గ్రీన్ సిగ్నల్
⇒ 311 గ్రేడ్-2 అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, మెట్రో వాటర్‌వర్క్స్‌లో
⇒ 44 గ్రేడ్-2 టెక్నీషియన్, 2 డీజీఎం పోస్టులకూ నోటిఫికేషన్లు
⇒ అన్నింటికీ నేటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
⇒ అర్హతలు, వయోపరిమితి వివరాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం మూడు నెలల కిందట ఆమోదించిన 439 గ్రూప్ 2 పోస్టులతోపాటు వ్యవసాయశాఖలో 311 గ్రేడ్-2 అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టులు, హైదరాబాద్ జల మండలిలో 44 గ్రేడ్-2 టెక్నీషియన్ పోస్టులు, 2 డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం-ఫైనాన్స్) పోస్టులతో కలిపి మొత్తం 796 పోస్టుల భర్తీకి బుధవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్ 2 రాత పరీక్షలను 2016 ఏప్రిల్ 24, 25 తేదీల్లో నిర్వహించాలని తాత్కాలికంగా తేదీలను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని పోస్టులకూ గురువారం నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, వయోపరిమితి, సిలబస్ తదితర అంశాలను గురువారం నుంచి టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు.
ఏప్రిల్‌లోగా మరిన్ని పోస్టులు
ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఆర్థికశాఖ ఇప్పటికే పంపిన దాదాపు 10 వేల పోస్టుల్లో గ్రూపు-2 పోస్టులతోపాటు గ్రూపు-3, గ్రూపు-4 వంటి పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులన్నింటికీ జనవరి లేదా ఫిబ్రవరిలో కేసీఆర్ ఆమోదం లభిస్తుందని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. ఎంత ఆలస్యమైనా ఏప్రిల్ నాటికైతే ప్రభుత్వం నుంచి ఎలాగైనా ఆమోదం లభిస్తుందని పేర్కొంటున్నాయి. దీంతో ఆయా పోస్టులను సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా ఇదే నోటిఫికేషన్ పరిధిలోకి తేవచ్చని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.
తప్పిన వయో పరిమితి తంటా
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం గత జూలై 27న పదేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి ఏడాదిపాటు అమల్లో ఉంటాయిని అందులో పేర్కొంది. అయినప్పటికీ నియామక నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏ సంవత్సరంలో (కేలండర్ ఇయర్) ఉత్తర్వులు జారీ చేస్తుందో ఆ సంవత్సరపు డిసెంబర్ 31 వరకు ఆ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31లోగా గ్రూప్-2 వంటి ప్రధానమైన నోటిఫికేషన్ రాకపోతే తమకు వయోపరిమితి పెంపు వర్తించక నష్టపోయే పరిస్థితి వ స్తుందని చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందారు. అయితే వారి ఆందోళనకు తెరదించుతూ టీఎస్‌పీఎస్సీ బుధవారం (డిసెంబర్ 30న) నోటిఫికేషన్లు జారీ చేసింది. ఫలితంగా అభ్యర్థులందరికీ ప్రభుత్వం ఇచ్చిన గరిష్ట వయోపరిమితి పెంపు వర్తించనుంది. ఇక ప్రభుత్వం మరిన్ని పోస్టులకు అనుమతి ఇచ్చినా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా ఇదే నోటిఫికేషన్ పరిధిలోకి తీసుకువచ్చే వీలుంది. దీంతో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కొత్త పోస్టులు వచ్చినా.. ఇదే నోటిఫికేషన్ కిందకే వస్తాయి కనుక సమస్య ఉండదు.
గ్రూపు-2తోపాటు ఇతర నోటిఫికేషన్ల వివరాలు
నోటిఫికేషన్ నంబర్ కేటగిరీ పోస్టుల సంఖ్య దరఖాస్తులు ప్రారంభం దరఖాస్తుల ముగింపు తాత్కాలిక పరీక్ష తేదీ
20/2015 గ్రూప్-2 439 31/12/2015 09/02/2016 24/04/2015, 25/04/2015
17/2015 డీజీఎం 02 31/12/2015 22/01/2016 21/02/2016
18/2015 గ్రేడ్-2 టెక్నీషియన్ 44 31/12/2015 28/01/2016 మార్చిలో (తేదీ తరువాత ప్రకటిస్తారు.)
19/2015 గ్రేడ్-2 ఏఈవో 311 31/12/2015 25/01/2015 మార్చిలో (తేదీ తరువాత ప్రకటిస్తారు.).
గ్రూప్-2లో కేటగిరీ వారీగా పోస్టులు
కేటగిరీ పోస్టుల సంఖ్య
గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ 19
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 110
గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ 23
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (పంచాయతీరాజ్) 67
ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ 220
మొత్తం 439