మెయిన్స్‌కు మళ్లీ అభ్యర్థులను ఎంపిక చేయాలి
గ్రూప్ 1 పై పిటిషనర్ల వాదనలు
టీజీపీఎస్సీకి అన్ని అధికారాలు ఉంటాయన్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అధికారం టీఎస్‌పీఎస్సీకి లేదని పలువురు పిటిషనర్లు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం అనుమతిస్తేనే టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో హైకోర్టు ప్రిలిమ్స్‌ను మాత్రమే రద్దు చేసిందని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని చెప్పిందని పేర్కొన్నారు. అయితే తొలుత జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేయడం ధిక్కరణ కిందకే వస్తుందన్నారు.
రెండో నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలు తొలగించి, మెయిన్స్‌కు మళ్లీ అభ్యర్థులను ఎంపిక చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల వాదనను ప్రభుత్వం తప్పుబట్టింది. టీఎస్‌పీఎస్సీకి అన్ని అధికారా లుంటాయని స్పష్టం చేసింది. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
6 శాతం ఎస్టీ రిజర్వేషన్లే అమలు చేయాలి: పిటిషనర్లు
గ్రూప్–1కు రీ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని, తాజా ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ పుల్ల కార్తీక్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ల తరఫున న్యాయ వాది జొన్నలగడ్డ సు«దీర్ వాదనలు వినిపించారు. ‘టీఎస్‌పీఎస్సీ 503 పోస్టులకు 2022, ఏప్రిల్ 26న తొలి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు 6 శాతమే ఉన్నాయి. ఆ తర్వాత 10 శాతానికి పెంచారు. అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు 6 శాతమే అమలు చేయాలి. లేదంటే జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది..’అని చెప్పారు.
రీనోటిఫికేషన్‌తో అభ్యర్థులకు లబ్ధి: ప్రభుత్వం
ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘టీఎస్‌పీఎస్సీ చట్టబద్ధమైన సంస్థ. నియామకాలకు సంబంధించి ఎలాంటి చర్యలైనా చేపట్టే అధికారం కమిషన్‌కు ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. నేరుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. 2024 ఫిబ్ర వరి 19న 563 పోస్టులకు ఇచ్చిన రీ నోటిఫికేషన్‌తో ఎవ రికీ నష్టం కలుగలేదు. పైగా 60 పోస్టులు పెరగడం అభ్యర్థులకు లబ్ధి చేకూర్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా పెరిగారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన ఎక్కడా జరగలేదు..’అని తెలిపారు. అనంతరం సమయం ముగియడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment