Group-1 Mains
-
జీఓ 29పై న్యాయ పోరాటం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల విషయంలో విద్యార్థుల కోరిక మేరకు బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో కేసు వేసిందని, జీఓ 29పై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. ‘మేము లేవనెత్తిన ఏ అంశాన్నీ సుప్రీంకోర్టు వ్యతిరేకించలేదు. జీఓ 29పై తీర్పు వచ్చేంత వరకు ఫలితాలు ఇవ్వవద్దని ఆదేశించడంతో పాటు వేగంగా విచారణ జరపాలని కోరింది. కోర్టు కేసు తేలేదాకా మేము విద్యార్థులకు అండగా ఉంటాం..’అని స్పష్టం చేశారు.సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్, కోవాలక్షి్మ, కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రసమయి బాలకిషన్, గ్యాదరి కిశోర్, నరేందర్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘జీవో 29 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణేతరులకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. జీవో 29 విషయంలోనే కాదు,ం జీవో 48, గ్రూప్ 4 ఉద్యోగుల విషయంలో కూడా కోర్టులో పోరాడతాం.’అని తెలిపారు. రేవంత్‌రెడ్డికి సంజయ్ రహస్య మిత్రుడు ‘విదేశీ పర్యటనకు వెళ్లిన జర్నలిస్టులను అవమానించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీ విషయంలో మాకన్నా ఎక్కువ పోరాడాల్సిన బాధ్యత మీడియాదే. కళ్ల ముందే మూసీ పేరిట జరుగుతున్న కుంభకోణాన్ని ప్రశి్నస్తున్నాం. మూసీ పేరిట లూటీని మరుగు పరిచేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నడుమ రహస్య స్నేహం కొనసాగుతోంది. రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ రహస్య స్నేహితుడు. అందుకే రేవంత్ ప్రభుత్వాన్ని మంత్రులు కూల్చేస్తారంటూ బండి సంజయ్ బాధపడుతున్నాడు. పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడులు, కర్ణాటకలో వాలీ్మకి స్కామ్, అమృత్ కుంభకోణంలో సీఎం బావమరిదికి కాంట్రాక్టు తదితరాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదు..’అని కేటీఆర్ అన్నారు. -
గ్రూప్–1 మెయిన్స్‌కు 72.4 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వరుసగా వారం పాటు జరిగే ఈ పరీక్షల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ టెస్ట్) పరీక్ష జరిగింది. అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని 46 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. 1.30 గంటలకు కేంద్రాలను మూసివేశారు. ఆలస్యంగా వచ్చినవారిని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. ఒకచోట నిమిషం ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థిని లోపలికి అనుమతించకపోవడంతో.. ఆ అభ్యర్థి ప్రహరీగోడ దూకివెళ్లాడు. కానీ పోలీసులు వెంబడించి పట్టుకుని.. బయటికి పంపించేశారు.22,744 మంది హాజరుమొత్తం 563 గ్రూప్–1 పోస్టులకు సంబంధించి మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా.. సోమవారం జరిగిన జనరల్ ఇంగ్లిష్ పరీక్షకు 22,744 మంది, అంటే 72.4 శాతం మంది హాజరయ్యారు. సరైన సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతోపాటు ఇతర కారణాలతో చాలా మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం గట్టి ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రం చుట్టూరా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు.. పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితిని, నిర్వహణ తీరును పర్యవేక్షించారు.ఉత్కంఠకు తెరగ్రూప్–1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలనే డిమాండ్‌తో అభ్యర్థులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు తెలుగు అకాడమీ పుస్తకాలు అధికారికం కావని ప్రభుత్వం పేర్కొనడం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, పలు ఇతర అంశాలపైనా ఆందోళన వ్యక్తమైంది. అభ్యర్థులకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతుగా నిలవడంతోపాటు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. మరోవైపు అభ్యర్థులు న్యాయ పోరాటానికి సైతం దిగారు. వారి పిటిషన్లను హైకోర్టు తిరస్కరించగా.. సోమవారం సుప్రీంకోర్టులో జరిగే విచారణపై ఆశలు పెట్టుకున్నారు. కానీ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో.. ఉత్కంఠకు తెరపడింది.మధ్యస్తంగా జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రంమెయిన్స్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన తొలి పరీక్ష.. జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రం మధ్యస్తంగా ఉందని అభ్యర్థులు తెలిపారు. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఇస్తున్నట్టు టీజీపీఎస్సీ పేర్కొన్నా.. కొన్ని ప్రశ్నలు సులభంగా అనిపించినా, అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని పేర్కొన్నారు. క్వాలిఫయింగ్ పరీక్ష అయిన ఈ పేపర్ చాలా మంది అభ్యర్థులు అర్హత సాధించే విధంగానే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో జనరల్ ఇంగ్లిష్ కీలకమైనది. అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధిస్తేనే.. తదుపరి పరీక్షలకు సంబంధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోవడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు.అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలుగ్రూప్–1 మెయిన్స్‌కు హాజరవుతున్న అభ్యర్థులు ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పరీక్షలకు హాజరవుతున్న వారందరికీ శుభాకాంక్షలు అంటూ సోమవారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని.. విజయం సాధించి, తెలంగాణ పునర్ని ర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అందులో పేర్కొన్నారు.రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిమెయిన్స్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు గ్రూప్–1 ఆఫీసర్లుగా ఎంపికై ప్రజాప్రభుత్వంలో, ప్రగతి తెలంగాణలో భాగస్వామ్యం కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు వేస్తున్న ఎత్తుగడల్లో నిరుద్యోగులు చిక్కకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
గ్రూప్–1 పరీక్షలు యథాతథం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికకు పాటించిన విధానంతో రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న మహేశ్‌కుమార్ గౌడ్ శనివారం సాయంత్రం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని పొన్నం ప్రభాకర్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతోపాటు టీజీపీఎస్సీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రూప్–1 అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు, సమస్యలను మహేశ్ గౌడ్ ప్రస్తావించారు. ప్రధానంగా జీఓ 29పై అభ్యర్థుల్లో భిన్నాభిప్రాయాలు, అనుమానాలున్నాయన్నారు. ఈ క్రమంలో దీనిపై కోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ పరీక్షలో ఏ విద్యార్థికీ అన్యాయం జరగొద్దని, రిజర్వేషన్ల పరంగా ఎలాంటి నష్టం కలగకుండా అన్ని వర్గాలకు న్యాయం జరగాలని మంత్రులు స్పష్టం చేశారు. మంత్రులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సాంకేతికపరమైన వివరణలు ఇచ్చారు. అనంతరం పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పరీక్షలు యధాతథంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆదివారం ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సమాచారం. -
ఇంత నిరంకుశ, నిర్బంధ పాలనా?
లాలాపేట (హైదరాబాద్): ‘‘గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను ఒక నెలో, రెండు నెలలో, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేవరకో వాయిదా వేస్తే మీ కొంపలేమీ మునిగిపోవు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 అభ్యర్థులను పిలిచి వారి సహేతుకమైన కారణాలను అడిగి తెలుసుకోవాలి..’’అని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను పశువుల్లా చూస్తుండటం చాలా దారుణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కుతూ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను మాత్రం రాచమర్యాదలతో అశోక్‌నగర్‌కు వెళ్లనిచ్చారని.. సీఎం రేవంత్, బండి సంజయ్ దోస్తులేనని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. శనివారం తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘జీవో నంబర్ 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులు భారీగా నష్టపోతున్నారు. కేసీఆర్ హయాంలో తీసుకువచ్చిన 95శాతం లోకల్ రిజర్వేషన్‌ను తుంగలో తొక్కుతున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలను కాకుండా వికీపీడియాను ప్రామాణికంగా తీసుకోవాలనే అర్థం లేని వాదనలు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ. అభ్యర్థులు 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయం. వారిలో కాబోయే డీఎస్పీలు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. అలాంటి వారిని పశువుల్లాగా ప్రభుత్వం చూస్తుండటం దారుణం. అభ్యర్థులతో ముఖ్యమంత్రిగానీ, చీఫ్ సెక్రెటరీ, పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గానీ ఎవరైనా చర్చలకు పిలిచి మాట్లాడాలి. ఏమిటీ నిరంకుశ, నిర్బంధ పాలన? గతంలో రాహుల్ గాం«దీ, రేవంత్‌రెడ్డిలో అశోక్‌నగర్‌కు వెళ్లి ప్రభుత్వం ఏర్పాటైన తొలి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పొంకనాలు కొట్టారు. నేడు కనీసం అభ్యర్థుల మాటలను ఆలకించని పరిస్థితి ఉంది. తెలంగాణ భవిష్యత్‌కు సారథులుగా వ్యవహరించే గ్రూప్–1 అభ్యర్థులనే ప్రభుత్వం ఇలా చూస్తుంటే.. మిగతా యువత పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి. గ్రూప్–1 అభ్యర్థుల తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. సోమవారం వాదనలు జరగనున్నాయి. గతంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మొండిగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది. కోర్టు తీర్పుతో మళ్లీ నిర్వ హించాల్సి వచ్చిందని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవా లి. తమది ప్రజాపాలన అని, తమ ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ ఫోజులు కొట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పు డు ఎందుకింత నిరంకుశ, నిర్బంధ పరిస్థితులు తీసుకువచ్చారు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.బండి సంజయ్‌కు గ్రూప్–1 పరీక్ష గురించే అర్థంకాదు.. రాష్ట్ర ప్రభుత్వం శిఖండి రాజకీయాల్లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ముందుపెట్టి గ్రూప్–1 అభ్యర్థుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తోంది. బండి సంజయ్ ఏమన్నా చదువుకున్నారా.. పరీక్ష రాసింది ఉందా? గ్రూ ప్–1 పరీక్షపై ఆయనకు చెప్పినా అర్థంకాదు, పేపర్ లీకులు మాత్రం చేస్తారు. రాష్ట్ర ప్రభు త్వం బండి సంజయ్ వంటి వారితో కాదు. ఓ 10 మంది గ్రూప్–1 అభ్యర్థులతో మాట్లాడాలి. రైతు బంధు ఏదీ? రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎలాంటి భరోసా లేకుండా పోయింది. ఇప్పటికీ రైతు బంధు ఇవ్వలేదు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి. తప్పకుండా రైతుల తరఫున పోరాడుతాం... -
సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ మూడురోజుల క్రితం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన గంగుల దామోదర్‌రెడ్డితోపాటు మరో నలుగురు హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సచ్చిస్ కమిషన్, జీఏడీ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చా రు. ఈ అప్పీల్‌పై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది. ‘ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను ప్రచురించే ముందు ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను నిష్పాక్షికంగా పరిశీలించాలి. ఆ అభ్యంతరాలపై పూర్తి పరిశీలన జరిగిన తర్వాతే మెరిట్ జాబితా ప్రకటించాలి. కానీ టీజీపీఎస్సీ ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. తప్పుగా వచ్చిన ప్రశ్నలను తొలగించి మళ్లీ మెరిట్ జాబితా ప్రకటించేలా ఆదేశించాలి’అని దామోదర్‌రెడ్డితోపాటు మరికొందరు దాఖలుచేసిన రిట్ పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేశారు. సాంకేతిక అంశాలను నిపుణుల కమిటీకే వదిలేయాలని, కోర్టుల జోక్యం కూడదని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ తాజాగా పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్లో పేర్కొన్న అంశాలివీ.. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులు చట్టవిరుద్ధం. గ్రూప్–1 ప్రిలిమ్స్ ‘కీ’లో కొన్ని ప్రశ్నలు, జవాబుల్లో స్పష్టంగా తప్పులు కనిపిస్తున్నాయి. వాటిని, పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే రిట్ పిటిషన్ కొట్టివేశారు. నిపుణుల కమిటీ నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని చెప్పారు. తప్పుడు ప్రశ్నలు తొలగిస్తే మెరిట్ జాబితా అంతా మారిపోతుందని అందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. కొన్ని ప్రశ్నలు తప్పుగా రూపొందించిన విషయాన్నీ గ్రహించలేదు. సింగిల్ జడ్జి మా పిటిషన్లను కొట్టివేయడం ద్వారా తప్పుడు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వారు కూడా మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు అవుతుంది. ఈ తప్పుడు ప్రశ్నలకు అనుకోకుండా పిటిషనర్లు కొందరు సరైన సమాధానం ఇవ్వడాన్ని టీజీపీఎస్సీ సింగిల్ జడ్జి ముందు పేర్కొంది. ప్రిలిమ్స్‌తోనే నేరుగా జాబ్ ఇవ్వకపోయినా మెయిన్స్ పరీక్ష రాయడానికి అదే కీలకం.ఇలా తప్పుడు ‘కీ’తో అర్హత సాధించి పోస్టుల్లో చేరే వారు తదుపరి మూడు దశాబ్దాల పాటు అధికారులుగా విధులు నిర్వహిస్తారు. రాహుల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. ఈనెల 15న సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి’అని ద్విసభ్య ధర్మాసనం ముందు దాఖలుచేసిన అప్పీల్లో కోరారు. -
గ్రూప్–1 మెయిన్స్‌కు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు లైన్‌క్లియర్ చేసింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉన్న చట్టపరమైన అడ్డంకులను తొలగించింది. రీనోటిఫికేషన్, ‘కీ’ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం కొట్టివేసింది. రీనోటిఫికేషన్‌పై పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఒక్కరే కమిషన్‌కు అభ్యంతరం తెలుపుతూ వినతిపత్రం సమర్పించారని పేర్కొంది. పిటిషన్లపై టీజీపీఎస్సీ వినిపించిన వాదనలతో సంతృప్తి చెందినట్టు స్పష్టం చేసింది. కొన్ని అంశాల్లో నిపుణుల అభిప్రాయం తప్పనిసరిగా ఉండాలని..వారి విజ్ఞతను న్యాయస్థానాలు భర్తీ చేయలేవని వ్యాఖ్యానించింది. సాంకేతిక స్వభావమున్న విషయాల్లో నిర్ణయాన్ని నిపుణుల సంస్థలకే వదిలివేయాలని చెప్పింది. గ్రూప్–1 ‘కీ’పై టీజీపీఎస్సీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత న్యాయస్థానం కలుగజేసుకోవడం అవసరం లేదని అభిప్రాయపడింది. ‘1,721 మంది అభ్యర్థులు లేవనెత్తిన 6,417 అభ్యంతరాలను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించింది. ఇందులో కొందరు పిటిషనర్లు కూడా ఉన్నారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఆధారంగానే తుది కీ ప్రచురించాం. జూలై 7న తుది కీ విడుదల చేసి.. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెలువరించాం. మొత్తం ఖాళీల సంఖ్యకు 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు’అన్న టీజీపీఎస్సీ వాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తీర్పునిచ్చింది. ‘ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను ప్రచురించే ముందు ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను నిష్పాక్షికంగా పరిగణించాలి. ఆ అభ్యంతరాలపై పూర్తి పరిశీలన జరిగిన తర్వాతే మెరిట్ జాబితా ప్రకటించాలి. కానీ టీజీపీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్‌పై ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. తప్పుగా వచ్చిన ప్రశ్నలను తొలగించి మళ్లీ మెరిట్ జాబితా ప్రకటించేలా ఆదేశించాలి’అని వికారాబాద్‌కు చెందిన దామోదర్‌రెడ్డితోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీ నోటిఫికేషన్, ఎస్టీ రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ మరికొందరు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టి ఈ నెల 4న తీర్పు రిజర్వు చేశారు. మంగళవారం.. పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. -
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్
-
14 నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–1 మెయిన్స్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్లు ఈ నెల 14 నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయ ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు కమిషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాన్ని ముందుగానే సందర్శించాలని కమిషన్ సూచించింది. మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను కేంద్రంలోనికి అనుమతించరని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలని డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం లేదని పేర్కొంది. సమయం తెలుసుకు నేందుకు వీలుగా పరీక్ష హాల్లో గడియారాలను ఏర్పాటు చేస్తామని కమిషన్ వివరించింది. హాల్‌టికెట్‌లో పొరపాట్లు, ఇతర సమస్యలుంటే కమిషన్ కార్యాలయం పనిదినాల్లో 040– 23542185 లేదా 040–23542187 ఫోన్ నంబర్ల లో, లేదా హెల్ప్‌డెస్క్‌కు ఈ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
TG: ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈనెల 21 నుంచి 27వరకు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహించనుంది.మధ్యాహ్నం 12:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. ఒకటిన్నర తర్వాత పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులకు అనుమతించరు. ఇక ఈ నెల 14 నుంచి వెబ్ సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. అదే విధంగా పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు.ఇక గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. 3.02లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లన్నీ అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాల్సి ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండనున్నాయి. -
రీనోటిఫికేషన్ కోర్టు ధిక్కరణే
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అధికారం టీఎస్పీఎస్సీకి లేదని పలువురు పిటిషనర్లు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం అనుమతిస్తేనే టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో హైకోర్టు ప్రిలిమ్స్‌ను మాత్రమే రద్దు చేసిందని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని చెప్పిందని పేర్కొన్నారు. అయితే తొలుత జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ రద్దు చేయడం ధిక్కరణ కిందకే వస్తుందన్నారు.రెండో నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలు తొలగించి, మెయిన్స్‌కు మళ్లీ అభ్యర్థులను ఎంపిక చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల వాదనను ప్రభుత్వం తప్పుబట్టింది. టీఎస్పీఎస్సీకి అన్ని అధికారా లుంటాయని స్పష్టం చేసింది. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 6 శాతం ఎస్టీ రిజర్వేషన్లే అమలు చేయాలి: పిటిషనర్లు గ్రూప్–1కు రీ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని, తాజా ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ పుల్ల కార్తీక్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ల తరఫున న్యాయ వాది జొన్నలగడ్డ సు«దీర్ వాదనలు వినిపించారు. ‘టీఎస్పీఎస్సీ 503 పోస్టులకు 2022, ఏప్రిల్ 26న తొలి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు 6 శాతమే ఉన్నాయి. ఆ తర్వాత 10 శాతానికి పెంచారు. అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు 6 శాతమే అమలు చేయాలి. లేదంటే జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది..’అని చెప్పారు. రీనోటిఫికేషన్‌తో అభ్యర్థులకు లబ్ధి: ప్రభుత్వం ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘టీఎస్పీఎస్సీ చట్టబద్ధమైన సంస్థ. నియామకాలకు సంబంధించి ఎలాంటి చర్యలైనా చేపట్టే అధికారం కమిషన్‌కు ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. నేరుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. 2024 ఫిబ్ర వరి 19న 563 పోస్టులకు ఇచ్చిన రీ నోటిఫికేషన్‌తో ఎవ రికీ నష్టం కలుగలేదు. పైగా 60 పోస్టులు పెరగడం అభ్యర్థులకు లబ్ధి చేకూర్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా పెరిగారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన ఎక్కడా జరగలేదు..’అని తెలిపారు. అనంతరం సమయం ముగియడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. మెయిన్స్‌కు 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 2–9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ శనివారం తెలిపారు. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో 4,496 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కేవలం 26 రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెల్లడించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన 81 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది డిసెంబర్ 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులకు 3 నెలలు సమయమిచ్చి ప్రిలిమ్స్‌ను మార్చి 17న రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నిర్వహించగా, 91,463 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరికి మరో ఐదున్నర నెలల సమయం ఇచ్చి సెప్టెంబర్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు. నోటిఫికేషన్లో పేర్కొన్న 81 పోస్టులకు అనంతరం మరో 8 పోస్టులను చేర్చడంతో గ్రూప్–1 పోస్టుల సంఖ్య 89కి పెరిగింది. ఇటీవల గ్రూప్–2 ఫలితాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ 1:100 నిష్పత్తిలో 905 పోస్టులకు 92,250 మంది అభ్యర్థులను మెయిన్స్ కోసం ఎంపిక చేసింది. చరిత్రలో ఇంత మంది అభ్యర్థులకు అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. ఫలించని ఎల్లో బ్యాచ్ వ్యూహం మార్చి 17న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం లేదు. దీనికోసం రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయించారు. ఈ ప్రయత్నం కూడా ఫలించకపోయేసరికి బాబుకు దిక్కుతోచలేదు. చివరికి 2018 గ్రూప్–1 పోస్టుల భర్తీపై ఎన్నోసార్లు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసి, ఓడిపోయిన అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన 2018 గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పరీక్షను రద్దు చేయమని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు చెలరేగిపోయారు. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ మీడియాకు స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. గత మూడేళ్లల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలను సకాలంలో నిర్వహించి, ముందే ప్రకటించిన షెడ్యూల్ మేరకు పోస్టులను భర్తీ చేసింది. అయినప్పటికీ ఏపీపీఎస్సీ ఇచ్చిన పలు నోటిఫికేషన్లు, పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నమంటూ లేదు. గత ఫిబ్రవరిలో గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పటికే తన బృందంతో కేసులు వేయించి పరీక్షను రద్దు చేయించాలని యత్నించారు. ఆ చిక్కులను అధిగమించి ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. తాజాగా గ్రూప్–1 విషయంలోనూ తన కుట్రలు ఫలించకపోవడంతో బాబు కంగుతిన్నారు. -
బాబు ‘గ్రూప్’ పాలి‘ట్రిక్స్’... ఆ ఉద్యోగులకు ఊరట
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2018లో జారీ చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు పొంది ప్రస్తుతం వివిధ హోదాల్లో కొనసాగుతున్న 167 మందికి తాత్కాలిక ఊరటనిస్తూ హైకోర్టు ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27వతేదీకి వాయిదా వేసింది. న్యాయ ప్రయోజనాల నిమిత్తం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంటూ న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్–1 మెయిన్స్‌కు సంబంధించి ఏపీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్‌తో ముడిపడిన అన్ని వ్యాజ్యాలను ఈ అప్పీల్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈ నెల 13న తీర్పునిచ్చారు. అలాగే గ్రూప్–1 మెయిన్స్‌లో అర్హత సాధించిన వారి జాబితాను కూడా రద్దు చేశారు. తిరిగి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్‌పై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే ఉద్యోగాలు పొందిన 167 మందికి ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు వెలువరించింది. ఉదయించిన వివాదాలు.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి స్వామికార్యం, స్వకార్యాలు చక్కబెట్టి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. తప్పులను నిలదీసిన వారిపై కేసులు బనాయించి బెదిరించారు. చంద్రబాబు సర్కారు హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన ఉదయ్ భాస్కర్ 2015 నవంబర్ 27 నుంచి 2021 నవంబర్ 26 వరకు పదవిలో కొనసాగారు. ఆ కాలంలో ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, నిర్లక్ష్యంతో సర్వీస్ కమిషన్ నిర్వీర్యమైంది. 2018 గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 62 తప్పులు దొర్లాయని 2019 జూన్‌లో అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించ వద్దని సెప్టెంబర్‌లో హైకోర్టులో రిట్ వేయడంతో స్టే ఇచ్చింది. దీనిపై సర్వీస్ కమిషన్ కోర్టులో వాదనలు వినిపించగా ఐదు తప్పులను సవరించాలని ఆదేశిస్తూ రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి మెయిన్స్ నిర్వహించేందుకు మార్గం ఏర్పడింది. బాబు బృందం మెయిన్స్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడంతో మూడుసార్లు షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది. డిజిటల్ మూల్యాంకనం నాటిదే.. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లను సంప్రదాయ పద్ధతిలో సబ్జెక్టు నిపుణులు మూల్యాంకనం చేయడం రివాజు. ఈ విధానంలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందంటూ నాటి కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదించారు. కమిషన్‌లో చంద్రబాబు నియమించిన అత్యధిక మంది సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ పేపర్లను ఈ విధానంలోనే మూల్యాంకనం చేసి 2021 ఏప్రిల్ 28న ఫలితాలను ప్రకటించారు. అయితే నోటిఫికేషన్లో డిజిటల్ మూల్యాంకనం గురించి పేర్కొనక పోవడంతో ఈ విధానాన్ని రద్దు చేయాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సంప్రదాయ విధానంలో మరోసారి మూల్యాంకనం చేయాలని 2021 అక్టోబర్ 1న హైకోర్టు ఆదేశించింది. ఉదయ్ భాస్కర్ పదవీ కాలం అదే ఏడాది నవంబర్‌లో ముగియడంతో ఏవీ రమణారెడ్డి ఇన్చార్జి చైర్మన్‌గా 2021 డిసెంబర్ 20న బాధ్యతలు చేపట్టి దాదాపు రెండు నెలలు సేవలందించారు. అనంతరం 2022 ఫిబ్రవరి 19న గౌతమ్ సవాంగ్ చైర్మన్‌గా వచ్చి మార్చిలో సంప్రదాయ మూల్యాంకనం చేశారు. మోడరేషన్‌పై తప్పుడు ప్రచారం సబ్జెక్టు నిపుణులు మాన్యువల్‌గా మూల్యాంకనం చేసినప్పుడు మార్కుల్లో చోటు చేసుకునే వ్యత్యాసాలను సరిచేసేందుకు మోడరేషన్ ప్రక్రియ చేపడతారు. అంటే ఒక ప్రొఫెసర్ దిద్దిన పేపర్లను మరో నిపుణుడికి పంపిస్తారు. రెండుసార్లు చేసిన మూల్యాంకనంలో 15 శాతం మార్కులు తేడా వస్తే మూడోసారి మోడరేషన్ చేస్తారు. అంటే మరో ప్రొఫెసర్‌తో దిద్దిస్తారు. ఈ విధానాన్ని 2016లో చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ పేపర్ల విషయంలోనూ ఇదే జరిగింది. మోడరేషన్ ప్రక్రియ చేపడితే మూడుసార్లు పేపర్లు మూల్యాంకనం చేశారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు మెయిన్స్ పత్రాలను మాన్యువల్‌గా మూల్యాంకనం చేసిన అనంతరం సర్వీస్ కమిషన్ 1:2 నిష్పత్తిలో 325 మందిని, స్పోర్ట్స్ విభాగంలో మరో 48 మందిని 2022 మేలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది. ‘రిట్లు’.. మొట్టికాయలు మెయిన్స్ పరీక్షలు, ఫలితాలను అడ్డుకునేందుకు బాబు బృందం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇంటర్వ్యూలను అడ్డుకోవాలని ఎత్తులు వేశారు. అందుకోసం హైకోర్టు, సుప్రీంకోర్టులోను రిట్లు వేశారు. మాన్యువల్ మూల్యాంకనం, ఇంటర్వ్యూలు రద్దు చేయాలని 2022 జూన్ 13 హైకోర్టులో రిట్ వేయగా సరైన ఆధారాలు లేవని కొట్టివేసింది. దాంతో పదిరోజుల వ్యవధిలో ఇంటర్వ్యూలపై స్టే విధించాలని డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేయగా తిరస్కరించింది. ఈ మధ్యలో ఏపీపీఎస్సీ జూలై 5 నాటికి ఇంటర్వ్యూలు పూర్తి చేసింది. చంద్రబాబు బృందం అదే ఏడాది జూలై 14న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇన్నిసార్లు భంగపడ్డ బాబు బృందం ఇంటర్వ్యూలు రద్దు చేయాలని మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై గతేడాది ఆగస్టు 21న తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఎనిమిది నెలల తర్వాత 2018న గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలని ఈ ఏడాది మార్చి 13న తీర్పు వెలువరించారు. తెలంగాణ తరహాలోనే గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో ఏపీలోనూ అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో స్క్రీన్‌పై లెక్కలు చెబుతూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేశారు. అయితే సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పుపై సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్‌కు వెళ్లి వాదనలు వినిపించడంతో స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఏడాది మార్చి 17న జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను కూడా నిలిపివేయాలని హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయించిన ఎల్లో బ్యాచ్ తర్వాత పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. 2019 నుంచి 2023 వరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన 78 నోటిఫికేషన్లకు సంబంధించి ఒక్క వివాదం కూడా లేకపోవడం గమనార్హం. మేం కోరకున్నా మొదటి మూల్యాంకనం రద్దు చేశారు.. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు జొన్నలగడ్డ సుధీర్, రవిశంకర్ వాదనలు వినిపిస్తూ సింగిల్ జడ్జి తీర్పులోని కొంత భాగంపై తమకు అభ్యంతరం ఉందన్నారు. మొదటి మూల్యాంకనంపై తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ఆ మూల్యాంకనం తాలూకు ఫలితాలను వెల్లడించాలని మాత్రమే కోరామన్నారు. అయితే సింగిల్ జడ్జి మొదటి మూల్యాంకనాన్ని కూడా రద్దు చేశారని నివేదించారు. అందువల్ల తాము సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగులను తదుపరి విచారణ వరకు తొలగించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్లు కోరిన దానికి మించి సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు.. ఏపీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపించారు. పిటిషనర్లు కోరిన దానికి మించి సింగిల్ జడ్జి నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారని నివేదించారు. అడగని వాటిని పరిగణనలోకి తీసుకున్నారని, అభ్యర్థించిన వాటిని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. జడ్జి పరిగణనలోకి తీసుకున్న అంశాలను పిటిషనర్లు అభ్యర్థించలేదన్నారు. తిరిగి మూల్యాంకనం చేపట్టాలన్న సింగిల్ జడ్జి నిమ్మగడ్డ ఆదేశాలు ఎంత మాత్రం సహేతుకం కాదన్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన పిటిషనర్లు ఎవరూ మూల్యాంకనాన్ని సవాల్ చేయలేదని, అయినప్పటికీ సింగిల్ జడ్జి మూల్యాంకనాన్ని తప్పుపట్టి మొత్తం పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. సింగిల్ జడ్జి ముందు పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లు సైతం ఆ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీళ్లు దాఖలు చేయడం ఆసక్తికరమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గ్రూప్–1 మెయిన్స్, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించి పోస్టులు పొందిన 167 మంది ఇప్పటికే సర్వీసులో కొనసాగుతున్నారని, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు వల్ల వారిని ఉద్యోగాల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని నివేదించారు. -
2018 గ్రూప్–1 మెయిన్స్ రద్దు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2018లో నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష మాన్యువల్ మూల్యాంకనాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని తేల్చింది. అందువల్ల గ్రూప్ –1 మెయిన్స్ పరీక్ష మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. నిబంధనల ప్రకారమే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలని చెప్పింది. పరీక్ష నిర్వహణకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది. మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. 2022 మే 26న ఏపీపీఎస్సీ ప్రకటించిన అర్హుల జాబితాను కూడా రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం తీర్పు వెలువరించారు. ‘పబ్లిక్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా ఉండాలి. పోస్టుల భర్తీ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగడంపైనే అభ్యర్థుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. పరీక్షల నిర్వహణ ప్రక్రియ ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఒకసారికి మించి మాన్యువల్ మూల్యాంకనం చేసేందుకు నిబంధనలు అనుమతించకపోయినప్పటికీ, అధికారులు రెండుసార్లు మాన్యువల్ మూల్యాంకనం చేశారు. మరికొన్ని పత్రాలను మూడోసారి కూడా మూల్యాంకనం చేశారు. ఇది చట్ట విరుద్ధం. రెండు, మూడోసారి చేసిన మూల్యాంకనం మొత్తం మూల్యాంకనంపైనే అనుమానాలు రేకెత్తించింది. ఇలాంటప్పుడు అర్హులైన అభ్యర్థులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. అనర్హులు లబ్ధి పొందే అవకాశం ఉంది. కోర్టు ముందున్న ఆధారాలను పరిశీలిస్తే, పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయాన్ని పిటిషనర్లు నిరూపించగలిగారు. మూల్యాంకనంలో నిష్పాక్షికతను కొనసాగించడంలో అధికారులు విఫలమయ్యారు. మూడుసార్లు జరిపిన మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడి ఎవరు లబ్ధి పొందారన్న విషయాన్ని గుర్తించడం సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల మొత్తం పరీక్షనే రద్దు చేయడం ఉత్తమం’ అని జస్టిస్ నిమ్మగడ్డ తన 85 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే పోస్టింగులు తీసుకున్న అభ్యర్థులు హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో మిగిలిన అభ్యర్థులతో సమానంగా ఎలాంటి హక్కులూ కోరబోమంటూ అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మూల్యాంకనంలో అక్రమాలంటూ పిటిషన్లు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, అందువల్ల పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ తరువాత డిజిటల్ మూల్యాంకనంపైనా పిటిషన్లు దాఖలు చేశారు. పలు సందర్భాల్లో వీటిపై హైకోర్టు విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ధర్మాసనం విచారణ జరిపింది. ఇంటర్వ్యూలకు, ఎంపిక ప్రక్రియకు అనుమతినిచ్చింది. అయితే వారి నియామకాలన్నీ కూడా అంతిమంగా సింగిల్ జడ్జి ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అనంతరం సింగిల్ జడ్జి అన్ని వ్యాజ్యాలపై తుది విచారణ జరిపారు. ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్నారు. బుధవారం తీర్పు వెలువరించారు. మూల్యాంకనం విషయంలో పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. అక్రమాలు రుజువైనందున మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. -
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
అమరావతి: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 111 గ్రూపు-1 పోస్టులకు గాను 259 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్ కోటా నుండి ఎంపికయ్యారు. గ్రూప్-1 పరీక్ష జరిగిన కేవలం 34 రోజులలోనే ఫలితాలు విడుదల చేసింది ఏపీపీఎస్సీ . జూన్ 3 నుండి 10వ తారీఖు వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు మొత్తం 5035 మంది హాజరు కాగా వారిలో నుండి 259 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఏపీపీఎస్సీ ప్రతిష్టాత్మంకంగా నిర్వహించిన గ్రూపు-1 పరీక్షలు ఎటువంటి అక్రమాలకు, అవినీతికి తావివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ పర్యవేక్షణలో మూల్యాంకనం స్క్రూటినీ కార్యక్రమాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరిగింది. ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూలను నిర్వహించి సెప్టెంబర్ నాటికి అభ్యర్థుల నియామకాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది కమిషన్. ముందుగా నిర్ణయించినట్టుగానే క్యాలెండర్ ప్రకారం సకాలంలోనే నియామకాలు జరుగుతాయని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. -
AP: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, విజయవాడ: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ పరిశీలించారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులకు బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్ కు అనుమతి కోరారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇది కూడా చదవండి: నేడు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ -
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా
సాక్షి, విజయవాడ: ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. 2022 సివిల్స్ ఫేజ్- 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను యూపీఎస్సీ సోమవారమే విడుదల చేసింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకి ఏపీ నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హాజరవుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూల కారణంగా గ్రూప్-1 మెయిన్స్‌ని జూన్‌లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకునే మెయిన్స్ వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ మెంబర్ సలాంబాబు పేర్కొన్నారు. చదవండి: ‘ఓటుకు కోట్లు 2.0’ ప్రకంపనలు -
ప్రశ్నపత్రాల లీకేజీ: టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించనున్న ఉద్యోగ అర్హత పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జరిగిన నాలుగు పరీక్షలను రద్దు చేసిన కమిషన్.. మరో రెండు పరీక్షలను నిర్వహించకుండానే వాయిదా వేసింది. వీటితోపాటు వచ్చే నెలలో నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కొత్తగా తయారు చేసేందుకు చర్యలు చేపట్టారు. వీటన్నింటి క్రమంలో ఇప్పటికే నిర్దేశించిన తేదీల్లో ఉద్యోగ అర్హత పరీక్షల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని.. కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. దీనిపై టీఎస్పీఎస్సీ నుంచి త్వరలోనే ప్రకటన వెలువడవచ్చని అంటున్నాయి. కొత్త ప్రశ్నపత్రాల రూపకల్పన కోసం.. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారింది. గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీతోపాటు ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఈ నెల 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్.. 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేసింది. ఈ ఆరు పరీక్షలను తిరిగి నిర్వహించాలి. మరో తొమ్మిది రకాల పోస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. లీకేజీ, రద్దు, వాయిదాల క్రమంలో ప్రశ్నపత్రాలను కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిపుణులతో సంప్రదింపులు, కొత్త ప్రశ్నపత్రాల తయారీ, అందులో ఇప్పటికే రూపొందించిన ప్రశ్నపత్రాలతో సంబంధం లేకుండా ప్రశ్నల ఎంపిక, వివిధ దశల్లో ఆమోదం, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు వంటి కార్యాచరణ అవసరం. ఇదంతా పూర్తయ్యేందుకు దాదాపు రెండు నెలల సమయం పడుతుందని అంచనా. రద్దయిన పరీక్షలను ముందుగా నిర్వహించాలంటే.. ఇప్పటికే నిర్దేశించిన ఇతర పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి రానుంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని భావించినా.. రద్దయిన, వాయిదా పడిన పరీక్షలకు ఇబ్బంది వస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ పరీక్షల షెడ్యూళ్లలో మార్పులు చేసి.. కొత్త తేదీలను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నట్టు తెలిసింది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. గ్రూప్–1 మెయిన్స్‌కు తప్పని వాయిదా! గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. ఈ ఏడాది జూన్ 11న తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన తర్వాత మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసి.. మెయిన్స్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రకటించిన గ్రూప్–1 మెయిన్స్ తేదీలు దాదాపు రద్దయినట్లేనని అధికారులు చెప్తున్నారు. ప్రిలిమ్స్ ఫలితాల తర్వాత మెయిన్స్ షెడ్యూల్ విడుదల అవుతుందని అంటున్నారు. -
గ్రూప్–1 మెయిన్స్ ఎంపిక నిష్పత్తిపై పరిశీలన..
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న శాసనసభ సభ్యుల సూచనను పరిశీలించి టీఎస్పీఎస్సీకి ప్రతిపాదిస్తామని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం బిల్లులపై చర్చలో ఆయన మాట్లాడారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశంపై ఆయన స్పందిస్తూ గ్రూప్–1 మెయిన్స్‌కు 1:50 నిçష్పత్తిలో టీఎస్పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసిందని వివరించారు. నిష్పత్తిలో మార్పులు చేసి 1:100గా ఎంపిక చేయాలన్న సభ్యుల సూచనను పరిశీలించి టీఎస్పీఎస్సీకి సూచిస్తామని తెలిపారు. కొత్త స్టేషన్ల ఏర్పాటు, కొత్త భవనాలపై సభ్యులు సూచనలు చేయగా..చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
వరుసగా గ్రూప్–1 పరీక్షలా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్–1 మెయిన్ (ప్రధాన) పరీక్షల తేదీలపై అభ్యర్థు ల్లో ఆందోళన పెరుగుతోంది. వరుసగా పరీక్ష లు ఉండటం అభ్యర్థులపై ఒత్తిడి పెరుగు తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్ల పరీక్ష తేదీల్లో మార్పులు చేయాలని, కనీసం రోజువిడిచి రోజు పరీక్షలు ఉండేలా షెడ్యూల్ రూపొందించాలనే డిమాండ్ పెరు గుతోంది. గ్రూప్–1 మెయిన్ కేటగిరీలో ఏడు పరీక్షలున్నాయి. జనరల్ ఇంగ్లిష్ క్వాలి ఫైయింగ్ పరీక్ష కాగా, మిగతా 6 పేపర్లు ప్రధానపరీక్షలు. ఒక్కో పరీక్షకు గరి ష్టంగా 150 మార్కులు లెక్కన మొత్తం 1,050 మార్కులుంటాయి. ఈ ఏడింటిలో ఒకటి మినహా మిగతా ఆరు పరీక్ష లను జూన్ 5 నుంచి 12 వరకు (11వ తేదీ మినహా) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏపీపీఎస్సీలో అలా... ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ మెయిన్ పరీక్షల తేదీలను ఒక్కో పరీక్షకు ఒక రోజు అంతరం ఉండేలా షెడ్యూల్‌ను రూపొందించి నిర్వహించింది. 2012లో గ్రూప్–1 మెయిన్ పరీక్షలను సెప్టెంబర్ 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో చేపట్టింది. అలాగే విభజన తర్వాత ఏపీపీఎస్సీ పరిధిలో 2016లో జరిగిన మెయిన్ పరీక్షల్లో జనరల్ ఇంగీŠల్ష్ పరీక్ష సెప్టెంబర్ 13న నిర్వహించగా సెప్టెంబర్ 14, 17, 19, 21, 23 తేదీల్లో ఐదు పేపర్లకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తొలిసారి గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ చేపట్టడం... 503 ఉద్యోగ ఖాళీలు ఉండటంతో అభ్యర్థులు పట్టుదలతో సిద్ధమవుతున్నారు. అయితే పరీక్షలను వరుసగా నిర్వహిస్తే అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని, వారి ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉందని సైకియాట్రిస్ట్‌లు చెబుతున్నారు. గత విధానాన్ని అనుసరించాలి.. పరీక్షలను వరుసగా కాకుండా రోజువిడిచి రోజు నిర్వహిస్తే అభ్యర్థులకు ఉపశమనం లభిస్తుంది. అలా కాకుండా వరుసగా నిర్వహిస్తే ఒత్తిడికి గురై పరీక్షలను పక్కాగా రాయడంలో విఫలమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఉమ్మడి ఏపీలో నిర్వహించిన పరీక్షల విధానాన్ని టీఎస్పీఎస్సీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. – ఏఏస్ నారాయణ, గ్రూప్–1 మెయిన్స్ అభ్యర్థి -
గ్రూప్–1 మెయిన్స్ సన్నద్ధతపై సందిగ్ధం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి మూడు నెలలు కావస్తున్నా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటికీ ఆ ఫలితాలను ప్రకటించలేదు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధం కావాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రాథమికంగా వెల్లడించింది. ఈ క్రమంలో గడువు దగ్గర పడుతుండగా.. ప్రిలిమ్స్ ఫలితాలను ఇంకా ప్రకటించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 కొలువులతో పాటు ఇతర కేటగిరీల్లో పోస్టుల ప్రకటనలు పెద్ద సంఖ్యలో విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్–1 మెయిన్స్ అర్హతపై స్పష్టత వస్తే ఇతర ఉద్యోగాలవైపు దృష్టిపెట్టాలా? వద్దా? అనేది తేల్చుకోవడానికి అవకాశం ఉంటుందని అభ్యర్థులు అంటున్నారు. 8.7 శాతమే మెయిన్స్‌కు అర్హులు రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్–1 కేటగిరీలో 503 ఖాళీల భర్తీకోసం గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,85,916 మంది అభ్యర్థులు హాజర్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు మెయిన్స్‌కు ఎంపికవుతారు. ఈ క్రమంలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు మొదలు పెట్టింది. మలీ్టజోన్ల వారీగా రిజర్వేషన్లుకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 50 మందిని ఎంపిక చేస్తూ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయాలి. ఈ లెక్కన 25,150 మంది అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేయాలి. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో కేవలం 8.7 శాతం మంది మాత్రమే మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధిస్తారు. దీంతో మిగతా అభ్యర్థులు ఇతర కొలువులపై దృష్టి పెట్టాల్సిందే. ఈ క్రమంలో గ్రూప్–1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదలైతే మిగతా అభ్యర్థులు ఇతర కొలువులకు సన్నద్ధం కావడానికి వీలుంటుంది. కానీ ఇప్పటికీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్–2018 ఫలితాలను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను మాన్యువల్‌గా పునర్ మూల్యాంకనం చేయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష సమాధాన పత్రాలను ఇంతకుముందు డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయించి ఫలితాలు విడుదల చేశారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ డిజిటల్ మూల్యాంకనం గురించి ముందుగా నోటిఫికేషన్లో పేర్కొనకపోవడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈసారి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. వాస్తవానికి 2018 గ్రూప్–1 మెయిన్స్‌కు డిజిటల్ మూల్యాంకనం చేపడుతున్న విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొనకున్నా పరీక్షలకు ముందునుంచే అభ్యర్థులకు కమిషన్ వెబ్సైట్ ద్వారా, మీడియా ద్వారా తెలియచేస్తూ వచ్చింది. అప్పట్లో అభ్యర్థులెవరి నుంచీ వ్యతిరేకత రాకపోగా అంతా స్వాగతించారు. అయితే ఫలితాలు విడుదల చేశాక ఎంపిక కాని కొందరు అభ్యర్ధులు పలు సందేహాలు, అనుమానాలతో డిజిటల్ మూల్యాంకనాన్ని తప్పుబడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అభ్యర్థుల అనుమానాలను, సందేహాలను కోర్టు ఆమోదించలేదు. కేవలం మూల్యాంకన విధానం సరైన రీతిలో అమలు చేయనందున ఈసారికి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లే అవకాశమున్నా మరింత జాప్యం అయ్యే ఆస్కారం ఉండటం, ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో అప్పీల్‌కు వెళితే మరో రెండేళ్లు సమయం వృథా అవుతుందని భావించిన ఏపీపీఎస్సీ మాన్యువల్ మూల్యాంకనానికే మొగ్గు చూపింది. మూల్యాంకనాన్ని త్వరితంగా ముగించి ఫిబ్రవరి నెలలో ఫలితాలను విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ‘సాక్షి’కి చెప్పారు. యువత, నిరుద్యోగ సంఘాలతో భేటీ ఇలా ఉండగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ చేపడుతున్న విధానాలు, కొత్తగా చేపట్టబోయే సంస్కరణలు, ఇతర అంశాలపై యువత, నిరుద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. సంక్రాంతి తరువాత ఈ సమావేశం నిర్వహించనున్నారు. గతంలో ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు, నిరుద్యోగ యువత, సంఘాలతో సమావేశం నిర్వహించారు. అందరినుంచి అభిప్రాయాలు సేకరించారు. అయితే ఈ సమావేశంలో ఒకేసారి అందరినీ అనుమతించడంతో ఎవరేం చెబుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ అనుభవంతో ఈసారి ఏపీపీఎస్సీ కార్యాలయంలోనే సమావేశాన్ని ఏర్పాటుచేసి ఆయా సంఘాలను, అభ్యర్థులను ఆహ్వానించి బృందాల వారీగా అభిప్రాయాలు తీసుకోవాలని కమిషన్ భావిస్తోంది. -
గ్రూప్–1 మెయిన్స్.. ట్యాబ్‌లో ప్రశ్నపత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 మెయిన్స్‌లో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ట్యాబ్ ఆధారిత పరీక్ష మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. వీటిని వీడియో రూపంలో యూట్యూబ్‌లోనూ పొందుపరిచింది. గ్రూప్–1 పరీక్షలను ఏప్రిల్ 7 నుంచి 19వ తేదీవరకు ఈసారి ఆన్లైన్లో నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల్లో ట్యాబ్‌లు అందచేసి అందులోనే ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. ప్రింటింగ్, పంపిణీతో పనిలేకుండా సబ్జెక్టుల వారీగా ప్రశ్నపత్రం ట్యాబ్‌లో ఉంటుంది. కాగా కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు కమిషన్‌కు విన్నవిస్తున్నారు. ఇవీ మార్గదర్శకాలు... - అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చే వారిని ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరు - అడ్మిట్‌కార్డులు, ఇతర గుర్తింపుకార్డులు తేవాలి. నిషేధిత వస్తువులు తీసుకురాకూడదు. - పరీక్ష గదుల్లో ప్రతి సీటు వద్ద అభ్యర్థులవారీగా ట్యాబ్లెట్ డివైస్‌లను డెస్కులపై సిద్ధంగా ఉంచుతారు. - ట్యాబ్ కుడివైపు ఉన్న స్విచ్ ద్వారా డివైస్‌ను ఆన్చేయాలి - ట్యాబ్‌లో ‘స్టార్ట్ ఎగ్జామ్’ క్లిక్ చేయడం ద్వారా పరీక్షను ప్రారంభించాలి - ముందుగా సబ్జెక్టు పేరు క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. - పరీక్షకు 5 నిమిషాల ముందు ఇన్విజిలేటర్ అభ్యర్థులకు ఇచ్చే పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తే ఆ సబ్జెక్టు ప్రశ్నపత్రం ట్యాబ్‌లో ప్రత్యక్షమవుతుంది. దీన్ని జూమ్ చేసి చూసుకోవచ్చు. - అభ్యర్థులు పరీక్ష రాశాక డివైస్‌ను స్విచాఫ్ చేసి డెస్కుపైనే ఉంచి బయటకు వెళ్లాలి. - డివైస్‌ను ఇన్విజిలేటర్ దగ్గరకు తీసుకువెళ్లి ఇవ్వకూడదు. -
2011 గ్రూప్–1 మెయిన్స్ మెరిట్ జాబితా విడుదల
సాక్షి, అమరావతి : ఏపీపీఎస్సీ.. గతంలో నిర్వహించిన 2011 గ్రూప్–1 మెయిన్స్ మెరిట్ జాబితాను 294 మంది అభ్యర్థులతో మంగళవారం విడుదల చేసింది. 2011 గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో విచారణ జరిగి తీర్పు వెలువడ్డా చివరి వరకు పలు వివాదాలు దీన్ని వెన్నాడుతూనే వచ్చాయి. ఎట్టకేలకు 152 పోస్టులకు ఇంటర్వ్యూలకు పిలుస్తూ 294 మంది పేర్లతో జాబితా వెలువడింది. త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా ఆర్అండ్బీ భవనంలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది. ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తామని చెప్పింది. కాగా, డీఎస్పీ తదితర పోస్టులకు ఎంపికైనవారు శరీరదారుఢ్య పరీక్షలకు విశాఖపట్నంలోని మెడికల్ బోర్డు, దివ్యాంగులు సంబంధిత మెడికల్ బోర్డు ముందు హాజరుకావాల్సి ఉంటుంది. న్యాయవివాదాలతో సుదీర్ఘ కాలం.. 2011, నవంబర్‌లో 312 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 2012, మే 27న ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్ ‘కీ’లో 13 తప్పులు ఉన్నాయని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఏడింటిని సవరించిన కమిషన్ ఆరింటినీ వదిలేసింది. దీనిపై అభ్యర్థులు కొందరు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే 2012, సెప్టెంబర్ 18 నుంచి 30 వరకు మెయిన్స్ పరీక్షలు, తర్వాత ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. ప్రిలిమ్స్ కీపై ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వగా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుగా ఉన్న ఆరు ప్రశ్నలపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నుంచి నివేదిక కోరుతూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం ప్రిలిమ్స్‌లోని 150 ప్రశ్నల్లో తప్పులున్న ఆరు ప్రశ్నలను రద్దు చేసి మిగిలిన 144 ప్రశ్నల మేరకు మెరిట్ లిస్టు రూపొందించి మళ్లీ మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కమిషన్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించలేదు. రెండోసారి మెయిన్స్ నిర్వహించినా తప్పులే అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేయడంతో ఆంధ్రప్రదేశ్ (172), తెలంగాణ (140) రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వేర్వేరుగా మెయిన్స్ పరీక్షను చేపట్టాయి. క్యారీఫార్వర్డ్ అంటూ పోస్టుల సంఖ్య 172 నుంచి 152కు కుదించుకుపోయింది. మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించినా తప్పులే దొర్లాయి. పేపర్–5 150 మార్కులకు నిర్వహించగా 42 మార్కులకు ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. దీనిపై అభ్యంతరాల మేరకు కమిషన్ వాటిని తొలగించి 108 మార్కులకే పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మళ్లీ వారం రోజుల్లోనే ఆ జాబితాను తొలగించి తప్పుగా వచ్చిన 42 మార్కుల ప్రశ్నలనూ కలిపి మొత్తం 150 మార్కులకు స్కేలింగ్ విధానంలో అర్హుల జాబితాను ప్రకటించింది. మొదటి జాబితాలో ఉన్న 28 మంది అభ్యర్థుల పేర్లు ఈ రెండో జాబితాలో లేకపోగా కొత్తగా మరికొంతమందికి అవకాశం వచ్చింది. దీంతో వారంతా కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై ట్రిబ్యునల్ మొదటి జాబితాను మాత్రమే ఉంచాలని, లేదంటే మళ్లీ పరీక్ష పెట్టాలని ఆదేశించింది. దీనిపై ఏపీపీఎస్సీ మళ్లీ హైకోర్టుకు వెళ్లింది. కోర్టు నుంచి సానుకూల ఉత్తర్వులు రావడంతో కమిషన్ తాజాగా రెండో జాబితాను ఖరారు చేసి ఇంటర్వ్యూలకు రంగం సిద్ధం చేసింది. -
కార్తీక్‌రెడ్డి అప్పీల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్‌లో కొన్ని పేపర్లు రాయలేదన్న కారణంతో తనను టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూలకు అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంపై కార్తీక్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ మంతోజ్ గంగారావుల ధర్మాసనం అప్పీల్‌ను కొట్టివేసింది. మెయిన్స్‌లో కొన్ని పేపర్లు రాయనందుకు కార్తీక్‌రెడ్డిని ఇంటర్వ్యూలకు టీఎస్పీఎస్సీ అనుమతించలేదు. దీనిపై హైకోర్టులో అతను పిటిషన్ దాఖలు చేయగా.. ఇంటర్వ్యూలకు అనుమతించడంతో పాటు ఓ పోస్టును ఖాళీగా ఉంచాలని జూలైలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ టీఎస్పీఎస్సీ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంతో పాటు కార్తీక్‌రెడ్డి దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంపై విచారణ జరిపింది. కార్తీక్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ సెప్టెంబర్ 21న సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ధర్మాసనం ముందు కార్తీక్‌రెడ్డి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. మెయిన్స్‌లో అన్ని పేపర్లు రాసి, ఇంటర్వ్యూలకు హాజరైన వారే గ్రూప్–1 పోస్టుల భర్తీకి అర్హులంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది డి.బాలకిషన్‌రావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ తీర్పును పరిగణనలోకి తీసుకుని కార్తీక్‌రెడ్డి అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. -
డిజిటల్ ఇండియా లక్ష్యాలు?
ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పేపర్–4 మోడల్ ప్రశ్నలు సెక్షన్–1 1. ఎమర్జింగ్ టెక్నాలజీలు అంటే ఏమిటి? వాటి లక్షణాలేవి? సమకాలీన ఎమర్జింగ్ టెక్నాలజీల గురించి రాయండి. 2. మన దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో సైన్స్, టెక్నాలజీ పాత్రను వివరించండి. (లేదా) జాతి నిర్మాణంలో సైన్స్, టెక్నాలజీ పాత్రపై చర్చించండి. 3. 2013 నాటి సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్ విధాన ముఖ్యాంశాలపై చర్చించండి. 4. డిజిటల్ ఇండియా లక్ష్యాలను, సాధించిన ప్రగతిని వివరించండి. 5. భారత అంతరిక్ష కార్యక్రమంలో పీఎస్ఎల్వీ పాత్ర ఏమిటి? 6. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో అంతరిక్ష కార్యక్రమం ఉపయోగాలేవి? 7. దేశంలో సౌర శక్తి అభివృద్ధి గురించి క్లుప్తంగా వ్యాసం రాయండి. 8. 1) జియో థర్మల్ ఎనర్జీ 2) సముద్ర శక్తి రకాలు 3) వేస్ట్ టు పవర్ 9. దేశంలో శీతోష్ణస్థితి మార్పు నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి రాయండి. 10. వరదలకు కారణాలు, నిర్వహణ చర్యలు గురించి రాయండి. సెక్షన్–2 11. ఎ) అకశేరుకాలు–సకశేరుకాలు మధ్య భేదాలు. బి) వైరస్ల వర్గీకరణ. 12. ఎ) అమైనో ఆమ్లాలు, కర్బన ఆమ్లాల మధ్య భేదాలేవి? బి) ఆల్కహాల్స్, యాంటీబయాటిక్స్ ఉపయోగాలేవి? 13. ఎ) వ్యవసాయ ఆవిర్భావ కారణాలు బి) వావిలావ్ వ్యవసాయ ఆవిర్భావ కేంద్రాలు 14. వైద్య రంగంలో జంతువుల పాత్ర గురించి వివరించండి. 15. 1) ఎబోలా జ్వరం 2) జికా జ్వరం 3) పచ్చ జ్వరం 16. మలేరియా రోగోత్పత్తి, నిర్ధారణ, చికిత్స, నివారణ చర్యల గురించి రాయండి. 17. ఎ) జన్యు ఇంజనీరింగ్ సాధారణ ప్రక్రియ. బి) డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. 18. వ్యవసాయంలో జీవ ఎరువులు, జీవ క్రిమిసంహారకాల పాత్ర ఏమిటి? 19. ఎ) మిషన్ ఇంద్రధనుస్సు బి) పల్స్ పోలియో కార్యక్రమం 20. టీకాలు వేసే ముందు, వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించండి. సెక్షన్–3 21. ఎ) ఆహార శృంఖలం అంటే ఏమిటి? అందులోని రకాలను ఉదాహరణలతో రాయండి. బి) ఆహార శృంఖలాల ప్రాధాన్యతను తెలపండి? 22. ఎ) జీవ వైవిధ్య హాట్‌స్పాట్స్ అంటే ఏమిటి? వీటిని గుర్తించే ప్రమాణాలేవి? బి) భారత్ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ గురించి రాయండి. 23. ఎ) భారత్‌లో అక్రమ మైనింగ్ గురించి రాయండి. బి) మైన్స్ అండ్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం–ఇటీవలి సవరణల గురించి రాయండి. 24. ఎ) ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. బి) నమామి గంగే కార్యక్రమం. 25. ఎ) ఓషన్ అసిడిఫికేషన్. బి) పార్టికులేట్ మ్యాటర్ కాలుష్యం. 26. ఎ) సముద్ర కాలుష్యం. బి) భార లోహాల కాలుష్యం. - సి.హరికృష్ణ డైరెక్టర్, విన్–విన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్