ప్రశ్నపత్రాల లీకేజీ: టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్‌? | All TSPSC exams rescheduled? | Sakshi
Sakshi News home page

ప్రశ్నపత్రాల లీకేజీ: టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్‌?

Published Sun, Mar 19 2023 12:51 AM | Last Updated on Sun, Mar 19 2023 3:29 PM

All TSPSC exams rescheduled? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర స్టేట్‌ పబ్లిక్‌ సర్వి స్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించనున్న ఉద్యోగ అర్హత పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జరిగిన నాలుగు పరీక్షలను రద్దు చేసిన కమిషన్‌.. మరో రెండు పరీక్షలను  ని­ర్వహించకుండానే వాయిదా వేసింది.

వీటితోపా­టు వచ్చే నెలలో నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కొత్తగా తయారు చేసేందుకు చర్యలు చేపట్టారు. వీటన్నింటి క్రమంలో ఇప్పటికే నిర్దేశించిన తేదీల్లో ఉద్యోగ అర్హత పరీక్షల నిర్వ­హణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని.. కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. దీనిపై టీఎస్‌పీఎస్సీ నుంచి త్వరలోనే ప్రకటన వెలువడవచ్చని  అంటున్నాయి. 

కొత్త ప్రశ్నపత్రాల రూపకల్పన కోసం.. 
టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారింది. గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమినరీతోపాటు ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ నెల 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌.. 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలను వాయిదా వేసింది.

ఈ ఆరు పరీక్షలను తిరిగి నిర్వహించాలి. మరో తొమ్మిది రకాల పోస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. లీకేజీ, రద్దు, వాయిదాల క్రమంలో ప్రశ్నపత్రాలను కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిపుణులతో సంప్రదింపులు, కొత్త ప్రశ్నపత్రాల తయారీ, అందులో ఇప్పటికే రూపొందించిన ప్రశ్నపత్రాలతో సంబంధం లేకుండా ప్రశ్నల ఎంపిక, వివిధ దశల్లో ఆమోదం, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు వంటి కార్యాచరణ అవసరం.

ఇదంతా పూర్తయ్యేందుకు దాదాపు రెండు నెలల సమయం పడుతుందని అంచనా. రద్దయిన పరీక్షలను ముందుగా నిర్వహించాలంటే.. ఇప్పటికే నిర్దేశించిన ఇతర పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి రానుంది. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని భావించినా.. రద్దయిన, వాయిదా పడిన పరీక్షలకు ఇబ్బంది వస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ పరీక్షల షెడ్యూళ్లలో మార్పులు చేసి.. కొత్త తేదీలను ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నట్టు తెలిసింది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. 

గ్రూప్‌–1 మెయిన్స్‌కు తప్పని వాయిదా! 
గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఈ ఏడాది జూన్‌ 11న తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన తర్వాత మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసి.. మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో ఇప్పటికే ప్రకటించిన గ్రూప్‌–1 మెయిన్స్‌ తేదీలు దాదాపు రద్దయినట్లేనని అధికారులు చెప్తున్నారు. ప్రిలిమ్స్‌ ఫలితాల తర్వాత మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల అవుతుందని అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement