గ్రూపు-1 మెయిన్స్ ఇంగ్లిష్ పరీక్ష వాయిదా
గ్రూపు-1 మెయిన్స్ ఇంగ్లిష్ పరీక్ష వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 13 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న 2011 గ్రూపు-1 మెయిన్స్ (రీఎగ్జామ్) పరీక్షల్లో భాగంగా 13వ తేదీన నిర్వహించాల్సిన జనరల్ ఇంగ్లిషు పరీక్షను ఈనెల 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు.
బక్రీద్ పండుగను పురస్కరించుకొని 13న జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు యథావిధిగా షెడ్యూలు ప్రకారమే ఉంటాయన్నారు. మరోవైపు ఈ పరీక్షలను ఒక్క హైదరాబాద్ కేంద్రంలోనే నిర్వహించాలని కమిషన్ నిర్ణయించినట్లు తెలిపారు. జనరల్ ఇంగ్లిషు మినహా మిగతా పరీక్షలను అభ్యర్థులు ఇంగ్లిషు లేదా తెలుగు లేదా ఉర్దూ భాషల్లో రాయవచ్చని పేర్కొన్నారు.
అయితే ఒక పేపరులో కొంత భాగం ఒక భాషలో, అదే పేపరులో మరికొంత భాగం మరో భాషలోరాస్తే ఆ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయరని తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలని సూచించారు. హాల్‌టికెట్లను బుధవారం అర్ధరాత్రి నుంచే అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. మరిన్ని వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు.