2018 గ్రూప్ 1 మెయిన్స్‌పై సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పును పాక్షికంగా సవరించిన హైకోర్టు ధర్మాసనం
167 మంది ఉద్యోగులకు తాత్కాలికంగా ఊరట.. 27న తదుపరి విచారణ
తాము కోరకున్నా మొదటి మూల్యాంకనాన్ని నిమ్మగడ్డ రద్దు చేశారన్న పిటిషనర్లు
గత చైర్మన్ ఉదయ్ భాస్కర్ నిర్వాకాలతోనే ‘గ్రూప్స్’పై ముసిరిన వివాదాలు
2018 గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 62 తప్పులు ఉన్నాయని కోర్టులో అభ్యర్థుల పిటిషన్
హైకోర్టు ఆదేశాలతో సరిదిద్ది 2020 డిసెంబర్‌లో మెయిన్స్ నిర్వహణ
నోటిఫికేషన్‌లో వెల్లడించలేదని డిజిటల్ మూల్యాంకనంపై కోర్టు అభ్యంతరం
గౌతమ్ సవాంగ్ చైర్మన్‌గా 2022 మార్చిలో మాన్యువల్ మూల్యాంకనం
మెయిన్స్ మార్కుల్లో వ్యత్యాసాన్ని తగ్గించేందుకు 2016 నుంచి మోడరేషన్
15 శాతం మార్కులు తేడా వస్తే మూడోసారి ప్రక్రియ నిర్వహణ
మెయిన్స్ ఫలితాల వెల్లడి, ఇంటర్వ్యూలు నిలిపివేయాలని హైకోర్టులో రిట్.. కొట్టివేత
స్టే ఇవ్వాలని రెండుసార్లు పిటిషన్ వేసిన బాబు బృందం.. అంగీకరించని న్యాయస్థానం
నాలుగోసారి సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ.. కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం
ఐదోసారి హైకోర్టులో రిట్.. వాదనలు పూర్తి.. 2023 ఆగస్టులో జడ్జిమెంట్ రిజర్వు
ఎనిమిది నెలల తర్వాత.. మెయిన్స్ రద్దు చేయాలంటూ సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పు
నిమ్మగడ్డ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లిన కమిషన్.. తాజాగా స్టే ఇచ్చిన హైకోర్టు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) 2018లో జారీ చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు పొంది ప్రస్తుతం వివిధ హోదాల్లో కొనసాగుతున్న 167 మందికి తాత్కాలిక ఊరటనిస్తూ హైకోర్టు ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27వతేదీకి వాయిదా వేసింది. న్యాయ ప్రయోజనాల నిమిత్తం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంటూ న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రూప్–1 మెయిన్స్‌కు సంబంధించి ఏపీపీఎస్‌సీ దాఖలు చేసిన అప్పీల్‌తో ముడిపడిన అన్ని వ్యాజ్యాలను ఈ అప్పీల్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈ నెల 13న తీర్పునిచ్చారు.
అలాగే గ్రూప్–1 మెయిన్స్‌లో అర్హత సాధించిన వారి జాబితాను కూడా రద్దు చేశారు. తిరిగి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఏపీపీఎస్‌సీని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్‌సీ దాఖలు చేసిన అప్పీల్‌పై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే ఉద్యోగాలు పొందిన 167 మందికి ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు వెలువరించింది.
ఉదయించిన వివాదాలు..
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి స్వామికార్యం, స్వకార్యాలు చక్కబెట్టి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. తప్పులను నిలదీసిన వారిపై కేసులు బనాయించి బెదిరించారు. చంద్రబాబు సర్కారు హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన ఉదయ్ భాస్కర్ 2015 నవంబర్ 27 నుంచి 2021 నవంబర్ 26 వరకు పదవిలో కొనసాగారు. ఆ కాలంలో ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, నిర్లక్ష్యంతో సర్వీస్ కమిషన్ నిర్వీర్యమైంది.
2018 గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 62 తప్పులు దొర్లాయని 2019 జూన్‌లో అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించ వద్దని సెప్టెంబర్‌లో హైకోర్టులో రిట్ వేయడంతో స్టే ఇచ్చింది. దీనిపై సర్వీస్ కమిషన్ కోర్టులో వాదనలు వినిపించగా ఐదు తప్పులను సవరించాలని ఆదేశిస్తూ రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి మెయిన్స్ నిర్వహించేందుకు మార్గం ఏర్పడింది. బాబు బృందం మెయిన్స్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడంతో మూడుసార్లు షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది.
డిజిటల్ మూల్యాంకనం నాటిదే..
గ్రూప్–1 మెయిన్స్ పేపర్లను సంప్రదాయ పద్ధతిలో సబ్జెక్టు నిపుణులు మూల్యాంకనం చేయడం రివాజు. ఈ విధానంలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందంటూ నాటి కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదించారు. కమిషన్‌లో చంద్రబాబు నియమించిన అత్యధిక మంది సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ పేపర్లను ఈ విధానంలోనే మూల్యాంకనం చేసి 2021 ఏప్రిల్ 28న ఫలితాలను ప్రకటించారు.
అయితే నోటిఫికేషన్‌లో డిజిటల్ మూల్యాంకనం గురించి పేర్కొనక పోవడంతో ఈ విధానాన్ని రద్దు చేయాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సంప్రదాయ విధానంలో మరోసారి మూల్యాంకనం చేయాలని 2021 అక్టోబర్ 1న హైకోర్టు ఆదేశించింది. ఉదయ్ భాస్కర్ పదవీ కాలం అదే ఏడాది నవంబర్‌లో ముగియడంతో ఏవీ రమణారెడ్డి ఇన్‌చార్జి చైర్మన్‌గా 2021 డిసెంబర్ 20న బాధ్యతలు చేపట్టి దాదాపు రెండు నెలలు సేవలందించారు. అనంతరం 2022 ఫిబ్రవరి 19న గౌతమ్ సవాంగ్ చైర్మన్‌గా వచ్చి మార్చిలో సంప్రదాయ మూల్యాంకనం చేశారు.
మోడరేషన్‌పై తప్పుడు ప్రచారం
సబ్జెక్టు నిపుణులు మాన్యువల్‌గా మూల్యాంకనం చేసినప్పుడు మార్కుల్లో చోటు చేసుకునే వ్యత్యాసాలను సరిచేసేందుకు మోడరేషన్ ప్రక్రియ చేపడతారు. అంటే ఒక ప్రొఫెసర్ దిద్దిన పేపర్లను మరో నిపుణుడికి పంపిస్తారు. రెండుసార్లు చేసిన మూల్యాంకనంలో 15 శాతం మార్కులు తేడా వస్తే మూడోసారి మోడరేషన్ చేస్తారు. అంటే మరో ప్రొఫెసర్‌తో దిద్దిస్తారు. ఈ విధానాన్ని 2016లో చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టారు.
2018 గ్రూప్–1 మెయిన్స్ పేపర్ల విషయంలోనూ ఇదే జరిగింది. మోడరేషన్ ప్రక్రియ చేపడితే మూడుసార్లు పేపర్లు మూల్యాంకనం చేశారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు మెయిన్స్ పత్రాలను మాన్యువల్‌గా మూల్యాంకనం చేసిన అనంతరం సర్వీస్ కమిషన్ 1:2 నిష్పత్తిలో 325 మందిని, స్పోర్ట్స్ విభాగంలో మరో 48 మందిని 2022 మేలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది.
‘రిట్లు’.. మొట్టికాయలు
మెయిన్స్ పరీక్షలు, ఫలితాలను అడ్డుకునేందుకు బాబు బృందం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇంటర్వ్యూలను అడ్డుకోవాలని ఎత్తులు వేశారు. అందుకోసం హైకోర్టు, సుప్రీంకోర్టులోను రిట్లు వేశారు. మాన్యువల్ మూల్యాంకనం, ఇంటర్వ్యూలు రద్దు చేయాలని 2022 జూన్ 13 హైకోర్టులో రిట్ వేయగా సరైన ఆధారాలు లేవని కొట్టివేసింది. దాంతో పదిరోజుల వ్యవధిలో ఇంటర్వ్యూలపై స్టే విధించాలని డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేయగా తిరస్కరించింది.
ఈ మధ్యలో ఏపీపీఎస్సీ జూలై 5 నాటికి ఇంటర్వ్యూలు పూర్తి చేసింది. చంద్రబాబు బృందం అదే ఏడాది జూలై 14న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇన్నిసార్లు భంగపడ్డ బాబు బృందం ఇంటర్వ్యూలు రద్దు చేయాలని మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై గతేడాది ఆగస్టు 21న తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఎనిమిది నెలల తర్వాత 2018న గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలని ఈ ఏడాది మార్చి 13న తీర్పు వెలువరించారు.
తెలంగాణ తరహాలోనే గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో ఏపీలోనూ అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో స్క్రీన్‌పై లెక్కలు చెబుతూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేశారు. అయితే సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పుపై సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్‌కు వెళ్లి వాదనలు వినిపించడంతో స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఏడాది మార్చి 17న జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను కూడా నిలిపివేయాలని హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయించిన ఎల్లో బ్యాచ్ తర్వాత పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. 2019 నుంచి 2023 వరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన 78 నోటిఫికేషన్లకు సంబంధించి ఒక్క వివాదం కూడా లేకపోవడం గమనార్హం.
మేం కోరకున్నా మొదటి మూల్యాంకనం రద్దు చేశారు..
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు జొన్నలగడ్డ సుధీర్, రవిశంకర్ వాదనలు వినిపిస్తూ సింగిల్ జడ్జి తీర్పులోని కొంత భాగంపై తమకు అభ్యంతరం ఉందన్నారు. మొదటి మూల్యాంకనంపై తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ఆ మూల్యాంకనం తాలూకు ఫలితాలను వెల్లడించాలని మాత్రమే కోరామన్నారు. అయితే సింగిల్ జడ్జి మొదటి మూల్యాంకనాన్ని కూడా రద్దు చేశారని నివేదించారు. అందువల్ల తాము సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగులను తదుపరి విచారణ వరకు తొలగించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
పిటిషనర్లు కోరిన దానికి మించి సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు..
ఏపీపీఎస్‌సీ తరఫున సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపించారు. పిటిషనర్లు కోరిన దానికి మించి సింగిల్ జడ్జి నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారని నివేదించారు. అడగని వాటిని పరిగణనలోకి తీసుకున్నారని, అభ్యర్థించిన వాటిని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. జడ్జి పరిగణనలోకి తీసుకున్న అంశాలను పిటిషనర్లు అభ్యర్థించలేదన్నారు. తిరిగి మూల్యాంకనం చేపట్టాలన్న సింగిల్ జడ్జి నిమ్మగడ్డ ఆదేశాలు ఎంత మాత్రం సహేతుకం కాదన్నారు.
మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన పిటిషనర్లు ఎవరూ మూల్యాంకనాన్ని సవాల్ చేయలేదని, అయినప్పటికీ సింగిల్ జడ్జి మూల్యాంకనాన్ని తప్పుపట్టి మొత్తం పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. సింగిల్ జడ్జి ముందు పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లు సైతం ఆ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీళ్లు దాఖలు చేయడం ఆసక్తికరమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గ్రూప్–1 మెయిన్స్, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించి పోస్టులు పొందిన 167 మంది ఇప్పటికే సర్వీసులో కొనసాగుతున్నారని, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు వల్ల వారిని ఉద్యోగాల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment