సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్–2018 ఫలితాలను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను మాన్యువల్‌గా పునర్ మూల్యాంకనం చేయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష సమాధాన పత్రాలను ఇంతకుముందు డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయించి ఫలితాలు విడుదల చేశారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ డిజిటల్ మూల్యాంకనం గురించి ముందుగా నోటిఫికేషన్‌లో పేర్కొనకపోవడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈసారి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది.
వాస్తవానికి 2018 గ్రూప్–1 మెయిన్స్‌కు డిజిటల్ మూల్యాంకనం చేపడుతున్న విషయాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొనకున్నా పరీక్షలకు ముందునుంచే అభ్యర్థులకు కమిషన్ వెబ్‌సైట్ ద్వారా, మీడియా ద్వారా తెలియచేస్తూ వచ్చింది. అప్పట్లో అభ్యర్థులెవరి నుంచీ వ్యతిరేకత రాకపోగా అంతా స్వాగతించారు. అయితే ఫలితాలు విడుదల చేశాక ఎంపిక కాని కొందరు అభ్యర్ధులు పలు సందేహాలు, అనుమానాలతో డిజిటల్ మూల్యాంకనాన్ని తప్పుబడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అభ్యర్థుల అనుమానాలను, సందేహాలను కోర్టు ఆమోదించలేదు.
కేవలం మూల్యాంకన విధానం సరైన రీతిలో అమలు చేయనందున ఈసారికి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లే అవకాశమున్నా మరింత జాప్యం అయ్యే ఆస్కారం ఉండటం, ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో అప్పీల్‌కు వెళితే మరో రెండేళ్లు సమయం వృథా అవుతుందని భావించిన ఏపీపీఎస్‌సీ మాన్యువల్ మూల్యాంకనానికే మొగ్గు చూపింది. మూల్యాంకనాన్ని త్వరితంగా ముగించి ఫిబ్రవరి నెలలో ఫలితాలను విడుదల చేస్తామని ఏపీపీఎస్‌సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ‘సాక్షి’కి చెప్పారు.
యువత, నిరుద్యోగ సంఘాలతో భేటీ
ఇలా ఉండగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్‌సీ చేపడుతున్న విధానాలు, కొత్తగా చేపట్టబోయే సంస్కరణలు, ఇతర అంశాలపై యువత, నిరుద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించాలని ఏపీపీఎస్‌సీ భావిస్తోంది. సంక్రాంతి తరువాత ఈ సమావేశం నిర్వహించనున్నారు. గతంలో ఏపీపీఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు, నిరుద్యోగ యువత, సంఘాలతో సమావేశం నిర్వహించారు. అందరినుంచి అభిప్రాయాలు సేకరించారు. అయితే ఈ సమావేశంలో ఒకేసారి అందరినీ అనుమతించడంతో ఎవరేం చెబుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ అనుభవంతో ఈసారి ఏపీపీఎస్‌సీ కార్యాలయంలోనే సమావేశాన్ని ఏర్పాటుచేసి ఆయా సంఘాలను, అభ్యర్థులను ఆహ్వానించి బృందాల వారీగా అభిప్రాయాలు తీసుకోవాలని కమిషన్ భావిస్తోంది.
ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు
Published Sat, Jan 1 2022 4:38 AM | Last Updated on Sat, Jan 1 2022 4:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment