2018 గ్రూప్‌–1 మెయిన్స్‌ రద్దు | 2018 Group1 Mains Cancellation | Sakshi
Sakshi News home page

2018 గ్రూప్‌–1 మెయిన్స్‌ రద్దు

Published Thu, Mar 14 2024 4:44 AM | Last Updated on Thu, Mar 14 2024 3:08 PM

2018 Group1 Mains Cancellation - Sakshi

తిరిగి పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశం

అర్హుల జాబితా రద్దు

6 నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ

పరీక్షకు ముందు అభ్యర్థులకు రెండు నెలల సమయం ఇవ్వాలని ఆదేశం

నిబంధనల ప్రకారమే మూల్యాంకనం చేయాలని ఉత్తర్వులు

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) 2018లో నిర్వహించిన గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష మాన్యువల్‌ మూల్యాంకనాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని తేల్చింది. అందువల్ల గ్రూప్‌ –1 మెయిన్స్‌ పరీక్ష మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తిరిగి మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. నిబంధనల ప్రకారమే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలని చెప్పింది. పరీక్ష నిర్వహణకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది. మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.

2022 మే 26న ఏపీపీఎస్‌సీ ప్రకటించిన అర్హుల జాబితాను కూడా రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం తీర్పు వెలువరించారు. ‘పబ్లిక్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా ఉండాలి. పోస్టుల భర్తీ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగడంపైనే అభ్యర్థుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. పరీక్షల నిర్వహణ ప్రక్రియ ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఒకసారికి మించి మాన్యువల్‌ మూల్యాంకనం చేసేందుకు నిబంధనలు అనుమతించకపోయినప్పటికీ, అధికారులు రెండుసార్లు మాన్యువల్‌ మూల్యాంకనం చేశారు.

మరికొన్ని పత్రాలను మూడోసారి కూడా మూల్యాంకనం చేశారు. ఇది చట్ట విరుద్ధం. రెండు, మూడోసారి చేసిన మూల్యాంకనం మొత్తం మూల్యాంకనంపైనే అనుమానాలు రేకెత్తించింది. ఇలాంటప్పుడు అర్హులైన అభ్యర్థులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. అనర్హులు లబ్ధి పొందే అవకాశం ఉంది. కోర్టు ముందున్న ఆధారాలను పరిశీలిస్తే, పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయాన్ని పిటిషనర్లు నిరూపించగలిగారు. మూల్యాంకనంలో నిష్పాక్షికతను కొనసాగించడంలో అధికారులు విఫలమయ్యారు.

మూడుసార్లు జరిపిన మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడి ఎవరు లబ్ధి పొందారన్న విషయాన్ని గుర్తించడం సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల మొత్తం పరీక్షనే రద్దు చేయడం ఉత్తమం’ అని జస్టిస్‌ నిమ్మగడ్డ తన 85 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే పోస్టింగులు తీసుకున్న అభ్యర్థులు హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో మిగిలిన అభ్యర్థులతో సమానంగా ఎలాంటి హక్కులూ కోరబోమంటూ అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

మూల్యాంకనంలో అక్రమాలంటూ పిటిషన్లు
గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, అందువల్ల పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ తరువాత డిజిటల్‌ మూల్యాంకనంపైనా పిటిషన్లు దాఖలు చేశారు. పలు సందర్భాల్లో వీటిపై హైకోర్టు విచారణ జరిపింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ధర్మాసనం విచారణ జరిపింది.

ఇంటర్వ్యూలకు, ఎంపిక ప్రక్రియకు అనుమతినిచ్చింది. అయితే వారి నియామకాలన్నీ కూడా అంతిమంగా సింగిల్‌ జడ్జి ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అనంతరం సింగిల్‌ జడ్జి అన్ని వ్యాజ్యాలపై తుది విచారణ జరిపారు. ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్నారు. బుధవారం తీర్పు వెలువరించారు. మూల్యాంకనం విషయంలో పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. అక్రమాలు రుజువైనందున మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement