అభ్యంతరాలపై పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
నిపుణుల కమిటీ నిర్ణయం మేరకే ప్రిలిమ్స్ తుది ‘కీ’
పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించింది
ఈ అంశంలో న్యాయస్థానం జోక్యం అవసరం లేదు
‘గ్రూప్–1’పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం తీర్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు లైన్‌క్లియర్ చేసింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉన్న చట్టపరమైన అడ్డంకులను తొలగించింది. రీనోటిఫికేషన్, ‘కీ’ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం కొట్టివేసింది. రీనోటిఫికేషన్‌పై పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఒక్కరే కమిషన్‌కు అభ్యంతరం తెలుపుతూ వినతిపత్రం సమర్పించారని పేర్కొంది.
పిటిషన్లపై టీజీపీఎస్సీ వినిపించిన వాదనలతో సంతృప్తి చెందినట్టు స్పష్టం చేసింది. కొన్ని అంశాల్లో నిపుణుల అభిప్రాయం తప్పనిసరిగా ఉండాలని..వారి విజ్ఞతను న్యాయస్థానాలు భర్తీ చేయలేవని వ్యాఖ్యానించింది. సాంకేతిక స్వభావమున్న విషయాల్లో నిర్ణయాన్ని నిపుణుల సంస్థలకే వదిలివేయాలని చెప్పింది. గ్రూప్–1 ‘కీ’పై టీజీపీఎస్సీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత న్యాయస్థానం కలుగజేసుకోవడం అవసరం లేదని అభిప్రాయపడింది. ‘1,721 మంది అభ్యర్థులు లేవనెత్తిన 6,417 అభ్యంతరాలను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ పరిశీలించింది.
ఇందులో కొందరు పిటిషనర్లు కూడా ఉన్నారు. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదిక ఆధారంగానే తుది కీ ప్రచురించాం. జూలై 7న తుది కీ విడుదల చేసి.. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెలువరించాం. మొత్తం ఖాళీల సంఖ్యకు 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు’అన్న టీజీపీఎస్సీ వాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తీర్పునిచ్చింది.
‘ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను ప్రచురించే ముందు ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను నిష్పాక్షికంగా పరిగణించాలి. ఆ అభ్యంతరాలపై పూర్తి పరిశీలన జరిగిన తర్వాతే మెరిట్ జాబితా ప్రకటించాలి. కానీ టీజీపీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్‌పై ఆ మేరకు చర్యలు తీసుకోలేదు.
తప్పుగా వచ్చిన ప్రశ్నలను తొలగించి మళ్లీ మెరిట్ జాబితా ప్రకటించేలా ఆదేశించాలి’అని వికారాబాద్‌కు చెందిన దామోదర్‌రెడ్డితోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీ నోటిఫికేషన్, ఎస్టీ రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ మరికొందరు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టి ఈ నెల 4న తీర్పు రిజర్వు చేశారు. మంగళవారం.. పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment